ఇక ఈ సంబంధం ముగిసినట్టేనని అనిపించడంతో రాఘవులు ఖుషీగా వున్నాడు.
ఇంటి దగ్గర నిద్ర పట్టలేదు.
సుధాకర్ ను పిలుచుకుని ఊరి చివరనున్న మర్రిచెట్టు దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.
అది వెన్నెల కాలం కాదు చీకటి రాత్రులు. ఆకాశానికి చిల్లులు పడ్డట్టు నక్షత్రాలు మెరుస్తున్నాయి.
సరిగ్గా అదే సమయానికి ఆదినారాయణ భార్య లలిత రాత్రి సంబరానికి రెడీ అవుతోంది.
సాయంకాలం స్నానం చేసినా ఒళ్ళంతా చిరాగ్గా వుంది. అందుకే మరోసారి స్నానం చేయాలని బాత్రూమ్ లో దూరింది.
బాత్రూమ్ అంటే చుట్టూ నాలుగు తడికెలతో కట్టిన గది. అదే ఆకాశంలో మేఘాలతో కట్టిన స్నానాల గదిలా అనిపిస్తుండగా కిందనున్న బండమీద కూర్చుని జుట్టు ముడి విప్పింది.
తనలోని నీటి బరువుని వదుల్చుకోవడానికి నల్లమబ్బు ఒక్కసారిగా ఒళ్ళు విదుల్చుకున్నట్లయింది.
బకెట్ లోని నీటిని చేత్తో తీసుకుని చల్లదనం కోసం కంఠం చుట్టూ రాసుకుంది- నీలినరాల నృత్యం కనిపించే ట్రాన్స్ పరెంట్ గా గొట్టంలా వుంది.
పమిట చెంగును తీసి పళ్ళమధ్య బిగించి జాకెట్టు హుక్ లను విప్పడానికి ప్రయత్నించింది- పారిజాతాల బుట్టల్ని పమిట మధ్య దాచిపెట్టినట్లున్న ఎద ఎత్తుకి హుక్ లు రావడం లేదు.
శ్వాసను బిగపట్టి ఎద ఎత్తును బలవంతంగా తగ్గించి, బలాన్నంతా ఉపయోగించి ఎలాగో హుక్ లను తీసింది.
ఆమె సౌందర్యానికి తన కళ్ళే పగిలిపోయేటట్లనిపించడంతో లలిత ఠక్కున చూపులు మరల్చుకొని చెంబుడు నీళ్ళను ఒంటిపై కుమ్మరించుకుంది.
స్నానం పూర్తిచేసి లైట్ బ్లూ కలర్ కోటా చీరను కట్టుకుంది. దానికి మ్యాచ్ అయ్యే జాకెట్టు వేసుకుంది. లైట్ గా అలంకరించుకుంది. జడలో మాత్రం రెండు మూరల మల్లెల్ని అలా జారవిడుచుకున్నట్లు పెట్టుకుంది.
మెల్లగా వెళ్ళి భర్త పక్కన పడుకుంది.
ఆదినారాయణ ఆమెవైపు తిరగలేదు.
అతను మరో మూడ్ లో వున్నాడు. నిర్మలను చూసి అప్పటికి నెల అయింది. పెళ్ళిలో చుట్టం చూపుగా చూడడం తప్ప మనసు విప్పి మాట్లాడడానికి కుదరలేదు. హృదయమంతా నిర్మల నిండిపోయింది. ఆమెను చూడాలన్న కోరిక క్షణక్షణానికి ఎక్కువైపోతుంది.
భర్తలో తను ఆశించినట్లు ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఇక ఆగలేక తమలపాకుతో చిలకలు చుట్టి ఇచ్చినట్టు వేళ్ళతో కోరికనంతా కూరి అతని మీద చేతులు వేసింది లలిత.
"ఒళ్ళు బాగాలేదు- ఈరోజు వద్దు" అన్నాడతను ఆమెవైపు తిరగకుండానే.
ఇక ఆమె మాట్లాడలేకపోయింది.
శరీరాన్ని బుజ్జగిస్తున్నట్టు అటువైపు తిరిగి పడుకుంది.
మరోగంటకి ఆమె నిద్రపోయినట్టు గ్రహించి మంచంమీంచి మెల్లగా పైకి లేచాడు ఆదినారాయణ.
దండేనికి వేలాడుతున్న నల్లటి దుప్పటిని కప్పుకుని వీధిలో పడ్డాడు.
పనిలేని కుక్కలు అతన్ని చూసి అరిచి, ఆ తరువాత తమ ఊరివాడేనని గ్రహించి కాబోలు సర్దుకున్నాయి.
అతను వీధిలో ఓ మూలగా ఎవరూ తనని గుర్తించకూడదని మెల్లగా నడుస్తున్నాడు. అయితే అతను ఆ సమయంలో మర్రిచెట్టు కింద కూర్చున్న రాఘవులు కంటపడ్డాడు.
"ఎవర్రా వచ్చేది?" సుధాకర్ ను అడిగాడు రాఘవులు.
"ఎవరో గుర్తు తెలియడంలేదే"
ఇద్దరూ మరి మాట్లాడటం ఆపేసి కళ్ళు చిట్లించి చూశారు. వాళ్ళిద్దర్నీ గమనించని ఆదినారాయణ వీధి మలుపు తిరిగి నిర్మల ఇంటికేసి నడుస్తున్నాడు.
"ఆదినారాయణ" రహస్యాన్ని ఛేదించినట్లు మెల్లగా చెవిలో చెప్పాడు రాఘవులు. "అవును" సుధాకర్ కూడా నిర్ధారించాడు.
"ఎక్కడికెళుతున్నావు?" రాఘవులకి ఏదో సంశయం కంగారును పుట్టిస్తోంది.
"ఆ నిర్మల దగ్గరకేమో"
ఇద్దరూ పైకిలేచి మర్రిచెట్టు దగ్గర్నుంచి కదిలి వీధి మొదట్లోకి వచ్చి నిలబడ్డారు.
అక్కణ్ణుంచి వీధి మొత్తం కనిపిస్తుంది కాబట్టి ఆదినారాయణ ఎటు వెళ్ళేదీ తెలుస్తుంది. ఊపిరి బిగపట్టుకుని నిల్చున్నారు ఇద్దరూ.
ఆదినారాయణ నిర్మల ఇంటిముందు ఆగి, అటూ ఇటూ చూసి టక్కున లోపలికి దూరాడు.
"నేను చెప్పలా, నిర్మలా ఇంటికేనని" సుధాకర్ గర్వంగా చెబుతున్నాడు.
హఠాత్తుగా గుండెల్లోకి ఎవరో పెద్ద రాయిని జార విడిచినట్టయి పోయాడు రాఘవులు.
ఇకనైనా దక్కుతుందనుకున్న నిర్మల ఒళ్ళో వాలినట్టు వాలి ఎగిరెళ్ళిపోయి నట్టనిపించింది.
"కొత్త పెళ్ళాన్ని వదిలి- ఇలా"
రాఘవులి మాట పూర్తికాక మునుపే సుధాకర్ అన్నాడు "నిర్మల లాంటి వాళ్ళు జాణలు. ఏదో మందు పెట్టేసుంటుంది అతనికి. అందుకే కొత్త భార్యను వదిలి కూడా వచ్చేశాడు."
"మందు పెట్టడమా!" ఆ మాట విన్న రాఘవులు ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు.
ఆ తరువాత కూడా ఆదినారాయణ నిర్మల ఇంటికెళ్లడం మానలేదు ఊరంతా నిద్రపోతున్నప్పుడు, మబ్బులతో చందమామ దాగుడుమూతలు ఆడుకుంటున్నప్పుడు, గాలి రొమాంటిక్ గా వీస్తున్నప్పుడు, రతీదేవి ఆమె ఫ్యాషన్లను అనుకరిస్తున్నట్టు నిర్మల అలంకరించుకున్నప్పుడు అతను నిర్మల ఇంటి గుమ్మానికి మామిడాకు తోరణమయేవాడు.
ఆమె మంచంమీద రంగురంగుల దుప్పటి అయిపోయేవాడు. ఆమె బుగ్గమీద గోటి గుర్తయిపోయేవాడు ఆమె ఎదమీద పంటిగాట్లయి పోయేవాడు. అయితే ఇలాంటి రహస్యాలు ఎంతోకాలం దాగవు.
అతన్ని కట్టుకున్న భార్య లలితకు విషయం తెలిసేటప్పటికి ఊరికంతా ఎప్పుడో తెలిసింది.
"అదేం బుద్ధి- కుందనపు బొమ్మలా భార్య వుండగా ఆ చిలక్కొట్టుడు లేమిటి?"
"చిలక్కొట్టుడు ఎప్పుడూ రుచిగా వుంటుంది"
"చిలక్కొట్టుడు అంత రుచిగా వుంటుందని నీకు ఎలా తెలుసు?"
"ఏదో నీలాంటి అనుభవమున్న అమ్మణ్ణి చెబితే తెలిసింది."
ఇలా ఇద్దరు స్త్రీలు గుసగుసలు పోయే స్టేజీని దాటి ఆదినారాయణ, నిర్మల సంబంధం వీధి అరుగుల మీద నిత్యపారాయణం అయ్యే స్థితికి వచ్చింది.
లలితకైతే ఏం చేయాలో పాలుపోలేదు. సన్నజాజుల తీగకు మచ్చల పాములు చుట్టేసుకున్నట్టు అనిపించింది. భర్తకు మంచి మాట చెప్పడానికి భయపడింది. ఒకవేళ అడిగినా అతను నిర్మల దగ్గరికి వెళ్ళకుండా వుంటాడన్న నమ్మకం చిక్కలేదు.
దాంతో ఆమె అత్తామామల శరణువేడింది.
"ఏం చేస్తామమ్మా! ఆ టక్కులాడి మావాడికి ఏం పెట్టిందో, వాడు రాత్రిళ్ళు ఆ ఇంటిని కాసే కుక్కయిపోయాడు. ఛీఛీ! ఊర్లో ఇక ఏ మగాడూ లేనట్టు మావాడ్ని పట్టుకుంది" అని ఆదినారాయణ తల్లి కళ్లనీళ్లు పెట్టుకుంది.
"మందే పెట్టిందో, మంత్రమే వేసిందో తేల్చి పారేస్తాను" అని ఆవేశంగా అంటూ కోడలివైపు తిరిగి నువ్వేమి బెంగపెట్టుకోకు, దాని దగ్గరికి పోకుండా నీ భర్తను నీ దగ్గరికి చేరుస్తాను" అంటూ అనునయించాడు ఆదినారాయణ తండ్రి సుబ్బాచారి.