Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 13


    సోమవారం అప్పుడే వచ్చేసిందా అనిపించింది రవికి. నిన్నంతా చదువుకోవటంలోనూ, రాష్ట్రస్థాయి కవితల పోటీకి గేయం పంపటంలోనూ గడిచిపోయింది. ఆదివారం కాబట్టి పోస్టాఫీసు లేక కవరుకోసం లెక్చరరుగారింటికి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన ఓ అరగంటసేపు కబుర్లతో తినేశాడు. నేటి సామాజిక పరిస్థితిని దుమ్మెత్తిపోశాడు.
    ప్రొద్దునే భోజనం ముగించుకుని బయలుదేరాడు. సన్నగా వర్షం ప్రారంభమయింది! గొడుగులేదు! గొడుగులాటి భోగవస్తువు కొనే స్తోమత తండ్రి చావుతోనే పోయింది. రెయిన్ షూ లేదు. అదీ తన పాలిటికి లగ్జరీ అయిపోయింది. ప్రతిదీ డబ్బుతో లెక్క చూసుకుని బ్రతికే రోజులు.
    సగం తడిసే వెళ్ళాడు షాపుకి.
    తిరుప్పయ్య ఇంకా కొట్టుకి రాలేదు. గుమాస్తాలు అందరూ వచ్చారు. హెడ్ గుమాస్తా అంతా అజమాయిషీ చేస్తున్నాడు. రవే అతనకా పదివి సృష్టించాడు తమాషాగా.
    "పెద్దయ్య వచ్చినాక ఓ గొడుగు అడుగు. నెల నెలా యింత తీసుకుంటాడు! లేకపోతే ఈ వర్షాకాలంలో రావడం, పోవడం చాలా కష్టం!" అన్నాడు అతను.
    నవ్వేశాడు రవి.
    దాదాపు పండ్రెండు గంటల ప్రాంతం!
    తిరుప్పయ్య ఎవరో పెద్ద పార్టీ వస్తే కాఫీలు తెప్పించాడు. అందరూ వెచ్చగా తాగుతున్నారు. ధారగా కురుస్తోన్న వర్షం చలిచలి అనిపిస్తోంది. కొట్టుముందు కారు ఆగింది. ఎవరో అమ్మాయి దర్దాగా రాకుమారిలాగా గొడుగు పట్టుకుని వచ్చింది.
    "ఏం కావాలమ్మా!"
    "మంచి చీరలు --- వెరైటీ చూపండి!"
    ఆ గొంతు వినగానే ఖంగుతిన్నాడు రవి! ఆమె రాజ్యలక్ష్మి.
    నేరుగా చీరల కౌంటర్ ముందుకి వచ్చింది రాజ్యలక్ష్మి.
    "ఏ రకాలు కావాలండి!"
    "అన్ని వెరైటీస్ చూపండి!" రవిని గుర్తించనట్టే అడిగింది. ఆమె నల్లకళ్ళజోడు తీయనే లేదు. వాటి వెనుక ఏ భావాలు దాగి వున్నాయో ఎవరికీ తెలియదు.
    రవి రకరకాల చీరలు చూపుతున్నాడు.
    హెడ్ గుమాస్తా నారాయణ అన్నీ డిస్ ప్లే చేసి చూపుతున్నాడు.
    "ఇదయితే మీకు బావుంటుంది!" చప్పున అన్నాడు రవి.
    "షటప్!" కోపంగా అంది ఆమె.
    తెల్లబోయాడు రవి "తనేం తప్పు అన్నాడని ఆవిడలా అంది?" అతన్లోనూ కోపం వచ్చేసింది.
    "మైండ్ యువర్ బిజినెస్! కొట్టులో గుడ్డలు అమ్ముకునే వాడిని అలాగే వుండు! నా అందచందాలూ, నా టేస్టులో, నా మేచ్ లూ నీకు అక్కర్లేదు, షాపులో ప్రవేశించి చిన్నప్పటినుంచీ చూస్తూనే వున్నాను! నీ చూపులో, మాటలో నువ్వు నాకిస్తోన్న స్పెషాలిటీ --- వాడ్డూయూ మీన్ --- యామ్ ఐ సో చీప్!" చిడామడా అనేస్తోంది.
    నివ్వెరపోయిన, షాకయిన రవి ఏమీ మాటాళ్ళేకపోయాడు ... అతనికి ఆమె ప్రవర్తన చాలా వింతగా అనిపించింది.
    అంత ఖరీదైన పార్టీ! ఎగిరెగిరి పడుతూ వుంటే తిరుప్పయ్యకి వళ్ళంతా తేళ్ళూ, జెర్లూ పాకి నట్టైంది "ఏమిటమ్మగారూ! ఏమిటమ్మగారూ!" అని అడిగాడు.
    "ముందితన్ని మీ షాపు నుంచి డిస్మిస్ చెయ్యండి. ఇలాంటి వాళ్ళని షాపులో పెట్టుకుంటే యిక మీ షాపుకి మాలాంటి మర్యాదస్తులు ఎవరూరారు!" అంది కోపంగా.
    తిరుప్పయ్య బిక్క ముఖం వేసుకుని చూశాడు రవి వైపు.
    హెడ్ గుమాస్తా నారాయణ ఏదో చెప్పబోయాడు.
    "నే వెళ్ళొస్తానండీ!" అని చకచకా వెళ్ళిపోయాడు రవి. అతనికి ఆ అవమనం భరింపరానిదిగా వుంది. రాజ్యలక్ష్మి ఎందుకలా ప్రవర్తించిందో అతనికి అంతుపట్టలేదు. లెట్ ర్ గోటు డెవిల్స్! కానీ తననెంత అవమాన పరిచింది. సమయం వస్తే అంతకంతకు దెబ్బతియ్యాలి అనుకున్నాడు!
    రవి వెళ్ళిపోగానే షాపులో వున్న చీరలన్నీ తీయించి అలా అలా తిరగేసి ఒక్కటీ నచ్చలేదంటూ వెళ్ళిపోయింది. ప్రముఖ వ్యాపారస్తుడు, పారిశ్రామిక వేత్త రాజేశ్వరరావు గారి అమ్మాయిని ఏమీ అనలేక పోయాడు తిరుప్పయ్య.
    "ఈవిడ బేరం కాదుగానీ బంగారంలాంటి అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి తోడుగా మా పెద్దాడితో మరో కొట్టు పెట్టాలనుకుంటిని --- చాకులాంటి కుర్రాడు!" ఉస్సురుమన్నాడు తిరుప్పయ్య.
                                        10
    మనస్సంతా మబ్బు పట్టిన ఆకాశంలాగా వుంది.
    తనని ఉద్యోగం నుంచి తీసేశారని చెప్పాడు రవి. ఆ రోజే! సుబ్బమ్మకి గుండె గొంతుకలోకి వచ్చినట్టెయింది. ఏమీ అనలేక పోయింది. ఒక్కక్షణం ఆగి! పోతే పోయింది. వెధవ ఉద్యోగం! నేను ఆరోజే అనుకున్నాను. ఇంత చదువు చదివి బట్టల కొట్లో పద్దులు రాయటమా అని! ఏమో! భగవంతుడు నీకు యింతకంటే మంచి ఉద్యోగం రాసి పెట్టాడేమో! నువ్వేం దిగులు పడకు! మళ్ళీ వానలు పడుతున్నాయి. చెట్లు ఎదిగొస్తున్నాయి.
ఎంతలేదన్నా రోజుకి రెండు రూపాయల కాయలు వెళ్ళుతాయి! ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చినా కళ్ళకి అద్దుకుని తీసుకుంటారు! ఏం చేదా? తాజా కూరగాయలాయె! బజారుకు వెళ్లే పనీ తప్పే!" అంది ధాటీగా.
    ఆ రోజే ఓ కథ రాయటానికి ప్రారంభించాడు రవి. కధ పేరు అనుభవం! మొదటిపేడీ చక చకా సాగిపోయింది. తర్వాతే కుంటుతోంది.
    గేయం రాయాలన్నీ, పద్యం రాయాలన్నా, వచన కవిత రాయాలన్నా మేం మేం అంటూ పరిగెత్తినట్టు వచ్చే పదాలు కథ కోసం కలం పట్టుకునేసరికి ఎపోజిషన్ పార్టీ వాళ్ళలాగా కలిసి రావటం లేదు.
    ప్రతి తొలికథా తను అనుభవం నుంచే వస్తుందేమో అనుకున్నాడు రవి! నట్టు బట్టి రాస్తే నాలుగు రోజులకి నాలుగు పేజీలు వచ్చింది. పద్యంలో లాగా, గేయంలోలాగా, కథలో కూడా పదునైన పదాలే వస్తున్నాయి సంభాషణల్లో! రచనలో కవితాత్మ కనిపిస్తోంది.
    ఈరోజు ఎలాగయినా పూర్తి చేయాలనుకున్నాడు అతను.

 Previous Page Next Page