Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 14


    వర్షంవల్ల దారి అంతా కచాటుగా వుంది. చెట్టుక్రిందికి మళ్ళీ ఎండపొడ కనిపిస్తే తప్ప వెళ్ళేందుకు వీల్లేదు. అంచేతే తన తాతలనాటి మంచం వేసుకుని రాస్తూ కూర్చున్నాడు.
    "పోస్ట్!"
    చప్పున లేచాడు ఆ పిలుపుకి. ఏనాడూ తన యింటికి పోస్ట్ మెన్ రాడు! కవితలు పోస్టు చెయ్యటమేకానీ అందుకోవటం లేదు. అచ్చైతే వాటిని లైబ్రరీలో చూసుకోవాలే తప్ప కాంప్లిమెంటరీ కాపీ కూడా రాదు. ఇక పారితోషకం మాట దేవుడెరుగు!
    పరుగుపరుగున వెళ్ళినట్టుగా వచ్చి అందుకున్నాడు. రెండు కవర్లిచ్చి వెళ్ళేడు పోస్టుమెన్.
    ఒటి లోకల్ డెలివరీ! పైన రాత గుండ్రంగా అందంగా అమ్మాయిల రాతలాగా వుంది. ఫ్రం ఎడ్రస్ లేదు.
    మరొకటి రాష్ట్రస్థాయి గేయ కవితలపోటీ నిర్వహించినవారినుంచి ఫ్రం అడ్రస్ స్టాంపువేసి పంపారు. కవిత తిరిగొచ్చిందేమో అనుకున్నాడు నీరసంగా.
    కవరు చింపేడు.
    శ్రీ రవీంద్రగారిక
        శుభాభినందనలు!

    మీరు పంపిన 'నా మౌనగీతి' రాష్ట్రస్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి సంపాదించుకుంది. మీకు మా హృదయపూర్వక ప్రగాఢ అభినందనలు.
    బహుమతి ప్రధానోత్సవం ఆగస్టు పదిహేను జరుగుతుంది. సభ సాయంకాలం అయిదుగంటలకి. జిల్లా కలెక్టరు గారు అధ్యక్షత వహిస్తారు. సాంస్కృతిక వ్యవహారాల సహాయమంత్రి బహుమతి ప్రదానం చేస్తారు. కావున 14 రాత్రికే యిక్కడికి చేరండి.
    ద్వితీయ, తృతీయ బహుమతులు పొందినవారికీ మీతోబాటు యిక్కడే సముచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము.
                                                                                                                  అభినందనలతో
                                                                                                                     మీ వాడు
                                                                                                                     అధ్యక్షుడు.
    గుండెనిండా కొత్త ఊపిరి నిండినట్లయింది.
    ఛాతీ రెండంగుళాలు ఉబికినట్లయింది.
    "అమ్మా!" అని ఆప్యాయంగా పిలిచాడు గబగబా వంటింటివైపు వెళ్ళాడు.

    "ఏం బాబూ!"
    "నాకు-నాకు-ప్రధమ బహుమతి వచ్చింది. ఆరోజు చెప్పానే రాష్ట్రస్థాయి గేయాలపోటీ అని ఆ కవితకి ప్ర-ధ-మ బహుమతి 
    రవి ముఖం వెయ్యికేండిల్ బల్బులా వెలిగిపోతోంది. అతన్నిచూసి, అతని మాటలు వినగానే సంబరపడిపోయింది సుబ్బమ్మగారు, "అంతా ఆ శ్రీనివాసుడి చలువ!" అంది ఆనందంగా.
    "ప్చ్! అమ్మకేం తెలియదు! తను కష్టపడి రాసి బహుమతి సంపాదిస్తే అంతా దేవుడి దయ అంటుందేమిటి?" 'ఆయన రాశాడా! ఆయన బహుమతి ఇప్పించాడా?' అనుకుని వెనుదిరిగాడు.
    తిరిగి తన ఆస్థాన పీఠికలాంటి మంచంపైకివచ్చి లోకల్ డెలివరీలో వచ్చిన కవరు చించాడు తాపీగా!
    లేత నీలం కాగితంమీద-పచ్చటి రంగులో ముత్యాల్లాటి అక్షరాలు! ఇలాటి రాతరాస్తే ఏ పత్రిక వాళ్ళయినా ముచ్చటపడి అచ్చేసుకుంటారు అనుకుని ఉత్తరం చదవటం ప్రారంభించాడు.
    ఆత్మీయులు, పూజ్యులూ, గౌరవనీయులూ
        ప్రేమపాత్రులూ శ్రీ రవీంద్ర కవిచంద్రులకి---
            రాజ్యలక్ష్మి ప్రేమ నమస్కారాలు---
    ఆ మాత్రం చదవగానే ఉలిక్కిపడ్డాడు. రాజ్యలక్ష్మి ఉత్తరం రాసిందా! చేసింది చాలక పైగా ఉత్తరం కూడానా! ఆరోజు ఎంత అవమానించింది. నలుగురిలోనూ తల వంచుకునేట్టుగా చేసింది. ఒక జులాయి వెధవపై ఆగ్రహించినట్టుగా తనపై కోపం ప్రదర్శించింది. ఎంత జాణ! మళ్ళీ ఈరోజు గొప్పగా కవిచంద్రులకి అంటూ ఉత్తరం రాసింది.
    తన అవసరం వస్తే కారు వేసుకుని పరిగెత్తుకుని వచ్చేది. ఈరోజు ముఖం చెల్లక కాబోలు ఉత్తరం రాసింది.
    ఏం రాసిందో?
    తిరిగ ఉత్తరం చదవటం ప్రారంభించాడు.
    ముందుగా నన్ను మనసారా మన్నించమని కోరుతున్నాను. మీకు నాపై కుత్తుక దాకా కోపం వచ్చి వుంటుంది. నాకు తెలుసు! అర్ధం చేసుకోగలను.
    నన్ను క్షమించగలిగితేనే ఈ తర్వాత ఉత్తరం చదవండి! లేదా చించి తగలేయండి. ఓ గొప్ప భావుకుడికి, ఓ అభ్యుదయ రచయితకి చేసిన అవమానానికి ప్రతిక్షణం మనసులో కుళ్ళుతూ వుంటాను.
    లేదు-గొప్ప మనస్సుతో నన్ను, నా తప్పిదాన్ని క్షమిస్తాననుకుంటే యీ తరువాయి ఉత్తరం చదవండి.
    రవిగారూ! మీరు దురదృష్టంకొద్దీ ఈ టౌన్లో పుట్టారు. మనిషి ఎదుగుదలకు ఊళ్ళూ దోహదం చేస్తాయి, విజయవాడ, తిరుపతి, హైద్రాబాద్, మద్రాసులాంటి పట్టణాల్లో పుట్టటమే ఒక వరం! అక్కడి మనుషులకి చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ వుండే అవకాశాలు ఎక్కువ. మనకి చాలా తక్కువ. మరి పల్లెల్లో పుట్టినవారి విషయాలు ఎందుకులెండి! చెప్పక్కర్లేదు!
    ఈనాటి సమాజం ఎలా వుందంటే అందినవాడికి స్వర్గం. అందనివాడికి నరకం-ప్రభువులు పాలకులు అయ్యారు. ప్రజలగోడు పట్టించుకోరు!
    మీవంటి మేధావి ఒక మామూలు బట్టలకొట్టు గుమాస్తాగా జీవితాన్ని వెళ్ళదీయటం నేను సహించలేక పోయాను. అది సాహిత్య సరస్వతి చేస్తోన్న సేవగా అనిపించింది.
    రవిగారు! మీకు తెలియనది కాదు. మనిషిలో ఓ యానిమల్ ఇన్ స్టింక్స్ యింకా నశించలేదు. అది అలవాటు. బాగా ఆలోచించండి. పశువులు ఓ యింటికి, ఓ మనిషికి అలవాటుపడితే యిక వాటిని వదలవు మనం దానికి విశ్వాసం అనేపేరు గొప్పగా తగిలించాం. మనిషిలోనూ అదే ఇన్ స్టింక్స్ యింకా వుంది.
    ఓ రకమయిన గుడ్డలేకట్టడం, ఓ ప్రత్యేకమైన హోటల్ లోనే టిఫిన్ తినటం, ఓ కొట్టులోనే కొంటూ వుండటం -- ఇవన్నీ యిన్ స్టింక్ట్ లే కదా! పైగా దాన్ని గొప్పగాకూడా చెప్పుకుంటారు. మేం ఫలానా కొట్టులోనే కొంటాం నా జీవితమంతా అలాగే వెళ్ళిపోయింది. ఫలానా కృష్ణమూర్తి మా ఫామిలీ డాక్టరు-యాభయ్యేళ్ళనుంచీ అతనే మా డాక్టరు. ఇది అంధ విశ్వాసంకాదా...
    ఈ ఎనిమల్ ఇంస్టింక్ట్ గురించి భయపడే మిమ్మల్ని పనిగట్టుకునివచ్చి అవమానించి ఉద్యోగం పోయేట్టు చేశాను. లేకపోతే మీ జీవితం ఆ గాడికే అంకితమైపోయేది. మీరు శాశ్వతంగా బట్టలకొట్టు గుమాస్తాగా వెళ్ళబుచ్చేవారు బ్రతుకుని...

 Previous Page Next Page