"చూడండి రెడ్డిగారూ, యిందాకటినుంచి నాకిలాంటి పనులు అలవాటు లేదని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోకుండా ఏవో చెప్తున్నారు ఎవరో చేసారని నేను చేయనక్కరలేదు. నా ఆశయాలని నా నిజాయితీని డబ్బుకి అమ్ముకోవాల్సిన అవసరం ఇప్పటివరకు నాకు కలుగలేదు. యిక ముందూ కలుగదని నా నమ్మకం. అంచేత మీరెంత చెప్పినా ఇలాంటి పని డబ్బు కోసం నేను చెయ్యను....'
అయన హతాశుడైనట్టు చూశాడు. అయన తన పని ఎంతో సుళువుగా నిశ్చయంగా జరిగి పోతుందని. జరగడానికి కావాల్సిన ఆయుధం తన దగ్గిర వుందన్న నిబ్బరంతో వచ్చి వుంటాడు. వ్యవహారం యిలా ఎదురు తిరుగుతుందని ఎదురు చూడని ఆయనకి ఈ సంఘటన క్రొత్త. ఏం అనాలో ఇంకెలా నన్ను వశపరచుకోవాలో ఇదంతా అయన ఆలోచించని విషయం.
"తమరిలా అంటారని ఎన్నడూ అనుకోలేదు.... ఏదో యీ మాత్రం సాయం చేస్తారని గంపెడాశతో వచ్చాను. అంతదూరం నించి.... ఎంతో దీనంగా అన్నాడు, అంత గంభీరమైన మనిషి అలా జావగారిపోవడం చూస్తె ఈయన... యింత డబ్బుండి కొడుకు తెచ్చే లక్ష ఒక ఏడాది ఆలస్యం అవుతుందని దాని కోసం ఎందుకింత ఆరాటపడిపోతున్నాడు. ఈ మనిషికి డబ్బు మీద ఇంత కాపీనమా అనిపించింది. ఆ మాట అడగకుండా ఉండలేక పోయాను.
"మీరు ఈ పరీక్ష కోసం ఇంత ఆదుర్దాపడాల్సిన అవసరం నాకేం కనపడలేదు. లక్షాధికార్లు మీ అబ్బాయిని ఇంకో ఏడాది చదివించగలరు. అబ్బాయి పరీక్షలు ప్యాసయి అర్జించకపొతే రోజు గడవని వారు పడే ఆరాటం మీ రెందుకు పడుతున్నారో నా కర్ధం కావటం లేదు. ఏదో పూట గడవని వాళ్ళు వచ్చి తమ అబ్బాయి పరీక్ష కోసం అడుర్దాపడిన నన్ను సహాయం కోరినా అర్ధం వుంది. అలాంటి స్థితిలో నేను జాలిపడి ఏదో సహాయం చేసినా అర్ధం వుంటుంది. మీ అబ్బాయి విషయంలో అలాంటి అవసరం నాకేం కనపడడం లేదు . ఈసారి చాన్సుకి కష్టపడి చదివితే తప్పక ప్యాసవుతాడు. దానికోసం మీరు ఇంత అడుర్దాపడడం నన్ను ఇరకాటంలో పెట్టి నాకిష్టం లేని పని చేయించడానికి ప్రయత్నించడం ..... ఎందుకింత అవస్థ చెప్పండి.... పెద్దమనిషి గదా అని చెప్పదలసింది సౌమ్యం గానే చెప్పాను.
"అంతేనంటారా ? నానా గడ్డి కరిచి మిగతా వాళ్ళ చేత మార్కులు వేయించి మెడికల్ కాలేజీకి సీటు రిజర్వు చేయించిందీ అంతా వృధేనంటారా.....' తనలో తాను గొణుక్కున్నాడు నేను నవ్వాను.
"మెడికల్ కాలేజి సీటేక్కడికి పోతుందండీ ఓ పదివేలు మీవి కావనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మీ కోసం రెడీగా వుంటుంది.
అయన వుంగరాలు సవరించుకున్నాడు.... తల గోక్కున్నాడు. ఇంకా ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాడు.... ఎంతకీ వదిలేట్టు లేడని నేను కుర్చీలోంచి లేచి కవరు తీశాను ఈయడానికి.
'అమ్మా. తవరెలాగో నిక్కచ్చిగా తన అభిప్రాయం చెప్పేశారు. ఏం చేస్తాను నా ప్రాప్తం ఇంతేననుకుంటాను.... పోనీ చిన్న సాయం చేసి పెట్టండి. వాడి పరీక్ష ప్యాసయాడో లేదో ఒక్కమారు పేపరు చూసి సేప్పేస్తే ఇక ఈ ఏడాదికి ఆ సీటు వద్దని రాసేస్తాను.... అల్లు మావాడి కోసం ఓ సీటు అట్టేపెట్టారు....ఏదో సంగతి అల్లకి రాయాలి గందా.....ఒక్క క్షణం పేపరు చూసి చెప్పేయండి సాలు....' ఆశగా ఆగాడు.
ఒక్క క్షణం సందేహించాను. నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాను. నేనే సాయం చేయనని ఆయనకీ అర్ధం అయింది. ఆ ఒక్క మాట చెప్పేస్తే ....వెళ్ళిపోతాడు తొందరగా ఆయన్ని వదుల్చుకోడానికి అంతకంటే మార్గం కనపడడం లేదు.... సందేహిస్తూనే నంబరడిగాను....
"ఏమిటో మీరు ఎంత చెప్పినా నన్ను ఇరకాటంలో పెడుతున్నారు...." చిన్నగా విసుక్కుని డ్రాయరు తెరిచాను.
"క్షమించడమ్మా....నిజమే తమకి శ్రమ యిస్తున్నాను.... మరేం అనుకోకండి..." అతి వినయంగా క్షమాపణ కోరాడు.
పేపర్లు బయటికి తీయకుండానే గబగబ ఆ నెంబరు కోసం వెతికాను ఆ కట్టల్లో కావాల్సిన నెంబరు కనిపించగానే మార్కులు, మాత్రం చూశాను. పద్దెనిమిది మార్కులు. హు ....ప్యాసుమార్కుకి సగానికి సగం తక్కువ.
ఆ మాట చెప్పాను. అయన మొఖం నల్లబడింది. "పోయిందన్న మాట పరీక్ష! అనుకుంటూనే వున్నాను....' అన్నాడు.
'చూశారా , ఒకటికాదు. రెండు కాదు తక్కువ! నేనే కాదు ఎవరయినా యిలాంటి స్థితిలో ఏం సాయం చేయగలరు? చెప్పండి " అన్నాను డ్రాయరు మూసేసి.
"ఆ ..... తవరు తల్చుకుంటే యిదో లెక్కా తమకి దయ లేదు గాని ఆ ప్రక్క ఒకటి నాలుగు క్రింద ఎంత సుళువుగా మారిపోతుంది.... ఎటొచ్చి తవరు దయుంచాలి మాలాంటి వాళ్ళ మీద?" అంటూనే మరో ప్రక్క జేబులోంచి ఇంకో కవరు తీసి ....."హి...హి..... మీదయ, మా ప్రాప్తం! నీట ముంచినా పాల ముంచినా మీదే భారం .....మరివస్తా దయ యుంచండి...." కవరు టేబిలు మీద పెట్టి....."వాడ్ని పాసు చేయించే భారం మీదే....' అని గబగబా వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.
తెల్లబోయాను నేను. ఇంత చెప్పినా ఇచ్చింది చాలక మరో ఇంత యిచ్చి ఎంత దైర్యంగా వెళ్ళిపోతున్నాడు. డబ్బిచ్చి వెళ్ళిపోతే చచ్చినట్టు ఆ డబ్బు తీసుకున్నందుకు కృతజ్ఞతతో కాకపోయినా మరో దారి లేక ప్యాసు చేస్తానని అయన ఉద్దేశం గాబోలు. కోపం కట్టలు తెంచుకుంది నాకు.
"ఆగండి" అన్నాను కఠినంగా. ఓ కవరు తీసి చూశాను. "ఐదు వందల రూపాయల నోట్లు" ఇది మార్కులు చూసి చెప్పడానికి లంచం. మరో కవరు తీశాను! మరో ఐదు వందలు ! మార్కులు వేసేందుకు లంచం. వెయ్యి రూపాయలు ఒక సబ్జక్టు ప్యాసు అయ్యేందుకు . ఇలా ఎన్ని వేలు ఖర్చు పెడతాడో మొత్తం పరీక్ష ప్యాసనుపించుకోడానికి -------
"హు ... మీరు ఏదో పెద్ద మనషులు గదా అని ఇంతసేపటి నుంచి ఎంతో ఓపిగ్గా మాట్లాడాను. ఎంత చెప్పినా కూడా మీ యీ జబర్దస్తీ ఏమిటి? యీ డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళండి.... లేకపోతే పర్యవసానం ఎలా వుంటుందో మీరే చూస్తారు యిప్పుడే" వ్రేలితో గుమ్మం వంక చూపిస్తూ కోపంగా అన్నాను.