అతని కాళ్ళ సందుల్లోంచి నాగుపాము చరచరమని పాకి వెళ్ళిపోగానే లేచి ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా-
ఆ రాతిభవనం వెనక్కి కదిలాడు. విశాలమయిన తోట. దట్టంగా పిచ్చి చెట్లతో, దుర్గమంగా తయారయిన తోట. నడుస్తున్నాడు అందులోంచి నిర్భయంగా.
తను ఏ లక్ష్యంతో బయలుదేరాడో, ఆ లక్ష్యం పొందడానికి అతని మనస్సు సమాయత్తమవుతోంది.
వచ్చేశాడు... వచ్చేశాడు తను కోరుకున్న చోటుకొచ్చేశాడు. ఆ రాతి కట్టడానికి యాభై అడుగుల దూరంలో, శాఖోపశాఖలుగా విస్తరించిన మర్రిచెట్టు నేలలో పాతుకుపోయి వృక్షాల్లా మఱ్ఱి ఊడలు.
ఆ ఊడల మధ్యకెళ్ళి నిలబడ్డాడు.
ఇక్కడే... ఇక్కడే.... కొన్ని శతాబ్దాల క్రితం ఏదో పోగొట్టుకున్న వాడిలా ఏదో వస్తువును వెతుకుతున్న వాడిలా అతని కళ్ళు పరిభ్రమిస్తున్నాయి.
మట్టిని, తుప్పల్ని చేతులతో పక్కకు తోసేసి ముందుకు నడుస్తున్నాడు.
అప్పుడు తగిలింది అతని కాలికో స్పర్శ. మెట్లు... అదొక భూగృహానికి మార్గం. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుందో, భరించిందో ఎన్ని శతాబ్దాలుగా వున్నాయో.
శిథిలమైన మెట్ల చివర పెద్ద బండరాయి. తన శక్తినంతా ఉపయోగించి ఆ బండరాయిని పక్కకు తోశాడు.
చీకటి.... కటిక చీకటి.
అయినా అతను భయపడలేదు. ముందుకు కదిలాడు. కళ్లు చిట్లించుకొని చూస్తూ ముందుకుపోసాగాడు.
అరడజను స్తంభాలతో పెద్ద భూగృహం. ఆ భూగృహం మధ్య నుండి పారుతున్న సెలయేరు.
ఆ సెలయేట్లో కొట్టుకుపోతున్న పాములు. ఆ పాముల కళ్ళ వెలుతురే చుక్కానిలా చీకటిలో మార్గాన్ని చూపుతున్నాయి ఆ వ్యక్తికి.
నలువైపులా నిశితంగా పరికిస్తున్న ఆ ఆజానుబాహుడు మూడడుగులు ముందుకు వేసి ఆగిపోయాడు.
మనిషి మీద మనిషి నిలబడినంత ఎత్తున్న పుట్ట. మట్టిపుట్ట తప్ప అక్కడ మరేం కనిపించలేదు.
ఒక్కసారిగా నిరాశ ఆవరించింది ఆయన్ని. తన అన్వేషణ సఫలం కాదా? తన ప్రశ్నకు జవాబు దొరకదా? లేక తను దారితప్పి ఇంకో ప్రదేశానికి వచ్చాడా? సవాలక్ష చిత్రమైన ప్రశ్నలు.
పదినిముషాలు గడిచాయి.
మనసులో మహేశ్వరుడ్ని స్మరించుకొని సెలయేటివైపు నడుస్తున్న ఆ ఆజానుబాహుడు ఏవో కదలిక తాలూకు శబ్దం వినిపించడంతో ఒక్క క్షణం నిస్తేజంగా నిలబడిపోయాడు.
అతని నరాలలోని రక్తం క్షణకాలం ఆగిపోయినట్లయింది.
"వచ్చావా... ఇంత దూరం శ్రమపడి వచ్చావా? ఇంత దూరం వచ్చిన వాడివి నన్ను కనుక్కోలేక పోతున్నావేంటి?" మంద్రంగా నూతిలోంచి వస్తున్నట్టుగా వినిపిస్తోందా మాట.
గది కుహరాల్లో ప్రతిధ్వనిస్తోందా మాట.
ఆ మాటలు వినిపించిన దిశగా కదిలిన ఆ ఆజానుబాహుడు మట్టిపుట్ట దగ్గరకొచ్చి నుంచున్నాడు. అతని కళ్ళు ఆ మట్టిపుట్టనే చూస్తున్నాయి.
ఒక్క క్షణం... ఒక్కక్షణం.
చూస్తుండగానే ఆ మట్టిపుట్ట నెమ్మదిగా కదలటం ప్రారంభమైంది. ఫెళ్ళు ఫెళ్ళున మట్టి పెళ్ళలు రాలడం ప్రారంభమైంది. ఆ పెళ్ళలు సెలయేటిలో పడి అంతలోనే కరిగిపోతున్నాయి.
ఆ పుట్టవైపే కన్నార్పకుండా చూస్తున్న ఆ ఆజానుబాహుడు అంతులేని దిగ్భ్రమకు లోనయ్యాడు.
ఎదురుగా- ఎదురుగా- విచ్చిపోయిన పుట్టమధ్య శుష్కావస్థలో వున్న మానవకారాం. నగ్నంగా, బలహీనంగా, అట్టలు కట్టిన జుట్టు, కాళ్ళవరకు పెరిగిన గడ్డం, విద్యుత్ గోళాల్లా ప్రకాశిస్తున్న కళ్ళు.
ఆ ఆకారాన్ని చూడగానే ఆ ఆజానుబాహుడు అప్రయత్నంగా తన చేతుల్ని ముకుళించి ఆయన ముందు సాష్టాంగపడ్డాడు.
"విశ్వాత్మా లే" అని వినిపించాయి మాటలు.
అతని పాదాల్ని తాకి నమస్కరించి లేచి తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు విశ్వాత్మ.
"విశ్వాత్మా! ఇంత దూరం నన్ను చూడటానికి కొచ్చి కళ్ళు మూసుకొని నిల్చుంటావేం?" ఆ నగ్న సాధువు ప్రశ్నించాడు.
ఆ ఆజానుబాహుడు పేరు విశ్వాత్మ.
ఆ నగ్న సాధువు తన పేరును ఉచ్ఛరించగనే అలౌకిమైన గగుర్పాటుకు లోనయ్యాడు విశ్వాత్మ.
"నేనిక్కడ వుంటానని ఎలా తెలుసుకున్నావు?" ప్రశ్నించాడు ఆ సాధువు.
ఎలా చెప్పగలడు విశ్వాత్మ? పూర్వజన్మ స్మృతే తనిక్కడకు తీసుకొచ్చిందని ఎలా చెప్పాలో తెలీక మౌనంగా వున్నాడు విశ్వాత్మ.
విశ్వాత్మ మనసులోని భావం అర్థమైనవాడిలా చిన్నగా నవ్వాడు ఆ దిగంబర సాధువు.
"ఎందుకు నీ అన్వేషణ... దేనికోసం వచ్చావు?"
"ఎందుకో మీకు తెలీదా స్వామీ... అయినా నా మనసును వేధిస్తున్న జటిలమైన సందేహాన్ని మీ ముందుంచుతున్నాను. గతజన్మలో నేనెవర్ని? ఈ జన్మలో నా ఉనికికి కారణం ఏమిటి? నాకు పునర్జన్మ వుందా? వచ్చే జన్మలో నేనే రూపంలో జన్మిస్తాను?" వరసగా ప్రశ్నల పరంపర.
సెలయేటి గలగలలు, భూగర్భ కుడ్యాలను మృదువుగా స్పృశిస్తున్న వింత చప్పుడు.
"అంటే... నువ్వెప్పుడు జీవాత్మని వదిలిపెడుతున్నావో నీకు ఖచ్చితంగ తెలుసా?" ప్రశ్నించాడు ఆ దిగంబర సాధువు.
"తెలీదు. తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే మీ దగ్గరకొచ్చాను స్వామీ" అన్నాడు.
నాడీశాస్త్రం ద్వారా మన మరణ ఘడియల గురించి తెలుసుకున్న విషయం గురించి చెప్పదలుచుకోలేదు. తన మరణం గురించి ఈ సాధువు ఏం చెప్తాడోనని తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది విశ్వాత్మకి.
"మొదట నా మరణ ఘడియల గురించి తెలియజేస్తే" అనడిగాడు విశ్వాత్మ.
"తెలుసుకోక తప్పదా?"
"పూర్వజన్మ, పునర్జన్మల గురించే నా అన్వేషణ స్వామీ" అన్నాడు విశ్వాత్మ.
ఆ మాట వినగానే ఆ సాధువు ఎదురుగా నుంచున్న విశ్వాత్మవైపు ఆపాదమస్తకం చూశాడు.
ఒక్కక్షణం యోగముద్రలోకెళ్ళాడాయన.
మరుక్షణం "విశ్వాత్మ... నేటికి సరిగ్గా పదునాలుగో రోజు, అర్థరాత్రి పన్నెండు గంటల పది ఘడియలకు నీకు మరణం సంభవిస్తుంది"
విశ్వాత్మకు సందేహం తీరిపోయింది.
నాడీజోస్యుడు చెప్పింది నిజమే.
"మరి పునర్జన్మ?"
"నీలో పునర్జన్మ ఆశ వుంది. ప్రాణిగానే జన్మిస్తావు" నెమ్మదిగా అన్నాడాయన.
"ప్రాణిగా అంటే?"