5. ఇంద్రాగ్నులు ఘనులు, సభాపాలకులు. వారు రాక్షసుల తామసమును హరించవలెను. రాక్షసులు సంతానములేనివారు కావలెను. అప్రజాః సంత్వత్రిణః
6. ఇంద్రాగ్నులారా ! మీరు ప్రకాశ స్థానమున ఉన్నారు. సత్యమును జాగృతము చేతురు. మాకు ధనములను ప్రసాదించుడు.
ఇరువది రెండవ సూక్తము-ఋషి-కణ్వపుత్రుడు మేధాతిథి, దేవతలు1-4 అశ్వినులు,
5-8 సూర్యుడు, 9-10 అగ్ని, 11 దేవతలు, 12 ఇంద్రాణి, వరుణాని, అగ్నాయీ,
13-14 భూమ్యంతరిక్షములు, 16-21 విష్ణువు, ఛందస్సు - గాయత్రి.
1. ప్రాతస్సవనమునకు విచ్చేయుటకుగాను అశ్వినీదేవతలను మేల్కొలుపుచున్నాము. వారు సోమపానమునకు విచ్చేయవలెను. గచ్ఛతామ్ అస్య సోమస్య పీతయే
2. అశ్వినులు సురథులు, ద్యులోకమున నివసించువారు. ఉజ్వలముగా ప్రకాశించువారు. వారిని ఆహ్వానించుచున్నాము. అశ్వినా తాహవామహే
3. అశ్వినుల చేతి కశము, కొరడా సత్యమయినది. తడిసి ఉండునది. వారు అట్టి కశమున యజ్ఞము నిర్వహించవలెను. తయా యజ్ఞం మిమిక్షితమ్
4. అశ్వినులారా ! సోమయాగము చేయు యజమాని గృహము దూరముకాదు. అతని ఇంటికి మీరు రథముపై చేరగలరు. గచ్ఛథః అశ్వినా సోమినోగృహమ్
5. యజమానిని రక్షించుటకు హిరణ్యపాణి అయిన సూర్యదేవుని ఆహ్వానించుచున్నాము. సూర్యుడు యజమానికి అతని స్థానమును తెలుపగలడు. పచేత్తా దేవతాపదమ్
6. సూర్యుడు నీటిని ఇగిరించును. అతనిని రక్షణకుగాను నుతింపుము. సూర్యవ్రతములను ఆచరించుము.
7. సూర్యుడు నివాసమునకు కావలసిన ధనమును ఇచ్చును. సవితారం నృచక్షుషం నరులను వెలిగింపచేయు సూర్యుని ఆహ్వానించుచున్నాము.
8. మిత్రులారా ! ఋత్విజులారా ! రండు. ఆసీనులు కండు. సూర్యుడు స్తవనేయుడు. ధనప్రదాత. అతడు వెలుగులు పరచుచు విచ్చేయుచున్నాడు.
(ఉదయ సంధ్య అందములను ఆస్వాదించుటకు ఆహ్వానించుచున్నాడు.)
9. అగ్నీ ! దేవతల పత్నులను తీసికొని రమ్ము. త్వష్టను కూడ సోమపానమునకు తీసికొనిరమ్ము.
10. అగ్నీ ! మమ్ము రక్షించుటకు దేవపత్నులను, నీపత్ని భారతిని, పూజ్యురాలు సరస్వతిని తీసికొని రమ్ము.
11. నరులను పాలించువారు, అక్షయ సంపదలుగల దేవపత్నులు మాకు సుఖమును, భద్రతను ప్రసాదించవలెను.
12. మా యజ్ఞములకు శుభములు కలిగించుటకు ఇంద్రపత్నిని, వరుణపత్నిని, అగ్నిపత్నిని సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
13. మహద్యౌలోకము, పృథివి తమ దయారసమున ఈ యజ్ఞమును తడుపవలెను. మమ్ములను వారు పోషించవలెను.
14. భూమి, అంతరిక్షము, స్థిరముగా ఉన్నవి. గంధర్వ స్థానమున ఉన్నవి. అవి ప్రసాదించు ఉదకములు ఘృతమువంటివి. విప్రులు ఆఘృతములనే ఆస్వాదింతురు.
15. పృథివీ ! విస్తారమవు అగుము. నిష్కంటకమవు అగుము. అవినాశ్యమవు అగుము. విశాలగుణపతివి కమ్ము. సుఖములను ప్రసాదించుము యచ్చావః శర్మ సప్రథాః
16. విష్ణువు గాయత్ర్యాది సప్త ఛందములతో పృథ్విపై పదవిన్యాసము చేసినాడు. ఆ పృథ్విమీద మానవులు ఉన్నారు. వారిని సకల దేవతలు రక్షించవలెను.
17. విష్ణువు ఈ జగమున సంచరించినాడు. త్రేధా నిదధే పదమ్ మూడు విధములుగా అడుగిడినాడు. విష్ణువు పాదధూళితో సమస్తవిశ్వము నిండి ఉన్నది.
18. విష్ణువు అజేయుడు, సకల విశ్వమును పాలించువాడు అగును. అతడు ధర్మరక్షణకుగాను మూడు లోకములందు మూడు అడుగులిడినాడు.
19. విష్ణుని కర్మలను చూడుడు. అతడు ఇంద్రునకు సఖుడు. విష్ణుని గూర్చి కర్మలు చేయుచున్నాము.
20. ఆససమున నిలిచి సమస్తము చూడవచ్చును. ఆవిధముగనే విద్వాంసులు విష్ణుని మహత్తును సదా చూడగలరు. సదా పశ్యంతి సూరయః
21. లోపరహితులు, జాగరూకులు అయిన స్తుతి కర్తలగు విప్రులు విష్ణుని పరమపదమును ప్రకాశింపచేతురు. సమింధతే విష్ణోర్యత్పరమం పదమ్
ఆలోచనామృతము :
1. కక్షీవంతుడు చేతిపనులవాడు, హస్తకళాకారుడు కావచ్చును. అతడు తన స్వయం ప్రతిభ వలన దేవతల స్థానమునకు చేరినాడు.
ఋభువులు ఒక రకముగా హస్తకళలవారు, నిర్మాతలు. వారు తమ స్వశక్తితో దేవతలలో చేరినారు.
ఇప్పుడు దేవతల పత్నులకు దేవతలతో సరి సమానస్థానము లభించినది. ఇంతకుముందు దేవతలను పత్నుల సమేతముగా ఆహ్వానించినాడు. ఇప్పుడు పత్నులకు, స్త్రీలకు, స్వయంప్రతిపత్తి కలిగినది. పత్నులను మాత్రమే సోమపానమునకు ఆహ్వానించినాడు. ఇది స్త్రీకి పురుషునితో సమానత్వ చిహ్నము. స్త్రీ స్వేచ్చకు, స్త్రీకి సమానస్థాయికి గుర్తింపు.
భార్యలుగా మాత్రము కాక ఇళ-మహి-భారతి స్వతంత్ర దేవేరులు అయి ఉన్నారు.
ఈ స్త్రీ సమానత్వము వేనవేల సంవత్సరములకు పూర్వము ఋగ్వేదమునాడు ఉన్నది.
అత్యంత నాగరకములు అని చాటుకొనుచున్న కొన్ని యూరొపు సమాజములలో నేటికిని స్త్రీకి సమానత్వము లేదు. స్విట్జర్లాండులో స్త్రీకి ఓటుహక్కు లేదు.
2. భరతుడు అగ్ని అగును. అతని భార్య భారతి.
3. విష్ణువు తొలిసారిగా సర్వశక్తిమంతునిగా దర్శనము ఇచ్చినాడు.
విష్ణువు సప్తధాముడు.పృథ్వి, జలము, ఆకాశము, తేజస్సు, వాయువు, తన్మాత్రలు ఏడు విష్ణుని నెలవులు.
పృథ్వి అంతరిక్షము, ద్యులోకముల విష్ణువు తన పాదము ఉంచినాడు. పురాణ కథలందు వామనుడు తన మూడు అడుగులువేసి మూడులోకములు కొలచినాడు.
4. పరమం పదమ్ అను పదము తొలిసారిగా దర్శనమిచ్చినది. విష్ణునిది అన్నిపదములకన్న పరమైన పదము, పరమ పదము.
ఇరువది మూడవ సూక్తము-ఋషి-కణ్వపుత్రుడు మేధాతిథి,
దేవతలు 1వాయువు, 2-3 ఇంద్రవాయువులు, 4-6 మిత్రావరుణులు,
7-9 మరుద్గణ వశిష్టుడు, ఇంద్రుడు, 10-12 విశ్వేదేవతలు,
13-15 పౌష్ణుడు, 16-22 ఉదక దేవత, 24 అగ్ని, ఛందస్సు-అనుష్టుప్.
1. సోమము అభిషవించబడినది. ఇది తీవ్రమయినది. తృప్తికలిగించును. ఆశీర్వంతమయినది. పాలు, పెరుగు మున్నగు వానితో చేయబడినది. ఉత్తరవేదిక సిద్ధముగ ఉన్నది. వాయువా ! ఆ సోమమును పానము చేయుము.
2. ద్యులోకమందున్న ఇంద్రవాయువులను సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
3. ఇంద్రవాయువులు మనోవేగము గలవారు. వేయి కన్నులవారు. బుద్ధికి అధిపతులు. ఋత్విజులారా ! అట్టి ఇంద్రవాయువులను మా రక్షణకుగాను ఆహ్వానించుడు.
4. మిత్రావరుణులు పవిత్ర బలము గలవారు. యజ్ఞమునకు అవతరించువారు. వారిని సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
5. మిత్రావరుణులు సత్యప్రకాశకులు. ప్రశస్త తేజోవంతులు. వారిని ఆహ్వానించుచున్నాము.
6. వరుణుడు రక్షకుడు. మిత్రుడు సర్వరక్షకుడు. వారు ధనములను ప్రసాదించవలెను.
7. మరుత్తులతో కూడిన ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. వారు సోమపానము చేయవలెను. సంతృప్తులు కావలెను.
8. ఇంద్రుడు ముఖ్యముగా గలవారు, ధనములను ప్రసాదించువారు పూష దేవతలు. ఇంద్ర, పూష సమన్వితులయిన మరుద్గణములను ఆహ్వానించుచున్నాము.
9. మరుత్తులు భూరిదాతలు. ఇంద్ర సహితులయి శత్రునాశనము చేయగలరు. మరుద్గణములు మమ్ము దుష్టుడయిన వ్రుత్తుని బారినుండి రక్షించవలెను.
10. మరుత్తులు ఉగ్రులు. పృథ్విపుత్రులు, వారిని సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
11. మరుత్తుల ధ్వని శూరులవలె గంభీరముగా ఉండును. వారు నాయకులు. వారిని సదా శుభకరమయిన దేవయజన స్థానమునకు ఆహ్వానించుచున్నాము.
12. మరుత్తులు కాంతిమంతులు. ప్రకాశమానులు. దివి నుండి దిగివత్తురు. అట్టి మరుత్తులు మాకు సుఖమును ప్రసాదించవలెను. మరుతో మృళయంతునః
13. కాంతి కలిగి గమనశీలుడవయిన పూషా ! తప్పిపోయిన పశువును పట్టి తెచ్చినట్లు, విచిత్రదర్భలు కలిగి యాగమును పోషించునట్టి సోమమును అంతరిక్షము నుండి తెమ్ము.
14. సోమము గుహలో ఉన్నది. గూఢమయినది. విచిత్ర దర్భలు కలది. అట్టిసోమమును కాంతివంతుడయి పూష - సూర్యుడు సంపాదించినాడు.
15. మేము ప్రతి సంవత్సరము ధాన్యము పండించుటకు ఎద్దులతో పొలము దున్నుదుము. అట్లే పూష ఆరు ఋతువులందును మా కొఱకు సోమము తెచ్చును.
16. మేము యజ్ఞము చేయగోరినాము. కావున జలములు, తల్లిపాలవలె మధురములు, హితకరములు అయి దేవ, యజన స్థానముల ప్రవహించవలెను.
17. జలములందు సూర్యుడు, సూర్యునియందు జలము ఉన్నది. అట్టి జలము మా యజ్ఞమును తృప్తి పరచవలెను.
18. మా గోవులు త్రావు ఉదక దేవతలను ఆహ్వానించుచున్నాము. ప్రవహించు స్వభావముగల అట్టి జలములతో హవిస్సులు సిద్ధము చేయవలసి ఉన్నది.
19. జలముల మధ్య అమృతము ఉన్నది. జలముల మధ్య ఔషధములు ఉన్నవి. ఋత్విజులారా! జలము ప్రాశస్త్యము చాటుడు.
20. జలములందు సమస్త ఔషధములు ఉన్నవి. జలములందు లోకములకు సుఖము కలిగించు అగ్ని ఉన్నదని సోముడు చెప్పినాడు. ఉదకములు విశ్వభేషజములు అగును. ఆపశ్చవిశ్వభేషజీః
21. జలములు మా శరీరములందలి రోగములను నివారించు ఔషధములు కావలెను. చిరకాలము మేము సూర్యుని దర్శించునట్లు చేయవలెను.
22. నేను పాపము చేసి ఉండవచ్చును. ఇతరులను తిట్టి ఉండవచ్చును. అసత్యము పలికి ఉండవచ్చును. జలములారా ! అట్టిపాపములను మీరు కడిగివేయుడు.
23. నేడు నేను స్నానము చేసినాము. జలములందలి రసములు నాలోనిండినవి. గ్నీ ! నీవు జలములతో కలిసిరమ్ము. నాకు తేజస్సును ఇమ్ము.
24. అగ్నీ ! నాకు వర్చస్సును యిమ్ము. స్మ్తానమును యిమ్ము. ఆయువును యిమ్ము. ఈ నా కోరికను సకల దేవతలు ఎరుగవలెను. ఋషులు సహితముగ ఇంద్రుడు ఎరుగవలెను.
(ప్రథమ మండలమున అయిదవ అనువాకము సమాప్తము.)
ఆలోచనామృతము :
1. ఈ సూత్రమునందలి సోమమునకు ప్రత్యేకత, విశిష్టత ఉన్నట్లున్నది. ఇది పశువును పట్టి తెచ్చినట్లు అంతరిక్షమునుండి తేవలసినది. గుహ్యప్రదేశమునుండి తేవలసినది. సంవత్సరమునందలి ఆరు ఋతువులందు లభించవలసినది.
2. జలములను గురించిన వివరములు అద్భుతము, ఆశ్చర్యకరములుగ ఉన్నది. జలములందు అమృతము, ఔషధము, అగ్ని ఉన్నదని చెప్పి ఆపశ్చవిశ్వభేషజీః అన్నాడు.
జలములను గొప్పగా వర్గీకరించినాడు.
ఈ మధ్య (WATER THERAPY) జలచికిత్సను కనుగొన్నట్లు ఎంతో ప్రచారము జరిగినది. అది ఋగ్వేదమునందే ఉన్నది. వైద్యశాస్త్రము ఋగ్వేద జలచికిత్సను గురించి అధ్యయనము చేయవలసి ఉన్నది. పరిశోధించవలసి ఉన్నది.