Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 12


    "సెలవు పెట్టడానికి వుంటే ఇన్ని తిప్పలెందుకు?" అన్నది మీనాక్షికి తెలుసు. మెటర్నిటీ లీవు మొత్తం మూడు నెలలూ పిల్లపుట్టాక తీసుకుందాం అనుకుంది. కాని ఎనిమిదో నెలనుంచి బ్లీడింగ్ ప్రాబ్లమ్ మొదలు పెట్టగానే డాక్టరు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనడంతో నెలా ఇరవైరోజులు ముందే సెలవు గడిచిపోయింది. పెళ్ళయ్యాక పిల్లలు వద్దనుకుంటూ రెండేళ్ళు, కావాలనుకున్నాక మరో రెండేళ్ళు గడిచిపోయాయి. ప్రెగ్నెన్సీ మొదలైందగ్గర నుంచి మూడో నెలలో థ్రెటనింగ్ అబార్షన్. అప్పుడే నలభై రోజుల సెలవు పోయి ఎరెండ్ లీవ్ అయిపోయింది ఇప్పుడింక పెడితే జీతం నష్టంమీద పెట్టాలి. ఆ మాట వినగానే సుబ్బారావు గాబరాగా "జీతం నష్టం మీద సెలవు పెడితే ఇంటి అప్పు ఎలా తీరుస్తాం?" అన్నాడు. సుబ్బారావుకి నాలుగువేల ఎనిమిది వందలు, మీనాక్షికి మూడువేల ఎనిమిది వందలు జీతాలొస్తాయి. భార్య జీతం వచ్చింది వచ్చినట్టు మూడున్నర లక్షలు పెట్టి కొన్న ఫ్లాట్ కి తెచ్చిన లోను తీర్చేస్తాడు. తన జీతంతోనే ఇల్లు గడుపుతాడు. కూడబెట్టి ఇల్లు కొనడం అన్నది వట్టిమాట. ఇలా అప్పులు తెచ్చుకొని కొనవలసిందే ఇల్లు. సరే పిల్లలు పెద్దవాళ్ళయ్యేలోగా ఇంటిమీద అప్పు తీర్చేయచ్చు అనుకుంది మీనాక్షి. 'నెల్లాళ్ళ బాలింతవి అప్పుడే ఆఫీసేమిటని అమ్మ అంటూంది.' మీనాక్షి గొణిగింది డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన రోజు వచ్చేసరికి. "మన ప్రాబ్లమ్స్ మనవి. ఆవిడకేం అర్ధమౌతాయి? అప్పు తీర్చడానికి, ఇంటి ఖర్చుకి నా జీతం సరిపోతుందా? ఓ నెల కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వూరుకోరు. అదీకాక రెండో నెలకి డబుల్ అయితే అప్పుడు మాత్రం ఎలా కడతాం? ఏం చేస్తాం? అందరు ఆడవాళ్ళు కనడం లేదా? వెళ్ళడం లేదా?" అన్నాడు సుబ్బారావు. ఇంక అనడానికి ఏం మిగలలేదు మీనాక్షికి.

                                                       *  *  *

    "ఏమిటమ్మా... పిల్లకి ఇన్ని విరోచనాలు అయితే, డీహైడ్రేట్ అయిపోయేవరకు డాక్టరు దగ్గరకి తీసుకువెళ్ళాలని తెలియదా? మళ్ళీ చదువుకున్నవాళ్ళు మీరు" డాక్టర్ మెత్తమెత్తగా మందలించింది. పోతపాలు ఆరంభించగానే పడక, విరోచనాలు మొదలైతే ఇంట్లో కొత్తపాలు అలవాటవడానికి నాలుగు రోజులు పడుతుందని తల్లి అంటే సరేననుకుంది. విరోచనాలు తగ్గకపోగా ఎక్కువై పిల్ల నీరసంగా వేలాడిపోతూంటే ఆఫీసుకి సెలవుపెట్టి డాక్టరు దగ్గరకి తీసుకొచ్చింది మీనాక్షి.
    "అప్పుడే పోతపాలెందుకు మొదలుపెట్టారు? ఏం పాలు లేవా? తగ్గిపోయాయా?"
    "పాలున్నాయి డాక్టరుగారూ, ఆఫీసుకి వెళ్ళినప్పుడు మూడు నాలుగు ఫీడ్లు పోతపాలు పడ్తున్నాం."
    "అప్పుడే ఆఫీసా! మూడు నెలల వరకు సెలవు ఉంటుందిగా...?"
    "సెలవు ముందు చాలా అయిపోయింది" అంటూ అంత చెప్పుకొచ్చింది.
    "అట్లా అయితే, పాలున్నప్పుడు బాటిల్స్ లోకి తీసి ఫ్రిజ్ లో పెట్టి రెండుమూడుసార్లు పట్టొచ్చుగదా.. ఆఫీసుకి వెళ్ళేముందు బాటిల్స్ లో కలెక్ట్ చేసి పెట్టండి."
    మీనాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఆ విషయం ఆమెకి కొత్త... అలా పట్టొచ్చా... నాకు తెలియనే తెలీదు. బాటిల్స్ కి వస్తాయా పాలు!
    "బాగానే ఉంది, ఆవులు, గేదెలు పాలు పిండుకున్నట్టు మనుష్యుల పాలు పిండుకుని దాచుకోవడం... వరలక్ష్మి నవ్వింది. ఏం రోజులొచ్చాయి. తల్లి వళ్ళో పడుకుని వెచ్చగా పాలు తాగాల్సిన పిల్లలకి తల్లిపాలు సీసాలో పట్టే రోజులు! ఏం ఉద్యోగాలో, ఏం సంపాదనలో..' విరక్తిగా నవ్వింది.
    మీనాక్షికి నిజంగానే విరక్తేమిటి? కోపం, నిస్సహాయత చుట్టుముట్టాయి. చేతులు, రొమ్ములు నొప్పి పట్టేట్టు పాలు పిండుకుంటుంటే! ఆవుదూడకి చుక్కపాలు వదలకుండా ఆఖరి బొట్టుకూడా పిండుకునే పిసినారి పాలవాడిలా, వున్న ఆఖరిబొట్టు వరకు, ఇంకా పిండితే రక్తమే వస్తుందేమో నన్నంతగా, నొప్పి భరిస్తూ పాలు పిండుకుంటూంటే భరించలేని నిర్వేదం చుట్టుముట్టింది. ఎందుకీ పిల్లల్ని కనడం? కడుపునిండా పాలైనా ఇచ్చుకోలేని తల్లులకి పిల్లలెందుకసలు? తమకీ అవస్థ ఏమిటి? ఇంత అవస్థపడి ఈ ఉద్యోగాలెందుకు చేయడం? ఇదంతా స్త్రీల అభ్యున్నతి అనుకోవాలా! స్త్రీల ఆర్ధికప్రగతి అనుకుని సంతోషించాలా? ఏం ఆర్ధిక ప్రగతి? ఏం ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించింది తను? తెచ్చిన జీతం తెచ్చినట్టు మొగుడి చేతిలో పోస్తూంది. ఇంటికోసం ఫ్రిజ్ కోసం, టీవీల కోసం, గ్రైండర్ల కోసం, కుక్కర్ల కోసం.. ఏమన్నా అంటే ఇదంతా మీ కోసమే, మీ సుఖంకోసమే, మీ సౌకర్యాల కోసమే మా తాపత్రయం అనే మొగుళ్ళు... మరి నోరెత్తకుండా రాటకి గట్టిన గానుగెద్దుల్లా గుడ్డిగా రాటచుట్టూ వలయంలా, ఈ ఉద్యోగాల చుట్టూ తిరగుతాము.
    "ఏమిటే, అడుగుతుంటే వినిపించుకోవు, ఏమిటా ఆలోచన?" వరలక్ష్మి మాటలకి.
    "ఏం లేదమ్మా.. పాలు సీసాల్లో దాచుకోడం గురించి ఆలోచిస్తున్నా... రేపొద్దున్న 'ప్రశస్తమైన తల్లిపాలు ఇచ్చట దొరుకును" అని బోర్డులు పెట్టి తల్లిపాలు అమ్మకానికి పెట్టే రోజు వస్తుందేమో? పాలు పిండి, ఫ్రీజర్లో పెట్టి అమ్ముతారేమో! ఇంకా కాస్త ముందు వెళ్ళి పాలు పాస్టరైజ్ చేసి పాక్చరైజ్ డ్ మిల్క్ గా ఉద్యోగ తల్లుల పిల్లలకి కొనుక్కోవచ్చేమో!' విరక్తిగా నవ్వుతూ అంది.
    "బాగానే ఉంది ఆలోచన.. ఏమో నువ్వన్నట్టు ఆ రోజులూ వస్తాయేమో!"
    "ఏమిటమ్మా! వుత్తప్పుడు వూరికే కారిపోతుంటాయి. పిండితే ఆరు ఔన్సులకన్నా రావటం లేదు. రెండు సీసాల్లో మూడు ఔన్సుల చొప్పున పెట్టి ఫ్రిజ్ లో పెట్టింది మీనాక్షి.
    "పిల్ల తాగుతూంటే చేపొచ్చి ఊరుతాయి. ప్రకృతి సహజమైన దాన్ని మనం విరుద్ధంగా చేస్తే అంతే. అయినా పిల్ల తాగితే ఎన్ని తాగుతుందీ మనకు తెలీదుకదా. అది కాస్త తాగాక మళ్ళీ వస్తాయి కాని అన్నీ ఒక్కసారే పిండుకుని సీసాల్లో దాచుకుంటాం అంటే లీటర్ల కొద్దీ వస్తాయేమిటి పిచ్చిదానా! సర్లే ఇవి రెండు మూడుసార్లకి సరిపోతాయా? మధ్యలో కాసిని నీళ్ళు పడ్తుంటాలే" అంది వరలక్ష్మి.
    తల్లి వెళ్ళిపోయే రోజు దగ్గరపడుతూంటే గుండెల్లో గుబులు మొదలైంది మీనాక్షికి. తల్లిని వదల్లేని బెంగ కాదది. కూతుర్ని క్రెష్ లో వదలాలన్న బాధ, బెంగ అది! ఇంత పసిగుడ్డుని ఉదయమే తయారుచేసి పాలు సీసాలు, నీళ్ళసీసాలు, గుడ్డలు అన్నీ మూటకట్టి మైలుదూరంలో వున్న క్రిష్ లో వదిలితే, సాయంత్రం మళ్ళీ తెచ్చుకుని, మళ్ళీ వండుకుని.. చాకిరీ తల్చుకుంటే ఏడుపు వచ్చింది. పాలతో గుండెలు, దిగులుతో మనసు బరువెక్కాయి.
    "ఎలా అమ్మా నీవెళ్ళిపోతే" బెంగతో కళ్ళు తడి అయ్యాయి.
    "ఏం చెయ్యనే, ఎన్నాళ్ళుండగలను. అక్కడ మీ నాన్నగారు ఇబ్బంది పడ్తున్నారు ఒక్కరూ. ఏమిటో పుట్టింటికొచ్చి పురుడు పోసుకోవడం. మూడోనెల వెళ్ళడం ఏమీ లేకుండా ముందునుంచీ మంచం ఎక్కావు. ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళాలి. ఎన్నాళ్ళుంటాను? ఇంక నీ పాట్లు నీకు తప్పవు. ఆ క్రిష్ వాళ్ళతో మాట్లాడి డబ్బు ఇచ్చిరా ఇవాళ" అంది వరలక్ష్మి నిట్టూర్చి.

                                                         *  *  *

    తమ కంపెనీ ఇంకో బ్రాంచిలో పనిచేస్తున్న రేవతి తమ అపార్ట్ మెంట్స్ లోనే ఉంటుంది. ఒకే అపార్ట్ మెంట్స్ లో వున్నా వచ్చి మాట్లాడుకునే తీరిక, టైము లేదు ఇద్దరికీ. ఆ రోజు తన కొడుకు మొదటి పుట్టినరోజు పేరంటం అంటూ పిలవడానికి వచ్చిన రేవతి "మీ అమ్మగారు వెళ్ళిపోయినట్టున్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? క్రిష్ లో జాయిన్ చేశారా? అదేనయం లెండి. ఈ పనిమనుషుల మీద వదిలేకంటే. ఇంట్లో మనిషిని పెట్టి వెడితే వున్నారా? ఇల్లు దోచుకుపోయారా? పాలు పట్టారా? లేక తాగేశారా? అని అన్నీ బెంగలే" అంది నవ్వుతూ తనకంటే అనుభవం ఉన్న ఉద్యోగిని తల్లి కన్పించేసరికి ఆరాటంగా మీనాక్షి ప్రశ్నలు గుప్పించి ఆరాలు తీసింది.

 Previous Page Next Page