Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 12


    లంచం యిస్తాడన్నమాట ! ఎంత ధైర్యంగా మొహం ఎదటే చెపుతున్నాడు . నా వళ్ళు మండింది. తక్షణం బయటికి గెంటాలన్న ఆవేశం వచ్చినా పెద్దమనిషి అంతలా అమర్యాదగా మాట్లాడి పొమ్మనలేక పోయాను....
    'చూడండి .... నా కిలాంటివి ఇష్టం లేదు..... యిలాంటి అవినీతి పనులకి పాల్పడడం నాకు చేత కాదు. దయచేసి మీరు నన్ను ఇరకాటంలో పెట్టి బాధ పెట్టకండి...." అంతకంటే కఠినంగా యింకెలా చెప్పాలో ఆ క్షణంలో నాకు తెలియలేదు....
    అబ్బే తవర్ని బాధపెట్టడం నాకు మాత్రం ఇష్టమా? ఒకరికష్టం వుంచుకోవడం నా కిష్టం లేదు.... ఉత్తినే ఏ పని ఎవరి చేత వేయించుకావాలన్నా నా కదోలా వుంటుంది.... అంచేత అన్నాను సుమండీ..... ఏదో సంతోషంతో ఇచ్చిన దాన్ని మీరు కాదనకూడదు..... అంటూ టేబిల్ మీద కవరు తెచ్చి పెట్టాడాయన. గుమ్మం దగ్గర కెళ్ళి డ్రైవర్ని కేకేశాడు. డ్రైవరు ఏదో బుట్ట తెచ్చి లోపల పెట్టాడు.... మా ద్రాక్షతోటలో కాసిన దక్షాలండి అనాబ్ షా ద్రాక్షల రుచి మరి ఏ ద్రాక్ష కి రాదుకదండీ....అతి నైపుణ్యంతో సంభాషణ సాగిస్తున్న అయన నాకు మాట్లాడడానికి అవకాశం యీయలేదు. అయన కెలా చెప్పాలో అర్ధం కాని స్థితిలో పడ్డాను.
    'చూడండి యిలాంటి లంచాలు అవి తీసుకుని పనులు చేయడం నాకు అలవాటు లేదు. దయచేసి ఈ కవరు తీసేయండిక్కడినించి.
    "అమ్మమ్మ..... లంచం ఏమిటండీ.... ఛీ...ఛీ.... లంచం ఇస్తానా మీ లాంటి వారికి.... సంతోషంతో యిచ్చిన కానుక.....
    "పోనీ లంచం కాకపొతే.... కానుక ఇలాంటి కానుకలు పుచ్చుకునే అలవాటు నాకు లేదు.... మీకు నేను ఏం సహాయపడలేనందుకు క్షమించండి.... కాస్త కఠినంగా అన్నాను.
    అయన నిస్సహాయంగా చూశాడు...."ఏదో మిమ్మల్ని నమ్ముకుని యింతదూరం వచ్చాను....ఈ కాస్త సాయం చేసిపెట్టండి....కాదనరని వచ్చాను...."
    అసలు మీకు మీ అబ్బాయి ప్యాసవుతాడన్న నమ్మకం వుందా? ప్యాసవుతాడని మీకు నమ్మకం వుంటే మార్కుల సంగతి అడగనేఅక్కరలేదు. ఫ్యాసు కాని పక్షంలో మార్కులేన్ని వచ్చాయో తెలుసుకుని మాత్రం ఏం చేయగలరు? అయన అసలు వుద్దేశం రావడానికి గడుసుగా ప్రశ్నించాను.
    అయన కాస్త ఇబ్బందిగా చూశాడు. "ఆ ...ఆ ... అదేనండీ ఆడు కాస్త పేపరు పాడు చేసానంటున్నాడు.... అందుకే కాస్తంత ఆరాటం...."
    అయితే కేవలం మార్కులేన్ని వచ్చాయో చూసి చెప్పమని కాదు అయన కోరిక. ఆ తక్కువ మార్కులు వేయమంటాడు చెప్పాక . ఖచ్చితంగా తన వల్ల కాదని ముందే చెప్పి పంపేయాలి.
    పేపరు పాడుచేసానని అబ్బాయి అంటుంటే మార్కులు తెలుసుకుని మాత్రం మీరేం చేశారండి...."
    "తమ దయుంటే వేయలేనిది ఏముంటుంది సెప్పండి....చేతులు నలుపుకుంటూ అన్నాడు అదోలా నవ్వుతూ.
    అయన అసలు ఉద్దేశం స్పష్టంగా అర్ధం అయింది.
    "మీరు నన్ను క్షమించండి.... అలాంటి పనులు చేయడం నావల్ల కాదని ముందే చెప్పాను.... మీరింక నా కాలం మీ కాలం కూడా వృధా చెయాడం మంచిది కాదు.... ఈ కవరు తీసుకోండి. ఇలాంటివి నాకు అలవాటు లేదు లేచి నిలబడి కవరు తీసి అతనికి అందించాను. అయన తీసుకోలేదు.
    "తవరికి క్రొత్త చిన్నవారు అలవాటు లేదు గాబోలు .... కాని యిలా ఎంతోమంది చేస్తుంటారు.... ఇందులో తప్పేం వుంది సెప్పండి... మన లాంటి వాళ్ళం ఏదో న్యాయంగా వుండాలంటే మాత్రం యీ ప్రపంచంలో కుదురుతుందా మహామహా వాళ్ళే సేయగాలేంది మనలాంటి వారం ఎంత. నలుగురితో పాటు మనమూ నడవాలి.... నిల్చోపెట్టి అయన బోధిస్తున్న నీతులు వింటూంటే వళ్ళు ముందుకొచ్చింది.
    "నలుగురి సంగతి నాకు అక్కరలేదు . నాకు న్యాయం అని తోచింది చేస్తాను....రూల్సుకి వ్యతిరేకంగా వెళ్ళడం నాకిష్టం లేదు..... అయినా మీరు యింత డబ్బుగలవాడు. మీ అబ్బాయి ఓ ఏడాది పరీక్ష తప్పినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏముండదు. అబ్బాయి పరీక్ష ప్యాసయి ఏదో నాలుగు రాళ్ళు తెస్తేనే గాని రోజు నడవని వాళ్ళు పరీక్ష కోసం ఆరాటపడ్డారంటే అర్ధం ఉంది. మీకేం లక్షాధికార్లు అబ్బాయి చదివి ప్యాసయినా ప్యాసకాకపోయినా ఉద్యోగం చేయాలన్న బాధ ఏం లేదు. ఈసారి కాకపొతే మరొకసారి అవుతాడు. దానికోసం మీరింత ఆరాట పడడం అనవసరం అంటాను..."
    'అమ్మమ్మ అలా అనేయకండి. మావాడ్ని డాక్టరు పరీక్ష చదివించాలని నాకోరిక. ఎలాగైనా యీ పరీక్ష ప్యాసయిపోతే డాక్టరు పరీక్షకి చదివిన్చేస్తాను వాడిని.... సీటు గట్రా అంతా ఏర్పాటు సేశాను.... పరీక్ష ప్యాసయిపోయాడని పించుకుంటే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. అందుకే తనకాడికి ఇంత అర్జంటుగా పరుగెత్తుకు వచ్చాను. ... కాస్త దయుంచి మావాడి పేపరు చూచి పెట్టండి అమ్మా.... యీ సిన్న సాయం చేస్తే చాలు...."
    అంటే ఈ పరీక్ష ఎలాగో అలాగ మార్కులు వేయించాన్న ప్యాసు చేయించి ఏ మెడికల్ కాలేజిలో డొనేషన్ కట్టి మెడిసిన్ లో చేర్పిస్తాడన్నా మాట కొడుకుని! హ.... డబ్బుంటే ఈ లోకంలో చేయలేని పనులే ముంటాయి. ఇలాంటివాళ్ళు పరీక్షలు ప్యాసు కాని వాళ్ళందరూ డబ్బిచ్చి ఏ కాలేజీలోనో సీటు సంపాయించడం. అక్కడో పదేళ్ళు చదివి ఎప్పటికో డిగ్రీ చేత బట్టుకోవడం, సవ్యంగా ప్యాసకాకపొతే మళ్ళీ డబ్బు కుమ్మరించి డిగ్రీ తీసుకోవడం ఇలా వున్నాయి యీ రోజుల్లో చదువులు. ఇలాంటి చదువులు చదివి దేశాన్ని ఉద్దరించడానికి వూరి మీద పడుతుంటే మన దేశం యింతకంటే ఎలా బాగుటుంది. రేపొద్దున్న యీ అబ్బాయి .... యినాడు పి.యు.సి పరీక్ష స్వశక్తితో ప్యాసు కాలేక పోయినా డాక్టరయిపోతాడు. బోర్డు కడతాడు! లక్షలార్జిస్తాడు. రోగానికి సరిగా మందులీయడం చేతకాకపోయినా ....పరవాలేదు. డిగ్రీ వుంటే చాలు. ఆ డిగ్రీ రావడం కోసం ఎంతటి అవినీతికయినా పాల్పడతారు. ఎంత డబ్బయినా కుమ్మరిస్తారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బుకి పదింతలు , డాక్టరు డిగ్రీ చూపించి పెళ్ళిళ్ళ మార్కెట్టులో సునాయాసంగా "నష్టాన్ని భర్తీ చేసుకోవడమే కాక లాభం తీస్తారు. ఎంత లేదన్నా యీ డాక్టరు పెళ్ళి కొడుకుని వేలంలో నిలబెట్టి లక్ష రూపాయల పాట పాడిస్తాడు యీ తండ్రి ఆ లక్ష ముందు ఇప్పుడు ఖర్చు పెట్టిన ఏ పది పదిహేను వేలు ఎంత? అంతా డబ్బు మహత్యం. ఆ డబ్బు కోసం ఎంతకయినా , ఏం చేయడాని కయినా సిద్దం....' ఆలోచనలలో వున్న నన్ను చూసి "అయన కాస్త మెత్తపడుతున్నాను అనుకున్నట్లున్నాడు.
    "మీరింతగా ఆలోచిస్తున్నారు యీ సిన్న పని సేయానికి మొన్న కాకినాడ వెళ్ళాను. ఆ మాష్టారు గారు నిమిషాల మీద పనికిచ్చేశారు. మారు సెప్పకుండా ....' ప్రోత్సహిస్తున్నట్టు లోక విరుద్దమైన పని నేనేం చేయబోవడం లేదని నచ్చ చెపుతూ మాట్లాడాయన.
    ఆశ్చర్యపోయాను నేను. అంటే ఒక్క సబ్జక్ట్ లోనే కాదన్నమాట యిలా ఎన్నింట్లో అయితే అన్నింట్లోనూ డబ్బిచ్చి మార్కులు వేయించి ప్యాసు చేయిస్తాడన్నమాట. నా వళ్ళు మండింది. అందరిలాగే నేనూ డబ్బుకి లొంగి చెప్పిన పని చేస్తానని ఎంతో నమ్మకంతో వచ్చిన ఆయన నమ్మకాన్ని సడలించాలి! డబ్బుకి లొంగని వాళ్ళు యీ లోకంలో కొందరయినా లేకపోలేదని నిరూపించాలి నేను. నన్నూ అందరితో జతపరచటం సహించలేక పోయాను నా ప్రత్య్రేకత నిరూపించుకోవాలి. ఎవరో కాకినాడలో లెక్చరర్ మాట్లాడకుండా చేశారట. పాపం ఏం చేస్తాడు. పెళ్ళాం పిల్లల బరువులు బాధ్యతలు నెత్తిన వున్నావాడేమో డబ్బు మీద వ్యామోహ పడి వుంటాడు. నాకేం అలాంటి బాదర బందీలు లేవు. అన్యాయార్జతాలకి కక్కుర్తి పడాల్సిన అవసరం నాకేం లేదు. ఖచ్చితంగా చెప్పేయడానికి నిశ్చయించాను.

 Previous Page Next Page