3. 15వ సూక్తమున ఋతువులు మూడుగా పేర్కొనబడినది. ఇక్కడ "షడ్యుక్తా" ఆరు ఋతువులను పేర్కొన్నాడు. ఈలోగా ఇప్పటికి తెలిసిన ఆరు ఋతువుల ఆవిష్కరణ జరిగినట్లున్నది.
ఆరవ అనువాకము - ఇరువది నాలుగవ సూక్తము
ఋషి- అజీగర్తపుత్రుడు శునశ్శేఫుడు, దేవతలు-1 ప్రజాపతి, 2 అగ్ని,
3-5 సవిత, 6-15 వరుణుడు, ఛందస్సు 1-2, 6-15 త్రిష్టుప్, 3-5 గాయత్రి.
1. యూపస్తంభమునకు కట్టబడినాడు శునశ్శేఫుడు. అన్నాడు: "ఏ దేవతల మధ్య ఉండవలెను? ఏ దేవుని శోభస్కారకముగా నామమును ఉచ్ఛరింతును? మరల నన్ను మహా పృథ్వికి ఇవ్వగలవాడు ఎవ్వడు? అట్లయిన నా తలిదండ్రులను చూడగలను".
2. దేవతలందు అగ్రుడు అగ్ని. అగ్ని యొక్క శోభస్కరమగు నామమును ఉచ్ఛరింతును. అతడు మరల నన్ను మహా పృథ్వికి ఇచ్చును. తలిదండ్రులను చూడగలను.
3. సవితృదేవుడు సర్వులకు రక్షకుడు అగును. సవితృదేవా ! నీవు కోరికలు అన్నింటికి ప్రభువును. నిన్ను ధనము ప్రసాదించవలసినదని వేడుకొనుచున్నాను.
4. మేము కోరదగినది నీవద్ద ఉన్నది. పూజ్యము. అనింద్యము. అద్వేష్యము అయిన ధనమును కోరుచున్నాము.
(అటువంటి ధనమే శాంతిని, సుఖమును కలిగించును. అట్లు కానిది అశాంతి కారకము అగును).
5. సవితా ! మేము నీవారము. నీవు మాకు ధనమును ప్రసాదించింనావు. రక్షణ కల్పించినావు. ట్టి ధనమును వృద్ధి చేయుటకు ప్రయత్నించుచున్నాము.
6. వరుణా ! నీవు సభామున పరాక్రమవంతుడవు. రెక్కలు ఉన్న పక్షులు సహితము నిన్ను చేరలేవు. నిన్ను సహించజాలవు. నిరంతరము ప్రవహించు జలములు సహితము నిన్ను అతిక్రమింపజాలవు.
7. వరుణరాజు బలములకు ప్రభువు. అతడు ఆధారములేని అంతరిక్షమున ఉన్నాడు. అక్కడి తేజోరాశివి ధరించి ఉన్నాడు. అతని కిరణము పైనుంచి క్రిందకు ప్రసరించుచున్నవి. ఆ కిరణములకు మూలము అంతరిక్షమున ఉన్నది. అందువలననే ప్రాణములు నిలిచి ఉన్నవి.
8. రవి ఉదయించవలె. అస్తమించవలె. వరుణరాజు అందుకు అనుగుణముగా ఆకసమున సూర్యునికొఱకు విశాల మార్గమును ఏర్పరచినాడు. ఆధారములేని సభమున కదలుటకు అవకాశము కల్పించినాడు. అట్టి వరుణుడు మా శత్రువును దూరము చేయవలెను.
9. వరుణరాజా ! నీవద్ద నూర్లవేల ఔషధములు ఉన్నవి. నీకు గల బుద్ధి అతిగంభీరము అయినది. మాచే పాపములు చేయించు దేవతలను దూరముగా తీసుకొని వెళ్ళుము. అచట పరిమార్చుము. మేము చేయు పాపములను తొలగించుము.
10. నక్షత్రములు రాత్రిపూట ఆకసమున వెలుగుచున్నవి. చంద్రుడు రాత్రులందు ప్రకాశించుచున్నాడు. వీరు పగలు కనిపించరు. ఇదంతయు వరుణరాజు మహిమ !
11. వరుణా ! నిన్ను స్తుతించుచున్నాను. ఆయువు కోరుచున్నాను. హవిస్సులు అర్పించువారు సహితము ఆయువునే కోరుచున్నారు. నేను హవిస్సులు అర్పించలేదని నన్ను అనాదరణ చేయుకుము. మా ఆయువును తగ్గించకుము.
12. రాత్రియందు వరుణస్తవము గానము చేతురు. దినమందు సహితము వరుణస్తవమే పాడుదురు. ఈ స్తవము నా మనసున నిలిచి ఉన్నది. ఈ స్తవముననే శునశ్శేఫుడు వరుణుని ప్రార్థించినాడు. ఆస్తవమునకు ప్రసన్నుడయి వరుణుడు మమ్ము విముక్తులను చేయవలెను.
13. శునశ్శేఫుడు మూడు బండ కొయ్యలతో కట్టబడినాడు. అతడు అదితి పుత్రుడు అగు వరుణుని స్తుతించినాడు. వరుణ రాజు శునశ్శేఫుని విడిపించవలెను. తెలివిగలవాడును, ఇతరులకు లొంగనివాడును అయిన వరుణుడు శునశ్శేఫుని కట్టుత్రాళ్ళు విడిపించవలెను.
14. వరుణరాజు ఆగ్రహమును నమస్సులు, యజ్ఞములు హవిస్సులచే ఉపశమింపచేయుచున్నాము. వరుణుడు ఆపదలు హరించువాడు. ప్రజ్ఞగలవాడు. అట్టి వరుణుడు మావద్ద వసింపవలెను. మా పాపములను పోగొట్టవలెను.
15. వరుణరాజా ! కట్టిన పాశమును, పాదముల పాశమును, నాభివద్దగల పాశమును తొలగించుము. అప్పుడు మేము దండ విముక్తులము అగుదుము. నిన్ను స్తుతింతుము.
ఆలోచనామృతము :
1. రామాయణమున, బాలకాండలో శునశ్శేఫుని వృత్తాంతము ఉన్నది. అంబరీషుడు అయోధ్యరాజు. అతడు తన యజ్ఞమునకుగాను ఒక నరుని కొనదలచినాడు. బుచీకుడు తన మధ్యమపుత్రుని, శునశ్శేఫుని అంబరీషునకు అమ్మినాడు. మార్గమధ్యమున పుష్కరమున విశ్వామిత్రుడు శునశ్శేఫునకు మంత్రములు ఉపదేశించినాడు. శునశ్శేఫుడు యజ్ఞమునందు ఆ మంత్రములు పఠించినాడు. విముక్తుడు అయినాడు.
ఆయితరేయ బ్రాహ్మణమున మరొక కథ ఉన్నది. హరిశ్చంద్రుడు అను రాజునకు సంతానము లేదు. అతడు వరుణుని గూర్చి తపస్సు చేసినాడు. వరము పొందినాడు. తన తొలి సంతానమును వరుణునకు బలి ఇత్తును అన్నాడు. హరిశ్చంద్రునకు రోహితుడు అను పుత్రుడు కలిగినాడు. కాని హరిశ్చంద్రుడు బలి ఇవ్వలేదు. రోహితుడు పెద్దవాడు అయినాడు. విషయము తెలుసుకున్నాడు. అడవులకు పోయినాడు. అక్కడ రోహితునకు అజీగర్తముని కనిపించినాడు. అతడు వందగోవుల వెలకు తనపుత్రుడు శునశ్శేఫుని బలి ఇచ్చుటకు రంగము సిద్ధము అయినది. అప్పుడు విశ్వామిత్రుని ప్రేరణతో ఒక ఋత్విజుడు దేవతలను ప్రార్థించినాడు. శునశ్శేఫుని విముక్తిని చేయించినాడు.
కథ ఎక్కడిది అయినను మానవజాతి ప్రగతి చరిత్రలో ఇది అత్యంత ప్రధాన ఘట్టము.
(i) నరమేధము నరులను బలి ఇచ్చుటకు నిలిచినది ఇట్టి వృత్తాంతము. అబ్రహామునకు సంబందించినది బైబిలునందును, ఖురానునందును కలదు. అక్కడ భగవానుడు నరునకు బదులు గొర్రెలు బలి ఇప్పించినాడు. (ii) యజ్ఞముచేసి హవిస్సులు ఇచ్చిననే దేవతలు ప్రసన్నులు అగుదురు అను నమ్మకమునకు తెరపడినది. 11వ మంత్రమున స్తుతులు, హవిస్సులు సమానములు అని ప్రతిపాదించినాడు.
పై రెండును మహత్తమములు అయిన మలుపులు.
2. 7వ మంత్రమును పరిశీలించిన ఒక గొప్ప ప్రకృతి రహస్యము గోచరము అగును.
నీచీవాస్థు రుపరి బుధ్న ఏషా మస్మే అంతర్నిహితాః కేతవః స్యుః
కిరణములు కిందికి ప్రసరించుచున్నను మూలముపైన ఉన్నది. అందువలననే మన ప్రాణములు నిలిచి ఉన్నవి.
అంతరిక్ష మూలములయిన కిరణము భూమికి చేరువరకు మధ్యన పరిశుద్ధములు అగుచున్నవి. అట్లుకాకున్న పృథ్వి మీద ప్రాణి జాలము బ్రతుకజాలదు.
ఆ మధ్యన ఉన్నదానిని ఆధునికులు 'ఓజోన్' అనుచున్నారు. రాక్షస పారిశ్రామీకారణము- వలన 'ఓజోన్' అంతరించుచున్నది. ప్రకృతిని ధ్వంసము చేయుచున్న ఆధునిక నరుడు తననాశనమును తానేవరించుచున్నాడు.
'ఓజోన్' విషయము ఋగ్వేదమున విదితము అయినది. ఈ విషయము శాస్త్రజ్ఞులు పరిశోధించవలెను.
ఇరువది అయిదవ సూక్తము - ఋషి - శునశ్శేఫుడు, దేవత - వరుణుడు,
ఛందస్సు - గాయత్రి.
1. వరుణా ! నీ వ్రతమున సామాన్యులు పొరపడుదురు. అటులే మేము సహితము పొరపడుదుము.
2. వరుణా ! నిన్ను అవమానించిన వానిని నీవు వధింతువు. మమ్ము అటుల చేయకుము. నీ కోపములనుండి మమ్ము కాపాడుము.
3. అలసిన అశ్వములను రథికుడు సేద తీర్చును. వరుణా ! అట్లే నిన్ను ప్రసన్నుని చేయుటకును. మాకు సుఖములు కలుగుటకును నిన్ను స్తుతించుచున్నాము. గీర్భిర్వరుణ సీమహి
4. నాబుద్ధి క్రోధరహితమై ఉన్నది. అది పునరావృత్తి లేనిదై పక్షులు గూళ్లకువలె చేరుకున్నది.
5. వరుణుడు బహుజనులను చూచువాడు. అధిక బలవంతుడు. అట్టి వరుణుని మాసుఖముకోరి ఎప్పుడు యజింతుమో కదా !
6. యజమాని సమర్పించు హవిస్సులను మిత్రావరుణులు సమానముగా సేవింతురు. సమానమాశాతే
7. ఆకసమున ఎగురు పక్షుల పాదములను ఎరుగువాడును, సముద్రమందు నావల గమనము ఎరిగినవాడును మమ్ము బంధవిముక్తులను చేయవలెను.
8. వ్రతమునందున్న వరుణుడు ప్రజావంతమయిన పన్నెండు మాసములను ఉపజాతమయిన అధికమాసమును ఎరిగినాడు.
(ఇది అధికమాసమును ఆవిష్కరించుట కావచ్చును)
9. వరుణుడు విశాలదృష్టి గలవాడు. అధిక గుణవంతుడు. అతడు వాయుమార్గమును దానిపై ఉన్న దేవమార్గమును తెలియును. అట్టి వరుణుడు మమ్ము బంధ విముక్తులను చేయవలెను.
10. వ్రతము ధరించిన వరుణుడు ప్రజల సామ్రాజ్యమును సుకృతము చేయును. ప్రజలయందు నివసించును.
11. వరుణుడు ప్రజ్ఞావంతుడు. విశ్వమందు పూర్వము జరిగినవానిని, జరుగనున్నవానిని తెలియగలడు.
12. వరుణుడు అదితి పుత్రుడు. శోభన ప్రజ్ఞ కలవాడు. మమ్ములను సర్వదా సన్మార్గమున నడుపవలెను. మా ఆయువును పెంచవలెను.
13. వరుణుని శరీరము పుష్టిగలది. అతడు బంగారు కవచము ధరించినాడు. కాంతులు విరజిమ్ముచున్నాడు.
14. హింసించ తలపెట్టిన శత్రువులు సహితము వరుణుని హింసింపజాలరు. ద్రోహముచేయ తలపెట్టినవారు ద్రోహము చేయలేరు. అతనిని పాపములు అంటలేవు.
15. వరుణుడు మానవులకు అన్నము కల్పించినాడు. వారికి కడుపునిండుగా అన్నము పెట్టినాడు.
16. వరుణుడు బహు దర్శనీయుడు. నా మనసు అతనికొఱకు గోవులు మందలకు చేరునట్లు వెనుదిరుగక సాగుచున్నది.
17. నాకు ప్రాణరక్షణ కలిగినది. నీకొఱకు మధుర హవిస్సులను సంపాదించినాను. ఆరగింపుము. ఆ తరువాత ప్రాణము లభించిన నేను, హవిస్సు లభించిన నీవు మాట్లాడుకుందుము.
18. దర్శనీయుడగు వరుణుడు ఆవిర్భవించినాడు! నేను అతనిని దర్శించినాను! భూమి మీద వరుణుని దర్శించు భాగ్యము కలిగినది! వరుణుడు నేను చేయు స్తుతులను ఆలకించినాడు!
19. మా శిరమున, నడుమున పాదములందు ఉన్న పాశములను విడిపించుము. జీవితము ప్రసాదించుము.
ఇరువది ఆరవ సూక్తము, ఋషి-శునశ్శేఫుడు, దేవత-అగ్ని, ఛందస్సు-గాయత్రి.
1. అగ్నీ ! నీవు యజ్ఞములకు, అన్నములకు ప్రభుడవు. తేజస్సులను ధరించిన వాడవు. మా యజ్ఞమును రక్షింపుము.
2. అగ్నీ ! నీవు తరుణుడవు. వరేణ్యుడవు. నీతేజస్సు చేతనే హోమమును వెలిగింపచేతువు. దివ్యమగు ఈ యజ్ఞమునకు రమ్ము. అసీనుడవుకమ్ము.