Previous Page Next Page 
హత్య పేజి 13


    "అదంతే అని....."

 

    "సరీగా చెప్పు నాకు తెలిసి చావటంలేదు." విసుక్కున్నాడు సూర్యారావు.

 

    "నీపేరు నాకు గుర్తున్నప్పుడు నాకింకా మతిమరుపు ఏమిటని నొక్కి వక్కాణించి అడుగుతూ నీకు అర్ధమైచచ్చేటట్లు చెపుతున్నాను."

 

    "చూడు కైలాసం! నాపేరు కూడా నీవు మరిచిపోతే నీకు మతిమరపు వచ్చినట్లు కాదు. పూర్తిగా మతిపోయినట్లు అని అర్థం!"

 

    "ఇంకా.....!"

 

    "తొందరపడకు అక్కడికే వస్తున్నాను. మా హరికి రవి అనిపిలుస్తున్నావు. రవిని హరి అంటున్నావు. అంతటితో అయిందా మా విమలని ఏకంగా కమలని చేశావు. మా ఆవిడ బెండకాయ కూరచేసి వడ్డిస్తే ఓ పక్క ఆ కూరని అన్నంలో కలుపుకుని గుండ్రాయంత ముద్దలని చేసుకుని గుటుకు గుటుకు మింగుతూ..... కూర బాగుందమ్మా, ఏది ఆ చేత్తో మరో నాలుగు దొండకాయ ముక్కలు యిలా వెయ్యి..... అంటావామే. కంటికెదురుగా వున్న కూర బెండకాయో దొండకాయో గ్రహించని మహా మనిషివి. నీకు మతి మరుపు లేదంటే నలుగురూ నవ్విపోతారు."

 

    "ఇంకా.....!"

 

    "అది చాల్లే."

 

    "ఇహ ఇప్పుడు నేను మాట్లాడుతాను సూరీడూ! నీవు విను. నాది మతిమరుపు కాదు. పొరపాటు లేక పరధ్యానం. మతి మరుపు వేరు పరధ్యాన్నం వేరు. నేను నిన్ను, ఉరుముకొండని మరిచిపోయానా! లేదే! కనుక నేను చెప్పేది ఏంటంటే నాకు మతి మరుపులేదు అని.....

   
    సాధారణంగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు మహామహా మేధావులు ఒకపనిలో కీర్తి గణించిన జీనియస్ లు తమ పనిలో తప్ప మిగతా విషయాలలో చాలా పొరపాట్లు పడుతుంటారు పరధ్యానంగా వుంటారు.

 

    వాళ్ళు పరిశోధనలో పడ్డారనుకో భోజనం చేయకపోయినా చేశామనుకుంటారు. ఆకలి దప్పులు వుండవు వాళ్లకి అసలా ఆలోచనే రాదు. రాత్రింబవళ్ళు పరిశోధల అంటే పరిశోధనే వాళ్ళకి ప్రాణం సర్వం.

 

    నీకు తెలుసో తెలియగో గానీ సూరీడూ!  పొఫెసర్ల మతిమరుపు మీద చాలాజోక్స్, బోలెడు కథలు వున్నాయి. ఒకానొక పరిశోధనా గ్రేసరుడు తన పరిశోధన శాలలో కూర్చుని ఏదో పరిశోధన చేస్తున్నాడు. రాత్రీ పగలు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయి. అలా వారం రోజులు గదిలో గడిపి బయటికి వచ్చిం తరువాత....

 

    "అమ్మాయి విషయం కూడా మీకు పట్టదా!" అంది భార్య.

 

    "ఏ అమ్మాయి విషయం నీవు చెప్పేది?" అడిగాడు ఆయన.

 

    "మీరు ఏ అమ్మాయి మాట అడుగుతున్నారో నాకు తెలియదు. నేను చెప్పేది మనమ్మాయి విషయం." అంది భార్య.

 

    "మనమ్మాయా! ఎప్పుడు పుట్టింది?" ఆశ్చర్యంగా అడిగాడు ఆయన.

 

    "కొత్తగా పుట్టలేదు. అయిదేళ్ల క్రితమే పుట్టింది." అంది ఆమె రుసరుసలాడుతూ.

 

    "అదీ విషయం అయిదేళ్ళ క్రితం విషయం అందుకే నాకు గుర్తులేకపోయింది." అన్నాడాయన తాపీగా.

 

    ఇలా వుంటాయి మాబోటివాళ్ళ కధలు. అంత మాత్రాన నాబోటివాడికి మతిమరుపు అనుకోకు. ఇంతెందుకు నేను ఈవూరు ఉరుముకొండలో పరిశోధన చేయటానికి....

 

    "కైలాసం!" అంతవరకూ నోరుమూసుకొని వింటున్న సూర్యారావు ఒక్క గావుకేక పెట్టాడు.

 

    "ఉలిక్కిపడి చచ్చాకదరా! అంతకేక పెట్టావు ఏమిటి?" కైలాసగణపతి భుజం చరుచుకుంటూ అడిగాడు.

 

    "నీ మతిమరుపుతో నాకొంప ముంచేటట్లు వున్నావు." సూర్యారావు నెమ్మదిగా అన్నాడు.

 

    "అదేమిటి సూరీడూ అంతమాటలన్నావ్?"

 

    "ఉరుముకొండ, పరిశోధన ఆ మాట అనకుండా నీదోవన నీవు పరిశోధన చేసుకోరా నాయనా అని నెత్తీ నోరు కొట్టుకుని చెప్పానా లేదా!"

 

    "చెప్పావుగానీ నెత్తీ నోరూ కొట్టుకుని మాత్రం కాదు" కైలాసగణపతి నవ్వుతూ అన్నాడు.

 

    "నీకంతా ఎగతాళిగానే వుంటుంది. నా భయం నీకు తెలియదు."

 

    "అరె భాయ్! నేను పైకి వాగటమేగాని చావు అంటే నీకన్నా నాకు భయం సరేనా!"

 

    "మరి యిదంతా ఏమిటి?"

 

    "నేను పరిశోధన చేయటానికి నీవు ఒప్పుకోవేమోనని బుకాయించాను అంతే. మామూలుచావంటేనే చచ్చేచావు ఇంక హత్య అంటావా ఆమాట ఉచ్చరించటానికే భయం మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము కదా, ఊరు దాటి పొలాల వరకు వచ్చాము. దూరదూరంగా పొలాలలో రైతులు తప్ప జనసంచారం లేదు. మన పక్కనే మరో ప్రాణి లేదు. అందుకని నిర్భయంగా మాట్లాడాను. అంత మాత్రానికే గుండె ఆగేలా కేకపెడితివి." అంటూ నవ్వాడు కైలాసగణపతి.

 

    "నవ్వకు నాభయం నీకు తెలియదు. పరిశోధన మాట ఎత్తొద్దు అన్నతర్వాత ఎత్తకూడదు అంతే. గోడకి చెవులుంటాయి."

 

    "ఇక్కడ గోడలేదుకదా!"

 

    "గోడ లేకపోవచ్చు. ఈ పొలం చూశావా, పొలం చుట్టూ కంచె వేశారు. ఇదీ చూశావుకదా. గోడకి చెవులున్నట్లే కంచెకి కళ్ళుంటాయి."

 

    "హారినీ ఎంత గొప్పగా చెప్పావురా సూరీడూ!" అంటూ సూర్యారావు భుజం తట్టాడు కైలాసగణపతి.

 

    "అంటే నేను చెప్పింది ఒప్పుకున్నట్లే కదా?"

 

     "ఆ...."

 

    "ఇంకెప్పుడూ పరిశోధన మాట పైకి ఎత్తవుగా?"

 

    "ఎత్తను."

 

    "అమ్మయ్యా ఇప్పుడు నా ప్రాణంహాయిగా వుంది" అన్నాడు సూర్యారావు.

 

    "నీ ప్రాణం హాయిగా వుండటమే నాకు కావాల్సింది" అన్నాడు కైలాసగణపతి.

 

    ఆ తర్వాత యిరువురూ వేరే విషయాలు మాట్లాడుకంటూ చేలగట్లమీద నడుస్తూ ముందుకు సాగారు.
    ఉరుముకొండ చూపిస్తే తను మంచి చోటు చూసుకొని అక్కడ కూర్చుని పరిశోధన చేస్తానని ఆ ఉదయం సూర్యారావుతో చాటుగా చెప్పాడు కైలాసగణపతి.

 

    సాయంత్రం షికారుకి అలా వెళ్ళి వస్తామనే నెపంతో ఇరువురూ ఇంట్లోంచి బయలుదేరి యిలా వచ్చారు. "నేను చెప్పింది గుర్తుందిగా" అంటూ సూర్యారావు హెచ్చరించాడు ముందు జాగ్రత్తతో. దాంతో యిన్ని మాటలు జరిగాయి వాళ్ళమధ్య. మరోసారి గట్టి వార్నింగ్ లాంటిది అతను యివ్వక తప్పలేదు. కైలాసగణపతి సరేననక తప్పలేదు.

 

    ఊళ్ళో వాళ్ళకి కైలాసగణపతికి ఆరోగ్యం సరిగ్గా లేనందున కొండగాలి, పైరుగాలి మేయటానికి వచ్చాడు. నటనతో రోజూ షికారుగా నడుస్తూ కొండదాకా వచ్చి ఆ రాళ్ళమీద కూర్చుని అలా అలా తిరిగి వెళతాడు. కాగా మూడో కంటికి తెలియకుండా పరిశోధన చేస్తాడు. ఇలా రహస్యంగా ఉంచాలి. అదీ విషయం.     

 Previous Page Next Page