"బాగానే వున్నాను" పొడిగా అని తన గదిలోకి వెళ్ళిపోయింది.
"అదేంటి అవని...కాసేపయినా మాట్లాడకుండా వెళ్తావు" అన్నాడు అవనితోపాటు ఆమె గదిలోకి వస్తూ.
"ఏం మాట్లాడాలి?" పెడసరంగా అంది.
"అవేం మాటలే" కోపంగా అంది కూతుర్ని మందలిస్తూ"
"అమ్మా...నాకు తలనొప్పిగా వుంది. కాసేపు పడుకోనీ" అంది మంచం మీద వాలిపోతూ.
"ఆఫీసు నుంచి ఇప్పడే వచ్చిందిగా. కాస్త తలనొప్పిగా వున్నట్టుంది" తమ్ముడికి సర్దిచేప్పింది మహాలక్ష్మి.
"అయినా అవనికి ఉదోగ్యం చేయాల్సిన ఖర్మేంటక్కా... ఉదోగ్యం మానేయమని చెప్పు" అన్నాడు అక్కయ్యతో రమేష్.
"నీకు తెలియందేముందిరా...చిన్నప్పట్నుంచి అది అంతే...ఒకరు చెబితే వినే రకమా?" అంటూ కాఫీ చేయడానికి కిచేన్ లోకి వెళ్లింది.
సూర్యనారాయణ వీళ్ళ సంభాషణ అంతా వింటూనే వున్నాడు.
"నువ్వయినా చెప్పొచ్చుగా బావా" అన్నాడు రమేష్, బావ దగ్గరకి వెళ్ళి.
"ఏం చెప్పమంటావురా...పాడు సిగరెట్లు మానమని నీకు అయిదేళ్ళ నుంచి చెబుతున్నాను. మానేసావా? లేదే...తాగుడు మానేయమన్నాను... అంది మానేయలేదే" అన్నాడు కూల్ గా సూర్యనారాయణ.
"అదేంటి బావా...అదీ...ఇదీ ఒక్కటేనా?" అన్నాడు బావ లాజిక్ ని ఎలా తిప్పికొట్టాలా? అని ఆలోచిస్తూ.
"నన్ను భగవద్గీత చదుకోనీరా" అన్నాడు భాగద్గీతను చేతిలోకి తీసుకుంటూ.
రమేష్ తో మాట్లాడ్డం మొదలెడితే, తన మెదడును తినేస్తాడని...సూర్య నారాయణకు తెలుసు.
నిన్ననే ఫోన్ చేసి మరీ భార్య రమేష్ ని పిలిపించిందని అర్ధమైంది.
భోజనాలయ్యాయి.
అవని భోంచేసి తన గదిలోకి వచ్చి మంచమ్మీద పడుకుంది. అడుగుల శబ్దం విని తలెత్తింది.
ఎదురుగా తల్లి.
"అదేమిటమ్మా...ఎప్పుడూ రానిది ఇప్పుడు నా గదిలోకి వచ్చావు?" ఆశ్చర్యంగా అడిగింది అవని.
తల్లి తన గదిలోకి రావడం అరుదు. మహాలక్ష్మి కూతురి మొహంలోకి పరిశీలనగా చూసింది.
"అదేమిటమ్మ అలా చూస్తున్నావు?"
"మరేంలేదమ్మా...మామయ్యా మీద నీ అభిప్రాయం ఏమిటి?"
"మామయ్యా మీద అభిప్రాయం నేనేం చెబుతాను. నీ తమ్ముడి గురించి నాకన్నా, నీకే బాగా తెలియాలే."
"అదికాదమ్మా... అవనూ, మామయ్యా ఉదయం నుంచి అవని ఎప్పుడొస్తుంది? అవని ఎప్పుడొస్తుంది. అని ఒకటే అడిగాడు. నీకోసం మంచి చీరలు తెచ్చాడు. ఓసారి వెళ్ళి మాట్లాడకూడదా?" అంది.
"ఎందుకు? నాకు చీరలు తెచ్చినందుకా?" అడిగింది అవని.
"అదికాదే, పాపం...నువ్వంటే మామయ్యకు చాలా ఇష్టం."
తల్లి టాపిక్ ను ఎక్కడికో తీసుకెళ్ళబతుందని అర్ధమైంది. వెంటనే మార్చడమో, నిద్రపోవడమో ఏదో ఒకటి చేయాలనుకుంది.
ఆలోచిస్తే...నిద్రపోవడమే బెటరనుకుంది.
"నాకు నిద్రొస్తుందమ్మా" అంది ఆవులిస్తూ.
"పది అయినా కాలేదు. అప్పడే నిద్రేమిటే? అద్సరేగానీ, మామయ్య బాగానే వుంటాడు కదూ" అడిగింది మహాలక్ష్మి.
"ఏమో... కాకి పిల్ల కాకికి ముద్ధనట్టు నీకు మామయ్య బాగానే వుంటాడేమో. నాకైతే...ఛీ...వాక్.. అనాలనిపిస్తుంది" తాపీగా అంది.
"అదేమిటే..అంత మాట అనేసావ్?"
"లేకపోతే.. ఏంటమ్మా...ఎప్పుడు చూసినా సిగరెట్ మీద సిగరెట్ కాలిస్తూ వుంటాడు."
"పెళ్ళయితే మానేస్తాడ్లే" అంది మహాలక్ష్మి.
"మామయ్య మానేస్తే నాకెందుకు? మానేయకపోతే నాకెందుకులే" అంది అవని.
"అదేంటే...మామయ్య పరాయివాడా? రేపో మాపో నిన్ను కట్టుకోవాల్సిన వాడు" అంది.
"నన్నా... నన్నెందుకు కట్టుకుంటాడు?" అంది మొహం చిట్లించి అవని.
"అంటే మామయ్య అంటే నీకిష్టం లేదా?"
"ఇష్టం వేరు. పెళ్ళి చేసుకోవడం వేరు. అయినా మామయ్యని నేను కట్టుకుంటానని ఎవరు చెప్పారు?"
"మామయ్యకు ఏం తక్కువైందే?"
"అన్నీ ఎక్కువే...దురలవాట్లు కూడా" అక్కసుగా అంది అవని.
"ఎంత మాటొస్తే అంత అనేయడమేనా?" కోపంగా అంది తల్లి.
"అమ్మా... నేను మామయ్యను చేసుకుంటానని ఎప్పుడైనా నీతో చెప్పానా? నా పెళ్లి విషయంలో నన్ను అడక్కుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకోవడమేమిటి?" అసహనంగా అంది.
"అంటే మామయ్యను చేసుకోవా?"
"చేసుకోను."
ఒక్క క్షణం కూతురి వంక కోపంగా చూసింది.
అప్పడే సూర్యనారాయణ భార్యాకూ, కూతురికి మధ్య వాగ్వివాదం జరగడం చూసి ఆ గదిలోకి వచ్చాడు.
"చూసారా...మీగారాబమే దాన్ని ఇట్లా తయారుచేసింది." ఫిర్యాదు చేస్తున్నట్టు అంది.
"ఇప్పడేమైందని అంత చేటున అరుస్తావు?" సూర్యనారాయణ అన్నాడు.
"నావి అరుపులా? అదేమందో విన్నారా? రమేష్ ని చేసుకోదట."
"మంచిది. తన నిర్ణయం చెప్పింది. అందులో తప్పేమిటి?"
"తప్పేమిటా? మీరూ దాన్నే వెనకేసుకు రండి... అయినా మా తమ్ముడంటే మీకు లోకువ. ఇంతకన్నా మంచి సంబంధమే వాడికి వస్తుంది" ముక్కు చీదుతూ అంది మహాలక్ష్మి.
"చూడు లక్ష్మీ... మనం పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి. అవని చిన్నపిల్ల కాదు. తన బాగోగులు మనకన్నా, తనకే బాగా తెలుసు. మన అభిప్రాయలు బలవంతంగా పిల్లల మీద రుద్ధడమెందుకు? దాన్ని ప్రశాంతంగా నిద్రపోనీ" అన్నాడు.
మహాలక్ష్మి కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సూర్యానారాయణ కూడా అక్కడ్నుంచి వెళ్లబోయేడు.
"నాన్నా" పిలిచింది వెళ్లిపోబోతున్న తండ్రిని అవని.
సూర్యనారాయణ ఆగి ఏమిటన్నట్లు చూశాడు.
"మీతో ఓ విషయం చెప్పాలి?" అంది మెల్లిగా. వెనక్కి వచ్చి అవని మంచం మీద కూచోని "చెప్పమ్మా"
అన్నాడు.
ఒక్కక్షణం ఎలా చెప్పాలో అర్ధంకాలేదు.
"చెప్పమ్మా" అన్నాడు సూర్యనారాయణ.
"నేను మామయ్యను చేసుకోను అన్నందుకు కోపం వచ్చిందా నాన్నా."
"అసలు పెళ్ళే చేసుకోను అంటే కోపం వచ్చేదేమో... మామయ్యను మాత్రమే చేసుకోనన్నావుగా. ఫర్లేదు.. నీకు నచ్చని పెళ్ళి చేయను" అన్నాడు కూతురి తల నిమురుతూ.
"థేంక్యూ నాన్నా."
"అద్సరేగానీ... చెప్పమ్మా...నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కదూ."
"అవున్నానా."
"ఏం చెప్పలనుకుంటున్నావు? అనిరుద్ర గురించా?"
ఒక్క క్షణం కలవరపడింది.
"చెప్పమ్మా అనిరుద్ర గురించే చెప్పాలనుకుంటున్నావా?"
"ఆ... అవును నాన్నా. కానీ మీకు.." అనిరుద్ర విషయం తండ్రికెలా తెలిసిందో అర్ధం కాలేదు.
"వచ్చేవారం నన్నొకసారి కలవమని ఆ అబ్బాయితో చెప్పు. అతన్తో ఓసారి మాట్లాడుతాను."
"నాన్నా" అవని కళ్ళు కన్నీళ్ళతో మెరిసాయి.
"నా చిట్టితల్లీ... నీ మనసులో వున్న కోరిక నాకు తెలియదా?" అన్నాడు కూతురిని దగ్గరకు తీసుకొని.
"నాన్న... కూతురి మనసు గమనించి, అభిప్రాయాన్ని గౌరవించే మీలాంటి నాన్న దొరకడం నా అదృష్టం.
"నా చిట్టితల్లీ... తండ్రి కూతుళ్ళు స్నేహితుల్లా వుండాలి. పెళ్ళి జీవితానికి సంబంధించిన విషయం. అలాంటి విషయంలో మూర్ఖంగా ప్రవర్తించి నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తాననుకున్నావు? నీకిష్టం లేని పెళ్ళి ఎన్నటికీ జరగదు...సరేనా? హాయిగా నిద్రపో" అన్నాడు.
అవనికి చాలా ఆనందంగా వుంది. తనెంత సతమతమైంది. తండ్రికి విషయం ఎలా చెప్పాలా? అని టెన్షన్ పడింది.
ఇప్పుడు రిలీఫ్ గా వుంది.
సూర్యనారాయణ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు.
డుంబు ఆ రోజు తొమ్మిది గంటలకే పడుకున్నాడు.
"రేపే...అనిరుద్రతో ఈ విషయం చెప్పాలి. అనిరుధ్రకు మాత్రం ఎవరున్నారు. ఈ విషయం విని ఎగిరి గంతేస్తాడు" అనుకుంటూ మంచం మీద వాలిపోయింది అవని.
సరిగ్గా అదే సమయంలో ఆ గది కిటికీ దగ్గర నుంచి కదిలి వెళ్ళిపోయాడు రమేష్.
అతని మొహంలో క్రౌర్యం తొంగిచూస్తోంది. అవని, సూర్యనారాయణ మాట్లాడుకున్న మాటలు విన్నాడు.
'అవనీ...నన్ను కాదన్న నిన్ను హేపీగా వుండనివ్వను.' మనసులో కసిగా అనుకున్నాడు రమేష్.
అతను ఓ నిశ్చయానికి వచ్చాడు.
దాని పర్యవసానమేమిటో అతనికే తెలియదు.
రాత్రి పదిగంటలు...
ఆ గదిలో ఫెడ్రిక్... ఇన్ స్పెక్టర్ బెనర్జీ వున్నారు. ఫెడ్రిక్ ఆ రోజు మధ్యాహ్నం బెనర్జీకి ఫోన్ చేసి, అర్జంట్ గా తనని కలవమని చెప్పాడు. ఆ రోజు రాత్రి పదిగంటలకు తన డ్యూటీ ముగించుకొని వచ్చాడు బెనర్జీ.
బ్లూ జీన్స్, బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు.
"ఇప్పుడు చెప్పండ్సార్" అన్నాడు బెనర్జీ ఫెడ్రిక్ నుద్దేశించి.
"ఇవ్వాళ మధ్యాహ్నం అవని రిజైన్ చేసింది" చెప్పాడు సిగరెట్ వెలిగించుకుంటూ...
"అదేమంత ఇంపార్టెంట్ విషయం కాదే?" ఆశ్చర్యంగా అన్నాడు బెనర్జీ.
"నన్ను నిందించింది. నన్నో ఉమనైజర్ గా చిత్రించింది. నా దగ్గర పని చేయడం తనకు అవమానమట?"
"ఎందుకలా అంది?"
"వసుధ చెప్పడం వల్ల."
"వసుధ ఎవరు?"