Previous Page Next Page 
మరణహొమం పేజి 11

 

    అతను చిన్నప్పుడు మెడ్రాసులో చదువుకున్నాడు. అందుకని తమిళం తెలుసు.   
    కావాలని రైల్లోనే ప్రయాణం చేశాడు తరుణ్. అక్కడ కొన్న కొన్ని టిక్కెట్లు పరీక్షగా చూస్తే నకిలీవిగానే కనబడ్డాయి.   
    కౌంటర్ ఫీట్ టిక్కెట్లు తయారు చెయ్యడం అనే ఫీటు అందరివల్లా కాదు. దానికి కొద్దో గొప్పో ప్రావీణ్యం ఉండి తీరాలి.   
    మెల్లిగా కూపీలు లాగడం మొదలెట్టాడు తరుణ్. 

    అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. అతను ఎలాంటి గుంపులోనైనా సులభంగా కలిసిపోగలడు. ఇవాళరాత్రికి తాజ్ కోరమాండల్ లో అయిదొందల రూపాయలు ఖరీదుచేసే డిన్నర్ తిని, రాత్రికి రైల్వే ఫ్లాట్ ఫారం మీద నిద్రపొయిం వేపపుల్లతో పళ్ళు తోముకుని, తెల్లారాక నాయరు టీ షాపులో బన్నుతిని టీ తాగగలడు. నేపాల్ వెళ్ళి కేసినోలో కూర్చుని రష్యన్ రూలెట్ ఆడి వేలకువేలు సంపాదించగలడు. ముతక రౌడీ మూకతో కలిసి పులిజూదం ఆడుతూ పందాలు గెలవగలడు.   
    జనంలో కలిసిపోయి వినడం, చూడడం మొదలెట్టాడు తరుణ్. చాలామంది మనుషులు చూడకుండానే "చూస్తారు". వినకుండానే "వింటారు." అంటే వాళ్ళు చూసినదీ, విన్నదీ పూర్తిగా ఆకళింపు చేసుకోరన్నమాట. ఉదాహరణకు అప్పుడే మేడమెట్లు ఎక్కివచ్చిన వాడిని "నువ్వెన్ని మెట్లెక్కివచ్చావ్" అంటే వెర్రిమొహం పెడతాడు. తను ఎన్ని మెట్లు ఎక్కివచ్చాడో చెప్పడమే కాకుండా ఆ మెట్లకి మధ్యలో ఎన్ని లాండింగ్స్ ఉన్నాయో కూడా చెప్పగలడు తరుణ్.   
    అందుకే అతను డిపార్ట్ మెంటులో గబగబ మెట్లెక్కేసి పెద్ద పొజిషన్ కి చేరుకోగలిగాడు. అందుకే అతను బాస్ మిశ్రా దృష్టిలో నెంబర్ వన్ గూఢచారీ, ఏస్ ఏజెంటూ అయ్యాడు.   
    నేరస్థుడి వాసన పట్టగలిగాడు అతను. వెదుక్కుంటూ వెళ్ళి కోయంబత్తూరులో తేలాడు.   
    అక్కడ ఉంది కలైమణి ప్రింటింగ్ ప్రెస్సు. కలైమణి ఇదివరకు ఒక మేగజైనులో బ్లాక్ మేకరుగా పనిచేసేవాడు. మేగజైన్ డబ్బు దాదాపు ముఫ్ఫయివేలు తీసుకుని పరారైపోయాడు. తర్వాత పట్టుకుని జైల్లో వేశారు పోలీసులు. కానీ పోయిన డబ్బు రాబట్టలేకపోయారు.   
    జైలునుండి విడుదలయి రాగానే చిన్న ప్రెస్సుపెట్టి, గౌరవప్రదంగా కొత్తజీవితం మొదలెట్టాడు కలైమణి. మీటింగుల తాలూకు కరపత్రాలూ, పెళ్ళి శుభలేఖలూ లాంటి చిన్న చిన్న జాబ్ వర్కులు చేస్తుండేవాడు.   
    అలాంటి కలైమణి హఠాత్తుగా తను అద్దెకి వుంటున్న ఇల్లు కొనేశాడు. ఇంకో బంగళా కడుతున్నాడు. హీరోహోండా మోటారు సైకిలు కొన్నాడు. మారుతీకారు బుక్ చేశాడు.   
    అనుమానం స్థిరపడింది తరుణ్ కి.   
    ఆ రాత్రికి అతని ప్రెస్సులో ఎలాగైనా ప్రవేశించి, క్షుణ్ణంగా వెదకాలని నిశ్చయించుకున్నాడు.   
    రాత్రి ఎనిమిదింటికల్లా ఒక చిన్న హోటల్లో భోజనం చేసి, టైంపాస్ చెయ్యడానికి సినిమాకి వెళ్ళాడు తరుణ్. అర్దరాత్రి తిరిగివస్తూ కలైమణి ప్రెస్సుముందు ఆగాడు.   
    చాలా సన్నటిసందు అది. సినిమా జనం వెళ్ళిపోయాక పూర్తిగా నిర్జనం అయిపోయింది.   
    జేబులోనుంచి అభ్రకం ముక్క ఒకటి తీసి, దాన్ని తాళం కప్ప రంధ్రంలో దూర్చి నాలుగైదుసార్లు తిప్పాడు తరుణ్.   
    "క్లిక్"మని చిన్న శబ్దంతో తాళం తెరుచుకుంది.   
    నిశ్శబ్దంగా లోపలికెళ్ళిపోయాడు. మామూలుగా అన్ని ప్రెస్సుల్లోనూ ఉండే సరంజామానే అక్కడ కూడా ఉంది. ప్రింటింగు ఇంకులా వాసన గాలిలో అలుముకుని ఉంది.   
    లోపల ఇంకో చిన్న గది ఉంది. అక్కడ నీటుగా ప్యాక్ చేసిన బండిల్సు కొన్ని ఉన్నాయి.   
    జాగ్రత్తగా ఒకటి విప్పి చూశాడు. అతను ఊహించింది కరెక్టే! నకిలీ రైలు టిక్కెట్లు ఉన్నాయి వాటిల్లో.   
    మళ్ళీ బండిల్సుని అనుమానం రానివిధంగా బిగించికట్టి, రొటీన్ గా అలమార్లూ, డ్రాయర్లూ పరిశోధించాడు.   
    ఒక డ్రాయరులోనుంచి కాయితాలు తీస్తుంటే, వాటిలోనుంచి ఫోల్దర్సు లాంటివి నాలుగైదు జారిపడ్డాయి.

    ఒంగి అందుకొని చూశాడు.   
    పాస్ పోర్టులు!   
    ఓపెన్ చేసి చూశాడు. నాలుగు పాస్ పోర్టులు, నాలుగు పేర్లమీద ఉన్నాయి.   
    ఏదో స్ఫురించింది. వాటిలో అతికించి ఉన్న ఫోటోలని మళ్ళీ ఒకసారి తీక్షణంగా పరికించి చూశాడు.   
    ఫోటోల్లో ఒకతనికి గెడ్డం ఉంది. ఒకతనికి బట్టతల. మరొకతను వయసు మళ్ళిన వాడిలా ఉన్నాడు. ఇంకొక అతను కాలేజ్ స్టూడెంట్ లా యంగ్ గా కనబడుతున్నాడు.   
    నుదురు చిట్లించి ఆలోచించాడు తరుణ్.   
    నాలుగు ఫోటోల్లోకూడా కొద్దికొద్దిగా పోలికలు కనబడుతున్నాయి.   
    ఎవరి పోలికలు? ఎక్కడ చూశాడు తను?   
    మెదడులో ఒక్కసారి చక్ మని మెరుపు మెరిసినట్లయి గుర్తొచ్చింది. ఈ నాలుగు ఫోటోల్లోనూ ఉన్నది ఒక్కమనిషే!   
    నిఖిల్!   
    నాలుగు పేర్లతో,  నాలుగు రకాల మేకప్ తో పాస్ పోర్టులు!   
    వెనకాల ఏదో శబ్దం అయింది.

 Previous Page Next Page