వెంటనే బైక్ స్పీడ్ పెంచి, అనిరుద్ర స్కూటర్ ని తన బైక్ సమీపించగానే కుడి చేత్తో అనిరుధ్రను ముందుకు లాగాడు.
అనిరుద్ర తూలి పడ్డాడు.
అతి కష్టం మీద బైక్ ని ఆపాడు. స్కూటర్ రోడ్డుకు అడ్డంగా పడింది. ఇది రమేష్ ఊహించని పరిణామం.
వేగంగా అనిరుద్ర స్కూటర్ ని ఢీ కొట్టాలని స్పీడు పెంచాడు. ఆ స్పీడుని బ్యాలెన్స్ చేయడం కష్టమైంది.
రోడ్డుకు అడ్డంగా పడ్డ స్కూటర్ మీదుగా అంబాసిడర్ కారు వెళ్ళింది.
స్కూటర్ తుక్కు తుక్కు అయింది. భయంతో కారు వేగం పెంచాడు రమేష్.
బెనర్జీ...వెంటనే బైక్ ని తిప్పి...ఆ కారును ఫాలో చేసాడు.
పది నిముషాల్లో కారుకి అడ్డంగా తన బైక్ ని పెట్టాడు.
* * *
లాకప్ లో వున్నాడు రమేష్.
"కమాన్ స్పీకవుట్...ఎందుకు అతడ్ని చంపాలనుకున్నావు?" కర్కశంగా అడిగాడు బెనర్జీ.
రమేష్ అనిరుద్ర స్కూటర్ ని డ్యాష్ ఇచ్చి పారిపోతుంటే, బెనర్జీ ఛేజ్ చేసి, కారుని ఆపి, రమేష్ ని అరెస్ట్ చేసాడు.
ఎఫ్.ఐ ఆర్. పైల్ చేయకుండా, సెల్ లో తోసి, ఇంటరాగేషన్ ప్రారంభించాడు.
"నేను అతడ్ని చంపాలనుకోలేదు. స్పీడ్ గా వెళ్తున్నాను. సడన్ గా బ్రేక్ ఫెయిలైంది" అన్నాడు రమేష్ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.
తనకు డబ్బు వుందనే అహంకారం అతని మాటల్లో కనిపిస్తోంది.
"అలాగా... మరి రోడ్డుకు అడ్డంగా నేను బైక్ పెట్టినప్పుడు సడన్ గా ఎలా ఆపావు కారును. " అడిగాడు బెనర్జీ.
"అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా?"
"అనుమానం కాదు.. నిజం.."
"ఇన్ స్పెక్టర్... నేనవర్నో తెలుసా..అయినా మీతో డిస్కషన్ అనవసరం. నేను లాయర్ తో మాట్లాడాలి."
తన చేతిలో వున్న స్టిక్ తో అతని పెదవుల మీద కొట్టాడు. పెదవి చిట్లి రక్తం కారింది.
"ఇది అన్యాయం?" అరిచాడు రమేష్.
"నువ్వు ఓ వ్యక్తిని ఘోరంగా యాక్సిడెంట్ చేసి చంపాలనుకోవడం కన్నానా?"
"ఇప్పుడు నన్నేం చేస్తారు?"
"ఏమైనా చేయగలను. ఎన్ కౌంటర్ చేసిపారేయగల్ను కూడా."
"ఇన్ స్పెక్టర్"
"అరవకు మిష్టర్.. నీ మీద ఎఫ్.ఐ.ఆర్. కూడా ఫైల్ చేయలేదు. నిన్ను అరెస్ట్ చేసిన సాక్ష్యం లేదు. నువ్వన్నావే బ్రేకలు ఫెయిలయ్యయని, నిజంగానే ఆ కారు బ్రేకులు తిసేసి, నిన్ను అందులో కూచోబెట్టి ఓ లోయలో వదిలేస్తే, బ్రేకులు ఫెయిలై కారు లోయలో పడి చచ్చావనుకుంటారు" తాపీగా అన్నాడు.
"ఇది అన్యాయం...ఓ పోలీసాఫీసర్ అయివుండి..."
"అవును అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదుర్కొనే పోలీసాఫీసర్ ని. ' ధర్మ సంస్దాపనార్దాయ సంభవామి యుగేయుగే..' అని భగవద్గీత లో వుందిగా."
"ఇప్పుడు...ఇప్పుడు నన్నేం చేస్తారు?"
"ముందుగా థర్ట్ డిగ్రీ అంటే ఏంటో రుచి చూపిస్తా... ఆ తర్వాత నీ మీద హత్యాయత్నం కేసు కూడా ఫైల్ చేస్తా."
"వద్దు.. ఫ్లిజ్ ... నన్ను వదిలేయండి... మీకు నిజం చెప్పేస్తాను" ఒక్కడుగు తగ్గాడు రమేష్.
బెనర్జీ గురించీ ఆ కాసేపట్లోనే అర్ధమైంది. అన్నంత పని చేయగలడు. పైగా హత్యా ప్రయత్నం కేసు తన మీద తోస్తే, కోర్టుల చుట్టూ తిరగాలి. తను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
"నేను అనిరుద్రని చంపాలనుకున్నది నిజమే" తల వంచుకుని చెప్పాడు రమేష్.
"రైట్... ఆ విషయం నాకు తెలుసు... కానీ ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు" బెనర్జీ అడిగాడు.
"అవని కోసం" చెప్పాడు రమేష్.
చిన్న కలవరపాటు.
అటెన్షన్ లోకి వచ్చాడు.
"అవును... అవని కోసమే... అవని అంటే నాకిష్టం. మా అక్క కూతురు. కానీ, అవని అనిరుద్రని ప్రేమించింది. నాకన్నా డబ్బులో, హొదాలో ఏ మాత్రం సరితూగని అతడ్ని అవని ప్రేమించడం భరించలేకపోయాను. అతడ్ని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాను."
"అనిరుద్రని చంపేస్తే కొన్నిరోజుల తర్వాత ఆ విషయం మరుగున పడుతుంది. అవని కూడా క్రమక్రమంగా అతడ్ని మరిచిపోతుందని అనుకున్నాను. పిచ్చి ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నాను." తలవంచుకుని చెప్పాడు రమేష్.
ఇన్ స్పెక్టర్ తో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చిన అనిరుద్ర ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. వెంటనే సెల్ లోకి వచ్చి కోపంగా రమేష్ చొక్కా పట్టుకున్నాడు.
"యూ...నన్ను, అవనికి దూరం చేయడానికి ఎంత కుట్ర పన్నావురా...నిన్ను ప్రాణాలతో వుండనీయను" అంటూ అతని గొంతు నొక్కబోయాడు.
బెనర్జీ అనిరుద్రని బలవంతం గా నిలదీసాడు.
"అవని అంటే మాస్టర్ అండ్ మాస్టర్ ఎక్స్ పోర్ట్స్ లో పనిచేసే అమ్మయేనా?" అడిగాడు బెనర్జీ.
"అవును" వెంటనే అన్నాడు అనిరుద్ర.
"మరి అవనిని చంపేస్తానని ఎందుకు బెదిరించావు?" అడిగాడు బెనర్జీ రమేష్ వైపు చూస్తూ.
బిత్తరపోయి అన్నాడు రమేష్, "నేను అవనిని చంపేస్తానని బెదిరించటమేంటి? అబద్ధం?" కీచుగా అరిచాడు.
"ఏది అబద్ధం? నువ్వు అవనిని ఫోన్ లో బెదిరించడమా?"
"నిజం ఇన్ స్పెక్టర్... అవని అంటే నాకు ఇష్టం. ఆమెను నేనెందుకు చంపేస్తానని బెదిరిస్తాను. నన్ను నమ్మండి. మీరు ఎంక్వయిరీ చేయించండి. నేనే దోషినని, అవనిని బెదిరించానని ప్రూవ్ అయితే ఉరిశిక్షకైనా రెడీ" అన్నాడు రమేష్.
అతని మొహంలో పరిశీలనగా చూసాడు బెనర్జీ. అతను అబద్ధం చెబుతున్నట్లు అనిపించలేదు.
ఆల్రైట్... ప్రస్తుతానికి నమ్ముతాను. అయితే అంతకన్నా ముందు నేను అవనితో మాట్లాడాలి."
అనిరుద్ర పోలీస్ స్టేషన్ నుంచే అవనికి ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్ దగ్గర్లో వున్న హొటల్ దగ్గరకు రమ్మన్నాడు.
పోలీస్ స్టేషన్ అంటే కంగారు పడుతుందని!
* * *
"మా మామయ్యా ఇంత పని చేసాడా?" పోలీస్ స్టేషన్ కు వచ్చాక ఇన్ స్పెక్టర్ బెనర్జీ చెప్పిందంతా విని అంది నమ్మలేనట్టు అవని.
"అవును అవనిగారూ... అయితే మీ మామయ్యా ప్రొఫెషనల్ క్రిమినల్ కాదు. కేవలం మీ మీద ప్రేమతోనే ఇదంతా చేసాడు. అయినా మీ ఇష్టం...మీరు సరేనంటే అనిరుద్ర మీద హత్యాయత్నం చేసినందుకు అతని మీద ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేస్తాను" అన్నాడు బెనర్జీ.
"వద్దు ఇన్ స్పెక్టర్...అవని మీద ప్రేమతోనే అతను చేసాడని నాకూ అర్ధమైంది. ఈ ఒక్కసారికి పోనీయండి. ఎంత కాదనుకున్నా అతను అవనికి మేనమామ" అన్నాడు మనస్పూర్తిగా అనిరుద్ర.
అక్కడే బెంచీ మీద తల వంచుకుని కూచొన్న రమేష్ అనిరుద్ర మాటలు విని చటుక్కున లేచి వచ్చి అనిరుద్ర చేతులు పట్టుకొని...
"నన్ను క్షమించు అనిరుద్రా...నీలాంటి మాంచి మనసున్న వ్యక్తికి అవని కరెక్ట్ పెయిర్. మీ పెళ్ళి నా చేతుల మీదగా జరిపిస్తాను. నీ తరపున నేను పెళ్ళి పెద్దగా వుంటాను" అని అవని వైపు తిరిగి-
"సారీ అవని..జరిగిందంతా పీడకలగా భావించు...అక్కయ్యను నేను ఒప్పిస్తా." అన్నాడు.
"వెరీగుడ్ రమేష్...పుట్టుకతోనే ఏ మనిషి నేరస్తుడు కాదు. పరిస్ధితి, ఆవేశం అలా చేయిస్తాయి. మిమ్మల్ని టార్చర్ చేసినందుకు సారీ....మీ నుంచి నిజం రాబట్టడానికి అలా చేయక తప్పలేదు. ఎనీహౌ ... మీరంతా ఒక్కటయ్యారు" అన్నాడు సంతోషంగా.
"మేమంతా మీకు బుణపడి వున్నాం సార్... పోలీసులు అంటే లాకప్ డెత్స్ చేసేవాళ్ళని, లాకప్స్ లో రేప్ చేస్తారని విన్నాను. కానీ, మీరు అవుటాఫ్ ది వే లో వెళ్ళి, ఓ సమస్యను పరిష్కరించారు. థేంక్యూ ఆఫీసర్" అంది అవని, కృతజ్ఞత పూర్వకంగా చేతులు జోడిస్తూ.
"మీరు థేంక్స్ చెప్పవల్సిన వ్యక్తి మరొకరు వున్నారు" బెనర్జీ అన్నాడు.
"ఎవరు?" ఆశ్చర్యంగా అడిగింది అవని.
"ఫెడ్రిక్" చెప్పాడు బెనర్జీ.
అతని పేరు వినగానే అవని మొహం కోపంతో ఎర్ర బడింది.
"మీకు అతని గురించి తెలియద్సార్..." అంటూ ఇంకా ఏదో అనబోయింది.
"మిస్ అవని...ఓ వ్యక్తి క్యారెక్టర్ గురించి ఏం తెలియకుండా కామెంట్ చేయడం మంచిదికాదు."
"అతని గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఇన్ స్పెక్టర్... చివరికి... చివరికి నన్ను చంపుతానని కూడా బెదిరించాడు" అంది అవని.
"మిమ్మల్ని చంపుతానని అన్నది అతనేనని మీకెలా తెలుసు?"
"ఎలా తెలుసంటే.." తడబడింది అవని.
"అతను ఉమనైజర్ అని మీరెలా కన్ ఫర్మ్ చేసుకున్నారు. అతను అమ్మాయిలతో తిరగడం చూసారా?"
"అదీ.."
"చెప్పండి...అతను ఆడపిల్లల పట్ల మిస్ బిహేవ్ చేస్తారని మీకెలా తెలుసు. ఎవరిపట్లనయినా అతను మిస్ బిహేవ్ చేసాడా? పోనీ మీపట్ల ఎప్పడైనా అసభ్యంగా ప్రవర్తించాడా?"
"లేదు."
"మరి...అతని గురించి ఓ నిర్ణయానికి, అదీ అతను మంచివాడు కాదనే నిర్ణయానికి ఎలా వచ్చారు? ఓ వ్యక్తి క్యారెక్టర్ ని అంత ఈజీగా ఎలా 'ఎసాసినేట్' చేయగలరు?"
"నన్ను..నన్ను అతనింటికి ఇన్వయిట్ చేసాడు" ఏమనాలో తోచక అంది.
"అమ్మ అని పిలిచినా ఆ పిలుపును అపార్ధం చేసుకోవాలని అనుకునే వాళ్ళకు అమ్మ అన్న ఆ పిలుపు కూడా నీయమ్మలా వినిపిస్తుంది" కఠినంగా అన్నాడు బెనర్జీ.
"సార్!"
"అవును మిస్ అవని...తొందరపాటు నేరం కాకపోవచ్చు. కానీ, కొన్ని సమయాల్లో అది కొద్ది ఘోరాలను సృష్టిస్తుంది."
"అయామ్ సారీ" అంది అవని.
"అది చెప్పాల్సింది నాక్కాదు. మిమ్మల్ని ఆత్మీయురాలు అనుకొని, మీలో చనిపోయిన తన చెల్లిల్ని చూసుకొని, మీ కోసం తన ఆస్తిని కూడా వదులుకోవాలనుకున్న ఫెడ్రిక్ కు సారీ చెప్పాలి.
అతడి గురించి తెలుసుకోకుండా, కనీసం అతను చెప్పే సంజాయిషి కూడా వినకుండా, రాజీనామా లెటర్ అతని మొహాన కొట్టిన మీరు అతనికి సారీ చెప్పాలి."
"అతని చెల్లెలు చనిపోయిందా? అతని చెల్లెల్ని నాలో చూసుకుంటున్నాడా? అతని ఆస్తి నాపేరు మీద.." మాటలు పెగలడం లేదు.
అవునన్నట్టు తలూపాడు.
అనిరుద్రకు ఇవేమీ అర్ధం కావడంలేదు.
"మిస్ అవనీ... మీకేం అభ్యంతరం లేకపోతే, ఓసారి నాతో ఫెడ్రిక్ దగ్గరకు రండి... కొన్ని విషయాలు అక్కడా మాట్లాడికుందాం... అనిరుద్ర మీరు కూడా." అని రమేష్ వైపు చూసాడు.
"నేను విజయవాడ వెళ్ళిపోతాను ఇన్ స్పెక్టర్. మీరు చెప్పినదంతా వింటుంటే అవని ఏదో ప్రమాదంలో చిక్కుకొందని అనిపిస్తోంది. అవనిని మీరే కాపాడాలి. అందుకు నా సహాయం ఎప్పడూ వుంటుంది. నా అవసరం ఎప్పుడు వచ్చినా, నాకు ఫోన్ చేయండి. వెంటనే వచ్చేస్తాను." అని అవని వైపు తిరిగి 'ఆల్ ది బెస్ట్ అవనీ, అన్నాడు.
"థేంక్యూ మామయ్య" అంది అప్పటి వరకూ అతనిమీద వున్న కోపాన్ని తుడిపేసుకొని.
"డామిట్.. కథ అడ్డం తిరిగింది" టీపాయ్ మీద వున్న పేపర్ వెయిట్ ని నేలకేసి గట్టిగా కొడుతూ అన్నాడు.
పేపర్ వెయిట్ కిందపడి ముక్కలయింది.