ఆలోచించండి! నామాట అబద్ధమా?
మీ అమూల్యమైన కాలం అలా వ్యర్ధమైపోయి, సాహితీజగతికి అన్యాయం జరగటం నేను సహించలేకపోయాను. రైటర్లు హోటల్ సర్వర్సుగా, బట్టలకొట్టు గుమాస్తాలుగా బ్రతకమన్న దౌర్భాగ్యం ఈ తెలుగువాళ్ళకే పట్టింది.
రవిగారూ! మీరు గొప్పవారు కావాలనే ఉద్దేశంతోనే నేనిలా చేశాను. తప్పయితే మన్నించండి.
మీ
ప్రేమ పాత్రురాలు
---రాజీ
ఉత్తరం పూర్తి చేయగానే రవి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
'తనెంతగా అపార్ధం చేసుకున్నాడు!'
ఉత్తరం మడిచి భద్రంగా దాచుకున్నాడు.
11
రాష్ట్రస్థాయి పోటీలనుంచి తిరిగొచ్చాడు రవి.
వాకిట్లోనే ఎదురైంది సుబ్బమ్మగారు. వంగి పాదాలకి నమస్కరించాడు. "వృద్ధిలోకి ర"మ్మని ఆశీర్వదించింది ఆమె.
లోపలికి వెళ్ళారిద్దరూ. బేగ్ లోంచి మెమెంటు తీసి గోడకి తగిలించడు. 'రాష్ట్రస్థాయి పాటల పోటీలు... ప్రధమ బహుమతి... రవీంద్రబాబు' అనే మాటలు మరోసారి చదువుకోగానే రోమాంచమైంది.
"ఎలా జరిగిందిరా సన్మానం?"
"గొప్పగా జరిగిందమ్మా! పెద్ద వేదిక కట్టారు. వెళుతూవుంటే దారికిరువైపులా మనుషులునుంచుని మాకూ, మంత్రిగారికి, కలెక్టరుగారికి పూలతో స్వాగతం చెప్పారు. మంత్రిగారు నన్ను గొప్పగా పొగిడారు. రెండు, మూడు బహుమతుల వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళు చిన్నవాడికి బహుమతి వచ్చింది. ఇక యితను పెద్దవాడు కావాలి అని ఆశీర్వదించాడు!"
సుబ్బమ్మగారి ముఖమంతా కళ్ళే అయ్యాయి.
సరిగ్గా అదేసమయం సవిత వచ్చింది.
"రావే! రా!" ప్రేమగా ఆహ్వానించింది సుబ్బమ్మగారు.
"పేపర్లో నీ ఫోటో చూశాను బావా. వెయ్యిన్నూట పదార్లు బహుమతి యిచ్చారటకదా! అభినందనలు!" అంది సవిత.
రవి వెర్రిముఖం పెట్టాడు.
"అదేం అలా చూస్తున్నావ్?" అంది అమాయకంగా, "అత్తయ్యా నువ్వు ఫోటోలు చూళ్ళేదా?"
"ఏదమ్మా! వాడొచ్చింది యిప్పుడేగా!"
సవిత పేపర్లోని ఫోటో చూసింది. రవి తన బేగ్ లోని ఫోటోలు తీసి చూపించాడు.
"పర్స్ యిస్తోన్న ఫోటోకదూ బావా!"
"అవును సవితా! పర్స్ మంత్రితో యిప్పించారు. సభ ప్రారంభం కాగానే కార్యనిర్వాహకులు చెప్పారు. వాళ్ళ సంస్థ ప్రారంభదశలో వుందని! అంత బహుమతి యివ్వలేదనీ--- అందుకే ద్వితీయ, తృతీయ బహుమతులు వాళ్ వాళ్ళకే యిచ్చుకున్నామనీ అన్నారు. సగం డబ్బు వాళ్ళకి విరాళంగా యివ్వబోయి పర్స్ తెరిచాను! ఏముంది అందులో?"
ఆశ్చర్యంగా చూసింది సవిత "ఖాళీయా?"
"కరక్టు... ఖాళీపర్స్... తెల్లబోయాను నేను. అప్పుడు చెప్పారువాళ్ళు యదార్ధం!"
"ఒకవేళ పర్స్ ని వేదికపైన్నే చూసుకుని వుంటే ఏమయ్యేది?"
"ఏమవుతుంది? చూసి చూసి అడగలేం కదా?"
"ఎంత దగా?"
"దగా కాదు సవితా! యదార్ధం! చాలా సాహిత్య సంస్థల బ్రతుకు కవుల బ్రతుక్కి డిటోలాగా వుంది."
నిట్టూర్చింది సవిత - "ఈ కవిత్వాలకంటే లాటరీ టిక్కెట్లు అమ్ముకున్నా మేలే! కమీషనయినా వస్తుంది."
నవ్వేశారిద్దరూ.
"అన్నట్టు బావా! నీకు ఫస్టు ప్రెయిజ్ ఒక నంబర్ లో పోయింది.
ఆశ్చర్యంగా చూశాడు రవి.
"ఏదీ నీ టిక్కెట్టు?"
బిక్కముఖం వేశాడు రవి "పోయింది!"
"పోయి వుండదు. ఎక్కడో మరిచిపోయివుంటావు --- వెదుకు."
సుబ్బమ్మగారు వెళ్ళి శ్రీనివాసుడి పాదాలవద్ద వుంచిన టిక్కెట్లు రెండూ తెచ్చింది.
"అదిగో! చూశావా అత్తయ్య ఎంత జాగ్రత్తగా దాచిందో! ఇదీ నేనిచ్చిన టిక్కెట్టు. ఇదిగో నీ నంబరు A 0005555--- పేపర్ లో చూడు ఫస్టుప్రయిజ్ A 1005555కి వచ్చింది. చూశావా ఒక్క నంబర్ లో తప్పిపోయిందంటే నువ్వు నమ్మలేదు."
ఫక్కున నవ్వేడు రవి - "అదేదో కార్టూన్ జోకులాగా వుంది నీ జోకు!" అన్నాడు.
సవిత కూడా నవ్వింది.
"పదండి! కాళ్ళూ ముఖాలు కడుక్కుందురుగాని!"
"అత్తయ్యా! నాకు కాఫీ కావాలి!" అంది సరిత.
తల్లివైపు చూశాడు రవి.
"శారదమ్మని అడుగుతానులే!" అంటూ వెళ్ళింది.
ఇద్దరే మిగిలిపోయారు.
"అవును కాకి బావా! ఏదైనా గవర్నమెంటు ఉద్యోగం వెతుక్కోకూడదూ?"
అటూ యిటూ చూశాడు రవి.
"ఏంటలా చూస్తున్నావ్?"
"ఎక్కడన్నా ఎవరయినా పారవేసుకున్నారా అని చూస్తున్నాను."
ఫక్కున నవ్వింది సరిత "భలే!" అంది.
తనూ నవ్వేడు రవి "మరేమిటి? గవర్నమెంటు ఉద్యోగాలు బజార్ లో ఎవరో పారవేసుకున్నట్టుగా నువ్వంటే నవ్వు వచ్చింది. అదంత సులువుకాదు"
"రోజులలా వచ్చాయి. మన బ్రతుకులిలా తగలడుతున్నాయి!"
"సవితా!"
"ఏమిటి బావా!"
"నువ్వు పెళ్ళి చేసుకోకూడదూ?"
సవిత అతనివైపు ఎగాదిగా చూసింది. చుట్టూ చూసింది. అతన్ని నిశితంగా పరిశీలించింది.