Previous Page Next Page 
హత్య పేజి 11


    "నీవు నాలుగురోజులు విశ్రాంతి కావాలనివచ్చావు. నలభైఏళ్ళు యిక్కడ వుండమని కోరుతున్నాను సరేనా!"

 

    "నలభై ఏళ్ళు చాలా?"

 

    "ఏదో కాస్త తృప్తి పడతాలే."

 

    "నాన్నగారి తృప్తికోసం మీరు యిక్కడే వుండాలి" హరి అన్నాడు.

 

    "మామయ్యగారు యిక్కడే వుంటారు. నేను రోజూ మామయ్యగారికి మంచి మంచి కధలు వినిపిస్తుంటాను" అందివిమల.

 

    "నీ పిల్లలు రత్నాలురా సూరీడూ" అన్నాడు కైలాసగణపతి.

 

    "అసలు రత్నం యింకా యింటికి రాలేదు." అన్నాడు సూర్యారావు.

 

    భోజనాలకి పిలుపు వచ్చిందాకా నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.

 

    అరగంట తర్వాత పిలుపు వచ్చింది.


                                       8

 

    భోజనం సగంలో.....

 

    "ఖారం ఎక్కువగా వుందా అన్నయ్యగారూ!" మాణిక్యాంబ అడిగింది.

 

    "అదేం లేదమ్మా! ప్రతివంటకంలో నాకు అమృతం గుర్తుకువస్తున్నది. తింటుంటే లోపలకు వెళుతున్నాయి. నాది కడుపో చెరువో అర్ధం కావటం లేదు" గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు నంచుకుతింటూ చెప్పాడు కైలాసగణపతి.

 

    "సొరకాయ కోతలు కొయ్యకు కైలాసం. నేను చూస్తూనే వున్నాను. భోజనం మధ్యలో సరిగ్గా మరచెంబుడు నీళ్ళు తాగావు" అతను అన్నాడు.

 

    "అది నా అలవాటు"

 

    "అంతేగాని మా యింట్లో వంటకాలు ఖారంగా వున్నాయని వప్పుకోవన్నమాట"

 

    "ఒప్పుకోను!"

 

    "అయితే సరే గుర్తుంచుకో."

 

    "దేనికిరా సూరీడూ?"

 

    "గుర్తుంచుకోమన్నా గుర్తుంచుకో అంతే. ఎదురు ప్రశ్నలు వేయకు."

 

    వాళ్ళ సరదా మాటలు వింటున్న విమల "నాన్నగారు చిన్నపిల్లవాడు అయ్యారు" అంది నవ్వుతూ.

 

    "కారణం మామయ్యగారనే ఔషధం" అన్నాడు హరి.

 

    "అదేమోగాని మేమెప్పుడు కల్సుకున్నా ఇలానే మాట్లాడుకుంటాము. చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటాం. ఆ రోజుల్లో వీడి తల కాటుకరంగులో వుండేది. ఒకటి రెండు పాయలు నెత్తిన నాకు మెరిశాయి. ఒరేయ్ ముసలిసూరీడూ! అని వీడు ఒకటే ఎక్కిరింతలు వేళాకోళాలు. నలుగురు బిడ్డల తండ్రిని -

 

    "నలుగురు కాదు నాన్నా ముగ్గురు" గుర్తు చేసింది విమల.

 

    "ఏదో మాటవరసకి అన్నానులే! ముగ్గురు బిడ్డల తండ్రిని మనవణ్ణి ఎత్తుకోబోనున్నాను. ఇప్పటికి సగం తల నెరిసింది. తారుడబ్బాలా వుండే వీడి తలకట్టు ముగ్గుబుట్టలాతయారయింది. ఆ రోజుల్లో నన్నుచూసి నవ్వాడు కదా నవ్విన నాపచేను పండింది" సూర్యారావు నవ్వుతూ చెప్పాడు.

 

    "భోజనం సరిగ్గా చేయండి" అంది మాణిక్యాంబ.

 

    "వంటిమీద మెతుకులు పోసుకోకుండా జాగ్రత్తగా తింటున్నాకదా?" అన్నాడు సూర్యారావు.

 

    వాళ్ళలా సరదాగా మాట్లాడుతుండగానే మధ్యలో వాకిట్లోంచి ఈలపాట వినపడింది.

 

    "మా రత్నం వచ్చాడు" అన్నాడు సూర్యారావు.

 

    "రత్నమా?" అన్నాడు కైలాసగణపతి.

 

    "రత్నం అంటే మా సుపుత్రుడులే. కూత వినపడలేదా!"

 

    "కూతా!"

 

    "నీకు ప్రతిదినం వింతగానే వుందేమిటి కైలాసం! కూత అంటే రైలుకూత కాదు. మావాడి ఈలపాట. వాడొస్తున్న గుర్తుగా ముందు ఈలపాట వస్తుంది. ఆ తర్వాత వాడొస్తాడు. అడుగో మాటల్లోనే వచ్చాడు" అన్నాడు సూర్యారావు.

 

    గణపతి తలతిప్పి చూశాడు.

 

    గుమ్మానికి సరిపోను భారీయువకుడు పుష్టిగా బలంగా వున్నాడు. రవిని చూడంగానే ఫాషనులు ఇష్టపడే ఈ కాలం కుర్రాడు అనిపిస్తున్నాడు. అల్లరి, సరదా కలబోసినట్లు ముఖం చూడంగానే అనిపిస్తున్నది.

 

    ఈ విషయంలో అన్నదమ్ముల్లో చాలా వారవుంది. హరి నెమ్మది. పెద్దమనిషి తరహాగా వ్యవహరిస్తాడు. సింపుల్ గా వుంటాడు. రవి అల్లరి వేషాలు వేస్తుంటాడు. గలగల మాట్లాడుతుంటాడు. తాను నవ్వుతూ. ఎదుటివారిని నవ్విస్తూ బ్రతకాలంటాడు.

 

    "నేను రాకుండానే మీరు భోజనం చేస్తున్నారంటే మీకు బాగా ఆకలి అయిందన్నమాట..... అలా అయిందంటే అది ఆరోగ్య....." కైలాసగణపతిని అప్పుడు చూశాడు రవి "సారీ" అన్నాడు.

 

    "నాన్నగారి స్నేహితులు వీరు. తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా మాతోపాటు భోంచేద్దువుగాని" హరి అన్నాడు.

 

    "తప్పదా?" రవి రవంత విచారంతో అన్నాడు.

 

    "తప్పదు." హరి నవ్వుతూ అన్నాడు.

 

    "మమ్మీ! వడ్డించెయ్యి కంచాన్ని" అంటూ రవి పెరటివేపు దారితీశాడు కాళ్ళూ చేతులూ కడుక్కురావడానికి.

 

    "ఏమిటి మీవాడు తప్పదంటున్నాడు?" కైలాస గణపతి అడిగాడు.

 

    "ఊరంతా తిరిగిరావటానికి లేని బద్ధకం వాడికి ఇల్లు చూడంగానే గుర్తుకు వస్తుంది. కాళ్ళు కడుక్కోవటానికి బద్దకం. కొండని పిండి చెయ్యటానికి శక్తివస్తుంది గానీ ఇవతలి చెంబుతీసి అవతల పెట్టరా అంటే చెయ్యి పైకి లేవటం లేదంటాడు" సూర్యారావు చెప్పాడు.

 

    "అయితే మీచిన్నవాడికి అన్నీ నీ పోలికలేనన్నమాట."

 Previous Page Next Page