Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 11


    కాలక్షేపం అవుతోంది సరే! పూటగడిచేదెలా!
    అందుకే సుబ్బమ్మగారు ఆ సలహా యిచ్చారు. ఏవేవో ఉద్యోగాలు చేసి సుఖపెడతాడని ఆశించింది ఆవిడ! డిగ్రీ చేతిలోకి రాగానే ఎదిగివచ్చిన అబ్బాయిలకి పిలిచి పిల్లనిచ్చినట్టుగా, హారతెత్తి ఉద్యోగాలిస్తారని ఆశించింది ఆవిడ! కానీ ఆవిడ ఆశలన్నీ నిరాశలవుతాయని ఏనాడూ అనుకోలేదు. అయితే నిజప్రపంచంలో వాస్తవం చాలా కఠినంగా వుంది.
    అందుకే ఆమె ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం వెదుక్కోమంది.
    ఆ సలహావిని నిట్టూర్చాడు రవి. ఉద్యోగంలో చిన్నది, పెద్దది అంటూ వుందా? అదిచ్చే జీతంలో వుంటుంది కానీ అనుకున్నాడు.
    "సరే! ప్రయత్నిద్దాం" అనుకున్నాడు ఓ నిర్ణయంగా.
    ఆ సాయంకాలం టౌన్ లోకి వెళ్ళినపుడు అనుకోకుండా ఓ ఫ్రెండ్ కనిపించాడు. అతడు రవికి యింటర్లో క్లాస్ మేట్. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ ఫర్ కావటంతో వెళ్ళిపోయాడు. ఈ నాలుగేళ్ళలో అతను చాలా మారిపోయాడు. ఎత్తు ఎదిగాడు. మనిషి కండపట్టాడు! దర్జా వెలగబెడుతున్నాడు.
    ఇంతకీ అతను డిగ్రీలో తప్పగానే చేస్తున్నది వ్యాపారం. తండ్రి ప్రోత్సాహంతో, తన ఉత్సాహంతో, బ్యాంక్ లోన్ తీసుకుని ఓ చిన్న పుస్తకాలకొట్టు పెట్టుకున్నాడు. అదిప్పుడు మూడు పుస్తకాలు-ఆర్రూపాయల ఆదాయం అన్నట్లుగా వుంది. దానికి జతగా అతను లెండింగ్ లైబ్రరీ కూడా ప్రారంభించాడట!
    "అంటే ఏం లేదు--మామూలు భాషలో బడ్డీకొట్టులో అద్దెకి పుస్తకాలు!" అని వివరించాడు. అందులో రకరకాల సాహిత్యం వుంది.
    కాఫీ తాగించి ఆఖర్న అతన్నిచ్చిన  సలహా-ముందు ఓ పుస్తకాల కొట్టులో గుమాస్తాగా చేరిపొమ్మని - ఈ సీజన్ అంతా పనిచేస్తే-ఆ అనుభవంతో నెక్స్ ట్ యియర్ స్వంతంగా ప్రారంభించవచ్చనీ చెప్పాడు.
    అది తన ప్రవృత్తికి సరిపోవచ్చని అనుకున్నాడు రవి.
    అటునుంచే ఓ పుస్తకాలషాపుకి వెళ్ళాడు.
    రవిని చూడగానే నమస్కరించాడు ఆ షాపు యజమాని ప్రభాకర్. రవి వయస్సులో చిన్నవాడయినా అతన్నందరూ గౌరవిస్తారు.
    నీరు కారిపోయాడు రవి. ఉద్యోగం కోసంవస్తే నమస్కరిస్తున్నాడు ఎలాగా అనుకున్నాడు.
    "ఏమిటి సర్ కబుర్లు?"
    నాన్చేడ రవి. "ఏం లేదండి! ఎలా వుంది సేల్స్"
    "ఏం చెప్పమంటారు సర్. నోట్ పుస్తకాల ధరలు పెరిగిపోయాయి. పేపరు ధర ఆకాశాన్నంటింది. నిరుటికంటే ముప్ఫై శాతం పెరిగిపోయాయి. స్టూడెంటు కుర్రాళ్ళేమో పాతరేటుకి యిమ్మని గొడవచేశారు. ఎలా చావాలి?"
    రవి సమాధానం యివ్వలేదు.
    "టెక్స్ ట్ బుక్స్ తగినన్ని సప్లయి చేయరు. డబ్బు ముందుగానే కట్టేశాం. ప్రెస్సుచుట్టూ తిరగలేక చస్తున్నాం. వడ్డీ గిట్టటంలేదు. ఏం లాభం లేదుసార్. ఈ పుస్తకాల వ్యాపారంకంటే వేరుశెనక్కాయలమ్ముకున్నా మేలే! గిట్టుబాటవుతుంది" అన్నాడు.
    నివ్వెరపోయాడు రవి. "ఇదేమిటి? సత్యం చెప్పిన సత్యానికి, ఈయన చెబుతోన్నదానికీ ఎక్కడా పోలికలేదే" అనుకున్నాడు.
    "చెప్పండి సర్!"
    "ఎక్కడయినా గుమాస్తాగా చేరిపోవాలనుందండీ" అన్నాడు రవి.
    ఆయన యిబ్బందిగా ముఖం పెట్టేడు. అంతలో టీ వచ్చింది, "తీసుకోండి సర్" అని యిచ్చి, "మీలాటి తెలివితేటలు కలవాళ్ళు గవర్నమెంటులో చేరాలి సర్! ఇలాంటి ఉద్యోగాలు మీకేం చాలుతాయి. చూడండి! ఆ కుర్రోడికి మేం అరవై యిస్తాం. అది వాడికి ఏం చాలుతుంది. అలా అని ఎక్కువ ఇవ్వాలంటే మాతో అవుతుందా?" అన్నాడు.
    టీ తాగలేకపోయాడు రవి. అది అతను చెప్పిన నిజం కంటే కూడా చేదుగా వుంది. 'అరవైరూపాయలా! భగవాన్' అనుకున్నాడు. అంతలో అరవై అంటే రోజుకి రెండు రూపాయలు. ఒకరిపొట్టకి చాలు. ఇద్దరికి అయితే ఫరవాలేదు.
    "మీరు ప్రయత్నిస్తానంటే ప్రక్కకొట్లో చూడండి. ఆ మెడికల్ షాపువారికి లెక్కలు రాసేవాళ్ళు కావాలిట. మీరు బి.ఏ. కదా చదివారు! వాళ్ళకి బి.ఎస్సి కావాలేమో అయినా కనుక్కోండి" ఇక వెళ్ళిరా అన్నట్టుగా అతను లేచి అదో బేరంవస్తే వెళ్ళాడు.
    అటుచూశాడు రవి.
    ఆ వచ్చినతను పల్లెటూరి ఆసామి. సెవెన్త్ క్లాస్ పుస్తకాలు కావాలిట. అసలు రేటుకిపైన పుస్తకానికి ఒక్కో రూపాయి ఎక్కువ యిస్తానంటున్నాడు. అయినా ఆసామికి లేవన్నాడు కొట్టు అతను. అతను ప్రాధేయపడుతున్నాడు.
    "వస్తానండీ" అంటూ వెళ్ళాడు రవి.
    మెడికల్ షాపులో రద్దీలేదు. ఓ కుర్రాడున్నాడు మందులు తీసి యివ్వటానికి. కేష్ ముందు ఓ పాతికేళ్ళ యువకుడు కూర్చుని వున్నాడు. పైన సీలింగ్ ఫాన్ నెమ్మదిగా తిరుగుతోంది. ఆ యువకుడి చేతిలో ఏదో పుస్తకం వుంది. అందులో ఏ సన్నివేశం చదువుతున్నాడో ఫేన్ గాలి వస్తున్నా ముఖాన చెమటలు పడుతున్నాయి.
    రవిని అకస్మాత్తుగా చూసి కంగారుగా పుస్తకం దాచేసి "ఏమిటి? ఏమిటి? కావాలి?" అని అడిగేడు.
    స్టూల్ పై కూర్చున్నాడు రవి.
    "మీకు ఎకౌంట్సు రాసేవాళ్ళు కావాలిట కదా" సూటిగా అడిగాడు.
    "నువ్వు లెక్కలు రాస్తావా?" కస్టమర్ కాదు-ఉద్యోగార్ధి - అందునా లెక్కలు రాసే గుమాస్తా అనేసరికి ఆ యజమాని ముందు రవి స్థాయి బొత్తిగా నేలబారుకి వచ్చేసింది.
    తలూపేడు రవి సగం చచ్చిన మనసుతో.
    "ఏం చదివేవు."
    "బి.ఏ..." నెమ్మదిగా అన్నాడు.
    "ప్చ్! మాకు బి.ఎస్సీయో- బి.కామో కావాలి"
    "హుఁ! ఈ ఉద్యోగానికి డిగ్రీకూడా కావాలా!" అనుకున్నాడు రవి.
    "మీకు యింతకుపూర్వం అనుభవం వుందా?"
    "లేదు---"
    "మరయితే లాభంలేదు - మాకు ఎకవుంట్స్ రాసేందుకు అనుభవంవున్న వ్యక్తి కావాలి. ఆఖరికి అతను ఎసెసెల్సీ తప్పినవాడయినా ఫరవాలేదు" డిగ్రీ స్థాయినుంచి దిగివచ్చాడు.
    "నేను బాగా రాస్తాను. ముందు కొంచెం చెబితే జాగర్తగా రాస్తాను." సగంచచ్చి మిగిలిన మనస్సు పూర్తిగా చచ్చిపోగా అన్నాడు.
    "లాభంలేదు- మేం మిమ్మల్ని ఎక్కడ భరిస్తాం. ఎలా నేర్పిస్తాం వెళ్ళిరండి."
    నిరాశగా లేచాడు రవి.
    మెట్లు దిగుతోంటే, "ఇదిగో... ఈ వీధి చివర మా బాబాయిగారి బట్టలకొట్టుంది. వాళ్ళకి ఓ మనిషి కావాలని అంటుంటే విన్నాను. ట్రై చెయ్!"
    ఉస్సురుమన్నాడు రవి.
    నాలుగడుగులు వేసేసరికి పుస్తకాలషాపులో చూసిన పల్లెటూరి ఆసామి పుస్తకాలు కట్టకట్టుకుని ఎదురయ్యాడు. రవిని చూడగానే "చూశావా బాబూ! అడిగితే లేవన్నాడు. పైన ఆర్రూపాయలిస్తే ఏడో తరగతి బుక్కులన్నీ యిచ్చాడు కలికాలం! అంతా డబ్బులో వుంది" అన్నాడు ఫిర్యాదులాగా.
    పేలవమయిన నవ్వునవ్వి బట్టలకొట్టువేపు దారితీశాడు రవి. అతనికి ఈ రోజు ఎలాగయినా ఎంత చిన్నదైనా ఉద్యోగం సంపాదించుకుని యింటికి వెళ్ళాలనిపించింది.
    వెళ్ళి నమస్కారం చేశాడు. ప్రతినమస్కారం కూడా చేయలేదు అతను. దగ్గరగావెళ్ళి బల్లముందు నుంచుని తను వచ్చినపని చెప్పాడు రవి.

 Previous Page Next Page