"ప్రశ్నిస్తే తల ఎగిరిపోతుంది. పోనీ జమ్ము పోనీ. అక్కడ నుంచి ఆఫ్రికా అడవుల్లోకి ఇంకా... అక్కడ..." గొణుక్కున్నాడు విసుగ్గా పరాంజపా.
పైలట్ సన్నగా నవ్వాడు ఆ మాటలకు. పైలట్- రాడార్ హెడ్ క్వార్టర్స్ లోని ఆఫీసర్ తో వైర్ లెస్ లో మాట్లాడి తను ఎటువైపు వెళ్ళాలో రూటు తెలుసుకున్నాడు. ఆ తర్వాత- హెలికాప్టర్ వేగం పెరిగింది. వెనకసీట్లో విశ్వాత్మ మౌనంగా ప్రకృతిని చూస్తూ ఆలోచనల్లో పడిపోయి తన ప్రశ్నకు దొరికే జవాబు గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.
* * * *
హిమాలయ పర్వతాల్లోని చర్రీ ముబారక్ ప్రాంతం. సముద్ర మట్టానికి పదమూడువేల అడుగుల ఎత్తున్న దుర్గమమైన మంచుకొండల్లో, ఓ గుహలో హిమలింగ రూపంలో ప్రకాశించే అమరనాధుని దర్శించి పునీతులు కావటం కోసం జమ్ములోని చర్రీముబారక్ నుంచే యాత్రికుల ప్రయాణం ప్రారంభమవుతుంది.
అటూ ఇటూ దట్టమైన మంచుకొండల మధ్య దారి.
"హరహరమహాదేవ్. బోలో శివశంకర్, అమర్ నాథ్ స్వామీకి జై....!" యాత్రికుల నినాదాలతో పర్వతపంక్తులు మార్మోగిపోతున్నాయి.
ఏదో అద్భుతశక్తి శాసించినట్లుగా, సరైన దారి చూపినట్లుగా ఆ యాత్రికుల మధ్య నుంచి వడివడిగా నడిచిపోతున్నాడు విశ్వాత్మ. నడవలేని యాత్రికులను 'దండీ' అనే డోలీలో కూర్చోబెట్టి తీసుకెళ్ళే కాశ్మీరీలు మార్గాయాసం మరిచిపోవడానికి జానపద గీతాలు పాడుతున్నారు.
తనను దాటి ముందుకెళ్ళిపోతున్న వృద్ధుడు విశ్వాత్మవైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు యాత్రికులు.
అమర్ నాథ్ యాత్రలో మొదటి మజిలీ చందన్ వారీ. ఆ గ్రామం సముద్ర మట్టానికి 2923 మీటర్ల ఎత్తు వుంటుంది. ఎగుడుదిగుడు దారి వెంబడి నడుస్తూ చందన్ వారీ గ్రామం చేరుకున్నాడు విశ్వాత్మ. దూరంగా లిడ్దర్ అనే కొండవాగు.
లోయల్లోంచి వినిపిస్తున్న అడవి పిట్టల వింత కూతలు, ఒకవైపు మంచుకొండలు, మరొకవైపు దట్టమైన పచ్చదనంతో మెరుస్తున్న లోయలు చందన్ వారీ తర్వాత మజిలీ శేష్ నాగ్.
సన్నటి ఇరుకయిన దారిలోంచి నడుస్తున్నాడు విశ్వాత్మ. సన్నటి దారి కింద అంతు తెలియని భయంకరమైన అగాధాలు. ఏమాత్రం అడుగు తప్పినా ఆ అగాధాల్లోకి జారిపోవడం ఖాయం.
శేష్ నాగ్ దాటాక పిస్సుఘాటి అనే ప్రాంతం వచ్చింది. పిస్సుఘాటి ప్రాంతానికొచ్చి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడతారు.
దానికి కారణం- అక్కడ నుంచి దూకిన వారికి ముక్తి లభిస్తుందని సాధువులు చెప్పడమే.
పిస్సుఘాటి దగ్గరనించి మంచుకొండలపైకి నిలువుగా ఎక్కుతూ పోవాలి.
అలా ఎంతదూరం నడిచాడో అతనికి తెలీదు. చలిగాలికి విశ్వాత్మ శరీరం మంచుముద్దలా మారిపోయింది.
దారిలో శేష్ నాగ్ సరోవరం, ఆ సరోవరంలో ఆదిశేషువు దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు. ఆ సరోవర జలాన్ని దోసిట్లోకి తీసుకొని తాగి, నమస్కరించి ముందుకు కదిలాడు విశ్వాత్మ.
ఆ తర్వాత-
అమర్ బూత్ ప్రాంతం....
మరో అరవై నిమిషాలు గడిచాక అమర్ నాథ్ గుహ.
అమర్ నాథ్ గుహ 50 మీటర్ల ఎత్తు అంతే వెడల్పుతో వుంటుంది. లోపలికి వెళుతున్న కొద్ది భక్తిభావం మనస్సును కల్మషరహితం చేస్తుంది.
గుహ మధ్యలో ధవళకాంతులు వెదజల్లుతూ సమున్నతమైన మంచులింగం ప్రత్యక్షమవుతుంది.
ఆ లింగమే అమర్ నాథ్ స్వామి!
అమర్ నాథ్ గుహ సమీపంలోని అమరావతి నదిలో స్నానం చేసి గుహలోకి అడుగుపెట్టి అమరనాథ్ స్వామిని దర్శించుకొని బయటికొచ్చాక తనకు ఎదురొచ్చిన ఒక పూజారిని అడిగాడు విశ్వాత్మ.
"హిమలింగస్వామి ఎక్కడ వుంటారు?"
ఆ పూజారికి నలభై ఏళ్ళుంటాయి. ఆ ప్రశ్న వేసిన విశ్వాత్మవైపు పిచ్చివాడిలా చూశాడా పూజారి.
"హిమలింగస్వామి పేరెలా మీకు తెలిసింది? ఆయన ఇక్కడుంటారని మీకెవరు చెప్పారు?" అమితాశ్చర్యానికి గురవుతూ అడిగాడా పూజారి.
"నాకు తెలుసు"
"ఏవిటీ... నీకు తెలుసా?" మరింత ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఆ పూజారి.
"నేనిక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను, ఇక్కడే పూజారిగా స్థిరపడ్డాను. నా నలభై ఏళ్ళ వయస్సులో నేను ఎప్పుడూ హిమలింగస్వామిని చూడలేదు. మా పూర్వులు చెపుతుంటారు ఈ ప్రాంతాల్లో సిద్ధయోగం పొందిన హిమలింగస్వామి వుండేవారని, హిమలింగస్వామి అనే పేరు ఈ ప్రాంతం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. మరి మీకు...."
"ఆయన ఎక్కడ వుండేవారని మీ పూర్వులు మీకు చెప్పారు? అసహనంగా ప్రశ్నించాడు విశ్వాత్మ.
"ఆ కనిపిస్తున్న అమరావతి నదికి రెండు యోజనాల దూరం నడిచి వెళ్ళాక జ్వలన పర్వతం వుంటుంది. ఆ పర్వతం పక్క నుంచి వెళితే ఖర్జూరచెట్ల వనం కనిపిస్తుంది. ఆ వనం పరిసర ప్రాంతాల్లోనే వుండేవారని చెప్తారు" అని అటువైపు చేయి చూపిస్తూ చెప్పాడా పూజారి.
వెంటనే ముందుకు నడిచాడు విశ్వాత్మ.
"జ్వలన పర్వతం సమీపంలో మీరు జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మంచుపెళ్ళలు పడుతుంటాయి. ఆ మంచుపెళ్ళల క్రింద పడి చాలామంది చనిపోయారు కూడా" గట్టిగా హెచ్చరించాడతను.
హిమలింగస్వామి ఇప్పటికీ వున్నాడా? లేడా? ఉంటే ఇక్కడివారికి తెలియకుండా ఎలా వున్నాడు?
కనీసం ఆహారం కూడా తీసుకోకుండా జీవిస్తున్నాడా? నడుస్తూ ఆలోచిస్తున్నాడు విశ్వాత్మ.
జ్వలన పర్వతం సమీపంలోకొచ్చాడు. నిటారుగా, సూదిగా వుందా పర్వతం. పైనుంచి మంచుదిబ్బలు దొర్లుకుంటూ పడుతున్నాయి.
వాటినుంచి తప్పించుకొని అతి కష్టంమీద రెండోవైపు వెళ్ళాడు. దూరంగా ఖర్జూరవనం. మంచులోయల్లో చెట్లవనం కనిపించడం ఆశ్చర్యంగా అనిపించింది విశ్వాత్మకు.
దట్టమైన మంచుగాలికి విశ్వాత్మ వేళ్ళు వంకర్లు పోతున్నాయి. వృద్ధాప్యపు శరీరం మంచుదాటికి తట్టుకోలేకపోతోంది.
దట్టమైన వనం మధ్యకెళ్ళి నుంచున్నాడు. మంచు ముద్దల్ని కప్పుకున్న చెట్లు.... ఎటు చూస్తే అటు మంచుదిబ్బలు... ఎటు వెళ్ళాలి?
ఎక్కడా మనుషులు సంచరించే గుర్తులు లేవు. ఏవైనా పక్షులు, జంతువులు వంటివి కనిపిస్తాయేమోనని నలువైపులా చూశాడు.
చెట్లమీద ఒక పక్షి కూడా కనబడకపోవడం వింతగా వుంది విశ్వాత్మకు. దూరంగా మంచుపర్వతాలను అక్కున చేర్చుకుని చుంబిస్తున్నట్లుగా వుంది ఆకాశం.