2. ద్రోహ వివర్జిత దేవద్వయమా ! మాకు మీవద్ద మా భోజనమునకుగాను అన్నలాభము కలుగవలెను. రుద్రపుత్రులారా ! మేము మీ స్తోతలము. మేము మీవారలము కావలెను. సమృద్దులము కావలెను.
3. రుద్రపుత్రులారా ! మీ ఉభయుల రక్షణలతో మమ్ము రక్షించండి. మాకు ఇష్టప్రాప్తి కలుగవలెను. అనిష్ట నివారణ జరుగవలెను. అభిమత ఫలము లభించవలెను. మేము మాపుత్రుల సహితులమయి శత్రువులను హింసించవలెను.
4. ఆశ్చర్యకర కార్యములు చేయువారలారా ! మేము ఇతరులను పూజించుట వలన లభించిన ధనమును అనుభవింపము. మేము మీ అనుగ్రహమున సమృద్దులము. మేము ఇతరుల ధనముతో దేహ పోషణచేసికొనము. పుత్ర పౌత్రుల యుక్తమయిసహితము మీకు వ్యతిరిక్త ధనమును అనుభవించము. మా కులమందు ఎవరును మీరు కాక ఇతరులవలన లభించిన ధనమును అనుభవించరు.
డెబ్బది ఒకటవ సూక్తము
ఋషి - ఆత్రేయ బాహువృక్తుడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - గాయత్రి
1. మిత్రావరుణులారా ! మీరు శత్రు ప్రేరకులు. శత్రుహంతలు. మీరు హింసావర్జితమగు మా ఈ యజ్ఞమునకు విచ్చేయండి.
2. ప్రకృష్ట జ్ఞానయుక్త మిత్రావరుణులారా ! మీరు అందరకు స్వాములు. ఫలప్రదానము ద్వారా మా కార్యములను పాలించండి.
3. మిత్రావరుణులారా ! మీరు మా అభిషుత సోమము కొఱకు విచ్చేయండి. మేము హవి అందించు వారలము. మేము సమర్పించు సోమపానము చేయుటకు విచ్చేయండి.
డెబ్బది రెండవ సూక్తము
ఋషి - ఆత్రేయ బాహువృక్తుడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - ఉష్ణిక్.
1. మా గోత్ర ప్రవర్తకుడగు అత్రివలె మేము మంత్రములతో మిమ్ము ఆహ్వానింతుము. మిత్రావరుణులారా ! మీరు సోమపానమునకుగాను కుశాసనమున ఆసీనులు అగుడు.
2. మిత్రావరుణులారా ! మీరు జగదుద్దారక కర్ములు. మీరు స్థానచ్యుతులు కారు. ఋత్విక్కులు మీకు యజ్ఞప్రదానము చేసెదరు. సోమపానమునకు గాను కుశాసనమున ఆసీనులుకండి. "నిబర్హీషి సదతం సోమపీతయే"
3. మిత్రావరుణులారా ! మీరు మా యజ్ఞమునుకోరి స్వీకరించండి. సోమపానమునకుగాను కుశాసనమున కూర్చుండుడు "నిబర్హీషి సదతం సోమపీతయే"
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఐదవ మండలమున నాలుగవ అష్టకము ఐదవ అనువాకము సమాప్తము)
ఆరవ అనువాకము డెబ్బది మూడవ సూక్తము
ఋషి - ఆత్రేయ పౌరుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - అనుష్టుప్.
1. లెక్కకు మిక్కిలి యజ్ఞములందు భుజించు అశ్వినీకుమారులారా ! మీరు ఇప్పుడు అత్యంత దూరదేశమగు అంతరిక్షమున ఉన్నారు. ద్యులోకమున ఉన్నారు. అట్లయ్యు అన్ని స్థానములనుండి ఇచటికి విచ్చేయండి.
2. అశ్వినులారా ! మీరు అనేక యజమానులకు ఉత్సాహదాతలు. వివిధ కర్మల కర్తలు. వరణీయులు. అప్రతిహతగాములు. అనిరుద్ధకర్ములు. ఈ యజ్ఞమున మేము మీవద్దకు చేరెదము. విశేష భోగము, రక్షణ కొఱకు మేము మిమ్ము ఆహ్వానించుచున్నాము.
3. అశ్వినులారా ! సూర్యుని స్వరూపమును ప్రదీప్తము చేయుటకుగాను రథపు దీప్తిమంతమగు చక్రమును నియమించినారు. మీ సామర్థ్యమును మానవుల అహోరాత్రికాలమును నిరూపించుటకుగాను అన్య చక్రములను లోకములందు పరిభ్రమింప చేసినారు.
4. వ్యాపక దేవద్వయమా ! మేము మిమ్ము స్తుతించు స్తోతలము ఇది 'పౌరు'ని ద్వారా సుసంపాదితము. పృథిక్ ఉత్పన్నులు - నిష్పాపులగు మీరు మాకు బోలెడు అన్నము ప్రసాదించండి.
5. అశ్వినులారా ! మీ భార్య సూర్యమీ సర్వథా శీఘ్రగామి - రథమున ఎక్కినపుడు - అప్పుడు వెలుగులు చిమ్ము మీ దీప్తి నలుదిశల క్రమ్ముకొనును.
6. నేతలగు అశ్వినులారా ! మా తండ్రి అత్రి మిమ్ము స్తుతించినపుడు అగ్ని తాపము సుఖ సేవ్యమయినది. అతడు అందుకు కృతజ్ఞతచిత్తమున మీ ఉపకారమును స్మరించినాడు.
7. అశ్వినులారా ! మీ రథము గట్టిది. ఉన్నతము. నడకనేర్చినది. ఆ రథము యజ్ఞములందు ప్రసిద్ధము. మా తండ్రి అత్రి మీవలననే తరించినాడు.
8. మధుర సోమరసమును కలుపు దేవద్వయమా ! మేము సమర్పించు పుష్టికరమగు స్తుతి మీ మీద మధుర రసమును చల్లవలెను. మీరు అంతరిక్ష సీమను అతిక్రమింతురు. సుపక్వ హవ్యము మిమ్ము పోషించును.
9. అశ్వినులారా ! పండితులు మిమ్ము సుఖదాతలనుగా పేర్కొందురు. అది నిశ్చయ సత్యము. మా యజ్ఞమునకు సుఖదానార్థము ఆహ్వానించుచున్నాము. మీరు అతిశయ సుఖదాతలు కావలెను.
10. శిల్పి రథమును అందముగా చెక్కినట్లు మేము అశ్వద్వయమును సంవర్థితులను చేయుటకు స్తుతులు సమర్పించుచున్నాము. ఆ స్తుతులు అశ్వినులకు ప్రీతికరమును కావలెను.
డెబ్బది నాలుగవ సూక్తము
ఋషి - ఆత్రేయ పౌరుడు దేవత - అశ్వినులు, ఛందస్సు - అనుష్టుప్.
1. అశ్వినులారా ! మీరు స్తుతిధనులు. ధనవర్షులు. మీరు నేడు ఈ యజ్ఞ దినమున ద్యులోకమునుండి విచ్చేయండి. భూమి మీద నిలువండి. ఈ స్తోత్రమును వినండి. ఈ స్తుతిని మీ కొఱకు అత్రి సర్వదా పఠించును.
2. దీప్తిమంతులగు నా సత్యద్వయము - అశ్వినులు ఏరి? నేటి ఈ యజ్ఞదినమున ద్యులోకమునందలి ఏ స్థానము నుండి శ్రుతులగుచున్నారు?
దేవద్వయమా ! మీరు ఏ యజమాని దగ్గరకు విచ్చేయచున్నారు? ఏ స్తోత మీ స్తుతులకు సహాయకుడు అగుచున్నాడు?
3. అశ్వినులారా ! మీరు ఏ యజ్ఞము - ఏ యజమానివద్దకు ఏతెంచుచున్నారు? అట్లు వెళ్లి ఎవరిని కలిసి కొందురు? ఎవరి ఎదుట నిలిచి మాట్లాడుటకు రథమునకు గుఱ్ఱములు కట్టుచున్నారు? ఎవరి స్తోత్రములు మీకు ప్రీతికరములు? మేము మిమ్ము పొందవలెనను కోరికగలవారము.
4. పౌరసంబంధి అశ్వినీ కుమారులారా ! మీరు పౌరునివద్ద జలవాహక మేఘమును ప్రేరేపించండి. అడవిలో పులులు సింహమును కొట్టినట్లు యజ్ఞకర్మ వ్యాప్త పౌరునివద్ద మేఘమును కొట్టుడు.
5. చ్యవనుడు జరా జీర్ణుడు. పురాతనుడు. కురూపి. అశ్వినులారా ! మీరు అతనిని కవచమువలె విముక్తము చేసినారు. మీరు చ్యవనుని మరల ప్రాయపు వానిని చేసినపుడు అతనిని రూపమును సురూపయువతి కామించినది. పొందినది.
6. అశ్వినులారా ! ఈ యజ్ఞస్థలమునకు మీ స్తోతలు వచ్చియున్నారు. మాకు సమృద్ధి కలుగుటకుగాను మేము మీ దృష్టిలో ఉండవలెను. నేడు మీరు మా ఆహ్వానమును ఆలకించండి. మీరు అన్నరూప ధనవంతులు మీరు రక్షణలతో ఇటకు ఏతెంచండి.
7. అశ్వినులారా ! మీరు అన్నరూప ధనవంతులు. మానవులను మిమ్ము మించి ప్రసన్నులను చేయువాడు ఎవడు? జ్ఞానులచే వందితులగు దేవద్వయమా ! ఏ జ్ఞాని మిమ్ము అందరిని మించి ప్రసన్నులను చేయగలడు?
8. అశ్వినులారా ! దేవతలందరి రథములలో మీ రథము వేగవంతము, అసంఖ్యాక శత్రుసంహారకము. ఆ రథమును యజమానులు నుతింతురు. మీ రథము దూరహితమును కోరవలెను. మావద్దకు చేరవలెను.
9. మధుమంతులగు అశ్వినులారా ! మీ కొఱకుగాను మరల మరల సమకూర్చిన స్తోత్రములు మాకు సుఖములు కలిగించవలెను. విశిష్ట జ్ఞానసంపన్నులగు అశ్వద్వయమా ! మీరు శ్యేన పక్షివంటి సర్వత్ర సంచరించు అశ్వమును ఎక్కి మాకు అభిముఖముగా రండి.
10. అశ్వినులారా ! మీరు ఎక్కడ ఉన్నను మా ఆహ్వానమును వినిపించుకొనుడు. మీ వద్దకు వచ్చుటకు అతురపడు ఈ హవ్యము మీవద్దకు చేరవలెను. మీకు అందవలెను.
డెబ్బది అయిదవ సూక్తము
ఋషి - ఆత్రేయ అవస్యుడు - దేవత - అశ్వినులు, ఛందస్సు - పంక్తి.
1. అశ్వినులారా ! అవస్యు ఋషి మీ ఉభయుల స్తుతికర్త. అతడు మీ ఫలప్రద, ధనపూర్ణ రథమును అలంకృతము చేయును. మధు విద్య ఎరిగిన వారలారా ! మా ఆహ్వానమును ఆలకించండి. "మమశ్రుతం హవమ్"
2. అశ్వినులారా ! మీరు శత్రుసంహారకులు. హిరణ్మయ రథారూఢులు. ప్రశస్త ధనసంపన్నులు. నదులను ప్రవహింప చేయువారు. మధువిద్యావిశారదులు. మీరు అందరు యజమానులను అతిక్రమించి ఇచటకి విచ్చేయండి. అందువలన మేము సమస్త విరోధులను ఓడించగలము. మీరు ఆహ్వానములు వినండి. "మమశ్రుతం హవమ్"
3. అశ్వినులారా ! మీరు సువర్ణ రథారూఢులు. స్తుతియోగ్యులు. అన్నరూపధనవంతులు. యజ్ఞమున అధిష్ఠించినారు. మధువిద్యావిశారదులు. మీరు మా పిలుపు వినండి. మా కొఱకు రత్నములు తీసికొని రండి.
4. ధనమును వర్షించు అశ్వినులారా ! నేను మీ స్తోతను. ఈ స్తోత్రములు మీ కొఱకు ఉచ్చరించబడినవి. ప్రసిద్ధుడు, మూర్తిమంతుడగు యజమాని ఏకాగ్రచిత్తమున మీకు హవి సమర్పించును. "మమశ్రుతం హవిం"
5. అశ్వినులారా ! మీరు విజ్ఞ మనస్కులు. రథారూఢులు. ద్రుతగాములు. స్తోత్రశ్రవణకర్తలు. మీరు త్వరగా రథమునెక్కి కపటము ఎరుగని చ్యవనుని వద్దకు వెళ్లినారు. మీరు మధువిద్యావిశారదులు "మమశ్రుతం హవమ్"
6. నేతలగు అశ్వినులారా ! మీ గుఱ్ఱములు సుశిక్షితములు. ద్రుతగాములు విచిత్రరూపులు. ఆ అశ్వములు మిమ్ము ఐశ్వర్యయుక్తముగ సోమపానమునకుగాను ఇచటికి తీసికొని రావలెను. "మమశ్రుతం హవమ్"
7. అశ్వినులారా ! మీరు ఇచటికి ఏతెంచండి. మీరిద్దరు ప్రతికూలురుకారాదు. అజేయ ప్రభువులారా ! ఏ ప్రచ్చన్న ప్రదేశమునుండియైనను యజ్ఞగృహమునకు వేంచేయండి. మధువిద్యావిశారదులారా ! "మమశ్రుతం హవమ్"
8. జలాధిపతులు, అజేయులగు అశ్వినులారా ! ఈ యజ్ఞమున మీ స్తోత్రకారుడగు అవస్యుని అనుగ్రహించండి. మధువిద్యావిశారదులారా ! "మమశ్రుతం హవమ్"
9. ఉషస్సు వికసించినది. సముజ్వల కిరణ సంపన్న అగ్ని వేదిమీద సంస్థాపితమయినది. ధనవర్షకారులు, శత్రుసంహారకులగు అశ్వినులారా ! మీ అక్షయ్య రథమును అశ్వయుక్తము చేయండి. మధువిద్యావిశారదులారా ! "మమశ్రుతం హవమ్"
డెబ్బది ఆరవ సూక్తము
ఋషి - ఆత్రేయ భౌముడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఉషఃకాలమున జాగృతుడయిన అగ్ని ప్రజ్వరిల్లును. మేధావులగు స్తోతల దేవాభిలాష స్తుతులు ఉద్గీతములగును. రథాధిపతులగు అశ్వినులారా ! నేడు మీరు ఈ యజ్ఞస్థలమునకు అవతరించండి. సోమరస పూర్ణ సమృద్ధ యజ్ఞమునకు విచ్చేయండి.
2. అశ్వినులారా ! ఇది సంస్కారవంతమగు యజ్ఞము. దీనిని హింసించరాదు. కాని యజ్ఞమునకు త్వరగా వచ్చి స్తుతిభాజనులుకండి. ప్రాతఃకాలమున రక్షణ సహితులయి విచ్చేయండి. అందువలన అన్నమునకు అభావము కలుగదు. హవ్యదాత యజమానిని సుఖవంతుని చేయండి.
3. అశ్వినులారా ! మీరిద్దరు రాత్రిశేషమున పాలుపితుకుకాలమున ప్రాతఃకాలమున అపరాహ్నమున రాత్రిపూట ఏ సమయమందయినను సుఖకర రక్షణలతో విచ్చేయండి. అశ్వినులను విడిచి ఇతర దేవతలు సోమపానమునకు ఉద్యుక్తులుకారు.
4. అశ్వినులారా ! ఈ ఉత్తర వేది మీకు నివాసయోగ్యమగు ప్రాచీనస్థలము. ఈ సమస్త గృహము ఆలయము మీ కొఱకే అగును. మీరు ఇరువురు వాయుపూర్ణ, మేఘ సమాకీర్ణ అంతరిక్షము నుండి అన్నము, బలమును తీసికొని మా వద్దకు చేరండి.
5. మేమందరము అశ్వినుల శ్రేష్ఠరక్షణలు సుఖప్రద ఆగమములతో ముడిపడవలెను. అమర దేవద్వయమా ! మీరు మాకు ధనము, సంతానము, సమస్త కళ్యాణములను ప్రసాదించండి.
డెబ్బది ఏడవ సూక్తము
ఋషి - ఆత్రేయుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. అశ్విద్వయము ఉదయమే - అందరి దేవతలకన్నముందు విచ్చేయుదురు. ఋత్విక్కులారా ! వారిని పూజించండి. కాంక్షగల అదానపరులగు రాక్షసులు మున్నగువారికన్నముందే వారు హవ్యపానము చేయుదురు. వారు ప్రాతఃకాలముననే యజ్ఞమును భజింతురు. పూర్వకాలపు ఋషులు ప్రాతఃకాలమున అశ్విద్వయమును ప్రశంసించినారు.