Previous Page Next Page 
వ్యూహం పేజి 14


    "సడెన్ గా బుద్ధిమంతుడవైపోతే ఎలారా... ఏదో ఉద్యోగంలో చేరావంట" సుబ్రహ్మణ్యం ప్రశ్నించాడు.

 

    "ఏమిట్రా... ఇంత బ్రతుకూ బ్రతికి, కిరాణా కొట్లో చింతపండు ఉల్లిపాయలు అమ్మే సీన్ లో ఊహించుకోలేకపోతున్నాంరా."

 

    "అందులో పర్మనెంటుగా సెటిల్ అయిపోయినట్లే గురవా?" రమణరావు సందేహం వదిలాడు.

 

    "గొప్ప వాళ్ళందరూ అంతేరా... ఎన్నో యుద్ధాలు చేసిన అశోకుడు సడెన్ గా మారిపోయి శాంతి, శాంతి అనలేదు. బుద్ధి మాటేంటి? అంతే... మనవాడు అదే లెవిల్ అన్నట్లు ఫీల్ అవుతున్నాడు కాబోలు."

 

    "ఎప్పుడూ నోరు విప్పితే టాటాలు, బిర్లాలు... జపాన్ లు, కొరియాలు... చివరకు వీడు చేసేది మాత్రం కిరాణాకొట్లో కందిపప్పు లెక్కలు వ్రాసుకోవటం" హేళనగా అన్నారు మిగతావారు.

 

    "టాటాలు, బిర్లాలు ఇవాళ ఇలా ఉన్నార్రా... ఒకప్పటి వాళ్ళ స్టార్టింగ్ చిన్నదిగానే ఉంటుంది... రోడ్డుమీది చిత్తు కాగితాలు అమ్ముకునే వాళ్ళు కోటేశ్వరులయ్యారు..." శక్తి ఆవేశంగా అన్నాడు.

 

    "అయ్యారు... అవుతారు... అదే న్యాయంగా కాదురా... అన్యాయంగా, అక్రమంగా- రోజూ పేపర్లు చూస్తున్నావు గదా... హర్షద్ మెహతా కోటీశ్వరుడే... కాని ఏంటి లాభం... ఎన్ని బ్యాంకుల్ని మోసం చేసాడు... పాపం పండినప్పుడు కానీ... ఆ విషయం మనకు తెలీలేదు."

 

    "యువార్ రాంగ్ రా జగ్గూ... నా దృష్టిలో హర్షద్ మెహతా ఒక జీనియస్... అతను కేవలం బిజినెస్ మాగ్నెట్ లా కేవలం తన పని ఏదో తను చూసుకుంటే కింగ్ లా, కింగ్ మేకర్ లా ఉండేవాడు... పొలిటికల్ విషస్ సర్కిల్స్ వల్ల బలైపోయాడు. వ్యాపారానికి కానీ, వ్యాపారస్థునికి కానీ రాజకీయాలు వుండాలి కానీ, రాజకీయాలే వ్యాపారమైపోకూడదు. రాజకీయ కొండ చిలువలాంటిది. అది దేన్నయినా మింగేస్తుంది. అలా బలైపోయినవాడు హర్షద్ మెహతా... హర్షద్ మెహతాకు కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చిందనుకున్నావు... అతప్పు అతనిది ఒక్కడిదే కాదు కాబట్టి" చెప్పాడు శక్తి.

 

    "నువ్వు ఆ లైన్లో వెళ్తావా... కిరాణా కొట్లో పనిచేస్తే నువ్వు ఆ లైన్ లో వెళ్ళలేవు" జోక్ గా అన్నాడు రమణరావు.

 

    రమణరావు జోక్కి మిత్రబృందం, పడీ పడీ నవ్వారు.

 

    "అలాగే జపాన్ కూ వెళ్ళలేవు..." జగపతి నవ్వుతూ అన్నాడు.

 

    "చూద్దాం..." సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు శక్తి.

 

    "ఒరేయ్ శక్తీ... మనం సినిమాకెళుతున్నాంరా... మణిరత్నం రోజా వచ్చిందిరా" ప్రపోజ్ చేసాడు రమణరావు.

 

    ఇరవై నిమిషాల తర్వాత విజయవాడ వెళ్ళే బస్సులో వున్నారంతా.

 

                                             *    *    *    *

 

    బస్ విజయవాడ బస్ స్టేషన్ కి చేరుకుంది.

 

    అప్పటికి సమయం సరిగ్గా తొమ్మిది గంటలు.

 

    సిటీ బస్సు మీద సినిమాహాలు చేసేసరికి మరో పావుగంట పట్టింది.

 

    సెకండ్ షో వదిలేసరికి పన్నెండు అయ్యింది.

 

    దారిలో టీ త్రాగి, సిగరెట్లు కాల్చుకుంటూ, నడుచుకుంటూ బస్టాండ్ వరకూ వచ్చారు.

 

    అరగంట వెయిట్ చేసాక ఓ లారీ దొరికింది.

 

    మరో గంటన్నర తర్వాత రైతుపేటలో దిగారు.

 

    కబుర్లు, నవ్వులు, జోకులు, చల్లటి చలిలో సిగరెట్లు...

 

    "సతీష్ చంద్ర థియేటర్ లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయిరా- ఇంకా సినిమా షోకాలేదా?" అడిగాడు సుబ్రహ్మణ్యం.

 

    "థియేటర్ లైట్లు కావని, పర్సనల్ రూమ్ లో లైట్లు" చెప్పాడు రమణరావు అనుమానంగా.

 

    జగపతి నీడల్లోంచి పాక్కుంటూ వెళ్ళిన కాసేపటికి గోడకు కొట్టిన బంతిలా పరుగు పరుగున ఒగర్చుకుంటూ వచ్చాడు.

 

    "ఓరేయ్ శక్తీ... ఘోరం జరిగి పోతోందిరా... అర్జంటుగా రండి" అల్లంత దూరం నుంచే గొంతు తగ్గించి అరిచాడు.

 

    మరేమాత్రం ఆలస్యం చేయలేదు శక్తి. మిగిలిన వాళ్ళు శక్తిని అనుసరించారు.

 

    థియేటర్ పైన-

 

    మేడమీద, కేబిన్ కు కుడివైపున ఉన్న పర్సనల్ రూమ్ లో-

 

    బాలచంద్ర ఫుల్ బాటిల్ పూర్తిచేసి తూలుతూ వున్నాడు. మత్తులో స్నానం చేసినవాడిలాగా వున్నాడు.

 

    ఎదురుగా....

 

    ఓ అమ్మాయి... ఆ అమ్మాయికి చెరొకవైపు ఇద్దరు గూండాలు.

 

    "చూడు నాగమణీ- అంతర్జాతీయ సమస్య లెవిల్లో ఫీలైపోతావేంటి? మర్యాదగా ఒప్పుకో... ఈ రోజుల్లో ఇట్సాల్ కామన్ పైకి రావటానికి ఇవన్నీ పట్టించుకోకూడదు..." అన్నాడు మత్తుగా.

 

    "నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మాట్లాడాలని పిలిపించి... ఇంత నీచమైన పని చేయాలని ప్రయత్నిస్తావా?" నాగమణి నాగుపాములా బుసలు కొడుతోంది.

 

    "నీచం అనుకుంటే నీచం... రొమాన్స్ అనుకుంటే రొమాన్స్- కొంపదీసి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనే లెవిల్లో ఆలోచించుకున్నావా? పిచ్చిదానా... టైం వేస్ట్ చేయమాకు. నిన్ను ఎక్కడికో తీసుకుపోతాను..." అంటూ తూలుతున్నాడు బాలచంద్ర. మాటలు తడబడుతున్నా- శరీరం తూలుతున్నా- అతని కళ్ళల్లో కాంక్ష జ్వలిస్తోంది.

 

    "నా కంఠంలో ప్రాణం వుండగా అది జరగదు-" నిస్సహాయంగా అరిచింది నాగమణి.

 

    "రెచ్చిపోకు నాగమణీ... నీ జీవితంలో రేప్ జరగాలని ఆ బ్రహ్మ రాస్తే నువ్వు ఇళా మాట్లాడక ఎలా మాట్లాడుతావు- ఐ యామ్ సారీ... బ్రహ్మరాతను తారుమారు చేయలేను-" అంటూ బాలచంద్ర పశువులా ఆమెమీద పడ్డాడు.

 

    నాగమణిని గట్టిగా పట్టుకుని ఆమె జాకెట్ చించే ప్రయత్నంలో వున్న బాలచంద్రకు జరగబోయేదేమిటో అర్థం కాలేదు.

 

    ఫట్... ఫట్...

 

    బాలచంద్ర గూండాలిద్దరూ ఆర్తనాదం చేస్తూ బాలచంద్ర మీద పడ్డారు.

 

    బాలచంద్ర కళ్ళముందు మెరుపులు కన్పించాయి. విసురుగా వెళ్ళి గోడకు గుద్దుకున్నాడు.    

 

    ముందు లోపలకు వచ్చింది శక్తి.

 

    అతని వెనుకగా అతని మిత్ర బృందం.

 Previous Page Next Page