నిమిత్త మాత్రులు
రోహిణి కార్తి ఎండలు ! రోళ్ళు బద్దలు కొడుతున్నాయి. ఫేను క్రింద కూర్చున్న వేడిగాలి తప్ప ప్రాణానికి సుఖం ఏది? వడగాల్పు ఆ చెవి నించి ఈ చెవికి కొడుతోంది.
ఎంత చికాకుగా వున్న తప్పదు గనక అలాగే ఆపసోపాలు పడ్తూ కూర్చుని పేపర్లు దిద్దితున్నాను. ఆ పేపర్లు వారం లోపల వదుల్చు కోవాలీ. అప్పుడిక కాస్త ఊపిరి పీల్చుకోడానికి అవుతుంది. ఏ వూరైనా సరదాగా వెళ్ళి తిరిగి రావాలి! వెళ్లబోయే చోటు గురించి ; అక్కడ గడుపబోయే రోజుల గురించి మనసు ప్లాను వేస్తుంది. అలవాటుగా, యాంత్రికంగా కళ్ళు పేపర్ల మీద నిలిపాను అలవాటయిన చేతులు తమ పని అవి చేస్తున్నాయి.
వీధి తలుపు ఎవరో కొడ్తున్నారు. చేస్తున్న పని ఆపి వెళ్ళడానికి బద్ధకం వేసింది. ఇంత ఎండలో ఎవరొచ్చారో , కొంప మునిగినట్లు, మళ్ళీ రెండుసార్లు కొట్టారు ఎవరో , తప్పక విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాను.
గుమ్మం ముందు ఎండలో కళకళలాడుతూ ఓ ఎంబాసిడర్ కారాగి వుంది. మెట్ల మీద ఓ వ్యక్తి నిల్చుని నన్ను చూడగానే నమస్కారం చేశాడు. ప్రతి నమస్కారం చేశాను. ఆయనెవరో ఎక్కడా చూసిన గుర్తయినాలేదు నాకు. లోపలికి రమ్మనలో వద్దో తేల్చుకోలేక ఒక్క క్షణం అలా నిలబడ్డాను. అయన తనని పరిచయం చేసుకుంటాడేమోనని.
"మీతో సిన్న పని వుండి వచ్చానమ్మా!" అన్నాడు అయన తానెవరో చెప్పకుండానే.
"లోపలికి రండి" దారితీస్తూ అన్నాను.
లోపలికి వెళ్ళగానే టేబుల్ మీది చిందర వందరగా ఉన్న పేపర్లని గబగబ డ్రాయరులో పెట్టాను, నేను దిద్దే పేపర్లు మరొకరి కంట పడడం నా కిష్టం లేదు. అయినా, ఈ లోపల అయన చూడనే చూశాడు. " పేపర్లు దిద్దుకుంటున్నట్టున్నారు, మీపని పాడు చేశాను గాబోలు" అదోరకంగా ఆ పేపర్ల వంక చూస్తూ అన్నాడు.
'పరవాలేదు లెండి " మర్యాదకి అన్నాను.
అయన మాటల్లో యాస ఆ వేషం చూస్తె డబ్బు గల కమ్మలో, రెడ్లో అని తెలిసిపోతుంది. పల్చటి గ్లాస్కో లాల్చి, పంచ, ఖరీదు గల చెప్పులు, ఎనిమిదివేళ్ళకి ధగధగలాడే రాళ్ళ వుంగరాలు గోల్డు వాచీ వీధిలో ఎంబాసిడర్ అన్ని అతని కున్న డబ్బుని చాటకనే చాటుతాయి అందరికి. నాతో అయన కేంపనో నాకు అర్ధం కాలేదు.
"నాపేరు యీరపరెడ్డి అంటారండి.... మాది గోపన్నపాలెం ..." అని సక్రమంగా అన్నాడు వచ్చి కూర్చున్న ఐదు నిమిషాలకి.
'ఆహా .... ఏం చేస్తుంటారు మీరు?..." ఏదో అడగాలని అడిగాను.
"ఆ.... ఏదో రెండు పంచదార మిల్లులు రెండు రైసు మిల్లు లున్నాయి.... అవి చూసుకుంటాను..... ఇంకా చెరుకుతోట హైదరాబాదు కాడ ద్రాక్షతోట అది వుందనుకోండి.... మాలాంటి వోళ్లకి ఏదో యిలాంటి యాపారాలు తప్ప ఉద్యోగాలు సద్యోగాలు ఏం సేస్తాం చెప్పండి."
రెండు పంచదార మిల్లులు, రైస్ మిల్లులు పొలాలు తోటలు వున్న వాడికి వెధవ ఉద్యోగం ఎందుకు ?.... యింతకీ యితనికి నాతో ఎంపనో అడగందే చెప్పెట్టులేదు.
"ఏం పని మీద వచ్చారో చెప్పారు కాదు...."
"హి.... హి.... ఓసారి తమ దర్శనం సేసుకుందామని...." ఓ వెకిలి నవ్వు నవ్వి చేతులు నలుపుకున్నాడు నసుగుతూ.
నా దర్శనం ! నేనేం దేవతనా ఏ సినిమా తారనా, పోనీ ఏ మంత్రినా ! పోనీ ఏ లక్షాధి'కారిణినా ? నా దర్శనం చేసుకుంటే అతనికేం లాభం. ఆ నసుగుడు చూస్తుంటే వళ్ళు మండుతుంది. చెప్పేదేదో త్వరగా చెప్పేయకూడదూ?
"తమవల్ల సిన్న ఉపకారం కావాలి ....మళ్ళీ ఆగాడు.
"నావల్ల మీకేం ఉపకారం జరుగుతుంది. మీ లాంటి వాళ్ళకి నాలాంటి మామూలు కాలేజి లెక్చరరు చేసే ఉపకారం ఏముంటుందండి...... ' నవ్వుతూనే అంటించాను.
"అమ్మమ్మ.....అలా అనకండి.... తమరి సేతుల్లో లేనిదేముంది.... మీరు తల్చుకోకపోతే తమరు కాస్త దయంచకపొతే మా లాంటోళ్ళం ఎలా రోజులు నెట్టుకు రాగలం సెప్పండి..."
పొగిడి, ఉబ్బెస్తున్నారు? ఎంత బింకంగా వుందామన్న నా మొహంలో ప్రసన్నత కానీ పెట్టినటున్నాడు. మరికాస్త నమ్రతగా, వినయంగా, "తవరి గురించే కాలేజీలో మా గొప్పగా సెప్పుకుంటారట, సాల ా బాగా పాఠాలు చెప్తారని చాలా స్ట్రిక్ అని..."
"ఆ....ఆ మాటలకేం లెండి....' ఇష్టం లేనట్టుగా మాట త్రుంచేశాను. ఎంతసేపు కూర్చున్న అసలు సంగతి చెప్పకుండా అతను చేసే కాలయాపన చూస్తుంటే చిరాకు పుట్టుకొస్తుంది నాకు.
"ఇంతకీ , మీ పని ఏమిటో చెప్పండి....' కాస్త అసహనంగా అడిగాను.
"అబ్బే! ఏం లేదు . పెద్ద పని కాదనుకోండి. మీరు శ్రమ అనుకోక పొతే....కాస్త శ్రమ తీసుకుని....
"ఊ, చెప్పండి ...."
"అదే, తవకాడికి మా వాడి పి.యు.సి కెమిస్ట్రీ పరిక్ష పేపర్లు వచ్చాయని తెలిసింది.
ఇదా సంగతి. నేనెంత మూర్ఖురాలిని! పరీక్ష లయ్యాక నా దగ్గరికి వచ్చే అపరిచితులు నా సహాయం అపేక్షించి వచ్చే వారయి వుంటారు. నా వల్ల ఎవరికన్నా కావాల్సిన పని అదోకటేనని , నావల్ల జరిగే ఉపకారం ఇదొకటేనని ముందే నాకెందుకు తట్టలేదో! అయన వచ్చిన పని తెలిశాక నా మొహంలో ప్రసన్నం పోయి గంభీరత అలుముకుంది.
"ఎలా తెల్సింది? ఎవరు చెప్పారు?"
"దాందే ముదండి. ఎవరు సేపితేనేం. మీ కాడ కొచ్చినాయి ఆ పేపర్లని నిక్కచ్చిగా తెలిసింది నాకు...." వెకిలి నవ్వు ఒకటి నవ్వాడు.
అవును నిజమే. తెల్సుకోడం ఏం కష్టం డబ్బుతో జరగని పనులు ఏముంటాయి యీ లోకంలో. డబ్బుకి దాసోహం అనని వాళ్ళెంత మంది వుంటారు.
"అయితే, ఏం అంటారు ఇంతకీ మీరు?"
"తమరు కాస్త దయుంచి మావాడి నంబరు పేరున చూసి ఎన్ని మార్కులొచ్చినాయో సెపితే మీ మేలు మరవను...."
"క్షమించాలి అలాంటివి మీరడగకూడదు, మేం చెప్పకూడదు.... అసలు మీరిలా రావడం, అడగడం తగిన పనికాదు. ఎవరికైనా తెలుస్తే నా ఉద్యోగానికి ఎంత ముప్పో తెలుసా మీకు కఠినంగా అన్నాను.
"అమ్మమ్మ....అదెలా తెలుస్తుంది. మూడో కంటివాడికి ఈ మాట తెలియనిస్తానా.... ఆ భయం మీ కొద్దు..." అభయం ఇస్తూ మాట్లాడాడు.
'ఎవరికి తెల్సినా, మానినా, అలాంటి పనులు చేయడం నా ఉద్యోగ ధర్మానికి విరుద్దం.... మీరు దయుంచి నన్ను ఇబ్బందిలో పెట్టకండి...." నా నిశ్చయం మారనట్టు గట్టిగా నొక్కి చెప్పాను.
అయన ఒక్కక్షణం నిరాశ పడ్డట్టు ,మొఖం పెట్టాడు. వెంటనే ఆ మాత్రానికే డీలా పడిపోతే ఎలా అన్నట్టు ఓ నవ్వు నవ్వి, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. 'అమ్మమ్మ మీరలా అనేస్తే ఎలా అమ్మా, మీ మీద ఆశ పెట్టుకొని ఇంతదూరం వచ్చాను.... యీ మాత్రం సాయం మీరు సేయక తప్పదు. ఎవరికి తెల్సుతుందేమోనన్న సందేహం మీకెంత మాత్రం అక్కరలేదు. కాస్త పేపరు చూసి పెసయ్యాడో లేదో చెప్పిస్తే చాలు....ఒక్కక్షణం ఆగి మీ కష్టం వుంచుకొను....ఏదో నా శక్తి కొద్ది జేబులోంచి ఓ కవరు తీసాడు.