Previous Page Next Page 
వ్యూహం పేజి 12


    అప్పుడు నిర్ణయించుకున్నాను. ఎవరిమీదా ఆదారపడకుండా జీవించాలని-

 

    అంటే వ్యాపారం చేయాలి.

 

    ఎలాంటి వ్యాపారం చెయ్యాలి?

 

    నీ దగ్గర లేనిది, నా దగ్గర వుంటేనే నువ్వు కొనటానికి నా దగ్గరకు వస్తావు. అంటే అవసరాన్ని తీర్చేదాన్ని అమ్మాలి. అలాగే ఆ అవసరం ఎంతమందికి వుంది అన్న ప్రశ్న కూడా ఆలోచించాలి.

 

    అలాగే వూరునిబట్టి, మనుష్యులను బట్టి వ్యాపారం ప్రారంభించాలి. ప్రతి వ్యాపారం ప్రతిచోటా నడవదు. కుర్తాలు, కమీజుల వ్యాపారం మన వూరిలో పెట్టావనుకో... ఎవడయినా కొంటాడా? ఫైవ్ స్టార్ హోటల్ మన వూరిలో వుంటే ఎవరయినా వస్తారా?

 

    రారు.

 

    ఎందుకు?

 

    ఇక్కడ వాటి అవసరం లేదు కనుక.

 

    ఇప్పుడు హైదరాబాద్ లాంటి వూళ్ళలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పుట్టాయి. అక్కడున్న కొంతమంది మనుష్యులకు సరిగ్గా ఇంట్లో వండుకొని తినలేని పరిస్థితి వచ్చిందని దాని అర్థం. యాంత్రిక జీవనం... ఫాస్ట్ లైఫ్ వచ్చిందని దాని అర్థం.

 

    గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి ఆఫీసుకు వెళ్ళే దారిలో ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లోకి వెళ్ళి ఏదో తినేసి పనుల్లోకి వెళ్ళిపోవటం అలవాటయింది. ప్రపంచంలో వేగం, వేగంగా పెరుగుతుందన్న దానికి ఇలాంటి బిజినెస్ లు నిదర్శనం.

 

    నేనేం చేసాననుకున్నావ్?

 

    అప్పుడే ఈ ఊళ్ళో కాలేజీ పెడుతున్నారు. కొత్తగా ఊర్లోకి చాలా కుటుంబాలు వస్తున్నాయని తెలిసింది. అప్పటికే ఈ వూళ్ళో పాలు సరిగ్గా దొరకటం లేదు. ప్రక్కనున్న పల్లెటూర్ల నుంచి పాలు తీసుకువచ్చి ఉద్యోగులు అందరికీ పోయటం ప్రారంభించాను. సైకిల్ కు డబ్బాలు కట్టుకొని తిరిగాను... తిరిగాను... నువ్వు కాలక్షేపం చేసే నందిగామ బస్టాండ్ కి గొప్ప చరిత్ర వుంది. చుట్టుప్రక్కల గ్రామాలలో రైతులు ఎందరో ఆ బస్టాండ్ లో తమ ఆస్థుల్ని పోగొట్టుకున్నారు. ఎకరాలకు ఎకరాలు అమ్మేసి బికారులయ్యారు. వాళ్ళే తమ డొక్కు సైకిళ్ళమీద ఇప్పుడు అక్కడ కనిపిస్తుంటారు. చేతిలో ఏమీ లేకుండానే పాత బస్టాండులో పళ్ళకొట్టు పెట్టుకున్న తంగేలు లక్షాధికారయ్యాడు. అదే బస్టాండులో బాగుపడ్డవాళ్ళూ ఉన్నారు. సర్వనాశనమైన వాళ్ళూ ఉన్నారు, అయిదేళ్ళు పాలవ్యాపారం చేసాను. అదృష్టం కలిసి వచ్చింది.

 

    హోటల్ వ్యాపారం చేసాను- అది కల్సి రాలేదు.

 

    హోటల్ వ్యాపారానికి వెళ్ళే ముందు నేను ఏమనుకున్నానో తెలుసా? జిల్లాకో హోటల్ కట్టేయ్యాలని...

 

    ఏదీ కుదరలేదు... మనం కనే కొన్ని కలలు వాస్తవరూపం ధరించవు. అంత మాత్రం చేత నిరాశ చెందగూడదు గదా...

 

    ఎందుకు కుదరలేదు-

 

    'మన అపజయానికి కారణం మనమే అనుకునే వ్యక్తిని' నేను- మెయిన్ రోడ్ లో కిరాణాస్టోర్సు పెట్టాను... అందుకుంది. ఈ రోజు కె.వి.ఆర్. కాలేజీ లెక్చరర్స్, హైస్కూల్ టీచర్స్, రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది ఖాతాలన్నీ నా దగ్గరే- లిస్ట్ ఇచ్చి వెళతారు. సరుకులు కట్టించి పంపిస్తాను. నెలాఖరుకి జీతాలొచ్చినప్పుడు ఖాతాకి జమేస్తారు. వాళ్ళమీద నాకు- నామీద వాళ్ళకు నమ్మకం- దాంతో వ్యాపారం అభివృద్ధి చెందింది.   

 

    మామూలు కిరాణా షాపుగా పెట్టాను. అంచెలంచెలుగా పెంచాను ఇవాళ మన వూర్లో వున్న మూడు పెద్ద షాపులు నావే.

 

    దేవుడు దయతలిస్తే కంచికచర్లలో, జగ్గయ్యపేటలో కూడా పెట్టాలని నాకు వుంది- ఎదగాలిగదా- అందుకే ఆ తాపత్రయం- అది లేనినాడు మనిషెలా పైకొస్తాడు? నాది అత్యాశని కొందరు అసమర్థులు అంటుంటారు. నాది అత్యాశకాదు. ఎదుగుదలని నేనంటాను- ఉన్నచోటే ఉండలేం గదా...?

 

    నాది చిన్న జీవితం... ఈ వూరి వరకే పరిమితమైన జీవితం... దాన్ని విస్తరింప జేసుకోవాలనే నా ఆశ... అప్పుడే గదయ్యా నా పిల్లలు ఎమ్.బి.ఏ.లు, ఐ.ఏ.ఎస్ లు చదవగలిగేది. నేను సంపాదించిన దానిలో శివాలయానికి ఇంత దానం చేసాను. అదెలా సాధ్యపడిందంటావ్...? వుందయ్యా! నా దగ్గర పనిచేయటం, చెయ్యకపోవటం మాట అటుంచు, ఈ ఊరు వదిలి నీకు నచ్చిన చోటుకు వెళ్ళిపో.... నువ్వు బాగుపడకపోతే నన్నడుగు" చెప్పటం ఆపాడు సూర్యం.

 

    తండ్రి కూడా ఇంతలా తనకు చెప్పలేదు.

 

    ఇన్నేళ్ళ జీవితంలో తన జీవితం గురించీ, తన బ్రతుకు గురించీ ఆలోచించి చెప్పినవాడు సూర్యం ఒక్కడే.

 

    సూర్యంవేపు అభిమానంగా, గౌరవంగా చూసాడు శక్తి.

 

    ఆ చూపును అర్థం చేసుకున్నాడు సూర్యం.

 

    "ఈ వేళ పనికి వస్తున్నావా?" నవ్వుతూ అడిగాడు సూర్యం.

 

    "ఈ వూళ్ళోనుంచి ఇప్పుడే వెళ్ళిపోమని మీరు చెప్పలేదు కదా" జవాబిచ్చాడు శక్తి నవ్వుతూ.

 

                            *    *    *    *

 

    సాయంత్రం వరకు మరో ఆలోచనలేదు శక్తికి. పని... పని... పని...

 

    తెల్లారుఝాము అయిదయ్యింది పని పూర్తయ్యేసరికి.

 

    శక్తి ఏకాగ్రతకు ముచ్చటేసింది సూర్యానికి. ఉదయం అయిదు గంటలకు షాపు మూసుకుని రోడ్డుమీదకు వచ్చారు ఇద్దరూ.

 

    అప్పటికే టీ షాపులు తెరిచారు. ఇద్దరూ పాత బస్టాండ్ లోకి వెళ్ళి టీ తాగారు.

 

    "నీలో ఇంత పట్టుదల ఉందని నాకు తెలీదు సుమీ" టీ త్రాగుతూ అన్నాడు సూర్యం మెచ్చుకోలుగా.

 

    శక్తి మాట్లాడలేదు- కలగంటున్నాడు.

 

    "ఆరుగురు మనుష్యులు ఆరునెలలు కూర్చుంటే... అంత పనిని నువ్వొక్కడివే చేసావు... రెండురోజుల్లో పూర్తి చేసావంటే నాకు ఇప్పటికీ నమ్మకం కలగటంలేదు. నీకు మంచి ఫ్యూచర్ వుందయ్యా- కష్టపడటం నీకు తెలుసు... ఉత్తినే కష్టపడటంవల్ల ఉపయోగంలేదు. నువ్వు పడే కష్టం నీకు ఉపయోగపడాలి. నీ కష్టంవల్ల నీకు మంచి పేరు రావాలి. డబ్బు రావాలి. నాదగ్గర డబ్బుంది... నీ దగ్గర చురుకయిన బుద్ధుంది. తెలివితేటలున్నాయి. మనం కలిసి పని చేసుకుంటే బాగుంటుంది కదా? చేస్తావా.... నాతో కాలుస్తావా-?"

 

    అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడు సూర్యం.

 

    "రెండు రోజులకే నన్ను నమ్మేస్తున్నారు మీరూ... నా గురించి మీకింకా తెలీదు. నేను మీరనుకునేంత బుద్ధిమంతుడ్ని కాదు" నవ్వుతూ అన్నాడు శక్తి.

 Previous Page Next Page