"మా కొట్లో పనిచేస్తావా? చెయ్! అయితే ఒక నెల పూర్తిగా పనిచేయనిదే ఎడ్వాన్సుగా ఒక్క రూపాయి కూడా యివ్వను. ఇక్కడ పనులన్నీ జాగర్తగా నేర్చుకో. చదువుకున్నానంటున్నావు-మావాడు చెబితే లెక్కలు రాయి! దానికి పైగా ఏమీ యివ్వను జీతం నెలకు నూరు. అయితే రెండునూర్లకి సంతకం పెట్టాలి! అది రూలు. ఎవరయినా వచ్చి అడిగితే జీతం రెండునూర్లని చెప్పాలి. సరేనా!"
తలూపేడు రవి. 'అరవైరంటే వంద ఎక్కువేకదా! రోజుకి దాదాపు నాలుగురూపాయలు గిడుతుంది' అనుకున్నాడు.
"నీ పేరేమన్నావ్?" బొంగురుగొంతుతో అడిగాడు కేష్ లో డబ్బులేసుకుంటూ. కొట్టు చాలా రద్దీగా వుంది. అప్పటికే ఆరుగురు గుమాస్తాలు ఉన్నారు. కొందరు గుడ్డలు చూపుతున్నారు. కొందరు చించి మడతపెడుతున్నారు. కొందరు పేక్ చేస్తున్నారు. యజమాని అబ్బాయి బిల్లువేస్తున్నాడు! అంతా హడావిడి! సినిమాహాలు ముందు మొదటిరోజున టికెట్ కౌంటరులో రద్దీలాగా రణగొణధ్వని!
తెలుగు కేలండర్ చూశాడు రవి పేరు చెప్పగానే!
"ఈ రోజు బాగాలేదు! రేపు పొద్దున్నేవచ్చి చేరు! తొమ్మిదింటికి రా! ఒంటిగంటకు భోజనానికి పో! మళ్ళా రెండునుంచి రాత్రి ఎనిమిదిదాకా పనిచెయ్యాలి!"
తలూపేడు రవి! ఎంత కష్టమయినా సరే! తిండికి సంపాదించుకోవాలి అనేది ఇప్పటి అతని ధ్యేయం!
"మీ యిల్లెక్కడ?"
చెప్పాడు రవి!
"అబ్బా చాలా దూరమే! అయితే టిఫిన్ లో అన్నం తెచ్చుకో! ఇక్కడ పైన భోజనం చేద్దువు! తర్వాత తర్వాత సైకిల్ పై వెళ్ళి భోజనం చేసి రావచ్చు!"
"లేదులెండి! ఉదయమే భోజనం చేసి పదికివస్తాను. మధ్యాహ్నం ఎటూ వెళ్ళను!"
"తిండి తినకుండా నువ్వేం పనిచేస్తావ్! బాగా తినాలి! కష్టపడాలి! సరె! సరె! నీ యిష్టం! రేపు ప్రొద్దున్న రా!"
ఉత్సాహంతో ఇంటిముఖం పట్టాడు రవి! బి.ఏ. పాసై గొప్ప ఉద్యోగం చేయాలని కలలుకని ఆఖరికి బట్టలకొట్లో గుమాస్తాగా మారిపోయాడు!
9
వారంరోజుల అనుభవం తరువాత ఈ ఉద్యోగం బాగానే వుంది అనుకున్నాడు. కొట్టునిండా రకరకాల చీరలు, జాకెటు గుడ్డలు, షర్టింగ్సు, సూటింగ్సు లాగే గుమాస్తాలు కూడా ఎక్కువే!
"ఈ యాపారంలో వద్దన్నా డబ్బులొస్తాయి! జనానికి అన్నం నీల్లు లేకపోయినా మంచి బట్టలు కావాలె! అందుకని సచ్చి సెడి అయినా కొంటారు" అన్నాడు యజమాని తిరుప్పయ్య.
రవికి అన్ని రకాల చీరలుంటాయని తెలియనే తెలియదు! అబ్బో! కవిత్వంలో పురాణకవిత్వం, ప్రబంధ కవిత్వం, శతక కవిత్వం, గేయ, వచన, గద్య, పద్య, వచన గేయాలే వున్నాయి! కొనే చీరల్లో? షిఫాన్, జపాన్, కంచి, ఆర్టు, క్రేన్, నైలాన్ నైలాక్స్, ఫారిన్ నైలాక్స్, జార్జెట్-- అబ్బో-- గుర్తు వుండదు.
మొదటిరోజున కౌంటర్ లో నుంచుని వెనుక షెల్ఫులో వున్న షర్టింగు తానులు అందించాడు. వెరైటీ చూపమని అడిగితే చూపాడు. తోటి గుమాస్తా సింహం మంచివాడు. ఎప్పుడూ రవి ప్రక్కనే నుంచుని అతనికి తోడ్పడుతూ వున్నాడు.
రెండో రోజున బిల్లులు వేయమన్నారు. చకచకా బిల్లులు తయారుచేశాడు. తిరుప్పయ్య మెచ్చుకున్నాడు. "మా వోడూ నీ మాదిరే సదివిండు? ఏం లాభం, గబగబా లెక్కలెయ్యలేడు. నువ్వు బలే చేస్తావు పంతులూ!"
మూడో రోజు పేకింగ్ పని అప్పగించారు. బిల్లు ప్రకారం చెక్ చెయ్యటం, చేసిన వాటిని కవర్ లో అందంగా అమర్చటం, తర్వాత పిన్ వెయ్యటం-- చాలా సులువు-- కౌంటర్ లో అప్పగిస్తే ఆసామి బిల్లు యిచ్చేసి డబ్బు యిచ్చేస్తాడు.
నాలుగో రోజున "నువ్వు పర్లేదు పంతులూ! దేనికయినా పనికొస్తావు. ఇదిగో బ్యాంక్ కి వెళ్ళి యీ చెక్కులు వేసిరా!" అన్నాడు.
అలా తిరుప్పయ్య అభిమానం సంపాదించాడు రవి. "మొదట్లో అడ్వాన్సు ఇవ్వనన్న మనిషి శనివారం సాయంకాలం తనే పిలిచి యాభయ్ రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి సరుకులు తెచ్చుకోపో?" అన్నాడు.
ఈ మధ్య చాలా సంవత్సరాలుగా ఒక్కసారిగా యాభయ్ రూపాయలు కళ్ళజూడని రవి కళ్ళు మిల మిలా మెరిశాయ్.
ఇది తన స్వార్జితం! కష్టార్జితం! చెమటోడ్చి సంపాదించింది. గర్వంగా అనుకున్నాడు. సరుకులన్నీ కొని పాక్ చేయించాడు. కందిపప్పులాంటి అత్యవసర నిత్యవసర వస్తువులే కొన్నాడు. అన్నీ కలసి హేండ్ బ్యాగ్ లోనే సరిపోయాయి. హూఁ ఎంత ప్రియమైపోయింది బ్రతుకు? ఈ రోజుల్లో చావొక్కటే చవక అనుకున్నాడు.
చకాచకా నడిచి వెళదామనే అనుకున్నాడు.
కానీ చేతులు బరువుతోనూ, కాళ్ళు ఉదయం నించుని నించుని శ్రమచేసినందువల్లనూ లాగేశాయి. నడవలేక సిటీ బస్సు ఎక్కేశాడు.
ధియేటరు వద్ద దిగి, రోడ్డు దాటి, ఏరుదాటి తన చెట్టుమార్గంగా యింటికి వెళ్ళాడు.
"అమ్మా! శెట్టిగారు డబ్బు యిచ్చారు! ఇవిగో సరుకులు" అని నవ్వుతూ అందించాడు.
సుబ్బమ్మగారు వాటిని తీసికెళ్ళి యింట్లో పెట్టి కన్నీళ్ళు తుడుచుకుంది. "దేవుడా! నేను నిన్నెప్పుడూ ఏమీ కోరలేదు. ఇప్పుడు కోరుకుంటున్నాను. వీడి చదువుకి తగిన ఉద్యోగం యివ్వు! నాకు అంతేచాలు" అని ప్రార్ధించింది. వెంకటేశ్వరుడు నామాల క్రింది కళ్ళు తెరవనే లేదు.
కొడుక్కి మంచినీళ్ళిస్తూ "తొలిసంపాదనతో దేవుడికి ఒక కొబ్బరికాయ తెచ్చుంటే బావుండేది! మరిచిపోయావా?" అంది.
"లేదమ్మా! అన్నీ కొన్నాక వెళ్ళి అడిగితే రెండు రూపాయలు చెప్పాడు ధర - నా వద్ద డబ్బులు తక్కువయ్యాయి. అప్పు అడగలేక వచ్చేశాను! మన శెట్టిగారి కొట్లో తెస్తావా? ఈసారి వారంలో యిచ్చేద్దాం!"
"సరే!" అంది ఆమె.
వారం రోజుల అలసట తీరేట్టుగా ఆదివారం ఉదయమే ఏటికి వెళ్ళి స్నానం చేశాడు రవి. తొలకరి చినుకులు బాగాపడ్డంవల్ల అది నిండుగా వుంది.
గంటసేపు యీది వచ్చాక వళ్ళూ, మనస్సూ కూడా తేలికపడ్డట్టుగా అనిపించింది. మరో గంట తర్వాత తన మామూలు స్థలంలో కూర్చుంటే ఈ వారం రోజులూ తనవికానట్టూ, ఎవరో దొంగిలించుకు వెళ్ళినట్టు, తిరిగి తన పూర్వ జీవితం తనకి దక్కినట్టూ అనిపించింది.