Previous Page Next Page 
మరణహొమం పేజి 12

 

    ఒక్క అంగవేసి, బీరువా మూల క్రీనీడలో వెళ్ళిపోయి, నక్కి నిల్చున్నాడు తరుణ్.   
    ఇద్దరు మనుషులని వెంట బెట్టుకుని వెనకదారినుంచి మొహానికి దట్టంగా విభూతి దట్టించిన ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు అతనేనా కలైమణి?   
    కలైమణి తనని చూశాడంటే తనకి ప్రాణాపాయం కలిగే ఆస్కారం వుందని తరుణ్ కి తెలుసు. ప్రాణాలు తియ్యడం అతనికి కొత్తకాదని విన్నాడు తను.   
    కానీ మరొక్కటి కూడా తెలుసు తరుణ్ కి.   
    కలైమణి తనని చూశాడంటే ముందు అతనికే ప్రాణాపాయం తప్పదు. ప్రాణాలు తీయడం తనకీ కొత్తకాదు. పైగా అక్షర రూపంలో లేకపోయినా, ప్రాణాలు తీసే లైసెన్సు తనకి వుంది.   
    లైసెన్స్ టు కిల్!   
    కానీ, ఎప్పుడో తప్ప ఆ అవసరం రానివ్వడు తను.      
    కానీ, లోపలికి వచ్చిన ఆ మనుషులు మాట్లాడం మొదలెట్టిన తర్వాత, తన అంచనా తాత్కాలికంగా తప్పయిందని గ్రహించాడు తరుణ్.   
    ఆ విభూతి పెట్టుకున్నతను కలైమణి కాదు అతని పార్టనర్.   
    "అతి తెలివి ఎప్పుడూ చావుకి వస్తుంది" అన్నాడు ఆ విభూతి బొట్టు అతను తన సహచరుడితో. "ఏదో దొంగటిక్కెట్లు అచ్చుగుద్దడానికి నేను కలైమణికి కాపిటల్ పెట్టినానా, ధారాళంగా డబ్బు వస్తూ వుండిందా, బాగా డబ్బు జమ అయినాక ఇద్దరం "షణ్ముగా, మురుగా" అనుకుంటూ హాయిగా వుండి వుండచ్చా, అదేం లేదు! నిండా అత్యాశ! పాస్ పోర్ట్ ఫోర్జరీలు మొదలెట్టి ఇంకా డబ్బు సంపాదించడం మొదలెట్టినాడు. సరి! అంతటితోనైనా ఊర్కోవచ్చునా! డబ్బు తీసుకుని దొంగ పాస్ పోర్టులు సప్లయ్ చేసిన, ఆ కష్టమర్లనే తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడం మొదలెట్టినాడు. నేను ఆనాడే చెప్పినా! ఇది రొంబా ప్రమాదం తంబీ, వేండా! అని! వినలేదు. ఇప్పుడు చూస్తివా! రెండు నెలలనుంచి కలైమణి కనిపించకుండా పోయినాడు. బతికి వున్నాడో, చచ్చినాడో తెలియదు."   
    "ఎవరో చంపి వుంటారు" అన్నాడు అతని సహచరులలో ఒకడు.   
    "మరి నా కేపిటల్ అంతా ఎట్లా తిరిగి రావాలా తంబీ! ఎరక్కపోయి ఇందులో ఇరుక్కుంటినే!"   
    "దొరికినంతవరకూ ఎత్తుకుపోవాల కుమురన్! ఇంకా చేసేదేమీ లేదు"   
    ఆ ముగ్గురూ కలసి టిక్కెట్ల బండిల్సూ, డ్రాయరు లోని కొంత డబ్బు మూటకట్టుకుని వెళ్ళిపోయారు.   
    వాళ్ళు వెళ్ళిపోగానే, ఆ పాస్ పోర్టులను జేబులో పెట్టుకొని, తన హోటల్ కి తిరిగివచ్చాడు తరుణ్.   
    తను నకిలీ టిక్కెట్ల గురించి ఎన్ క్వయిరీ మొదలెడితే, నిఖిల్ ఆచూకీ తగిలింది ఇక్కడ!   
    ఈ సంగతి తన బాస్ మిశ్రాకి ముందే తెలుసా? లేకపోతే ఇదంతా కాకతాళీయమా? అదీకాకపోతే బాస్ కి క్లయిర్ వాయన్స్ లాంటి దివ్యదృష్టి ఏదైనా వుందా?   
    ఆయన తనకి అప్పగించిన ప్రతిపనీ మొదట్లో చిన్నదిగా, ప్రాముఖ్యం లేనిదానిలాగా కనబడుతుంది. లోతుకుపోయినకొద్దీ చాలా ముఖ్యమైన విషయాలు బయటికొస్తుంటాయ్. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు!   
    నకిలీ టిక్కెట్ల గురించి వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు చెయ్యదలుచుకోలేదు అతను. ఇప్పుడు తను కనుక్కొన్న విషయం అంతకంటే చాలా అర్జెంటు!   
    సో! ఫస్ట్ థింగ్స్ ఫస్ట్!
    
                                                            * * *
    
    సోఫాలో పడుకుని, పైన తిరుగుతున్న ఫాన్ వైపే చూస్తోంది అమూల్య. ఫాన్ ఫుల్ స్పీడులో తిరుగుతున్నా ఆమె మొహానికి పట్టిన స్వేదం ఆరడం లేదు.   
    భయంతో ఒకవైపు వణుకు వస్తోంది. మరొకవైపు చమటపడుతోంది అమూల్యకి. ఆ రోజున హోటల్లో జరిగిన హత్యే గుర్తొస్తుంది మాటి మాటికీ. ఖస్సుమని కడుపులో దిగిన కత్తి. ఫౌంటెన్ లా చిమ్మిన రక్తం, బయటకు వచ్చిన పేగులు, ఆ పేగులని కడుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మనిషి!   
    గాడ్!   
    మనుషుల్లో ఎంత అమానుషత్వం!   
    అంతమంది చూస్తుండగా జరిగిన హత్యను హత్యకాదని రుజువు చెయ్యాలా తను? ఇది తనకు ఇన్సియేషనా? ఆ తర్వాత తను నిఖిల్ గ్యాంగులో ఫుల్ ఫ్లెడ్జ్ డ్ మెంబర్ గా అంగీకరించబడుతుందా? ఆ తర్వాత జరిగే మరెన్నో ఘోరాలు చూడవలసి వస్తుందా తను? ఆ కేసులన్నీ కోర్టులో వాదించి నిజాన్ని అబద్దంగా, అబద్దాన్ని నిజంగా నిరూపించవలసి వస్తుందా?   
    అది తలుచుకుంటే వామిట్ అయ్యేటట్లు వుంది! లాభంలేదు! ఆ గుంపులో వుండి వాళ్ళ గుట్టు కనిపెట్టడం తనవల్ల అయ్యేపనికాదు. ఈలోపలే తను పిచ్చిదయి పోతుంది! నిశ్చయంగా! తరుణ్ కి ఈ సంగతి చెప్పేయాలి.   
    అసలు అతన్ని కలుసుకోవడమెలా? తనని కలుసుకోవడం అతనికి కూడా ఇప్పుడంత సులభం కాదు. తనకు ఇద్దరు బాడీగార్డులను పెట్టాడు నిఖిల్. ఇద్దరూ తనని నీడలా వెంటాడుతూ ఉంటారు అనుక్షణం.     
    
    అసలు బాదీగార్ద్గ్సు ఎందుకు తనకి? తన ప్రాణాలకు ముప్పొస్తుందని అనుమానిస్తున్నాడా నిఖిల్? లేకపోతే తన మనుషులు తనకి ద్రోహం చెయ్యకుండా ముందు జాగ్రత్తగా కనిపెట్టి వుండడం అతని పద్దతా?   
    వీళ్ళ కన్నుగప్పి ఆ స్పై తఃరుణ్ తనని ఎలా కలుసుకోగలడు? కలుసుకుంటే మాత్రం తను చెప్పేస్తుంది! ఈ పని తనవల్లకాదని, ష్యూర్!   
    ఉన్నట్లుండి, "ఝవ్వ్" మన్న శబ్దంతో లైట్లారిపోయాయి. ఫాను ఆగిపోయింది. ఫ్యూజు పోయి ఉండాలి.   
    దిగులేసిందిఅమూల్యకి. మనసులోని చీకటికి తోడు చుట్టూ కూడా చీకటా!   
    ఎవరో తలుపు కొట్టారు.

 Previous Page Next Page