Previous Page Next Page 
వ్యూహం పేజి 13


    "బుద్ధి అటూ ఇటూ పరిగెత్తటం ఈ వయసులో సహజమే శక్తీ! ఆ బుద్ధిని సక్రమమైన దారిలో పెట్టటానికి ఇది సరయిన సమయం.... ఏరు పొంగితేనే నీటి పరుగు తెలుస్తుంది. అపుడే ఆ పరుగును సరయిన దారిలోకి మళ్ళిస్తారు" అన్నాడు సూర్యం ఆశగా.

 

    అలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేయటం బొత్తిగా ఇష్టంలేని శక్తి సమాధానం ఇవ్వలేదు.

 

    "ఇవాళంతా టైము తీసుకో- రేపు చెప్పు."

 

    ఇద్దరూ టీ కొట్టునుంచి కొత్త బస్టాండ్ వరకూ వచ్చారు. అక్కడ నుంచీ తన ఇంటికెళ్ళిపోయాడు సూర్యం. శక్తి ఇంటికి వచ్చేసరికి పూర్తిగా తెల్లవారి పోయింది. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. తన గదిలోకి వెళ్ళిపోయి మంచం ఎక్కేసాడు శక్తి. కొడుకు ఒక దారికి వస్తున్నందుకు తల్లికెంతో ఆనందంగా ఉంది.

 

    "కాఫీ త్రాగి పడుకోరా..." కాఫీ గ్లాసు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయిందావిడ.

 

    అప్పటికే నిద్ర పట్టేసింది శక్తికి... ఆ వెంటనే కలలోకి వెళ్ళిపోయాడు.

 

                            *    *    *    *

 

    కళ్ళు నులుముకున్నాడు శక్తి.

 

    ఏ కారణం లేకుండా కలలు రావు... కలలకు కారణాలున్నాయి. కలలకో గమ్యం, మార్గం వున్నాయి. పూర్తిగా కళ్ళు విప్పాడు శక్తి... పగలో, రాత్రో అర్థం కాలేదు. కిటికీలోంచి బయటకు చూసాడు. పల్చటి ఎండ- గడియారంవైపు చూస్తే నాలుగు చూపించిందది.

 

    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.

 

    స్కూలుకు, చెల్లెలు కాలేజీకి వెళ్ళుంటారు. నాన్న పడుకుని వుంటారు...

 

    బాగా ఆకలి వేస్తుంది... లేచి బాత్రూంకు వెళ్ళి పదినిమిషాల్లో బైటకు వస్తూ వంటింటి వైపు చూసాడు.

 

    కాలేజ్ కు వెళ్ళాల్సిన శారద వంటింట్లో వుంది.

 

    "అన్నయ్య... అన్నం తింటావా."

 

    "నువ్వు కాలేజ్ కు వెళ్ళలేదా?" వంటింటి గుమ్మం దగ్గర నించుని అడిగాడు.

 

    "లేదు..." శారద ఒకింత బాధగా చెప్పింది.

 

    "ఏం... ఎందుకు వెళ్ళలేదు... పరీక్షలకు ముందు మానేస్తే ఎలా"

 

    "నేనేం మానేయాలని మానేయలేదు... ఫీజు కట్టలేదు... రేపటి నుంచి పరీక్షలు... ఎన్నిసార్లు అడిగినా అమ్మ... ఇదిగో, అదిగో అంటుంది తప్ప ఫీజు ఇవ్వలేదు..." నిష్ఠూరంగా అంది శారద.

 

    "నాకెందుకు చెప్పలేదు..."

 

    ఆ మాటలకు జవాబు చెప్పలేదు శారద.

 

    శారద అన్నం పెట్టి పీట వేసింది. మరేం మాట్లాడలేదు శక్తి.

 

    భోజనం చేసి చేతులు కడుక్కునే ముందు అడిగాడు.

 

    "ఫీజెంత కట్టాలి."

 

    చెప్పింది శారద.

 

    వెంటనే బట్టలు వేసుకుని బైటకు వెళ్ళాడు శక్తి.

 

    అప్పటికి సాయంత్రం ఐదు గంటలవుతోంది.

 

    కిరాణా షాపు మెట్లు ఎక్కాడు శక్తి.

 

    శక్తిని చూడగానే నవ్వుతూ ఆహ్వానించాడు సూర్యం.

 

    "ఏమయ్యా శక్తీ... ఇప్పుడే నిద్రలోంచి లేచి ఇళా నడిచి వచ్చేసావా, ముఖం పొంగినట్లుగా వుంది...."

 

    బాయ్ చేత టీలు తెప్పించాడు.

 

    "ఏం ఆలోచించావ్?" అడిగాడు సూర్యం.

 

    "ఇప్పటివరకూ ఏమీ ఆలోచించలేదండీ... ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను..." నెమ్మదిగా అన్నాడు శక్తి.

 

    "ఏమిటి..."

 

    చెప్పాడు శక్తి.

 

    "ఈ మాత్రం దానికి అంత మొహమాటం ఎందుకయ్యా... నిన్ననే అడగవచ్చు గదా..."

 

    కేష్ బాక్స్ లోంచి డబ్బుతీసి శక్తికి ఇచ్చాడు.

 

    "ఇది నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వవద్దు. ఈ రెండురోజులూ నువ్వు చేసిన పనికి- మీ నాన్న జీతం మీ నాన్నదే..."

 

    "మర్చేపోయానయ్యా... సంక్రాంతి ఇంకా పదిరోజులుంది. ఓ రెండు రోజుల్లోపల కొత్త షాపు విషయం... మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. క్రొత్త సంవత్సరం- సంక్రాంతి... అన్నీ కలసివస్తాయి."

 

    "మన వూర్లో ఎక్స్ క్లూజివ్ గా లేడీస్ కు డ్రస్ మెటీరియల్ షాప్ లేదు. అలాంటిదైతే బాగుంటుందేమో... చూడండి.... ఊరు పెరుగుతుంది. ఫాషన్లు పెరుగుతున్నాయి... ఈ ఊరు ఆడాళ్ళు పండుగలు, పబ్బాలకు విజయవాడ వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. ఆలోచించండి... రేపు వస్తాను" అన్నాడు శక్తి వెళ్ళిపోతూ.

 

    అలవోకగా, చెప్పేసి, వెళ్ళిపోయినా... శక్తి ఇచ్చిన ఐడియా టక్కున నచ్చేసింది సూర్యానికి.

 

    అప్పటికప్పుడు పెన్నూ, పేపర్ తీసుకుని, బడ్జెట్ వేయటం ప్రారంభించాడు.

 

    అంతా పూర్తయ్యాక-

 

    శక్తి ఆలోచనకు పదే పదే మనస్సులో మెచ్చుకుంటూ- అలాంటి షాపే పెట్టటానికి నిర్ణయించుకున్నాడు.

 

                                          *    *    *    *

 

    శక్తి నేరుగా పాతబస్టాండ్ కి వెళ్ళాడు.

 

    అక్కడ ఎవ్వరూ లేరు.

 

    అప్పటివరకూ రోజులాగానే మిత్రబృందం అంతా శక్తి కోసం ఎదురుచూసి, శక్తి పాడైపోయాడ్రా.... కిరాణా కొట్టు బ్రతుక్కి అంకితము అయిపోయాడు అని అనుకుంటూ కొత్త బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోయారు.

 

    "శక్తీ... నువ్వు వస్తే కొత్త బస్టాండ్ దగ్గరకు రమ్మన్నారు... నీ దోస్తులు..." రౌడీ ఇనాంగా సిగరెట్ పాకెట్ ఇస్తూ చెప్పాడు పాన్ షాప్ ఓనర్.

 

    శక్తి కొత్త బస్ స్టాండ్ కేసి బైలుదేరాడు.

 

    వచ్చేపోయే జనంతో బస్టాండ్ నిండుగా ఉంది.

 

    శక్తి వస్తుండగానే-

 

    "అరే... శక్తి రా...." మొట్టమొదటిసారిగా అగ్గిని చూసిన ఆది మానవుల్లాగా అరిచారు మిత్రబృందం.

 Previous Page Next Page