Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 13


    "బాగా అంటే మనలా వుంటుందా?"
    "యజమానురాలు మంచిదైనా ఆయాలు కాస్త దయగలవారైతే బాగానే చూస్తారు. కనీసం వేళ పట్టున పాలు అవీ పడతారు లెండి. మన పిల్లలు మనకే విసుగు, పదిమంది పిల్లల్ని చూడాల్సిన చోట వాళ్ళకీ విసుగేమరి. అవన్నీ ఆలోచించకూడదు. మనసు రాయి చేసుకోవాలి. ఏమయినా మనిషిని పెట్టడం కంటే క్రెష్ నయం అన్ని విధాలా. నేను మనిషిని పెట్టుకుని నానా బాధలు పడి ఆఖరికి క్రెష్ లోనే జాయిన్ చేశాను".
    "ప్చ్! మన ఆఫీసుల్లో క్రెష్ ఏర్పాటు వుంటే ఎంత బాగుండును? ఇలా అవస్థ, ఆరాటం మనకుండవు. ఓ చిన్న రెస్ట్ రూమ్ వుంటే నర్సింగ్ మదర్స్ కి ఎంత బాగుండును?" ఆశగా అంది.
    "రూలు ప్రకారం అన్నీ వుండాలి. ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ లేరన్న వంకతో పట్టించుకోరు. ఏదో సెక్రటేరియట్ లాంటి చోట్ల తప్ప ఆఫీసుల్లో క్రెష్ లు ఎక్కడున్నాయి? కనీ పెంచే తల్లుల అవస్థలు మనకి తెలుస్తాయి కాని వాళ్ళకేం తెలుస్తాయి?" విరక్తిగా అంది రేవతి. మీనాక్షి తన పాల బాధ, ఆఫీసులో పడిన బాధలు ఏకరువు పెట్టింది. "మన మహిళా విమోచనా సంస్థలు, స్త్రీ సంక్షేమ శాఖలు, స్త్రీవాద సాహితీపరులు, ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్స్ ఇలాంటి వాటిమీద పోరాడితే బాగుండును. స్త్రీలు ఉద్యోగాలు చేసేచోట పదిమందున్నా, పదిహేనుమందున్నా నర్సింగ్ మదర్స్ కోసం ఓ చిన్న రూమ్ అన్నా ప్రొవైడ్ చేయాలన్న రూలు ప్రభుత్వం పెట్టేలా చెయ్యాలి. "మనం అందరం కల్సి ప్రభుత్వానికి అర్జీలు పెట్టాలి, నిలేయాలి" ఉద్రేకంగా అంది మీనాక్షి. రేవతి నవ్వి లేచి నిల్చుంది. "సర్లేండి అవన్నీ అయ్యే పనులా! అంత తొందరగా ప్రభుత్వాలు స్పందించేసి మన గోడు పట్టించుకుంటే ఇంకే కావాలి? సాయంత్రం తప్పకుండా రండి" అంటూ వెళ్ళింది.
    అయ్యే పనులా అని అందరూ వూరుకుంటే ఎలా! "అయ్యా ఘనత వహించిన దొరగారూ! మా ఆడవాళ్ళ అవస్థవైపు కాస్త కన్నెత్తి చూడండయ్యా. జనాభాలో సగం వుండి, పిల్లల్ని కని మీ వంశాభివృద్ధి చేస్తున్న ఆడవాళ్ళ గురించి కాస్త ఆలోచించండి. "తల్లిపాలే బిడ్డకు శ్రేష్టము" అని ప్రతి పాలడబ్బా మీద అచ్చొత్తించి, ప్రకటనల్లో, టీవీల్లో నినాదాలిస్తూ మాతా శిశువుల సెమినార్లు, మీటింగులు పెట్టి, బిడ్డకి తల్లిపాల ఆవశ్యకతని గురించి ప్రభోధించే మీరు ఆ తల్లిపాలు తాగాల్సిన పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఉద్యోగాలు చేసి పొట్టపోసుకునే తల్లుల పిల్లలకి మీరిస్తున్న సదుపాయాలేమిటి? కూలి నాలి చేసుకునే తల్లులు ఏ చెట్టుకో ఉయ్యాల కట్టుకుని, పిల్లలని దగ్గరుంచుకుని పాలిచ్చుకుంటారు. ఆ మాత్రం వీలు కూడా మాకు లేదు! అయ్యా అంతంత పెద్ద ఆఫీసులు, బిల్డింగులు కట్టే మీరు మాలాంటి తల్లుల కోసం ఎనిమిది బై ఎనిమిది గది ఒక్కటి కట్టించి పుణ్యం చేసుకోకూడదూ! ఆయాలని మీరు పెట్టొద్దు. క్రెష్ కి కట్టే బదులు డబ్బు తెచ్చి మేమే పెట్టుకుంటాం. పురుష పుంగవులు టీలకి, సిగరెట్లకీ వెళ్ళొచ్చే టైముల్లో మధ్య మధ్య ఓ పదినిమిషాలు బిడ్డకి పాలిచ్చి వస్తాం కావలిస్తే మేం వృధా చేసిన సమయం బదులు ఓ అరగంట ఎక్కువ పనిచేస్తాం. బిడ్డ ఎలా ఉందో? పాలు తాగిందా? ఏడుస్తూందా? లాంటి చింతలు లేకపోతే, మనసు పెట్టి మరింత బాగా పని చేస్తాం సార్! ఈరోజు ఎక్కడ చూసినా ఆడవాళ్ళు లేని ఆఫీసుందా? రోజు గడవని ఇల్లాళ్ళు ఎందుకు ఉద్యోగాలు చేయడంలేదు సార్? ఈ గొడవంతా ఎందుకు మీ ఆడాళ్ళు ఉద్యోగాలు, ఊళ్ళేలడాలూ మానేస్తే ఏ గొడవా వుండదుగా అంటారా! మంచిది సార్, పిల్లల్ని కంటే, ఉచ్చగుడ్డలు ఉతుక్కుంటూ, పీతి గుడ్డలు ఉతుక్కుంటూ, ఎడపిల్ల, చంటిపిల్ల, కడుపులో పిల్లతో మొగుడికి, పిల్లలకి వండి వార్చుతూ, అప్పడాలు వత్తుకుంటూ, వడియాలు పెట్టుకుంటూ, పొడులు విసురుకుంటూ, మంగళగౌరీ వ్రతాలు, నందికేశుడి నోములు నోచుకుంటూ "భర్తే దైవం! ఇల్లే స్వర్గం" అనుకుంటూ భర్త తిడితే బాధపడి, కొడితే ఏడ్చి, దగ్గరికి తీసుకుంటే సంతోషించి, ఏ చీరో కొనిస్తే పొంగిపోయి... అదే బతుకనుకుంటూ కూపస్థ మండూకాల్లా బతికేస్తాం! అప్పటి ఆడవాళ్ళ అజ్ఞాననమే వాళ్లకి శ్రీరామరక్షా అయి బాధపడకుండా వుండేవారు! ఇప్పుడు జ్ఞానం సంపాదించి మేం సాధిస్తున్నది ఏముందిలెండి! భర్తగారికి సంపాదించి పెట్టి ఆయన బరువు సగం మేం ఎత్తుకుని ఇంటా, బయటా నలిగిపోవడం తప్ప. మీ కోరికలు, చీరలు, షోకులు తగ్గించుకుంటే ఇంటిపట్టున ఉండొచ్చు. ఆ కాలంలో అరడజను మంది వంటిచేత్తో పోషించిన మగాడు ఈనాడు ఒకళ్ళిద్దరిని ఎందుకు భరించలేడు! మీరు ఆర్ధిక స్వాతంత్ర్యాలు,వ్యక్తిత్వాలూ, ఆత్మగౌరవాలు, స్త్రీ పురుష సమానత్వాలు అంటూ కబుర్లెందుకు మానేయమంటార అవునులెండి, ఎటుతిరిగినా నేరం మా మీదకే తోస్తారు లెండి! ఈ కబుర్లు ఎందుకు సార్! క్రూర జంతువైన పులి లాంటిదే ఆవుతల్లి బిడ్డకు పాలిచ్చి వస్తానంటే దయతలచి వెళ్ళనిచ్చిందే! ఆ మాత్రం కన్సిడరేషన్, జనాభాలో సగం వున్న స్త్రీల మీద మీకు లేదా! ఏం అడిగాం సార్? ఓ చిన్న గది! ప్రతీ ఆఫీసు, ఫ్యాక్టరీ, కంపెనీ ప్రతిదానికీ ఆడవాళ్ళకో రెస్టురూం, పసిపాపలకి పాలిచ్చుకునేందుకు ఓ గది దయచేయించండి. మీ వంశాలని నిలబెట్టే కన్నతల్లులకి మాతృమూర్తులకి చిన్నపాటి వరం ఇవ్వండి. "బిడ్డకు తల్లి పాలే శ్రేష్ఠం" అంటారు మీరు. ఆ తల్లిపాలు నేలపాలు కాకుండా చూడాల్సిన బాధ్యతా మీదే!
    రాత్రి నిద్ర పట్టకుండా దొర్లినంత సేపు ఆవేశపు ఆలోచనలు. నిద్ర పట్టాక కలల్లో ఆర్జీలు పెట్టేసి ప్రభుత్వాన్ని తూర్పార పెట్టేసింది ఆ కన్నతల్లి.

                                                * ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఏప్రిల్-2003

                                                      *  *  *  *

 Previous Page Next Page