"చరాచర సృష్టిలో ప్రాణమున్న ప్రతి చైతన్య పదార్ధము ప్రాణే. పక్షి, జంతువు, చెట్టు, చేమా...."
"అంటే తనకు మానవజన్మ లేదా" ఒక్కసారిగా తెలియని భయం ప్రవేశించింది విశ్వాత్మలో- అదే ప్రశ్న వేశాడు.
"మానవజన్మే ఎందుకు కావాలనుకుంటున్నావు? ఈ జన్మలో నువ్వు సాధించిన దానితో, జీవించిన దానితో, అనుభవించిన దానితో, నువ్వు సంతృప్తి చెందలేదా?" అని ప్రశ్నించాడు సాధువు.
"లేదు స్వామీ... మామూలు సాదా కార్మికుడిగానే జీవితాన్ని ప్రారంభించాను. నా దుర్భరమైన దారిద్ర్యం వల్ల ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తిని యుక్తవయస్సులోనే పోగొట్టుకున్నాను. అదీ చేతిలో చిల్లిగవ్వలేక.
అప్పటినుంచే నాలో డబ్బుపై కసి పెరిగింది. దాన్ని నా పాదాక్రాంతం చేసుకోవాలనుకున్నాను. దాని కోసమే రాత్రింబవళ్ళు శ్రమించాను. పైసా పైసా కోసం కక్కుర్తి పడి, మధనపడి, కష్టపడిన అనుభవం నాది.
అందుకే నన్ను అవమానంపాలు చేసిన సమాజం, వ్యక్తులకు అధిగమించాలను కున్నాను.
నా ప్రతి రక్తపు బిందువును చెమట బిందువుగా మార్చి కష్టపడ్డాను. నా శరీరాన్ని, మేధస్సును పూర్తిగా వినియోగించుకున్నాను.
డబ్బు... డబ్బు.... డబ్బు.... రూపాయిని పదిరూపాయలుగా చేశాను. పది రూపాయల్ని వందరూపాయలుగా చేశాను. వందని వేయిగా, వేయిని లక్షగా, లక్షలుగా, కోట్లుగా ఆస్తులు అంతస్తులు, ఫ్యాక్టరీలు, భవనాలు- నేడు పారిశ్రామిక భవిష్యత్తును నిర్ణయించేది, శాసించేది యీ విశ్వాత్మే.
సుఖాన్ని, ఆనందాన్ని, విశ్రాంతిని పక్కనపెట్టేసి, మొండిగా డబ్బు కోసమే బతికాను. జీవితం చివరి దశగా వచ్చేసరికి నాకు కనువిప్పు కలిగింది.
అప్పుడు ఒక్కసారి నాగురించి నేను ఆలోచించేసరికి తెలిసిపోయింది. నా జీవితకాలంలో నేనెన్నడూ ఏమీ అనుభవించలేదని. అప్పటికే వార్ధక్యం చివరి అంచుకు నా జీవితం మార్చేసింది. నేను కోరుకునే ప్రేమ, ఆత్మీయత, అనురాగాలూ ఈ జన్మలో నాకందలేదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే ఈ జన్మలో నేను కోల్పోయినవన్నీ, పునర్జన్మలో అనుభవించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మరణం గూర్చి అన్వేషణ, పునర్జన్మ గురించి ఆలాపన" హృదయంలోని ఆవేదనని మాటల్లోకి మార్చిన విశ్వాత్మ వూపిరి పీల్చుకుని మళ్ళీ అడిగాడు.
"నాకు మానవజన్మ కావాలి స్వామీ! అందుకోసం ఏం చేయమన్నా చేస్తాను" స్థిరంగా అన్నాడు విశ్వాత్మ.
"నువ్వు ప్రాణిగా జన్మిస్తావని నా యోగముద్ర చెబుతోంది. అది మానవజన్మో కాదో చెప్పటానికి నేను అశక్తుడ్ని..." అన్నాడా సాధువు నెమ్మదిగా.
ఆ మాటలకు విశ్వాత్మ గాలితీసిన బెలూన్ లా అయిపోయాడు. ఆయన మొహం చూస్తుండగానే వివర్ణమైపోయింది.
ఎంతో దూరం నుంచి, ఎంతో విశ్వాసంతో, ఎంతో శ్రమపడి వచ్చిన తనకు మిగిలేది నిరాశేనా? మరుజన్మ మానవజన్మో కాదో తెలియదా? తెలుసుకోవడం ఎలా? అదే ప్రశ్న వేశాడు విశ్వాత్మ.
"ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవటం అంత అవసరమా నీకు?"
"అవును స్వామీ!"
"నేను మోక్షం కోసం తపస్సు చేస్తున్న యోగిని మాత్రమే. పరిపూర్ణ సిద్ధత్వానికి నేనింకా చేరువకాలేదు. అందుకే కఠోరదీక్ష వహిస్తున్నాను. నీ ప్రశ్నకు సరియైన జవాబు కావాలంటే..."
"నా ప్రశ్నకు జవాబు దొరుకుతుందా స్వామీ!" ఆత్రుతగా ప్రశ్నించాడు విశ్వాత్మ.
"దొరుకుతుంది. అందులోనూ చాలా క్లిష్టత ఇమిడి వుంది. హిమాలయాల్లో సిద్ధులు మాత్రమే నీ ప్రశ్నకు జవాబు చెప్పగలరు"
"హిమాలయాల్లోనా... హిమాలయాల్లో ఎక్కడ స్వామీ?" ప్రశ్నించాడు విశ్వాత్మ.
"అమర్ నాథ్ గుహల్లోని హిమలింగ స్వామీజీ నీ సంశయాన్ని పటాపంచలు చేయగలరు. వారిని నేను చిన్నప్పుడు చూశాను. నేనీ ఆధ్యాత్మిక బాటలోకి రావడానికి వారే కారణం"
"సిద్ధముని వయస్సే నూటపాతిక సంవత్సరాలు పైగా వుంటే, ఆ హిమలింగ స్వామీజీ వయసు ఇంకెంత వుంటుందో? ఇప్పుడాయన బతికున్నాడో లేడో. అసలే తనకున్నది చాలా తక్కువ టైమ్. ఈ టైమ్ లో తాను చేయాల్సిన పనులు చాలా మిగిలి వున్నాయి. ఆలోచిస్తున్నాడు విశ్వాత్మ.
"హిమలింగ స్వామీజీ ఉనికి గురించి ఆలోచిస్తున్నావు కదూ? సందియము వలదు, ఆయన జీవాత్మ ఇప్పటికీ స్థిరంగానే వుంది వెళ్ళు"
"ఆయనకు నన్నెలా పరిచయం చేసుకోమంటారు స్వామీ" అని అడిగాడు విశ్వాత్మ.
"నీలో ఏదో దైవాంశ వుంది. అతి బలీయమైన, నీ పూర్వజన్మలు నిన్ను నీకు తెలీకుండానే ప్రేరేపిస్తున్నాయి. నీకు పూర్వజన్మ సుకృతం చాలా వుంది. పూర్వజన్మల్లో నువ్వెంతో పుణ్యాన్ని మూటగట్టుకొని వున్నావు. నీలాంటి అపురూపమైన వ్యక్తిని, నీలోని ఆత్మని ఆయన గుర్తుపట్టగలరు.
నీ దేహం ఆయన ముందు ప్రత్యక్షం కాగానే నువ్వెందు కొచ్చావో ఆయనకు తెలిసిపోతుంది. వెళ్ళు ఆలస్యం చేయకు. నీ మరణ ఘడియలు త్వరితగతిన నీకేసి వచ్చేస్తున్నాయి. హిమలింగ స్వామీజీ నీకు తప్పక సహాయం చేస్తారు. ఆ అర్హతే నీకు లేకపోతే నువ్వు ఈ ప్రాంతానికొచ్చి నన్ను గుర్తించలేవు"
విశ్వాత్మ భక్తితో మోకరిల్లి సిద్ధమునికి నమస్కరించాడు.
"నీ ఆత్మ చిరంజీవ" అని ఆయన ఆశీర్వదించాడు.
మరో పదినిమిషాల తర్వాత విశ్వాత్మ వెనుతిరిగాడు. నలభై నిమిషాలు పట్టింది సంకేత స్థలానికి చేరుకోవటానికి.
ఆకాశంలో చప్పుడు చేస్తూ హెలికాప్టర్ కనిపించింది. జేబులోంచి రెడ్ లైట్ తీసి గాలిలో వూపాడు విశ్వాత్మ.
ఐదు నిమిషాలకి అక్కడున్న విశాలమైన మైదానంలో హెలికాప్టర్ ఆగింది.
హెలికాప్టర్ లోంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పరుగు పరుగున ముందుకొచ్చి విశ్వాత్మకు సెల్యూట్ చేశాడు.
"మీకోసం గంటనుంచీ వెదుకుతున్నాం సార్" అన్నాడా ఆఫీసర్.
"ఆలస్యం నాదే. డోంట్ వర్రీ కమాన్ మూవ్" అంటూ వడివడిగా హెలికాప్టర్ వైపు నడిచాడు విశ్వాత్మ.
గత కొన్ని రోజులుగా విశ్వాత్మ ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు. ఫలానా రోజుకు వచ్చి తనని రిసీవ్ చేసుకోమని చెప్పి అడవుల్లోకో, కొండల్లోకో ఒంటరిగా వెళ్ళిపోవడం, ఎప్పుడూ విమానాల్లో తిరిగే వ్యక్తి కాలినడకన తిరగడం. రైల్లో వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళడం ఏమిటి? డబ్బు సంపాదించి పిచ్చివాడిగా మారిపోతున్నాడా.
ఇప్పుడైనా హైదరాబాద్ వెళ్దామంటాడా? లేదా? ఆలోచిస్తూ లోయల్లోకి చూస్తున్నాడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్.
"మిస్టర్ పరాంజపా" పిలిచాడు విశ్వాత్మ.
"ఎస్...సర్"
"మనమిప్పుడు జమ్ము వెళుతున్నాం"
"జమ్మునా సర్?!" ఆశ్చర్యపోతూ అడిగాడు పరాంజపా.
"ఎస్...జమ్ము" అన్నాడు విశ్వాత్మ.
ఏ.కె.47, ఏ.కె.56లతో మార్మోగిపోతున్న రక్తసిక్తమయిన జమ్ముకా? జమ్ము ఎందుకు సార్? అని అడగబోయి ప్రశ్నవేస్తే తానేమవుతాడో వూహించుకుని పైలట్ కు ఆ విషయం చెప్పాడు పరాంజపా. అది విని పైలట్ తల తప్పి వింతగా పరాంజపా వైపు చూశాడు.