Previous Page Next Page 
మరణహొమం పేజి 13

 

    అమూల్య గుండెలు గుబగుబలాడాయి. "ఎవరు?" అంది తడారిపోతున్న గొంతుతో.   
    "ఎలక్ట్రీషియన్ ని. మీ అపార్ట్ మెంట్ లో కనెక్షన్స్ ఒకసారి టెస్ట్ చెయ్యాలి."   
    "ఒక్క నిముషం!" అంటూ వెళ్ళి కొవ్వొత్తి వెలిగించి తీసుకొచ్చి తలుపు తీసింది అమూల్య.   
    ఎలక్ట్రీషియన్ లోపలికి వచ్చి వెంటనే తలుపులు మూసేశాడు.   
    "ఏమిటిది?" అంది అమూల్య కంగారుగా.   
    "భయపడకండి! నేను తరుణ్ ని. కరెంటు పోయేలా చేసింది నేనే. మీతో మాట్లాడానికి మరో మార్గం కనబడలేదు మరి!"   
    కొవ్వొత్తి తాలూకు బలహీనమైన కాంతిలో అతని నీడ గోడమీద పడి, మడిచినట్లు కప్పుమీదకు వ్యాపించి, భయానకంగా కనబడింది అమూల్యకి. కొవ్వొత్తి పట్టుకున్న ఆమె చెయ్యి వణుకుతూ ఉంటే నీడ వికటాట్టహాసం చేస్తునట్లు కదులుతోంది.   
    "మిస్టర్ తరుణ్! ఐయామ్ అఫ్రయిడ్! ఈ గూడుపుఠాణీలు నాకు చేతకావు. మీరు నాకు అప్పగించిన పనిని చేసే సామర్ధ్యం లేదు నాలో. ప్లీజ్ లీవ్ మీ అలోన్!" అంది త్వరత్వరగా.   
    అతను ఒక్కక్షణం పాటు ఆశ్చర్యంగా చూశాడు. "ఏమయింది? ఎందుకాంత భయపడిపోతున్నారు?"   
    జరిగినదంతా చెప్పింది అమూల్య. హత్యచేసిన తర్వాత ఆ మనిషి శవాన్ని నిఖిల్ మనుషులే తీసుకెళ్ళి ఒక తోటలో పడేశారని, రాబందులు ఆ శవాన్ని నామరూపాలు లేకుండా పీక్కుతిన్నాయనీ, మిగిలిన ఎముకలని నదిలో కలిపేశారనీ, అదంతా తనుకూడా బలవంతంగా చూడవలసివచ్చిందని చెప్పింది.   
    "ఆ హంతకులని నేను రక్షించాలిట తరుణ్! నేను లా చదివింది న్యాయాన్ని రక్షించి నేరస్తులని శిక్షించడంకోసం! అంతేగానీ నేరస్తుల తరఫున వకాల్తా పుచ్చుకోడం కోసం కాదు" అంది ఆవేశంగా.   
    తరుణ్ తొణక్కుండా అన్నాడు. "మీరు నిఖిల్ కి భయపడి తిరిగి వచ్చేస్తే ఏమవుతుందో తెలుసా.   
    అమూల్యా! ఇలాంటి ఘోరాలు నిరంతరంగా జరిగిపోతూనే వుంటాయ్! న్యాయానికి అన్యాయం జరిగిపోతూనే వుంటుంది.   
    అంతేకాదు మిస్ అమూల్యా! ఇంతవరకూ వెధవ పనులన్నీ మన దేశంలోనే చేశాడు నిఖిల్. ఇప్పుడు విదేశాల్లో కూడా మొదలెట్టేట్లు వున్నాడు, అతని పద్దతి చూస్తే! ఇది చూడండి!" అంటూ కలైమణి ప్రెస్సులో నుంచి తను తెచ్చిన పాస్ పోర్టులు చూపించాడు.   
    "ఏమిటివి?" అంది అమూల్య కళ్ళు చిట్లించి చూస్తూ.   
    "దొంగపాస్ పోర్టులు! నాలుగు పేర్లతో, నాలుగురూపాలతో ఉన్నా, అన్నీ నిఖిల్ వే!"   
    కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది అమూల్య.   
    "అందుకని మిస్ అమూల్యా! ఇతని ఆట కట్టించడం అత్యవసరం! అతిముఖ్యం! ఇలాంటి పరిస్థితిలో మీరు భయపడి వెనకడుగు వెయ్యకూడదు. అవునంటారా?   
    ఎటూ చెప్పలేక సందిగ్ధంగా చూసింది అమూల్య.   
    ఆమె సందిగ్దంలో పడిందని గ్రహించగానే, అతను గొంతుమార్చి ఆ విషయం సెటిలయి పోయిందన్నట్లు సూచిస్తూ, వేరే సంభాషణ మొదలెట్టాడు.   
    "ఊ! చెప్పండి! ఏమంటున్నాడు నిఖిల్? మీతో బాగానే ఉంటున్నాడా?"   
    అవునన్నట్లు తల ఊపింది.   
    "తెలివైన వాడేనా?"   
    "చాలా!"   
    "రాజు!"   
    "అతను కూడా"   
    "ఏమిటి ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పాడుపని?"   
    "వాళ్ళేం చేస్తున్నారో తెలియదు గానీ నాకుమాత్రం ఈపని అంటగట్టారు. వాళ్ళు చేసిన హత్య చెయ్యలేదని నిరూపించాలి నేను"   
    నవ్వాడు తరుణ్.   
    "ఎలాగూ అదే జరుగుతుంది. వాళ్ళ లాయర్ బిల్డింగ్ వాలా కదా! ఏదో ట్రంప్ కార్డ్ ఉండేవుంటుంది వాళ్ళ దగ్గర! లేకపోతే అంత పబ్లిక్ గా, డ్రమాటిక్ గా హత్యచేయించరు. మిస్ అమూల్యా! మీరు వాళ్ళ దగ్గర వుండి నాకు ఇన్ ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ వుంటే, చూస్తూ వుండండి. మూడు నెలల్లో వాడిచేత మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను. ఓకే? జాగ్రత్తగా ఉండండి! నేను అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను."   
    ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా, చీకట్లో నీడలా మాయమైపోయాడు అతను. ఏం చెయ్యాలో తోచక, నిట్టూర్చి తలుపు వేసుకుంది అమూల్య.
    
                                                                * * *
    
    మర్నాడు ఆఫీసు కెళ్తుంటే అనిపించింది అమూల్యకి.   
    పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆకాశాన్ని అందుకోవాలనేంత ఉత్సాహమే తప్ప, ఇలాంటి టెన్షన్ ఉండేది కాదు. అన్ని గవర్నమెంటు ఆఫీసుల్లోలాగానే అక్కడా దుమ్ముకొట్టుకుపోయిన ఫర్నీచరూ, బూజుపట్టిన ఫైళ్ళూ, మైళ్ళకొద్దీ రెడ్ టేపూ వుండేవి. తాపీగా కాఫీలు తాగాడలూ, లేటు పర్మిషన్ లూ, ఫ్రెంచ్ లీవులు అన్నీ యధావిధిగా సాగిపోతూ వుండేవి. అక్కడ పద్ధతులు చూస్తే తనకి చిరాకు వేసేదే గానీ భయం ఎప్పుడూ కలగలేదు.
    
    కానీ దానికి పూర్తిగా కాంట్రాస్ట్ లా వుంది నిఖిల్ ఆఫీస్. అల్యూమినియం ఫ్రేముల్లో తళతళ్ళాడే అద్దాల కిటికీలు, ఒక్క దుమ్ముకణం కనబడకుండా శుభ్రం చేసిన ఫర్నీచరూ, ఖరీదయిన స్టేషనరీ, గడియారంలా, క్రమశిక్షణతో పని చేసుకుపోయే స్టాఫూ - ఇవన్నీ బాగానే ఉన్నా 'ఈ గాలిలో విషం వుంది' అనిపించేటట్లు వుంటుంది అక్కడి వాతావరణం. అందరూ సగం సగం వ్యాపకాలతోనే, ఏదో కోడ్ లో మాట్లాడు కుంటున్నట్లు మాట్లాడుతూ వుంటారు. మౌనంగా, సైగలతో సగం పనులు జరిగి పోతాయి.

 Previous Page Next Page