2. నేతితో కూడి పేలాలుగల వేదిక సిద్దముగా ఉన్నది. హర్యశ్వములు ఇంద్రుని సుఖతమ రథమున తీసుకొని రావలెను. ఇంద్రం సుఖతమే రథే
3. ఇంద్రుని ఉదయమున ఆహ్వానించుచున్నాము. మధ్యాహ్నము ఆహ్వానించుచున్నాము. సోమపానమునకు సాయంత్రము ఆహ్వానించుచున్నాము.
4. ఇంద్రా ! కేశములుగల నీ అశ్వములమీద మా యజ్ఞమునకు రమ్ము. అభిషవించిన సోమముల నిమిత్తము మాత్రమే నిన్ను ఆహ్వానించుచున్నాము. సుతే హిత్వాహ మావహే
5. ఇంద్రా ! నిన్ను మేము నుతించుచున్నాము. రారమ్ము. దేవ యాజనమందు సోమము అభిషవించి ఉన్నది. కర్మ జరుగుచున్నది. దప్పిగొన్న గోవువలె సోమమును త్రాగుము. గౌరోన తృషితః పిబ
(దప్పిగొన్న ఆవువలె. ఆవురావురుమని త్రాగమనుట ఎంతో సొగసుగా ఉన్నది.)
6. ఇంద్రా ! రసవంతములగు సోమములు దర్భల మీద ఉన్నవి. అవి బలమును ఇచ్చును. వానిని సేవింపుము. తా ఇంద్ర సహసే పిబ
7. ఈ స్తవము శ్రేష్ఠము. నీ మనసునకు నచ్చునది. సుఖతమము. ఈ స్త్రోత్రము వినుము. సోమము సేవింపుము. అథా సోమం సుతం పిబ
8. ఇంద్రుడు శత్రుసంహారకుడు. అతడు అన్ని సవనముల సోమమును సేవించుచున్నాడు. అది ఇంద్రునకు బలమును ఇచ్చును.
9. శతక్రతువవయిన ఇంద్రా ! నిన్ను మేము మనస్పూర్తిగా స్తుతించుచున్నాము. మాకు గోవులను అశ్వములను ప్రసాదింపుము.
పదిహేడవ సూక్తము - ఋషి - కణ్వపుత్రుడు మేధాతిథి,
దేవతలు - ఇంద్రుడు, వరుణుడు; ఛందస్సు - గాయత్రి.
1. ఇంద్రావరుణులు రాజ్యములు గలవారు. నేను వారి రక్షణ కోరుచున్నాను. వారు ఇటువంటివి ప్రసాదింతురు. నాకు సుఖములను ఇత్తురు. తానో మృళాత ఈదృశే
2. ఇంద్రావరుణులారా ! మేము యాజకులము. యజమాని క్షేమము కోరి మిమ్ము ఆహ్వానించుచున్నాము. మీరు మానవుల యోగక్షేమములు వహించుడు.
3. ఇంద్రావరుణులారా ! మిమ్ము మావద్దకు ఆహ్వానించుచున్నాము. మా కోరికలను మన్నించుడు. ధనమును తృప్తిగా ప్రసాదించుడు.
4. కర్మసంబంధములయిన సోమములను అన్నింటిని మీకే అర్పించినాము. పండితులు స్తోత్రములను అన్నింటిని మీ కొరకే పాడినారు. మమ్ము కరుణించుడు. మమ్ము దాతలలో ప్రఖ్యాతులను చేయుడు.
(దాతలలో ప్రఖ్యాతులగుదురట ! ఎంత మంచి కోరిక !!)
5. వేలకొలది దాతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడు. స్తవనీయులలో వరుణుడు శ్రేష్ఠుడు.
6. ఇంద్రావరుణుల రక్షణలోనే మాకు సకలము లభించుచున్నది. మేము వాడుకొనగా మిగిలిన దానిని ఇంద్రావరుణులు మరింత వృద్ధిపరచవలెను.
7. ఇంద్రావరుణులారా ! నానావిధ సంపదలు కోరి మిమ్ము ఆహ్వానించుచున్నాము. మీరు మాకు సర్వజయములు ప్రసాదించవలెను.
8. ఇంద్రావరుణులారా ! మా మనసులు సర్వదా మిమ్ము సేవింపవలెను. మాకు సర్వత్ర సుఖమును ప్రసాదించుడు.
9. ఇంద్రావరుణులను ఆహ్వానించుచున్నాము. స్తుతించుచున్నాము. అవి వారికి అందవలెను. వారికి ఆనందమున ముంచవలెను.
(ప్రథమ మండలమున నాలుగవ అనువాకము సమాప్తము.)
అయిదవ అనువాకము-పద్దెనిమిదవ సూక్తము-ఋషి-కణ్వపుత్రుడు మేధాతిథి
దేవతలు 1-5 బ్రహ్మణస్పతి, 6-9 సదసస్పతి, ఛందస్సు - గాయత్రి.
1. బ్రహ్మణస్పతిదేవతా ! నీ కొఱకు సోమము సిద్ధము చేసినాను. నన్ను ఉశిజ పుత్రుడు కక్షీవంతునివలె దేవతలలో ప్రసిద్ధుని చేయుము.
2. బ్రహ్మణస్పతి ధనవంతుడు. రోగములను హరించువాడు. ధనములను ఇచ్చువాడు. పుష్టిని పెంచువాడు. ఆలసింపక వచ్చువాడు. అట్టి బ్రహ్మణస్పతి మమ్ము రక్షించవలెను.
3. బ్రహ్మణస్పతీ ! మమ్ము హింసించుటకు వచ్చు జనుల పరుషవాక్కుల నుండి మమ్ము కాపాడుము.
4. బ్రహ్మణస్పతి, ఇంద్రుడు, సోముడు అనుగ్రహించినవాడు, వృద్ధిపొందించినవాడు మాత్రమే వీరుడు. అతడు నశించడు.
5. బ్రహ్మణస్పతి, ఇంద్రుడు, సోముడు, దక్షిణాదేవి మానవులను పాపములనుండి కాపాడవలెను.
6. సదసస్పతి అద్భుతుడు. ఇంద్రునకు ప్రియుడు. సుందరుడు. అతనిని మేధనుకోరి అర్థించుచున్నాము. మేధామయాసిషమ్
7. సదసస్పతి వినా యజమానికి యజ్ఞఫలము సిద్ధింపదు. అట్టి సదసస్పతి మాకు బుద్ధిని ప్రేరేపించవలెను.
8. అనంతరము హవిస్సులు ఆర్జించిన యజమానికి అభ్యుదయము కలుగును. సదసస్పతి యజ్ఞమును నిర్విఘ్నముగా పూర్తి చేయించును. స్తోత్రములు దేవతలను చేరును. హోత్రా దేవేషు గచ్ఛతి
9. సదసస్పతి మిక్కిలి బలవంతుడు. అతి ప్రసిద్ధుడు. దేవలోకమువంటి తేజస్సుగలవాడు. స్తవనీయుడు. అట్టి సదసస్పతిని నేను దర్శించినాను.
ఆలోచనామృతము :
1. బ్రహ్మణస్పతి వేదములను ప్రసాదించినవాడు. జ్ఞానజ్యోతులకు ప్రభువు. స్తవముల స్వామి. ఇది వేదమును ప్రార్థించుట అవి నా అభిప్రాయము. ఇప్పటికి వేదమును కూడ ఒకశక్తిగా, దేవతగా గుర్తించుట జరిగినది.
2. సదసస్పతి: సదస్యులకు దేవతస్థానము ఇచ్చినాడు. సదస్యుల సహకారములేనిది యజ్ఞము కొనసాగదు.
3. ఉశిజ పుత్రుడు కక్షీవంతునకు బ్రహ్మణస్పతి దేవతలతో సమానమయిన స్థానము కల్పించినాడు. కక్షన అనిన అవ్రేళ్లు. వేళ్లతో పనిచేయువాడు, చేతివృత్తులవాడు, కక్షీవంతుడగును. ఇది చేతి వృత్తుల ప్రాముఖ్యత గుర్తించుట కావచ్చును.
4. దేవతలలో మరికొందరిని చేర్చు ఆచారము ఉన్నట్లున్నది. రామాయణమునను, పురాణములందును విశ్వామిత్ర మహర్షి త్రిశంకుని దేవతలలో చేర్చు ప్రయత్నము చేసినాడు. విఫలుడు అయినాడు. అప్పటికి దేవతలలో చేర్చు ఆచారము అంతరించినట్లున్నది.
5. బ్రహ్మణ, సదస్య, రోగము, హింసించువాడు, పరుషవాక్కు, పాపము ను పదములు తొలిసారి వినిపించినవి.
పందొమ్మిదవ సూక్తము - ఋషి - కణ్వపుత్రుడు మేధాతిథి,
దేవతలు - అగ్ని - మరుత్తులు, ఛందస్సు - గాయత్రి.
1. యజ్ఞము ప్రీతికరము. ప్రసిద్ధము అయినది. అగ్నీ ! యజ్ఞమునందు సోమపానము చేయుటకు నిన్ను ఆహ్వానించుచున్నాము. మరుత్తులతో కూడి రమ్ము. మరుద్భిరగ్న ఆగహి
2. నీ క్రతువును మించిన మానవుడుగాని, దేవతగాని లేదు. అగ్నీ ! నీవు మరుత్తులతో కూడి రమ్ము.
3. మరుత్తులు ప్రకాశవంతులు. ద్రోహము చేయనివారు. వర్షము కురిపించగలవారు. అగ్నీ ! నీవు అట్టి మరుత్తులతో కూడి రమ్ము.
4. మరుత్తులు తీవ్రతరులు. ఉదకమును ఆర్జించువారు. బలవంతులు. ఇతరులకు లొంగరు. అగ్నీ ! నీవు అట్టి మరుత్తులతో కూడి రమ్ము.
5. మరుత్తులు శోభాయమానులు. ఉగ్రులు. ధనవంతులు. శత్రుంజయులు. అగ్నీ ! నీవు అట్టి మరుత్తులతో కూడి రమ్ము.
6. మరుత్తులు స్వర్గలోకపు ప్రకాశము గలవారు. ద్యులోకమందు ఉన్నారు. అగ్నీ ! నీవు అట్టి మరుత్తులతో కూడి రమ్ము.
7. మరుత్తులు కొండలను కదిలింతురు. ఉదక సముద్రమును తిరస్కరింతురు. అగ్నీ ! అట్టి మరుత్తులతో కూడి రమ్ము.
8. మరుత్తులు సూర్యకిరణ సహితులయి ఆకసమున వ్యాపింతురు. తమ బలదర్పమున సముద్రమును తిరస్కరింతురు. అగ్నీ ! నీవు అట్టి మరుత్తులతో కూడి రమ్ము.
9. మధురమగు సోమరసమును నీ కొఱకు సిద్ధపరచినాము. అగ్నీ ! అట్టి మరుత్తులతో కూడి రమ్ము.
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత మొదటి అష్టకము ప్ర. మండలమున మొ.అధ్యాయము సమాప్తము.)
ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవావాం ప్రథమా ధ్రువాణి |
నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||
రెండవ అధ్యాయము - ఇరువదవ సూక్తము
ఋషి-కణ్వపుత్రుడు మేధాతిథి, దేవత-ఋభువులు, ఛందస్సు-గాయత్రి.
1. ఋభువుల కొఱకు విప్రుల ఈ స్తవమును రచించినారు. ఇది అపార ధనము కలిగించును. అకారి రత్నధాతమః
2. ఇంద్రుని రథము హర్యశ్వములు, తలచినంతనే రథమునకు పూనుకొనుము. అట్టి గుఱ్ఱములను సిద్ధము చేసినవారు ఋభువులు. వారు యజ్ఞకార్యములందు వ్యాపించి ఉందురు.
3. అశ్వినుల రథము సర్వగమనము కలది. సుఖాసనము కలది. ఆ రథమును ఋభువులు సిద్ధము చేసినారు. పాలిచ్చి ఆవును సహితము వారే సిద్ధము చేసినారు.
4. ఋభువులు సత్య మంత్ర సామర్థ్యము గలవారు. నిష్కపటులు. సర్వకార్యసిద్ధులు, వారు తలిదండ్రులను మరల యవ్వనులను చేసినారు.
5. ఋభువులకు హర్షము కలిగించు సోమము మరుత్తులకు, ఇంద్రునకు, ఆదిత్యునకు కూడ చెందును.
త్వష్ట దేవతలకు దారుశిల్పి. అతడు సిద్ధము చేసినది చమసము అనుపాత్ర ఋభువులు ఆ ఒక్క చమసమును నాలుగుగా చేసినారు.
6. ఋభువులారా ! మా స్తవములను పరిగ్రహింపుడు. ఒక్కొక్క మంత్రమునకు ఇరువది ఒక్కరెట్లుగా మాకు ప్రసాదించుము.
7. ఋభువులు తాము చేసిన సుకృతముల వలన దేవతలు అయినారు. యజ్ఞమున దేవతలతో సమానముగా భాగము పొందినారు.
ఆలోచనామృతము :
1. సుధన్వుడు అంగిరసుని సంతతివాడు. అతని పుత్రులు ఋభు-విభు-వాజ. ఈ ముగ్గురిని వేదమున ఋభువులు అనడమైనది.
ఋభువులు మానవులు. వారు భూమార్గ- జలమార్గ-వాయుమార్గములు నిర్మించు వస్తు శిల్పులు. వారు దేవశిల్పి త్వష్టను మించిన ఘనకార్యములు చేసినారు. తమ ప్రజ్ఞాపాటవములతో దేవత్వము సాధించినారు.
పూర్వపు సూక్తమున కక్షీవంతుడు అటులనే దేవతలందు చేరినాడు.
మానవుడు ఆత్మవిశ్వాసమున దేవతకావచ్చునని వేదము వచించుచున్నది.
ఇరువది యొకటవ సూక్తము -ఋషి -కణ్వపుత్రుడు మేధాతిథి
దేవతలు - ఇంద్రాగ్నులు, ఛందస్సు - గాయత్రి.
1. ఈ యజ్ఞమునకు ఇంద్రాగ్నులను ఆహ్వానించుచున్నాను. వారి కొరకే సోమము సిద్ధము చేసినాను. వారు సోమము పానము చేయవలెను.
2. ఋత్విజులారా ! యజ్ఞములందు ఇంద్రాగ్నులను స్తుతింపుడు. అలంకరించుడు. గాయత్రి ఛందస్సులో ఉన్న సామ మంత్రములు గానము చేయుడు. వారిని స్తుతించుడు.
3. మిత్రుడయిన యజమాని క్షేమము కోరి ఇంద్రాగ్నులను ఆహ్వానించుచున్నాము. సోమపానము చేయవలసినదని వారిని పిలుచుచున్నాము.
4. ఇంద్రాగ్నులు శత్రువును వధించుటకు సమర్థులు. వారి కొఱకు సోమము సిద్ధపరచినాము. ఆహ్వానించుచున్నాము. వారు ఇచటికి రావలెను. ఇంద్రాగ్నీ ఏ హిగచ్ఛతామ్