Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 15


    మంచుముద్దల మీదుగా సన్నటి కాలిబాట మీదుగా నడుస్తున్నాడు. అలా ఎంతదూరం నడిచాడో అతనికి తెలీదు. అలసిపోయాడు బాగా.

 

    దూరంగా పెద్ద లోయ.

 

    ఆగిపోయి నలువైపులా చూశాడు. ఎటు వెళ్ళాలి? తన అన్వేషణ ఫలిస్తుందా?

 

    నిజంగా తన కోరిక నెరవేరుతుందా? హిమలింగస్వామి దర్శన భాగ్యం లభిస్తుందా?

 

    హిమలింగస్వామిని కలుసుకోగలనని ఎక్కడో మనస్సు మారుమూలల్లో మిణుకు మిణుకుమంటున్న ఆశ ఆయనలో అడుగంటిపోతున్న ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

 

    సన్నసన్నగా కాంతి కనుమరుగవుతోంది. అయినా ఏదో తెలియని భయం ఆవరించింది విశ్వాత్మకు. వేరొకపక్క నీరసం. మరో అడుగు వేయలేక వేస్తూ నాలుగువైపులా ఆశగా చూశాడు.

 

    ఉంటే హిమలింగస్వామి ఇక్కడే వుండాలి. మరి కనిపించరేం?

 

    అంతులేని నిరాశ కమ్మేయగా మధనపడసాగాడతను.

 

    "హిమలింగస్వామీ...." గొంతెత్తి అరిచాడు.

 

    ఆ అరుపు మంచులోయల్లో ప్రతిధ్వనించింది. అరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. పిచ్చిగా అరుస్తున్నాడు. అరిచి, అరిచి అలసిపోయి స్పృహ తప్పిపోయాడు. పడిపోయిన గంటకు మెలకువ వచ్చింది విశ్వాత్మకు.

 

    దట్టమైన చీకటి....

 

    నిశ్శబ్దమైన పరిసరాలు....

 

    ఉన్నట్లుండి ఎక్కడినుంచో ఆకాశవాణిలా పెద్దగా మాటలు వినిపించసాగాయి!

 

    విశ్వాత్మకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది.

 

    "అన్వేషకుడికి నిగ్రహం అవసరం విశ్వాత్మా! లేచిరా!" ఆ మాటలు తనకు వినిపించినవైపు చూశాడు విశ్వాత్మ.

 

    చీకట్లో కాంతిరేఖ. కళ్లు చిట్లించుకొని చూశాడు. మంచుకొండల మధ్య నుంచి ప్రసరిస్తున్న కాంతి.

 

    గబుక్కున లేచి వడివడిగా ముందుకు పరుగెత్తాడు.

 

    రెండు మంచుకొండల మధ్య గుహ, ఆ గుహ దిశగా నడుస్తున్నాడు. ఆ గుహ లోపలకు వెళ్లగానే కనిపించిన దృశ్యాన్ని చూసి సంబ్రమంగా మాటలు రాక నుంచుండిపోయాడు విశ్వాత్మ. ఎత్తయిన వేదిక మీద తల కిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న వ్యక్తి!

 

    హిమలింగస్వామి!

 

    సుమారు 180 సంవత్సరాల వయస్సున్న హిమలింగస్వామి నిజంగా బతికున్నాడు.

 

    ఇదెలా సాధ్యం?

 

    అప్పటివరకు తనలో వున్నది కేవలం నమ్మకమే. ఆ నమ్మకం వయసు 180 సంవత్సరాలా?! అది కలో నిజమో అర్థంకాక విశ్వాత్మ చాలాసేపు స్థాణువులా నిల్చుండిపోయాడు. తిరిగి ఆ స్వామి పలకరించాకగాని తేరుకోలేదు.

 

    "విశ్వాత్మా! ఇంత ఆలస్యంగా వచ్చావేం?"

 

    ఆ ప్రశ్నకు చలించిపోయాడు విశ్వాత్మ. "ఈ మధ్యనే జ్ఞానోదయమైంది స్వామీ!"

 

    "జిజ్ఞాసతో వచ్చావా? జిగీషతో వచ్చావా?"

 

    "రెండూ స్వామీ! ఒక సత్యాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాను" అన్నాడు.

 

    "నాకు తెలుసు నువ్వెందు కోసం వచ్చావో. మళ్ళీ మనిషిగా పుట్టగలనా అని సందేహం అవునా?"

 

    తన మనసులోని మాటని వ్యక్తం చేసిన ఆయనవైపు ఆశ్చర్యంతో చూశాడు విశ్వాత్మ.

 

    పండుటాకులా వున్నాడు హిమలింగస్వామి.

 

    "అవును స్వామీ! నా సందేహం తీర్చి నన్ను పునీతుడ్ని చేయండి" మోకరిల్లుతూ అన్నాడు విశ్వాత్మ.

 

    హిమలింగస్వామి శరీరం నుండి ప్రసరిస్తున్న కాంతితో పరిసరాలు పునీతమవుతున్నాయి. తదేకంగా ఆయనవైపే చూస్తున్న విశ్వాత్మలో తెలీని ఉత్సాహం. దివ్యత్వం పొందుతున్న అనుభూతి.

 

    "జన్మిస్తావు మనిషిగానే జన్మిస్తావు" మెల్లగా వచ్చాయి ఆ మాటలు ఆయన గొంతులోంచి.

 

    ఆ మాటలకు విశ్వాత్మ శరీరం రోమాంచితమైపోయింది. "కృతజ్ఞుడ్ని స్వామీ"

 

    "కానీ... సహజ మరణం పొందేవారెప్పుడూ పునర్జన్మ పొందలేరు" చెప్పాడాయన.

 

    "అంటే?" ప్రశ్నించాడు విశ్వాత్మ.

 

    "మృత్యువు సమీపించే ఘడియల గురించి నువ్వు తెలుసుకున్నావు. కానీ మృత్యువుని నువ్వే ఆహ్వానించుకోగలిగితేనే నీకు పునర్జన్మ వుంటుంది."

 

    "మృత్యువును నేనే ఆహ్వానించుకోవాలా?!" ఆశ్చర్యంగా అడిగాడు విశ్వాత్మ.

 

    "అవును! ఆ ధైర్యం, ఆ స్థయిర్యం నీకున్నాయా?"

 

    ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు విశ్వాత్మ. ఆ తర్వాత చెప్పాడు- "ఉన్నాయి స్వామీ! నేను మృత్యువుని మనసా, వాచా ఆహ్వానించగలను"

 

    "చిరంజీవ వెళ్ళిరా! కానీ ఒక్కటి గుర్తుంచుకో. అంతరాత్మ అనే దివ్యమైన దివ్వెను నీలో ఎప్పటికీ ఆరిపోకుండా చూసుకో. నీవు కావాలని ఆశిస్తున్నది అదే పునర్జన్మ మంచిదో, చెడ్డదో ఏదయినప్పటికీ నీ దీక్షాదక్షతలు, పట్టుదల, నమ్మకం, విశ్వాసం మాత్రం చాలా గొప్పవి. అవే నిన్ను గొప్ప వ్యక్తిగా మలిచాయి. అందుకే నీకు నా దర్శనం లభించింది. సామాన్యులకి అలవికానిది. విజయోస్తు వెళ్ళిరా" ఆ వెంటనే ఆ స్వామి కనిపించకుండా సన్నటి మంచు తుంపర తెరలా ఆక్రమించింది.

 

    విశ్వాత్మ ఆయనకు నమస్కరించి వెనుతిరిగాడు.

 

    అనంతమైన ఉద్వేగం, అచంచలమైన ఉత్సాహం అంతా కలలాగా, భ్రాంతిలాగా వుంది. అప్పుడే నిద్రలోంచి లేచినవాడిలా నడుస్తున్నాడు విశ్వాత్మ.

 

    "మృత్యువును నీవు ఆహ్వానించుకోగలిగితే నీకు పునర్జన్మ వుంటుంది" హిమలింగస్వామి మాటలు గుర్తుకొస్తున్నాయి విశ్వాత్మకు.

 

    అంటే.... తను అసహజమరణం పొందాలి- అసహజ మరణం అంటే ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య అనే పదం మనసులో మెదలగానే, సన్నగా కంపించాడు విశ్వాత్మ. రాత్రంతా నడుస్తూనే వున్నాడు. తెల్లవారుజామున అమరావతి నది ప్రాంతానికొచ్చాడు.

 

    "గుడ్ మార్నింగ్ సర్" చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పరాంజపే ఎదురొచ్చాడు.

 

    "ఎంతసేపయింది వచ్చి?"

 

    "రెండుగంటలైంది సార్! చందన్ వారీ గ్రామంలో హెలికాప్టర్ ని లాండ్ చేశాం సార్" చెపుతూ, విశ్వాత్మ ముఖంలోకి చూసిన పరాంజపే ఆశ్చర్యపోయాడు.

 

    ఆ మొహమ్మీద ఎవరో కత్తితో గాటు పెట్టినట్లుగా చర్మం చీరుకు పోయింది.

 

    "ఏమిటి సార్... మొహం మీద ఆ గాయం?"

 

    "నాకా? గాయమా?" వేళ్ళతో మొహాన్ని తడిమి చూసుకున్నాడు. ఎలాగైంది ఆ గాయం? గడ్డకట్టిన రక్తం వేళ్ళకు తగిలింది బహుశా స్పృహ తప్పిపోయి, కిందపడిపోయినప్పుడు తగిలినట్టుంది ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడతను.

 Previous Page Next Page