Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 11


                                            తల్లిపాలు నేలపాలు

    "తాగవే తల్లీ. తొందరగా తాగవే అమ్మా - నాకన్నా, బంగారు తల్లివిగా, నాకు టైము అయిపోతోంది. బస్సు వచ్చేస్తుందమ్మా. తాగవే తొందరగా, ఏం పిల్లవే రెండు గుటకలు మింగుతావో లేదో కళ్ళు మూసెస్తావు, మళ్ళీ అరగంటకే ఆకలికి ఏడుస్తూ లేస్తావు. కడుపునిండా తాగవే తల్లీ, ఇవాళ నుంచి నాకు ఆఫీసు, మళ్ళీ సాయంత్రం వరకూ అమ్మ పాలుండవు. తాగు మరి.." పాపని కుదిపి లేపాలని ప్రయత్నిస్తోందా తల్లి. బుగ్గమీద చిటికేసినా, చెవి నెమ్మదిగా నులిమినా, తొడమీద గిలిగింతలు పెట్టినా, ఏం చేసినా ఒక్కసారి ఉలిక్కిపడి, మళ్ళీ చప్పరించి మళ్ళీ కళ్ళు మూస్తోందా పాప. "అదేం ఖర్మో ఇన్నిపాలు తాగవే, నోట్లో పెట్టుకోగానే నిద్ర ముంచుకువస్తుందేమే నీకు?" తల్లి విసుక్కుంటూ బిడ్డని పక్కమీద పడుకోబెట్టి జాకెట్ సరిచేసుకుని లేచి నుంచుంది.
    ఆఫీసుకి వెళ్ళేలోగా బిడ్డకి కడుపునిండా పాలివ్వాలని ఆ తల్లి ఆరాటం! నెల్లాళ్ళ పసిగుడ్డుని వదిలిపెడ్తున్నందుకు ఓ పక్క బాధ- కడుపునిండా తాగితే ఓ రెండు మూడు గంటలన్నా నిలుస్తాయి. మళ్ళీ సాయంత్రం వరకు పోతపాలెగా గతి అన్న తాపత్రయం ఆ బాలెంతది! 'ఉద్యోగాలే చేస్తావో, రాజ్యాలే ఏలతావో నాకేల! ఆకలేస్తే మళ్ళీ లేస్తాగానీ ఇప్పుడు నన్ను వెచ్చగా, నీ వళ్ళో నీ కొంగుచాటున పడుకోనియి' అన్నట్లు గుప్పిళ్ళు, పెదాలు మూసి ఇంక తాగను అన్నట్టు కళ్ళు మూసుకున్న పాప - తల్లీకూతుళ్ల వరస చూసి తల్లి నవ్వింది. నలుగురి బిడ్డలని కన్నతల్లి. మొదటి కాన్పు కూతురు ఆరాటం చూసి నవ్వింది. "ఏమిటే నీ పిచ్చి! చంటి పిల్లలంతే. నీ దగ్గర పాలున్నాయని అన్నీ ఒకేసారి తాగేస్తుందా? నీవాఫీసుకి వెళ్తావని సాయంత్రం దాకా కావల్సినవన్నీ ఒకసారి తాగమంటే తాగుతుందా! వాళ్ళ చిన్న పొట్టకెంత కావాలే! ఉగ్గుగిన్నెడు పాలు చాలు. తల్లి వళ్ళో పడుకుని రెండు గుక్కలు తాగగానే తృప్తితో వాళ్ల కళ్ళు మూతపడతాయి."
    "అది కాదమ్మా. ఇన్ని పాలున్నా అసలు తాగనే తాగడం లేదు" కూతురు అమాయకంగా కంప్లైంటు.
    "అంతేనా, మన దగ్గర పుష్కలంగా పాలున్నప్పుడు వాళ్లు తాగలేరు. వాళ్ళు తాగడం మొదలుపెట్టేసరికి మన దగ్గర పాలు తగ్గుతాయి. ఒకసారి తాగలేరనే కదూ గంటగంటకివ్వడం! రెండో నెల వచ్చాక ఇంకాస్త తాగుతారు. ఇప్పుడు ఔన్సుడి పాలు చాలు వాళ్ల పొట్ట నింపడానికి" తల్లి వివరించింది. "బయలుదేరు, తొమ్మిదిన్నర అయింది. మళ్ళీ బస్సు వెళ్లిపోతుంది."
    "అమ్మా బాటిల్స్ స్టెరిలైజ్ చేసిపెట్టా, పాలు బాగా కాచి చల్లార్చాను. ఒకవంతు వేడినీళ్లు కలపమంది డాక్టరు..." తల్లికి అప్పగింతలు మొదలుపెడుతూంది కూతురు.
    "తెలుసే బాబూ నాకు, ఆ మాత్రం తెలీదూ, నీవెళ్లు ముందు" నవ్వుతూ అంది తల్లి. కూతురి వంక ఒకసారి చూసుకుని విడవలేక వెళ్తున్నట్లుగా చెప్పుల్లో కాళ్ళు దూర్చింది ఆ తల్లి. బాలెంత తల్లి మీనాక్షి.

                                                      *  *  *

    టైపు చేసిన కాగితాల్లో తప్పులు వెదుకుతూంటే కాగితాలు తడిసి అక్షరాలు అల్లుకుపోయాయి. కళ్ళు మసకేశాయి. కళ్లజోడు మసకేసిందా? అన్న అనుమానం వచ్చి కళ్ళజోడు తీసి కొంగుతో తుడిచి మళ్ళీ పెట్టుకున్నా అక్షరాలు తడిసి అల్లుకుపోయేలా వున్నాయి. నీళ్ళెక్కడనుంచి పడ్డాయి? అని అయోమయంగా చూస్తుంటే అవి నీళ్ళు కావని, అవి జాకెట్లోంచి కారుతున్న చనుబాలన్నది అర్ధం కావటానికి నిమిషం పట్టింది మీనాక్షికి. గాబరాపడిపోయింది. కారుతున్న పాలతో జాకెట్లు తడిసి కింద వళ్ళో చీర మీద కూడా పడిన పాలని చూసి తెల్లబోయి, గాభరాగా కొంగు తీసి చుట్టూ కప్పుకుని చటుక్కున లేచి బాత్ రూమ్ వైపు పరుగెత్తినట్టే వెళ్ళింది. ఇందాక నరం ఒక్కసారి గుంజినట్లు అనిపించి నొప్పి అనిపించింది. ఏమిటో అనుకుంది తను. జాకెట్టు అంతా అందునా లేతరంగు జాకెట్టేమో తడిసి మరకలు కట్టి బంకబంకగా అయింది. ఏం చెయ్యాలో తోచలేదు మీనాక్షికి. రుమాలు తడిపి అంతా తుడుచుకుని చేసేదేం లేక కొంగు నిండా కప్పుకుని మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంది. ఎవరి పనిలో వారున్నారు. తనని చూడలేదు నయమే అనుకుంది. ఇలా కారిపోతాయా పాలు! గుండెలన్నీ బరువెక్కి రాయిలా తయారయింది. పిల్ల పాలు తాగలేదని ఇలా అయిందా!.. సందేహాలు అడుగుదామన్నా తన సెక్షన్ లో ఇద్దరూ పెళ్ళికాని అమ్మాయిలే! పిల్ల తల్లులు లేరు. రోజూ ఇలా అవుతుందా!.. అమ్మో... ఏం చెయ్యాలి?
    "ఇవాళ ఎంత అవస్థపడిపోయానో, లేతరంగు జాకెట్టు, జాకెట్టంతా డాగులు కట్టేసింది. పమిట కప్పుకుని తంటాలు పడ్డాను. మళ్ళీ సాయంత్రమూ బస్సు స్టాపులో నించున్నప్పుడూ కారిపోయాయి. ఎలాగమ్మా ఇలా రోజూ అయితే!" ఇంటికొచ్చి తల్లితో చెప్పుకుంటూ దిగులుగా అంది మీనాక్షి.
    "పొద్దుట ఇచ్చాక మళ్ళీ ఇంటికొచ్చాకేగా! ఇంట్లో వుంటే నాలుగయిదు సార్లన్నా తాగేది కదా పాప, పాలు నిండిపోతే చేపొస్తాయి. పిల్ల ఆకలివేళ అయినట్టు అనుకునేవారం ఇదివరకయితే. గిన్నె నిండిపోతే పాలు ఒలకవూ! ఇదీ అంతే! అందులో నెల్లాళ్ళ బాలింతవాయె. పాలుండిపోవూ మరి..." తల్లి అంది.
    "ఏమిటోనే తల్లీ. మీ ఉద్యోగాలూ, మీరూనూ! నెల్లాళ్ళ పసిగుడ్డుని ఎనిమిది గంటలపైన వదిలిపెడితే పాలు చేపురాక ఏం చేస్తాయే? పోతే పోయింది జీతం! కనీసం మూడో నెల వచ్చేవరకన్నా సెలవు పెట్టి ఇంటిపట్టున ఉండు. పచ్చి బాలెంతవి. వంటి తడన్నా ఆరకముందే బస్సులు పట్టుకు వేలాడి ఆఫీసులకి పరుగెత్తడం. మా కాలంలో ఇరవైఒకటో రోజువరకు మంచం దిగనిచ్చేవారు కాదు. నలభైరోజుల వరకు చన్నీళ్ళలో చేయి పెట్టనిచ్చేవారు కాదు. నెలరోజులు శొంఠిపొడుం అన్నం, గిన్నెడు నెయ్యివేసి వళ్ళు గట్టిపడాలని పెట్టేవారు. నెల్లాళ్ళూ నడుం కట్టు కట్టుకునేవారం. నలభై రోజులకి గానీ వంటింట్లోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు. ఏం రోజులొచ్చాయో... నెలలు నిండేవరకు బస్సులో పడి ప్రయాణాలు చేస్తున్నారు. నెల్లాళ్ళ పసిగుడ్డుకి పాలు ఇచ్చుకోకుండా నేలపాలు చేసుకుంటున్నారు పాలు." వరలక్ష్మి నిట్టూర్చి అంది. "సెలవు పెట్టవే ఓ నెలన్నా... చూడు బాలింతరాలివి తోటకూర కాడలా ఎలా వాడిపోయావో" కన్నా కడుపు తీపి ఆవిడది. "నీ సంగతి సరే, ఆ పసిది తిత్తి నోట్లో పెడితే వెగటుగా మూతిపెట్టి పాలు తాగనే లేదు. పాలసీసా పీక నోట్లోంచి తీసేసింది.. ఆకలికి ఒకటే ఏడుపు..."
    "పాలు తాగలేదా మరి పొద్దుటనుంచీ?" కన్నతల్లి ఆరాటం.
    "రెండు మూడుసార్లు ప్రయత్నించి తాగకపోతే చెంచాతో కాసిని పట్టాను బలవంతంగా అందుకే బాటిల్ అలవాటు చెయ్యవే మధ్య మధ్య అన్నాను. కాసిని నీళ్ళు బాటిల్ తో పడుతుండాలి అలవాటు పడడానికి. పద అది లేచేలోగా కాస్త ఏదన్నా కాఫీ తాగు, కాళ్ళు కడుక్కురా" వరలక్ష్మి వంటింటి వైపు వెళుతూ అంది.
    కాఫీ తాగుతూ "మరి ఈ పాలు ఇలా కారితే ఆఫీసులో ఎలా అమ్మా! ఏం చేయాలి? అసహ్యంగా, ఎవరన్నా చూస్తే సిగ్గుతో చావాలి" అంది మీనాక్షి.
    "సెలవన్నా పెట్టి ఇంట్లో వుండు. మూడోనెల తరవాత కాస్త తగ్గుమొహం పడతాయి. లేదంటే డాక్టరుని మందు అడుగు పాలు తగ్గడానికి. మాత్ర వేసుకుంటే పాలు అసలుకే పోతాయేమో చూసుకో. ఏం చేస్తావు? మూడు గంటలకోసారి బాత్ రూమ్ లోకి వెళ్ళి కాసిని పిండి పారబోసుకో... ఇంకో జాకెట్టు బ్యాగులో పెట్టుకో. అవసరం పడితే వుంటుంది. మధ్యమధ్య బాత్ రూమ్ కి వెళ్ళి వస్తుంటే చేపు రావులే" అంది వరలక్ష్మి.

 Previous Page Next Page