Previous Page Next Page 
హత్య పేజి 12


    "బాగా గ్రహించారు అన్నయ్యగారూ!" ముసి ముసి నవ్వులు నవ్వుతూ అంది మాణిక్యాంబ.

 

    "అమ్మా! ఆకలి. మమ్మీ అన్నం పెట్టవే" అంటూ రవి వచ్చాడు.

 

    "మామయ్య గారి పక్కన కూర్చో" అంది మాణిక్యాంబ కంచము, మంచినీళ్ళు తీసుకువస్తూ.

 

    "రావోయ్ రత్నం!" అన్నాడు గణపతి.

 

    "నా పేరు రత్నం కాదు అంకుల్!" అన్నాడు రవి పక్కనే కూర్చుంటూ. హరి లాగాను, విమల లాగాను మామయ్యగారూ అనలేదు. రవిమాటల్లో తరచు ఇంగ్లీషు మాటలు దొర్లుతుంటాయి. అప్పటికప్పుడు మాటలు కూడా మారిపోతుంటాయి.

 

    "నీ పేరు రత్నం అని మా నాన్నగారు చెప్పారోయ్ రత్నం" అన్నాడు గణపతి.

 

    వాడి చేష్టలకి చర్యలకి ముద్దొచ్చి అప్పుడప్పుడూ రత్నమని, మాణిక్యమని, వజ్రమని అంటుంటాలే. వాడి పేరు రవి. చారులో అప్పడం నంచుకుంటూ సూర్యారావు చెప్పాడు.


 
    "రవి మీ పెద్దాడిపేరు కదా?"

 

    కైలాసం! నీ బుర్రకి తుప్పు బాగా పట్టిందిరా. మా పెద్దాడిపేరు హరి. చిన్నాడిపేరు రవి.

 

    "ఇలా దగ్గర దగ్గర పేర్లు పెట్టకూడదురా సూరీడూ! మరీ కన్ ఫ్యూజ్ గా వుంటుంది. ఇంకానయం. ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్టయితే కమల, విమల అని పెట్టేవాడివి. కమల ఎవరో తెలియక విమల ఎవరో తెలియక అదో పెద్ద కన్ ఫ్యూజ్ గా వుండేది. ఏమ్మా కమలా! నేనన్నదాంట్లో పొరపాటు లేదుకదూ?"

 

    "మీరన్న దాంట్లో పొరపాటు ఎంతమాత్రం లేదు మామయ్యగారూ! కాకపోతే నా పేరు విమల. విమల చెప్పింది.

 

    'అర్రెర్రె.' అన్నాడు కైలాసగణపతి.

 

    అందరూ నవ్వుకున్నారు.

 

    కొద్దిసేపు తర్వాత....

 

    "ఈరోజు భోజనంసరీగ చేయలేదేమిరా రవీ!" మాణిక్యాంబ అడిగింది.

 

    "అంకుల్ మాటలతో సగం కడుపు నిండింది" రవి అన్నాడు.

 

    "నీవు బాగా నచ్చావోయ్!" అని నవ్వుతూ గణపతి కంచం ముందునుంచి లేచాడు.

 

    "రవికి చేతయిన ప్రధమ విద్య ఏమిటంటే ఎదుటి వారిని మాటలతో ఆకట్టుకోటం" అంటూ సూర్యారావు లేచాడు.

 

    సూర్యారావు, కైలాసగణపతి, హరి చేతులు కడుక్కుని ముందు హాల్లోకి వెళ్ళారు. రవి, విమల వంటగదిలోనే ఉండిపోయారు.

 

    "అంకుల్ తమాషాగా ఉన్నారు కదూ?" తగ్గుస్వరంతో విమలతో అన్నాడు రవి.

 

    "సాయంత్రం భలే తమాషాగా నోరుజారి మళ్లీ తెలివిగా సర్దుకున్నాను" విమల చెప్పింది.

 

    తమాషా అంటే ఏంటట?

 

    మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు వుంది అన్నాను. ఎవరో చెప్పు అన్నారు మామయ్యగారు. ఆలోచించాను. అచ్చం ఇదే రూపం ఓ నవలలో పాత్ర అన్నమాట. ఇదే విషయం చెప్పాను.

 

    "దీనిలో తమాషా ఏముంది? నన్ను చిరంజీవిలాగా వుంటానని చాలామంది అన్నారు."

 

    "అబ్బ అది కాదురా! పుస్తకంలోని ఆ వ్యక్తి వర్ణన చెప్పి అతనో డిటెక్టివ్. మారు వేషం ధరించినప్పుడు అచ్చం మీలాగా డ్రస్ మేకప్ చేసుకున్నాడు అని చెప్పాను."

 

    "దీంట్లో కూడా నా కేమీ తమాషా కనపడలేదు" నాలుక చప్పరిస్తూ తేలికగా అన్నాడు రవి.

 

    "మామయ్యగారు మనసు నొచ్చుకుంటారని అసలు విషయం దాచాను. ఆ వ్యక్తిమారు వేషం వేసుకున్న డిటెక్టివ్ కాదు. పోలీసుల కళ్ళు కప్పటానికి మారువేషం వేసుకున్న హంతకుడు" విమల తగ్గుస్వరంతో చెప్పింది.

 

    "బాప్ రే..... అయితే అంకుల్.....!" రవి ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేశాడు.

 

    "ఈ మామయ్యగారు, హంతకుడు కాదు..... డిటెక్టివుకాదు. నాన్నగారి ఫ్రెండ్" అంటూ విమల నవ్వింది.

 

    వీళ్ళ మాటలు వింటున్న మాణిక్యాంబకి చిర్రెత్తుకొచ్చింది.

 

    "ముందు మీ యిద్దరూ నోరు మూసుకోండి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా వాగుడు. నాన్నగారు వింటే బాధపడతారని కూడా లేదు. ఆయన వింటే ఏమనుకుంటారు. పాలు తాగే పసివాళ్ళు కాదు. వయసు గుర్తు తెచ్చుకుని హుందాగా వ్యవహరించడం నేర్చుకోండి. మరోసారి పిచ్చి వాగుడు వాగకండి" చిరుకోపంతో మందలించింది మాణిక్యాంబ.

 

    "విన్నావా విమ్ము డబ్బా! మమ్మీ వేసిన అక్షింతలు నీకే" రవి నవ్వుతూ అన్నాడు.

 

    "అవును అక్షింతలు నాకు తిట్లునీకు" ఎక్కిరిస్తూ అంది విమల.

 

    "మీరు పిల్లలుకాదు పిడుగులు" మురిపెంతో అంది మాణిక్యాంబ.

 

    "ఇదేదో బాగానే ఉంది. అంకుల్ జిమ్ తో కాసేపు బాతాకానీ వేస్తాను" అంటూ రవి అక్కడ నుంచి లేచి బయటికి వెళ్లాడు.

 

    తల్లికి వంటింట్లో పని సాయం చేయటానికి విమల అక్కడే వుండిపోయింది.


                                      9

 

    "నేను చెప్పింది గుర్తుందిగా!"

 

    "చూడు సూరీడూ! ఏదైనా సరే నాకు వకసారి చెపితే చాలు నిక్షేపంగా గుర్తుంటుంది సరేనా!"

 

    "నీకు?" ఆశ్చర్యంగా అడిగాడు సూర్యారావు.

 

    "అవును నాకే" అన్నాడు కైలాసగణపతి.

 

    "నీకు?" మరింత ఆశ్చర్యపోయాడు సూర్యారావు.

 

    "చూడు సూరీడూ! నిన్ను నేను ఎప్పుడన్నా సూరీడూ అని పిలవటం మరిచిపోయి చందురుడూ! అని పిలిచానా?" కైలాస గణపతి యమ సీరియస్ గా ముఖం పెట్టి అడిగాడు.

 

    "లేదులే."

 

    "దట్సాల్."

 

    "అంటే?"

 Previous Page Next Page