"మా ఆఫీసులో పన్జేస్తున్నది."
నేను నా ప్రాపర్టీలో చాలా భాగం అవని పేరు మీద రాయాలనుకుంటున్న విషయం వసుధ తెలుసుకుంది కనుక."
ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
"మీ ప్రాపర్టీలో చాలా భాగం అవనికి ఇవ్వాలనుకుంటున్నారా?"
"అవును."
"ముక్కు...మొహం తెలియని ఓ అమ్మాయికి అంత ఆస్తి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు?"
"అవని చాలా మంచి అమ్మాయి. పదిమందికి సాయపడాలి అనే మంచి గుణం వుంది."
"అలా మంచి గుణం వుంటే చాలా? దేశంలో చాలామంది వున్నారు." బెనర్జీ వ్యంగ్యంగా అన్నాడు.
బెనర్జీ గొంతులో ఆత్రుతతో పాటు వ్యంగ్యమూ మిళితమై వుంది.
కొద్దినెలలు తన ఆఫీసులో పనిచేసిన అమ్మాయికి విలువైన తన ప్రాపర్టీని ఎందుకు అవని పేరు మీద రాయాలని అనుకుంటున్నాడో బెనర్జీకి అర్ధం కాలేదు.
"అవనిలో వున్న ప్రత్యేకత ఏమిటో మీకు చూపించాలా? నాతోరండి" అంటూ హాలునే అనుకుని వున్న మరో గదిలోకి తీసుకువెళ్ళాడు.
స్విచ్ ఆన్ చేశాడు. ప్లోరోసెంట్ లైట్ వెలుతురులో ఆ గది వెలిగిపోతోంది.
ఎదురుగా నిలువెత్తు ఫోటో చిర్నవ్వులు చిందిస్తూ వున్న ఫోటో...
"ఆ అమ్మాయి నా చెల్లెలు...రోజూ" చెప్పాడు కళ్ళు చెమరుస్తుండగా.
ఆ ఫోటో కు దండ వేసి వుండడాన్ని గమనించాడు బెనర్జీ. "పోయిన సంవత్సరమే ఓ కారు యాక్సిడెంట్ లో చనిపోయింది."
కర్చీఫ్ తో కళ్ళొత్తుకుంటూ చెప్పాడు ఫెడ్రిక్.
"అయామ్ సారీ" అన్నాడు బెనర్జీ.
"దట్సాల్ రైట్" అన్నాడు.
ఆ గది నిండా రోజూ ఫోటోలే. చిన్నప్పట్నుంచి దిగిన ఫోటోలు. కాన్వెంట్ లో చదివే రోజుల్లో దిగిన ఫోటోలు, కాలేజికి వెళ్ళే రోజుల్లో దిగిన ఫోటోలు...
ఆ గదంతా ఆమె ఫోటోలతో నిండిపోయింది.
స్విచ్చాఫ్ చేసి, ఆ గదికి తాళం వేసి హాలులోకి వచ్చారు.
"సర్... ఆ ఫోటోలకూ... అవనికి.." బెనర్జీ మాటలు పూర్తి కాకుండానే...
"జస్టేమినిట్" అంటూ మూలనున్న టేబుల్ సొరుగులో నుంచి ఓ పైల్ తీసి బెనర్జీ దగ్గరికి వచ్చి , ఆ ఫ్తెల్ బెనర్జీకిచ్చి ఓపెన్ చేయమన్నాడు.
బెనర్జీ ఆ ప్తెల్ ఓపెన్ చేసి, షాక్ తిన్నాడు. ఆ ఫైల్ లో అవని ఫోటో వుంది.
అతను షాక్ తినడానిక్కారణం ఆ ఫోటోలో వున్న అవనిని చూసి.
ఎందుకంటే...ఇంతకుముందు గదిలో ఫెడ్రిక్ చెల్లెలు రోజా ఫోటో, అవని ఫోటో రెండు ఒకటే అన్నట్టు...
"యస్.. ఇన్ స్పెక్టర్... అవని, నా చెల్లెలు రోజాలా వుంటుంది. ముమ్మూర్తులా అచ్చుగుద్దినట్టు వుండే పోలికలు. అందుకే.. అందుకే ఇన్ స్పెక్టర్ నాకు అవని అంటే ఇష్టం... నా తరువాత, పదిహేనేళ్ళకు రోజా పుట్టింది. తాను పుట్టగానే మా మమ్మి, డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు.
కొందరు, తనని నష్టజాతకురాలు అన్నారు.
మరికొందరు ఎక్కడైనా అనాధ శరణాలయంలో వదిలివేయమన్నారు. కానీ, ఇన్ స్పెక్టర్, కృషిని తప్ప మరి దేన్నీ నమ్మని నేను నా చెల్లెల్ని అమితంగా ప్రేమించాను.
పేపర్లు వేసాను. పాల పాకెట్స్ వేసాను. బూట్లు పాలిష్ చేసాను. నా చెల్లెలు నష్టజాతకురాలు కాదు. అందుకే నాకు కలిసి వచ్చిందేమో... కృషిని తప్ప అదృష్టాన్ని నమ్మని నేను, నా చెల్లెలుతో పాటు పెరిగిన స్టేటస్ ను చూసి పొంగిపోయాను.
నా అరచేతుల్లో నా చెల్లెల్ని నడిపించాను.. తనక్కూడా నేనంటే ఎంతో ప్రేమ. ఆ ప్రభువు నాకోసం పంపించిన దూత నా చెల్లెలు అనిపించేది.
నా చెల్లెలు కోసం పెళ్ళి చేసుకోలేదు. ఎందుకో తెలుసా ఇన్ స్పెక్టర్-
రేపు నాకు వచ్చే భార్య నా చెల్లెలును బాధ పెడుతుందేమో.. భార్య మీద ప్రేమతో నేనెక్కడ నా చెల్లెల్ని దూరం చేసుకుంటానోనన్న భయం.
అందుకే...బ్రహ్మచారిగా మిగిలాను. నాకు నా చెల్లెలు ప్రాణం.
నా వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది. విదేశాల్లో సైతం నాకు ఆఫీసులున్నాయి.
స్విట్జర్లాండ్ అంటే నా చెల్లలుకు ఇష్టం...ఇండియాలో వున్న నా వ్యాపార సంస్ధలన్నీ మూసేసి హాయిగా స్విట్జర్లాండు వెళ్ళి, నాచెల్లెలుతో ప్రశాంతంగా జీవిద్దామనుకున్నాను. అక్కడో అపార్ట్ మెంట్ ను కోనేసాను.
ఆ అపార్ట్ మెంట్ లని అన్ని గదులు ఖాళీగా వుంచాను. ఓ గది నా చెల్లెలు డ్రాయింగ్ రూమ్ గా ఉపయోగపడాలి. మరోగది నా చెల్లెలు పియానో వాయించుకోవడానికి...మరొకటి డ్యాన్స్ చేసుకోవడానికి.
ఇలా కోటి కలలతో నా చెల్లెల్ని ఆ బంగారు సౌధంలో వుంచాలనుకున్నాను.
సరిగ్గా అలాంటి సమయంలోనే యాక్సిడెంట్ అయింది. నా చెల్లెలు ఆ యాక్సిడెంట్ లో చ..ని..పో..యిం..ది."
ఫెడ్రిక్ మోకాళ్ళమీద కూలబడి ఏడుస్తున్నాడు.
కదిలిపోయాడు బెనర్జీ.
నగరంలో మల్టీమిలియనీర్. డబ్బుతో ఏదైనా సాధించగల కోటీశ్వరుడు, చనిపోయిన చెల్లెలు తిరిగి రాదని, డబ్బుతో చెల్లెలి ప్రాణం దొరకదని తెలిసి కుమిలి కుమిలిపోతున్నాడు.
అతన్ని ఎలా ఓదార్చాలో కూడా అర్ధం కాలేదు. అంతకన్నా పెద్ద విషాద మేముంటుంది?
డబ్బు వుండి, హొదా వుండి, అన్ని వుండి, అయినవాళ్ళు, అత్యంత ఆత్మీయులు లేని పరిస్ధితి...ఎంత దుర్బరం...
"అయామ్ సారీ సర్... ఎక్స్ ట్రీమ్ లి సారీ. మీ గతాన్ని గుర్తుచేసి,మిమ్మల్ని బాధాపెట్టాను."
"నో .. నో .. ఇన్ స్పెక్టర్" అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ ఫెడ్రిక్.
"నా చెల్లెలు విషాదంలో మునిగిపోయిన నాకు ఆ ప్రభువు పంపించిన చెల్లెలుగా అవని దొరికింది. అచ్చు నా చెల్లెలు లాగానే వుంటుంది.
ఆమె ప్రవర్తన, నవ్వు మాటలు... కూడా అన్నీ మా రోజా లానే వుండేవి.
నాకు డబ్బువుంది. మనశ్శాంతి లేదు. ఏ అనాధ శరణాలయాలకో ఈ ఆస్తి రాసి, స్విట్జర్లాండ్ వెళ్ళిపోవాలనుకున్నాను.
వెళ్ళిపోయే ముందు అవనికి నా కథ అంతా చెప్పి, నా చెల్లెలు గుర్తుగా ఈ ఇండియాలో నా వ్యాపారాలన్నీ అప్పగించాలనుకున్నాను.
ఆమె పెళ్ళి నా చేతులు మీదుగా చేయాలని ఆశ. ఆమెకు పుట్టే బిడ్డలోనా చెల్లెల్ని చూసుకోవాలన్న ఆశ.
మొన్ననే ఇంటికి కూడా ఇన్వయిట్ చేసాను. రానంది.. అపార్ధం చేసుకుందేమో...అనుకున్నాను.
ఏదో ఓ రోజు ఈ విషయాలు అన్నీ అవనికి చెప్పాలనుకున్నాను.
కానీ ఇంతలోనే నన్ను అవని అపార్ధం చేసుకుంది" బాధగా అన్నాడు ఫెడ్రిక్.
"మరి మీ మీద చెడ్డగా అవనితో వసుధ ఎందుకు చెప్పినట్లు ?" అడిగాడు బెనర్జీ.
"సరిగ్గా నాక్కూడా తెలియదు. కాకపోతే ఒకటి ఊహించగలను. ఆమె మీద నాకు ఈ మధ్యే అనుమానం మొదలైంది. విదేశాలకు పంపించే బ్యాగుల్లో కొన్ని ఆర్టికల్స్ మిస్సవుతున్నట్టు నాకు కంప్లెయింట్స్ వచ్చాయి.
ప్యాకేజీ సెక్షన్ సూపర్ వైజ్ చేసేది వసుధే. కొన్ని ఆర్టికల్స్ డూప్లికేటువి కూడా పంపిస్తుంది. ఒరిజినల్ వి తను తస్కరిస్తుంది. ఇదంతా నేను కన్ ఫర్మ్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది.
అవని మీద నాకు సదభిప్రాయం వుందని తెలుసుకున్న వసుధ, ఈ మధ్య ఓ రోజు ప్యాకేజీ సెక్షన్ కు అవనిని పంపించింది. నకిలీ ఐటమ్స్ ప్యాక్ చేయించింది. అది బయటపడితే ఆ తప్పు అవని మీద నెట్టవచ్చని ఆమె ఉద్దేశ్యం.
ఆ విషయాన్ని నేను అవనికి కూడా చెప్పలేదు. వసుధను ఆ సెక్షన్ నుంచి మార్చాలని నిర్ణయించుకున్నాను. హిమాయత్ నగర్ లో ఓ బ్రాంచిని ఓ పెన్ చేసి, అక్కడో పోస్ట్ క్రియేట్ చేసి వసుధను వెళ్ళమన్నాను.
దానివల్ల ఆమెకు ఫ్రాడ్ చేసే అవకాశం మిస్సవుతుంది. అవనిని తప్పిస్తే,తప్ప ప్రయోజనం వుండదని అనుకున్నట్టుంది.
అందుకే అవనికి నామీద లేనిపోనిని సృష్టించి చెప్పింది. అంతేకాదు, నేను అవనిని హత్య చేస్తానని బెదిరించానట" అన్నాడు ఫెడ్రిక్.
"మీరు అవనిని హత్య చేస్తానని బెదిరించారన్నాదా?"
"అవును...నాకెందుకో వసుధ మీదే అనుమానం. అవనికి ఏదైనా అపకారం తలపెట్టవచ్చు. ఇన్ స్పెక్టర్ నాకు ఏదో అవుతుందన్న భయం లేదు. పాపం అవనికి ఏం కాకుండా చూడండి.
మీకు తెలిసిన సెక్యూరిటీ అసిస్టెన్స్ తీసుకున్నా ఫర్లేదు. ఎంత ఫీజయినా నేను భరించగల్ను."
"నో సార్...ఈ కేసును నేనే టేకప్ చేస్తాను. ఇదంతా చూస్తుంటే మీ చుట్టూ ఓ విషవలయం ఏర్పడుతున్నాట్టు అనిపిస్తోంది. ఇది మామూలు విషయం కాదు. నేను రేపే మీ ఆఫీసుకు వస్తాను.
ఇన్నాళ్లు కేవలం చిన్న చిన్న కేసులు చేసి, చేసి విసుగొచ్చింది. అసలైన కేసు ఇప్పుడు టేకప్ చేస్తున్నాను. మీకు, అవనికి ఏ ప్రమాదమూ జరగదు.
మీలాంటి మంచి మనిషికి ఆ ప్రభువు ఆశీస్సులు ఎప్పడూ వుంటాయి. బై ది బై నేను అవనిని కలిసి కూడా మాట్లాడతాను. ఆమెకు మీ మీద వున్న అపోహ తొలగిస్తాను" స్ధిరంగా చెప్పాడు బెనర్జీ.
"థేంక్యూ ఇన్ స్పెక్టర్...మీమీద నాకా నమ్మకం వుంది" మనస్పూర్తిగా అన్నాడు ఫెడ్రిక్.
"ఓ.కె.సార్.. గుడ్ నైట్ " అని చెప్పి ఫెడ్రిక్ దగ్గర శెలవు తీసుకున్నాడు ఇన్ స్పెక్టర్ బెనర్జీ.
ఇన్ స్పెక్టర్ బైక్ గేటు దాటగానే, ఆ కాంపౌండ్ వాల్ దగ్గర్నుంచి ఆకారం బయటకు వచ్చింది.
ఆ ఆకారం ధీరజ్ ది.
అరగంట నుంచి ఆ రెస్టారెంట్ లో వున్నాడు రమేష్. అప్పటికే నాలుగు టీలు తాగాడు.
ఆ రెస్టారెంట్ ఎదురుగా అనిరుద్ర వుండే రూమ్ వుంది. అనిరుద్ర ని చంపాలన్నంత కసిగా వుంది రమేష్ కు. అవని తనని పెళ్ళి చేసుకోనని చెప్పడం, దానికి తన బావ సరేననడం, అనిరుధ్రకు అవనిని ఇచ్చి పెళ్ళి చేస్తాననడం జీర్ణించుకోలేకపోతున్నాడు.
అనిరుద్ర మరో కొద్ది నిముషాల్లో బయటకు వస్తాడు. అతను ఆఫీసుకు బయల్దేరగానే ఆ వెనకే కారులో తను ఫాలో అవుతాడు. నిర్మానుష్య ప్రదేశంలో తన కారుతో అనిరుద్రకు యాక్సిడెంట్ చేస్తాడు.
దాంతో అనిరుద్ర పని ఫినిష్.
అవసరమైతే డబ్బులు వెదజల్లి అయినా కేసును మాఫి చేసుకోవచ్చు
మరో సిగరెట్ వెలిగిస్తూండగా అనిరుద్ర బయటకు వచ్చాడు. చేతిలోని ఫైల్ ని డిక్కీలో పెట్టి స్కూటర్ స్టార్ట్ చేసాడు అనిరుద్ర.
బ్లాక్ జీన్స్ మీద, వైట్ టీ షర్ట్ టాక్ చేసాడు. అనిరుద్ర్రని చూడగానే జెలసిగా ఫీలయ్యాడు రమేష్.
'అనిరుద్ర...యూ ఆర్ ఫినిష్' అనుకున్నాడు రమేష్.
స్కూటర్ ముందుకు కదిలింది.
వెంటనే నోట్లోని సిగరెట్ ని నేలమీద వేసి, కాలితో నలిపేసి కారు స్టార్ట్ చేసాడు.
అంబాసిడర్ కారు ముందుకు కదిలింది.
సిటీకి దూరంగా ఓ కాలనీలో వుంది అనిరుద్ర ఆఫీసు.
ట్రాఫిక్ సిగ్నల్ దాటి, రైట్ సైడ్ కు తిరిగాడు అనిరుద్ర.
అంబాసిడర్ కారు ఆ స్కూటర్ ని ఫాలో అవుతున్నది.
రమేష్ కు టెన్షన్ గా వుంది. ఆ రోడ్డు నిర్మానుష్యంగా వుంది.
ముందు అనిరుద్ర స్కూటర్.
ఆ వెనకే రమేష్ కారు.
గేరు మార్చి స్పీడు పెంచాడు.
బెనర్జీ బైక్ చేసి ముందుకు దూకించాడు. బుల్లెట్ స్పీడందుకుంది.
చిన్న పని మీద ఆ కాలానికి వచ్చాడు. తిరిగి సిటీకి వెళ్ళాలి. ఆ తర్వాత ఫెడ్రిక్ ఆఫీసుకు వెళ్ళాలి. అట్నుంచి అవని దగ్గరికి వెళ్ళాలి.
అలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తోన్న బెనర్జీ ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా అంబాసిడర్ కారు వేగంగా వస్తుంది. స్కూటర్ ని యాక్సిడెంట్ చేయడానికి వస్తున్నట్టు అర్ధమైంది.
కొద్ది క్షణాల వ్యవధి.
ఒక్కక్షణం అటు ఇటు అయినా అంబాసిడర్ కారు వేగంగా స్కూటర్ ని డ్యాష్ ఇస్తుంది.