Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 12


    "ఎక్కడ ఆపమంటారు?" మీరాభాయ్ మరోసారి అడిగాడు.

 

    తను ఎక్కడ దిగాల్సిందీ చెప్పలేదు చలపతిరావు. కీడెంచి మేలెంచే రకం ఆయన. తను ఎవరిని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది ఎవరికీ తెలియకూడదు.

 

    "వీధి చివరికెళ్ళి ఆపెయ్."

 

    మీరాభాయ్ అలానే ఆపాడు.

 

    బండి దిగి ఇరవై రూపాయలు ఇచ్చాడు.

 

    మీరాభాయ్ బండి తిప్పుకుని వెనక్కి వెళ్లడం ప్రారంభించాక చలపతిరావు ముందుకు నడిచాడు.

 

    ఊరు దాటాక చివరలో విసిరేసినట్టుంది ఓ గుడిసె అది. ఆ ఊర్లోనే మహామంత్రగాడని పేరున్న షిండేది.

 

    చలపతిరావు మెల్లగా షిండే ఇంటివైపు అడుగులు వేశాడు అంత నిశ్శబ్దంలో తన నీడ తనకు పరాయిదిగా అనిపించింది. మెల్లగా, అమాయకంగా వీస్తున్న గాలే కుట్ర చేస్తున్నట్టుంది. పైన ఆకాశాన్ని పట్టుకొని వేలాడుతున్న చంద్రవంకే తోక తెగి చుట్టుకుపోవడానికి ప్రయత్నిస్తున్న బూడిదరంగు పాములా వుంది. ఆ మసక వెలుతుర్లో గుడిసె భూదేవికి ఒంటిమీద లేచిన కురుపులా వుంది.

 

    చలపతిరావు దానిముందు నిలుచున్నాడు.

 

    అటూ ఇటూ చూశాడు.

 

    ఎలాంటి అలికిడి లేని వీధి ఊరి మధ్యలో వున్న రోడ్డులా కాక గుహకు వేసిన రహదారిలా వుంది. ఊరి పొలిమేరల్లో పహరా కాస్తున్నట్టు తిరుగుతున్న నక్కలు అప్పుడప్పుడు వూళలు పెడుతున్నాయి.

 

    చలపతిరావు మెల్లగా తలుపు తోశాడు.

 

    దానికి గడి లేనట్టుంది.

 

    వెంటనే తెరుచుకుంది.

 

    లోపల మనిషున్న జాడలేదు.

 

    "రాఘవానందా..." ఆయన మెల్లగా పిలిచాడు.

 

    లోపల్నుంచి ఏ సమాధానమూ రాలేదు.

 

    కళ్ళు చిట్లించి చూశాడు.

 

    ఎవరూ లేరక్కడ.

 

    ఇంత రాత్రిపూట షిండే ఇంట్లో వుండకపోతే మరో దగ్గర వుంటాడు... అది శ్మశానం.    

 

    తలుపు ముందుకు లాగి శ్మశానంవేపు నడవడం మొదలుపెట్టాడు.

 

    ప్రకాష్, అనూహ్యల మీద పగ తీర్చుకోవడానికి షిండేను ఆయన అన్ని విధాలా ఆలోచించే ఎంచుకున్నాడు.

 

    షిండే సామాన్యుడు కాడు. అతన్ని గూర్చి పూర్తిగా తెలుసుకుంటే తప్ప అతనేమిటో అర్థం కాదు. షిండే అసలు పేరు రాఘవులు. ఆ తరువాత రాఘవానందగా మారాడు.

 

    ఇప్పుడు షిండేగా పిలవబడుతున్నాడు.

 

    ఈ రూపాంతరం వెనక పెద్ద కథే వుంది.

 

    రాఘవులది చిన్న పల్లెటూరు.

 

    పాతికేళ్ళు వచ్చినా పనీపాటా లేకుండా జులాయిగా ఊర్లో తిరుగుతున్న రాఘవుల్ని ఏం చేయాలో, ఎలా దారికి తేవాలో తెలియక అతని తల్లిదండ్రులు వేదన పడేవారు. వాళ్ళు అలా బాధపడుతుంటే అతను మరో విధంగా బాధపడేవాడు.

 

    తెల్లవారి లేచేటప్పటికి తన ముందు కుప్పలు తెప్పలుగా డబ్బు పడి వుండాలని కోరుకునే రకం అతను. మామూలు పనీ పాటా చేయడం అతనికిష్టం వుండేది కాదు. రోజంతా కష్టపడితే వచ్చే యాభయ్ రూపాయలంటే అసహ్యం.

 

    అందుకే ఎప్పుడూ ఊర్లు తిరుగుతూ సేహితుల్తో కాలక్షేపం చేసేవాడు. ఊర్లో అంతకంటే సోమరి మరొకడు లేడని పేరు తెచ్చుకున్నాడు.

 

    తండ్రి అంత పెద్ద వయసులో కూడా పొలం వెళ్ళి వ్యవసాయం చేసేవాడు. అతని కాయకష్టాన్ని తింటూ రాఘవులు పైసా పచ్చీసులాగా తిరిగేవాడు.

 

    ఇలా అయితే లాభం లేదనుకుని అతనికి పెళ్ళి చేస్తే తన బతుకు తాను వెదుక్కుంటాడని తల్లిదండ్రుల ఆశ. అందుకే నూరు అబద్దాలు కాదు, నూటా ఒక్క అబద్దాలు చెప్పి రాఘవులకి పెళ్ళి చేశారు.

 

    మొదట్లో పెళ్ళాంతో సరిగా వుండేవాడు కానీ ఆ తరువాత అదీ మానుకున్నాడు.

 

    తల్లిదండ్రులు, భార్యా ఆశించినట్టు అతడు మారలేదు. పైసా పనిచేసే వాడు కాదు.

 

    ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలన్న ఆలోచన తప్ప మరో రకంగా ఆలోచించేవాడు కాదు.

 

    పెళ్ళికాక ముందు రాత్రుల్లోనైనా ఇంటిపట్టున వుండేవాడు. భార్యతో అయిదేళ్ళు కాపురం చేశాక అసలు ఇంటికే వెళ్లడం మానేశాడు.

 

    ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి వెళ్ళి నాలుగు మెతుకులు తిని తిరిగి బయటపడేవాడు.

 

    "జీవితాంతం ఒకే భార్యతో గడపాలని శాసనం చేసిన వాడ్ని నడివీధిలో ఉరితియ్యాలి. భార్యంటే ఇంట్రెస్ట్ పోయి సంవత్సరాలయింది.

 

    ఇక చూడాల్సిన రహస్యాలు ఏమీ లేనప్పుడు ఏం ఇంట్రెస్ట్ వుంటుంది చెప్పు?? ఛీ ఛీ- నా పెళ్ళాంతో రాత్రుల్లో పడుకోవడం కంటే ఇబ్బందికరమైన విషయం మరొకటి లేదురా" అని తనకు బాగా క్లోజ్ అయిన మిత్రుడు సుధాకర్ తో వాపోయాడు.

 

    "మరి ఇప్పుడు ఏం చేస్తావ్? ఎలానో సర్దుకుపోవాలి మరి" మిత్రుడికి బుద్దీ మతీ చెప్పాలని ప్రయత్నం చేశాడు సుధాకర్.

 

    "భార్యతో మాట్లాడాలన్నా ఇష్టం వుండడం లేదు. పోనీ ఎవరినైనా కన్నెపిల్లల్ని ట్రై చేద్దామంటే ఖర్మ కాలి పెళ్ళి అయిపోయె. పెళ్ళి కావడం అంత డిస్ క్వాలిఫికేషన్ ఇంకొకటి లేదనుకో. అందుకే ఏ ఆడపిల్లా కన్నెత్తి చూడడం లేదు."

 

    ఇలా రాఘవులు ప్రస్టేషన్ తో కాలం గడుపుతున్నప్పుడు ఆ ఊర్లోకి కొత్తగా నిర్మల వచ్చింది.

 

    ఆమెకి ముప్పై అయిదేళ్ళ వయసుంటుంది. ఏ అవయవానికి ఆ అవయవం అనుభవంతో విచ్చుకున్నట్టు వుంటుంది. కళ్ళు చారడేసి వుంటాయి. పెదవులు వేలంతా వుంటాయి. వక్షోజాలు దోసిడంత వుంటాయి. నడుము పిడికిలి అంత వుంటుంది. బొడ్డయితే బొటనవేలుని చూపుడువేలుని రౌండ్ గా చేసినట్టు కనిపిస్తుంటుంది. మిగిలిన శరీరం చీరలో తడిబట్టలో చుట్టిన మందారాల పొట్లంలా వుంటుంది.

 

    ఆమె భర్త శ్రీనివాసులు ఈ మధ్య చనిపోయాడు. ఆయనది రంగరాజుపురం. కొయ్యబొమ్మలు చెక్కేవాడు. ఆయన ఆ విద్యలో పేరున్నవాడు. ఆయన బంధువుల్లో ఏ పిల్లాడైనా బొమ్మలు చెక్కడం నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే శిష్యులుగా చేరేవాళ్లు.

 

    అలాగే ఆదినారాయణ కూడా చేరాడు. విద్యంతా నేర్చుకున్నాక ఇక ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు శ్రీనివాసులు చనిపోయాడు. నిర్మల ఒంటరిదై పోయింది. ఆ ఊర్లో ఆమెకి ఎవరూ లేరు. తల చెడి పుట్టింటికి చేరుకోవడం ఇష్టంలేకపోయింది.

 

    "ఆదినారాయణా! నేనూ మీ ఊరికి వచ్చేస్తాను. ఇక్కడ పిలిస్తే పలికే దిక్కు కూడా లేదు. మీ వూర్లో అయితే మన బంధువులున్నారు- పై పెచ్చు నువ్వున్నావు. కష్టమొచ్చిన, బాధ వచ్చినా చూసుకోవడానికి నువ్వుంటావ్. ఇక్కడున్న ఇల్లూ, పొలమూ అమ్మేస్తాను. ఈలోగా నువ్వెళ్ళి మీ ఊర్లో నేనుండటానికి ఓ గూడొకటి చూడు" అంది.

 Previous Page Next Page