Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 11


    "ఇలాంటి తలనొప్పులొస్తాయనే మానాన్న ఏ పుస్తకం చదవొద్దంటాడు. పైసా వచ్చే పనిచేయాలిగానీ ప్రయాస తెచ్చే పని ఎందుకు చేయడం?"

 

    అతనేమిటో ఆమెకి పూర్తిగా అర్థమైంది.

 

    "ఏం చదువుకున్నావ్?"

 

    "పదో తరగతి పాస్" గొప్పగా చెప్పాడు.

 

    "ఇంకా చదవలేకపోయావా?"

 

    "ఇంకా చదివితే ఏం వస్తుంది?"

 

    ఏది అడిగినా ఒక అదే ప్రశ్న వేస్తాడని తెలిసి ఆమె మౌనంగా వుండిపోయింది.

 

    "నువ్వేం చదువుకున్నావ్?" వూరక కూర్చోవడం ఇబ్బందిగా అనిపించి ఆ ప్రశ్న అడిగాడు.

 

    "ఎం.ఏ. ఫిలాసఫీ"

 

    "అంత పెద్ద చదువు చదివావన్నమాట. అయినా అంత ఎక్కువ చదివితే ఏం వస్తుంది?"

 

    ప్రతి పనికీ లాభం ఒకటుండాలని చిన్నప్పట్నుంచీ ఎవరో ఒకరు అదేపనిగా చెప్పడంవలన అతను అలా తయారయ్యాడని అర్థమైంది.

 

    ఆ స్థితికి జాలిపడడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమీలేదు.

 

    'ఏం వస్తుంది?' అని అతను అడిగే ఛాన్స్ రాకుండా అవీ ఇవీ మాట్లాడుతూ వుండిపోయింది.

 

    మరో అరగంటకు తండ్రి పిలిస్తే శ్రీహరి లోపలికెళ్ళాడు. ప్రకాష్ ఎంత బలవంతం చేసినా స్వీట్స్ అయినా ముట్టుకోలేదు చలపతిరావు.

 

    చివరికి లేచి బయటికి వస్తూ "ఆదిరా అబ్బాయి విషయం. నువ్వో మారు మీ చెల్లెలి అభిప్రాయం కూడా కనుక్కొని ఉత్తరం రాయి. మనది మరి దగ్గిర సంబంధం. అన్నీ ఆలోచించుకో. మీరు సరేనని ఫోన్ లొ ఓ మాట చెప్పేస్తే ముహూర్తాలు పెట్టించేస్తాను" అని సెలవు తీసుకున్నాడు చలపతిరావు.  

 

    వాళ్ళు వెళ్ళిపోయాక చెల్లెల్ని లోపలికి పిలిచాడు ప్రకాష్. "మామయ్య ఎందుకొచ్చాడో ఏమైనా ఊహించావా? వాళ్ళబ్బాయి శ్రీహరికి నిన్ను అడగడానికి వచ్చాడు. మనం సరేనంటే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తాడట" అన్నాడు.

 

    "పెళ్ళా! నాకా!!"

 

    "ఆఁ!"

 

    "పెళ్ళి చేసుకుంటే ఏం వస్తుంది?" అమాయకంగా తన కళ్ళను బండి చక్రాల్లా అటూ ఇటూ దొర్లిస్తూ అడుగుతున్న చెల్లెలివైపు ఓ క్షణం అలా చూస్తూండిపోయాడు అతను.

 

    "అదేమిటమ్మా ఆ ప్రశ్న?" మాయాదేవి ఆడబడుచు వంక సందేహంగా చూస్తూ అడిగింది.

 

    అన్నావదినల్ని ఇక టెన్షన్ లో పెట్టడం ఇష్టంలేక గంభీరంగా వున్న వాతావరణాన్నంతా ఈజీ చేస్తూ ఫకాలున నవ్వింది అనూహ్య.

 

    "అలా కంగారుపడకు అన్నయ్యా! శ్రీహరితో ఓ అరగంట మాట్లాడడంతో ఆ ప్రశ్న నా నోటంట అప్రయత్నంగా వచ్చేసింది" అని మొదలుపెట్టి అతను ఆ అరగంటలో ఎలా మాట్లాడాడో అంతా పూసగుచ్చినట్టు చెప్పింది.

 

    "అతను నాకంటే తక్కువ చదువుకున్నాడనో, లేకపోతే పల్లెటూర్లో వుండాల్సి వస్తుందనో ఈ పెళ్ళి వద్దనడంలేదు. అతను అలా మాట్లాడినందుకు అతన్ని అసహ్యించుకోవడం లేదు. అతను పెరిగిన వాతావరణం అలాంటిది. అతని చుట్టుపక్కలున్నవాళ్ళు అతన్ని అలా తయారుచేశారు. దేనికయినా కబ్బు ప్రతిఫలంగా రావాలని చిన్నప్పటినుంచీ నూరిపోశారు. అందుకే అతను అలా తయారయ్యాడు.

 

    నా అభిరుచులు వేరు. నాకు డబ్బు వుండడంకంటే కష్టాల్లో వున్న మనిషిని చూసి ఓ కన్నీటి బిందువురాల్చే స్పందన వుంటే చాలనుకుంటాను. భిన్న ధృవాలయిన మేం కలిసి జీవించలేం. అందుకే అతన్ని నేను పెళ్ళి చేసుకోలేను" అని ఖచ్చితంగా చెప్పింది.

 

    "ఏదో ఒక కారణం చెప్పి ఇప్పటికి వచ్చిన రెండు సంబంధాలు వద్దన్నావు. మరి నీకు అన్నివిధాలా నచ్చినవాడ్ని ఎక్కణ్ణుంచి తీసుకురాగలం?" అంది మాయాదేవి. ఆమె అంత కటువుగా మాట్లాడడానికి కారణం అనూహ్య అంటే వున్న అమితమైన ఇష్టమేగానీ మరో కారణం కాదు.

 

    "నీ మనసులో ఎవరయినా వుంటే చెప్పమ్మా" ప్రకాష్ లాలనతో అడిగాడు.

 

    "అలా నేను పడి చచ్చే మనిషి ఎవరూ లేరన్నయ్యా. అయితే ఓ వ్యక్తిని చూశాక మాత్రం అతన్ని పెళ్ళి చేసుకుంటే ఎలా వుంటుంది అని రెండు మూడుసార్లు ఆలోచించాను" అన్నది.

 

    "ఎవరమ్మా అతను?"

 

    "అంతా విన్నాక అతను మన స్టేటస్ కు సరితూగడని నువ్వనకూడదన్నయ్యా. నేనేమిటో నీకు స్పష్టంగా తెలుసు. ఏ తెల్లవారుజామునో అలా లేచి కొండవరకు నడిచి రెండు రాళ్ళమధ్య పచ్చగా విచ్చుకున్న ప్రాణంలా అనిపించే గడ్డిపోచల్ని చూడాలంటే 'ఏం బరితెగించిన ఆడది ఇది' అని మనసులో అనుకుని 'ఇంత తెల్లవారుజామున లేచి నడిస్తే ఇంకేమైనా వుందా- నాకు జలుబు చేస్తుంది' అని మాట్లాడే వ్యక్తి నాకు భర్తగా వద్దన్నయ్యా!

 

    'ఓ బ్రహ్మాండం- ప్రకృతితోపాటు లేచి నడవడం అద్భుతమైన అనుభవం' అనే ఈస్థటిక్స్ వుండే వ్యక్తి భర్తగా రావాలి. అంతే తప్ప కరెన్సీ కట్టల్ని పెట్టెలనిండా పేర్చుకున్న మనిషి నాకొద్దన్నయ్యా"

 

    "అలాంటి వ్యక్తి ఎవరినయినా సెలక్ట్ చేసుకున్నావా?"

 

    "చెప్పానుకదా- రెండు మూడుసార్లు చేసుకున్నానని" అన్నది అనూహ్య.

 

    "ఎవరతను?" మాయాదేవి ఉత్సుకతను ఆపుకోలేకపోతోంది.

 

    "మా లెక్చరర్- ప్రదీప్"

 

    అతనెవరో ప్రకాష్ కి గానీ, మాయాదేవికిగానీ తెలియదు. అందుకే ఇద్దరూ ఆమెవైపు బ్లాంక్ గా చూశారు.

 

    "నాకంటే ఓ సంవత్సరం సీనియర్. వెంటనే ఉద్యోగం వచ్చింది. గుండెల్లో జలపాతాలు దాచుకున్న వ్యక్తి. అప్పుడప్పుడు ఆ జలపాతాలు అక్షరాలై పేపర్లమీద ఘనీభవిస్తుంటాయి. మంచి పొయిట్"

 

    "మరి అతనికి నిన్ను చేసుకోవాలని వుండాలికదా" మాయాదేవి తన అనుమానాన్ని వెలిబుచ్చింది.

 

    "నా చదువైపోయిన రోజున చిన్న టీ పార్టీ ఇచ్చి విషయం చెప్పాడు. నేను సరేనంటే పెళ్ళి చేసుకుంటానన్నాడు. ఆలోచించి చెబుతానని అన్నాను. అంతే"

 

    "మరి నువ్వు ఓకే అంటే రేపే యూనివర్శిటీకి వెళ్ళి అతనితో మాట్లాడతాను."

 

    అనూహ్య ఎంత చదువుకున్నా, ఎంత నిర్మొహమాటంగా వ్యవహరించే వ్యక్తే అయినా బేసిక్ గా ఆమె స్త్రీ. అందుకే అన్నయ్య పెళ్ళి ఫిక్స్ చేస్తానని అనగానే ఆమె ముఖంలో నునులేతసిగ్గు బుగ్గలమీద గులాబీరంగులో పూసింది.

 

    ఇంక ఆలస్యం చేయకుండా మరుసటిరోజే ప్రకాష్ చలపతిరావుకి అనూహ్య పెళ్ళి ఓ లెక్చరర్ తో కుదుర్చుకుంటున్నట్టు లెటర్ రాశాడు.

 

    అది చలపతిరావు మనసులో ప్రకాష్ మీద పగను రగిల్చింది. అనూహ్య మీద ప్రతీకారాన్ని రేపింది.

 

    ఆ అన్నాచెల్లెలిద్దరిమీద కసి తీర్చుకోవడానికి ఆయన ఓ కొత్త పథకం వేశాడు. అందుకే అంత రాత్రిపూట రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చాడు.

 

    ఎద్దుబండి ఓ గోతిలో దిగి, పైకి లేవడంతో చలపతిరావుకి నడుం విరిగినంత పనయింది.

 

    ఆలోచనల గొలుసు తెగింది.

 

    మీరాభాయి ఎక్కడికెళ్ళాలి అని అడుగుతున్నాడు.

 

    అంటే వూరు వచ్చేసిందన్నమాట.

 

    చలపతిరావు చేతులమీద భారంమోపి మనిషంతా ఒకడుగు పైకి లేచి చూశాడు.

 

    మసక వెన్నెల్లో ఊరు వెన్నెలకు పట్టిన చెదలా వుంది. గాలి ఉరి వేసుకోవడానికి తెల్లటిదారాన్ని ఆకాశానికి తగిలించినట్టు చంద్రవంక ఊరి నెత్తిమీద వేలాడుతోంది. గాలి వీచకపోవడంవల్ల శరీరమంతా చెమటపోసి జిడ్డోడుతుంది.

 Previous Page Next Page