Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 11

    "వద్దులే...మళ్ళీ నువ్వు ఫీలవ్వడం, లేదా వెళ్ళి బాస్ ను  అడగడం...  ఇదంతా బావోదు."
    "నేనేం అడగను.  జస్ట్ తెలుసుకోవాలని...నా గురించి అలా చెప్పిన వ్యక్తి దగ్గర పని చేయడమే వేస్ట్."
    కరక్ట్ గా చెప్పావు అవని.  నేను కూడా రెండు మూడు నెలల్లో ఇక్కడ మానేద్దామనుకుంటున్నాను.  అసలు ఇప్పడే నీ గురించి నెగెటివ్ గా మాట్లాడినప్పడే రిజిగ్నేషన్ లెటర్ మొహాన కొడదామనుకున్నాను.  ఇవ్వాళ నీ  గురించి మాట్లాడాడు.  రేపు నాగురించి మాట్లాడుతాడు.
    ఓ సిస్టర్ లా  చెబుతున్నాను.  ఓ   పన్జేయి... రిజిగ్నేషన్ లెటర్ రాసి,  హనుమంతుతో పంపించు.  అలాంటి వ్యక్తి మొహం చూడ్డం కూడా మంచిది కాదు.  అసలు ఈ కంపెనీలో పని చేసాకే నీకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.  ఏమో... ఇదంతా బాసే నిన్ను బెదిరించడానికి చేస్తున్నాడేమో.
    నువ్వసలే  అందంగా వుంటావు.  బాస్ ఉమనైజర్ అని తెలిసింది.  నువ్వు భయపడతావని చెప్పలేదు.  నీలాంటి ఎఫిషియంట్ కి ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది"  వసుధ చాలా ఎమోషనల్ గా   చెప్పింది.
    అవని ఆవేశంలో వుంది.
    దానికి తోడు వసుధ చెప్పిన విషయాలు,  ఈ మధ్య బాస్ ప్రవర్తన, తనకు ఫోన్ కాల్ రావడం,  ఇంట్లో అమ్మ రమేష్ తో తన పెళ్ళి జరిపించాలని అనుకోవడం...  అవని మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి.  దానికంతటికి పరిష్కారం ఒక్కటే.  ఉద్యోగానికి రిజైన్ చేసి అనిరుద్రతో  మాట్లాడి నాన్నతో తన విషయం చెప్పేయాలి.
    హాయిగా భర్త చాటు భార్యగా వుంటే  చాలు.  ఈ  టెన్షన్లు..  ఇవ్వన్నీ తను భరించలేదు.   తను వెంటనే రాజీనామా చేయాలి.
    అంతేకాదు...రిజైన్  చేసేముందు బాస్ ను   నాలుగు దులిపేయాలి.
    ఎలాగు  రిజైన్ చేస్తుంటే ఇంకా బాస్ ఏంటి?  అనుకుంది అవని.
    అలాంటి నిర్ణయం ఆమె మనసులోనికి రావడంతో కాస్త ప్రశాతంగా అనిపించింది.
    వెంటనే రిజిగ్నేషన్ లెటర్ టైప్  చేసింది.
    వసుధ ఇవ్వన్నీ ఓ కంట గమనిస్తూనే వుంది.  కావాలనే అవనిని రెచ్చగొట్టింది.
    అసలే సమస్యల్లో వున్న అవనికి,  తనిచ్చిన 'డోసు'  బాగా పనిచేస్తుంది.
    వెనకా ముందు ఆలోచించకుండా అవని రిజిగ్నేషన్ లెటర్ ఇస్తుంది. దాంతో బాస్ ఇగో దెబ్బ తింటుంది.
    ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
                                 *        *         *
    రిజిగ్నేషన్ లెటర్ ని  ఓ కవర్ లో పెట్టింది.  ముందు హనుమంతుతో పంపిద్దామనుకుంది.  కానీ తర్వాత తనే స్వయంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.
    తను రిజైన్ చేస్తున్నట్టు తెలిసి,  తన రిజిగ్నేషన్ లెటర్ చదువుతున్నప్పుడు బాస్ మొహంలోని ఫీలింగ్స్ తను చూడాలి.
    లేకపోతే తన గురించి వసుధతో బ్యాడ్ గా  చెబుతాడా? తనని అందంగా వున్నానని  అంటాడా? ఇంటికి ఇన్వయిట్ చేస్తాడా? ఉమనైజర్ వెధవ.
    ఇలా బాస్ గురించి రకరకాలుగా తిట్టుకొని,  రిజిగ్నేషన్ లెటర్ తో బాస్  ఛాంబర్ వైపు వెళ్ళింది.
    వసుధ కంగారు పడింది.
    హనుమంతుతో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి పంపిస్తుంది అనుకుంది.
    స్వయంగా అవని వెళ్తే అసలు విషయం బయటపడుతుందేమోనని  భయం పట్టుకుంది.
    "ఏయ్  అవనీ"  అంటూ వారించాబోయింది.  అప్పటికే అవనీ బాస్ ఛాంబార్  లోకి ఆవేశంగా దూసుపోయింది.
                        *            *            *
    విసురుగా లోపలికి వచ్చిన అవనిని చూసి,  ఆమె వాలకం చూసి "వాట్ హే పెండ్?"  అని అడిగాడు ఫెడ్రిక్.  తన  చేతిలో వున్న కవర్ ని  టేబుల్ మీద గిరాటేసింది.
    "వాటీజ్ దిస్? "  అడిగాడు కవరు తీసుకొని.
    "రిజిగ్నేషన్  లెటర్."
    "రిజిగ్నేషనా?"
    "అవును.  నా రాజీనామా"  అంది స్ధిరంగా అవని.
    అక్కడ   సూది కింది పడితే వినిపించేంత నిశ్శబ్దం.
    "రాజీనామా ఎందుకు?"
    "మీలాంటి  క్యారెక్టర్  లేని బాస్ దగ్గర పనిచేయడం ఇష్టం లేదు  కాబట్టి."
    "అవనీ.."  కోపంగా అరిచాడు ఫెడ్రిక్.
    "అరవకండి సార్..నేనిప్పుడు మీ సబార్డినేట్ ని  కాదు.  మీ  అరుపులకు భయపడ్డానికి. నన్ను ఏదో విధంగా లోబర్చుకోవాలని ట్రయ్  చేసారు.  కుదర్లేదు.  నా గురించి లేనివి కూడా కల్పించి ప్రచారం చేస్తున్నారు."
    "నీ  గురించి ప్రచారం చేసానా? నేనా"
    "అవును..మీరే."
    "మిస్ అవని...మీరు ఆవేశంలో వున్నారు."
    "కాదు గంట క్రితం వరకు మూర్ఖత్వంతో అమాయకత్వంతో వుండిపోయాను.  మీ నిజస్వరూపం ఏమిటో తెలిసిపోయింది."
    "ఏం తెలిసింది?"
    "నా నోటితోనే చెప్పించడం ఎందుకు?"
    వెంటనే ఫెడ్రిక్ కు  వసుధ మీద అనుమానం కలిగింది.
    "వసుధ నీకేమైనా చెప్పిందా?"
    "థేంక్  గాడ్...  ఇప్పుడు ఒప్పకుంటున్నారన్నమాట"   అంది వ్యంగ్యంగా అవని.
    "నేను  ఒప్పకోవడమేంటి?  నేను వసుధతో నీ గురించి నెగెటివ్ గా ఏమీ చెప్పలేదు."
    "అలాగా...మరి వసుధ అబద్ధం ఆడిందా?"
    "అవును."
    "ఏమిటో  ఆ అబద్ధం?"
    "ఇప్పుడు నీకేం చెప్పినా అర్ధం కాదు."
    "నాకు మీరు బాగా అర్ధమవుతున్నారు.  నన్ను చంపుతానని ఫోన్ లో బెదిరించింది కూడా మీరేనని అర్ధమైంది."
    "నిన్ను చంపుతానని బెదిరించానా?  నేనా?"
    "ఎంత చక్కగా నటిస్తున్నారు?"
    ఫెడ్రిక్ మనసులో ఏదో అనుమానం.
    వెంటనే తేరుకొని...
    "మిస్ అవని..  ఆవేశంలో వున్న వాళ్ళకు వాస్తవాన్ని ఎంత విడమర్చి చెప్పినా అర్ధంకాదు.  ప్రస్తుతానికి నీ రాజీనామా నేను యాక్సెప్ట్ చేయడం లేదు.నౌ యు కెన్ గో."  అన్నాడు.
    విసురుగా  అక్కడ్నుంచి  బయటకు  నడిచింది.
    అవని బయటకు  వెళ్ళగానే,  ఫెడ్రిక్ ఇన్ స్పెక్టర్ బెనర్జీకి ఫోన్ చేశాడు.
                    *              *              *
    ఛాంబర్ నుంచి బయటకు వస్తూనే తన టేబుల్ దగ్గరికి వెళ్ళింది  అవని.  డ్రాయర్ సొరుగులో నుంచి, తన టిఫిన్ బాక్స్ తీసి హ్యాండ్ బ్యాగ్ లో  వేసుకుంది.
    వసుధ యాంక్షస్ గా చూస్తోంది.  లోపల జరిగిందేమిటో అర్ధం కావడం లేదు.  వెంటనే లేచి,  అవని దగ్గరికి వచ్చింది.
    "ఏయ్.. అవనీ...వాట్ హ్యాపెండ్..."  అడిగింది వసుధ.
    "నేను రిజైన్ చేశాను"  చెప్పింది అవని.
    "రిజైన్ చేశావా?  అయ్యో  ఎంతపని చేశావు?  అంతా నావల్లే జరిగింది.  వద్దులే అవని.. తర్వాత రిజైన్ చేసినందుకు బాధపడాల్సిన అవసరం లేదు.  రాదు."
    "బాస్ ఏమన్నాడు? "  అడిగింది వసుధ.
    "ఏమంటాడు?  తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తనేం అనలేదంటాడు?"
    "నువ్వు నమ్మావా?"   అడిగింది వసుధ.
    "నేనెందుకు నమ్ముతాను.  అయినా నాకీ రాజకీయాలు వద్దు వసుధా.  శుభ్రంగా ఇంట్లో కూచుంటాను"  అంది వెళ్ళడానికి సిద్ధమవుతూ.
    సారినే అవనీ...ఇదంతా నావల్లే జరిగిందేమోననిపిస్తోంది"  బాధనటిస్తూ మళ్లీ అంది వసుధ.
    "ఛ.. ఛ..  నీ వల్లే నాకు నిజం తెలిసింది."
    "పోనీ మరోసారి ఆలోచించు."
    "ఆలోచించే ప్రసక్తే లేదు."  స్ధిరంగా అంది అవని.
            "సరే...నీ ఇష్టం... నేను కూడా ఎక్కువ కాలం ఇక్కడ పని చేయకపోవచ్చు.  అన్నట్టు నా అనుమానం నిజమైతే నీకు బెదిరింపు ఫోన్స్ రావు." అంది వసుధ.
    "అంటే..."
    "అదే.. నా ఉద్దేశ్యం..  బాసే ఇదంతా చేయిస్తున్నాడేమోనని."
    "కావచ్చు"   అంది అవని.
    అవని రిజైన్  చేసిందన్న విషయం ఆఫీసంతా పాకిపోయింది.  అలా పాకిపోయేలా చేసింది వసుధే.
    శేషశాయికి గర్వంగా వుంది. తనని కాదన్న అవని ఈ కంపెనీనే వదిలి వెళ్తోంది.
    రేపు వచ్చే మరో అమ్మాయిని తను ట్రాప్ లోకి  లాగొచ్చు అనుకున్నాడు.
      అవని ఇంటికొచ్చేసరికి ఇల్లంతా హడావుడిగా వుంది.
    "అక్కా...  ఈ గన్ చూడు ఎంత బావుందో...అచ్చు నిజం గన్ లాగే వుంది.  ట్రిగర్ నొక్కితే బుల్లెట్ కూడా వస్తుంది.   కాకపోతే,  ఆ బుల్లెట్ నీ తినొచ్చు." ఉత్సాహంగా అక్కతో చెప్పకుపోతున్నాడు డుంబు.
    "ఈ  హడావుడి అంతా ఏమిట్రా?"  అర్ధంకాక అడిగింది తమ్ముడ్ని అవని.
    "అవని..  వచ్చావా?  రారా..ఇదిగో ఈ చీర చూడు ఎంత బావుందో? నీకు చాలా బావుంటుంది. నీకోసం మామయ్య తెచ్చాడు" సంబరంగా చెబుతోంది తల్లి.
    విజయవాడ నుంచి రమేష్  మామయ్య వచ్చాడన్న మాట   అనుకుంది అవని.
    ఈలోగా రమేష్ హాలులోకి వచ్చేసాడు.
    "అవని... బాగున్నావా?"  అవని వంకే చూస్తూ అడిగాడు రమేష్.
    సిగరెట్లు విపరీతంగా కాల్చడం వల్ల అతని పెదవులు నల్లగా వున్నాయి. పైగా  శరీరం రంగు నలుపు.  బిజినెస్ చేస్తూ,   ఒకే దగ్గర  పెద్దగా పని చేయకపోవడం వల్ల మనిషి లావయ్యాడు.  పొట్ట వచ్చి చేరింది ఎక్ స్ట్రాగా!
    మహాలక్ష్మికి   తమ్ముడ్ని అవనికిచ్చి పెళ్ళి చేయాలన్న కోరిక.     

 Previous Page Next Page