Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 16


    చందన్ వారీ గ్రామానికొచ్చాక అద్దంలో ముఖాన్ని చూసుకున్నాడు. ముక్కుకి ఎడంపక్కన, బుగ్గకు కింది భాగంలో, చుబుకం ప్రాంతంలో గీరుకు పోయిన చర్మం... చందన్ వారీ గ్రామంలో ఓ ఆర్.ఎం.పి. డాక్టర్ దగ్గరకెళ్లాడు. ఆ డాక్టర్ ఆ గాయాన్ని శుభ్రం చేసి, కట్టుకట్టి, ఏవో మాత్రలు యిచ్చాడు.

 

    "గాయం మానడానికి నెలరోజులు పడుతుంది" చెప్పాడు ఆ డాక్టర్.

 

    "నెలరోజులా?" విచిత్రంగా అ డాక్టరువైపు చూస్తూ అన్నాడు విశ్వాత్మ.

 

    "మనం హైద్రాబాద్ వెళ్ళగానే స్పెషలిస్ట్ చేత ట్రీట్ మెంట్ చేయించుకుంటే సరి" పరాంజపే అన్నాడు హెలికాప్టర్ లో కూర్చున్నాక. విశ్వాత్మ ఏం మాట్లాడలేదు- తనలో తానే నవ్వుకున్నాడు. ఇన్నేళ్ళలో ప్రొఫెషనల్ గా తను ఎంత ఎత్తు ఎదిగాడో.... ఆ అనుభూతిలో ఎంతగా గర్వపడేవాడో... ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు విశ్వాత్మ.

 

    ఆనందంతో కూడిన గర్వం, విశ్వవిజేతగా నిలిచిన వ్యక్తి పొందే సంతృప్తి. "మృత్యువును నువ్వు ఆహ్వానించుకోగలిగితేనే నీకు పునర్జన్మ వుంటుంది" హిమలింగస్వామి మాటలు గుర్తుకొచ్చాయి.

 

    'ఆత్మహత్య' అనే పదం మళ్ళీ రెండోసారి మనస్సులో మెదిలింది. ఆ ఆలోచన మనసులో మెదలగానే, గిరి శిఖరాల నుంచి కింద అగాధపు లోయల్లోకి జారిపడిపోతున్నంత వింత దృశ్యం.

 

    ఏమాత్రం భయపడకుండా, ఆర్తనాదాలు చేయకుండా గాలిలో సుడులు తిరిగిపోతున్నాడు.

 

    ఒక నిశ్శబ్దపు మృత్యుకోర... అద్వైతపు మృత్యుకోన... తనకు పునర్జన్మ వుంది. మనిషిగానే పుడతాడు. ఈ జన్మలో తను కోల్పోయిన దానిని వచ్చే జన్మలో నిండుగా అనుభవిస్తాడు. అందుకోసమే తను జన్మిస్తాడు. జన్మించి తీరాలి.

 

    ఎనిమిది గంటల తర్వాత విశ్వాత్మ హైద్రాబాద్ లో తన విశాలమైన ప్యాలెస్ లో వున్నాడు.

 

                              *    *    *    *

 

    ఒక రోజంతా తన బెడ్ రూంలోంచి బయటకు రాలేదు విశ్వాత్మ.

 

    తననెవరూ డిస్ట్రబ్ చెయ్యద్దని చెప్పేసాడు.

 

    చావు ముఖం వరకూ వెళ్ళే హాస్పిటల్ బెడ్ మీద రోగికి 'నువ్వు బ్రతుకుతావు- నువ్వు అందరిలా జీవిస్తావు' అని డాక్టర్ చెప్పినప్పుడు ఆ రోగి ఎలాంటి అనుభూతికి లోనవుతాడు?

 

    అలాగే...

 

    నువ్వు ఫలాన రోజున ఫలాన ఇన్ని నిమిషాలకు చచ్చిపోతావని ముందుగానే తెల్సినప్పుడు మనిషి అనుభూతి ఎలా వుంటుంది?

 

    ఆ అనుభూతిని స్వయంగా అనుభవిస్తూ, మాటల్లో అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ రూంలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు విశ్వాత్మ. అయినా ఆయనకు ఏ భావం కలగడం లేదు. స్థిరంగా ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన వాడిలా ప్రశాంతంగా కిటికీ దగ్గరకు నడిచాడు. కిటికీ తెర తీయగానే సముద్ర తీరాన్ని తాకినంత గాఢంగా పరిమళాన్ని మోసుకొచ్చిన గాలి, అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.

 

    ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు.

 

    కళ్ళ ముందు తిరిగి ఏవో దృశ్యాలు- మంచుతెరల్లా, నీటి అలల్లా కదిలిపోతున్నాయి.

 

    విజయనగర సైనికాధికారి అంతఃపురంలోని గాజు ప్రమిదలలోని దీపాలు మిణుకు మిణుకుమని వెలుగులు వెదజల్లుతున్నాయి.

 

    గవాక్షాల కావల పేరుకొని వున్న నిశ్శబ్ద నిశీధి భయంకరమైన రూపుదాల్చి నిలిచి వుంది. నిద్రాసక్తులయిన కావలివృ నిదురమైకంతో చేసే హెచ్చరికలు బరువుగా వినిపిస్తున్నాయి.

 

    దూరంగా అటు ఉత్తుంగ తరంగాలతో, జలజలా ప్రవహిస్తున్న కృష్ణవేణమ్మ ఘోష- ఇటు పొంగిపొరలి పరవళ్ళు తొక్కుతూ పారుతున్న తుంగభద్రానదీ హొయలు- సంగమ స్థానంలో మేళవించి, వాయు వాహనాన్ని అధిష్టించి, కఠినశిలా నిర్మితమైన నిశీధిని ధిక్కరిస్తూ నిలిచివున్న కందనవోలు కోటగోడలకు తగిలి ప్రతిధ్వనిస్తున్నాయి.

 

    ఆ నిశీధి సమయంలో... అంతఃపురంలో సన్నని ఏడుపు... ఆ వేదన ఎవరిది?

 

    ఇంకెవరిది? వజ్రహస్త భార్యది. అంతలో ఎందుకో కల చెదిరిపోయింది. ఒక్కసారి 16వ శతాబ్దం తొలి భాగం నుండి 20వ శతాబ్దం చివరి కొచ్చేశాడు విశ్వాత్మ.

 

    వజ్రహస్త భార్య వైదేహి కాదుగదా? కల నుంచి తేరుకున్నాడు విశ్వాత్మ.

 

    ప్యాలెస్ కిటికీలోంచి ప్రకృతి గుసగుసలు వింటూ తదేకంగా చూడటం, రెక్కలున్న మేఘాల్లా కదిలిపోయే పక్షుల గుంపులను చూస్తూ పసిపిల్లాడిలా సంబరపడిపోవటం విశ్వాత్మకు చాలా ఇష్టం.

 

    ప్రకృతిని చూస్తూ చాలాసేపు గడిపాక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ముఖంమీద గాయాన్ని చూసుకున్నాడు. హైదరాబాద్ రాగానే స్పెషలిస్ట్ చేత ట్రీట్ మెంట్ తీసుకున్నాడు.

 

    గాయం త్వరలో మానిపోతుందని చెప్పాడు డాక్టర్... మరి మచ్చ...?

 

    తను చనిపోయే లోపల మచ్చ మానిపోతుందా?

 

    ఈ మచ్చ, తన ముఖమ్మీద అలాగే వుండిపోతే.... ఈ జన్మకు గుర్తుగా పునర్జన్మలో ఈ మచ్చ తన ముఖమ్మీద మిగులుతుందా?

 

    ఆ ప్రశ్నకు జవాబు విశ్వాత్మ దగ్గర లేదు.

 

    అలా అద్దంలో చూస్తున్న విశ్వాత్మ చూపులు క్యాలెండర్ వైపు మరలాయి.

 

    క్యాలండర్లో తను ఏ రోజు చనిపోతాడో చూసుకున్నాడు. బాల్ పెన్ను తీసుకొని ఆ తేదీ చుట్టూ సర్కిల్ గీశాడు.

 

    ఆ సర్కిల్ వైపే తదేకంగా చూస్తున్న విశ్వాత్మ చూపులు ముందుకు జరిగాయి.

 

    గబుక్కున చేతివాచీ వైపు చూసుకున్నాడు.

 

    క్యాలెండర్ వైపు చూశాడు.

 

    సరిగ్గా మూడురోజుల్లో తన బర్త్ డే రాబోతోంది.

 

    చిత్రంగా తన పుట్టినరోజును తను మర్చిపోయాడు. చావు ముందు వస్తున్న చివరి పుట్టినరోజు...

 

    తనలో తాను నవ్వుకుంటూ స్నానానికి వెళ్లాడు విశ్వాత్మ. షవర్ తిప్పగానే కురిసిన చల్లని చినుకులు అతడి వృద్ధాప్యపు శరీరాన్ని సన్నగా వణికించాయి.

 

    టవల్ చుట్టుకుని, నిలువుటద్దం ముందు నిలిచి, తన ప్రతిబింబాన్ని తీక్షణంగా చూసుకున్నాడతను.

 

    శిల్పం చెక్కినట్టుగా శరీరం, తలపై నెరిసీ నెరియని జుట్టు, కుడికాలు కొంచెం బలహీనపడటంతో ఒకవైపు ఒరిగినట్లుగా కనబడుతున్న తనకు రాబోయే పుట్టినరోజు ఎలాంటి సంతృప్తినిస్తుంది?

 

    ఏ అనుభూతిని మిగులుస్తుంది?

 

    పటిష్టమైన దుర్గాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న శత్రుసైన్యంలా తన శరీరం నిండా క్యాన్సర్ కణాలు.

 

    కోటానుకోట్ల ఆస్తి వున్నా క్యాన్సర్ నుంచి తను బయటపడలేక పోయాడు.

 

    డబ్బు సంపాదించడానికి ముందు, మనిషి డబ్బుతో ప్రపంచాన్ని కొనగలడని అనుకుంటాడు. డబ్బు సంపాదించాక, ప్రపంచంలో కొనలేని వస్తువులు చాలా వున్నాయని తెలుసుకుంటాడు.

 

    విశ్వాత్మ ప్రస్తుత పరిస్థితి అలాగే వుంది.

 Previous Page Next Page