"అదెంత భాగ్యం" నాయకుడు కనుసన్న చేయగానే ఓ అందాల భరిణలాంటి గిరిజన కన్య మట్టిపాత్రలో మంచినీళ్ళను అందించింది.
ఆ నీళ్ళను కడుపారా తాగి కండువాతో పెదవులు తుడుచుకొని "మృత్యుకోన ఇక్కడికి ఎంతదూరం?" ప్రశ్నించాడాయన.
మృత్యుకోన. ఆ పేరు వినగానే ఆ గిరిజన నాయకుని కనుకదలికల మాటున భయం తొణికిసలాడింది.
"ఇక్కడికి పదిహేను యోజనాల దూరం. అయినా మా గిరిజనులే ఆ మృత్యుకోనకు వెళ్లడానికి భయపడతారు. అక్కడికి ఎందుకు స్వామీ?"
"సిద్ధమునిని కలుసుకోడానికి"
ఆ మాట వింటూనే ఆ గిరిజన తండా నాయకుడు దెయ్యం పట్టిన వాడిలా భయోద్వేగంతో బిగుసుకుపోయాడు. కొద్ది క్షణాలకు తేరుకొని "సిద్ధముని స్వామినా? ఎప్పటి మాట! నా చిన్నప్పటికే ఆయనకు అరవై ఏళ్ళు. సాధువుగారు అంటుండేవాళ్లం.
కొండల మధ్య ఏటిపక్కన పాడుపడిన అమ్మోరి గుడిలో వుండేవాడు. కొన్నాళ్ళపాటు అక్కడ చెట్ల కింద, పుట్టల మధ్య తిరిగేవాడు. ఆయన ఎప్పుడో చనిపోయుంటాడు కదా స్వామీ"
సన్నగా నవ్వాడు ఆజానుబాహుడు. "ఆ సిద్ధముని చనిపోలేదు. నేను ఆయనను కలుసుకోడానికి వెళుతున్నాను. ఎటు వెళ్ళాలో చెప్తే వెళతాను"
"మీ మాట ప్రకారమే ఆయన బతికుంటే ఆయనకు ఇప్పుడు నూట పాతికేళ్ళు దాటి వుంటాయి. నూటపాతికేళ్ళు ఒక మనిషి బతకడం సాధ్యమా స్వామీ?" అన్నాడు గిరిజన నాయకుడు.
"సాధ్యమే"
"దట్టమయిన కీకారణ్యంలో, క్రూరమృగాల మధ్యన అప్పటికే కొనవూపిరితో వూగిసలాడే సాధువు. ఇప్పటికి బతికున్నాడని మీకెవరు చెప్పారు? అయినా ఈ సమయంలో మీరక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. మరొక్కసారి యోచించుకోండి" గిరిజన నాయకుడు అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు.
"ఆయన బతికుంటాడు నాకు తెలుసు" నెమ్మదిగా అన్నాడు ఆ ఆజానుబాహుడు.
మతిస్థిమితం లేనివాడ్ని చూసినట్టుగా ఆ ఆజానుబాహుడి వైపు చూశాడు గిరిజన నాయకుడు.
"ఎలా వెళ్ళాలో చెప్తే..."
ఎలా వెళ్ళాలో చెప్పి మళ్ళీ హెచ్చరించాడు గిరిజన నాయకుడు. "అయ్యా! కోరి మృత్యువును కొనితెచ్చుకోవద్దు. దయచేసి నా మాట మన్నించండి...."
ఏదో చెప్పబోయిన గిరిజన నాయకుడికి మౌనంగా నమస్కరించి అతను చూపించిన దిశగా వడివడిగా నడవడం ప్రారంభించాడు ఆజానుబాహుడు.
కొండల మాటున చంద్రునిలా కనిపించాడు వేగంగా వెళుతున్న ఆ ఆజానుబాహుడు ఆ గిరిజన నాయకునికి.
ఒక దివ్య తేజస్సు కదిలిపోతున్నట్టుగా ముందుకు నడుస్తున్న అతనికి అప్రయత్నంగా రెండు చేతులు ముకుళించి నమస్కరించాడతను.
అంతలోనే నృత్య కోలాహల సంరంభ సూచకంగా కొమ్ముబూర నాదం శంఖ ధ్వనిలా ఆ అడవిలో మార్మోగింది. అది మరణమృదంగ ధ్వనిలా వినిపించింది గిరిజన నాయకుడికి.
* * * *
దట్టమైన కీకారణ్యంలో ఇంకా దట్టంగా పరుచుకున్న చీకటిని చీల్చుకుంటూ వెలుగు కిరణంలా నడుస్తున్నాడు ఆ ఆజానుబాహుడు.
వైదీశ్వరన్ కోయిల్ లో శివస్వామి చెప్పిన మృత్యు హెచ్చరిక అతనికి గుర్తుకు వచ్చింది హఠాత్తుగా. "సరిగ్గా నేటికి పదహారవరోజున రాత్రి పన్నెండుగంటల పది ఘడియలకు మీరు మృతజీవులు అవుతారు" సర్ర్ మని చలిగాలి చెవులకు కొట్టింది మృత్యు ఛాయలా.
ఆ ఆజానుబాహుడికి ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది. అతి కీలకమైన రెండో ప్రశ్నకు జవాబుకోసమే ఆ అన్వేషణ.
తనకు పునర్జన్మ వుందా? వుంటే వచ్చే జన్మలో తను ఏ రూపంలో జన్మిస్తాడు?
తను చనిపోయిన ఎన్ని నాళ్ళకు జన్మిస్తాడు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. జవాబు దొరికేవరకూ తన ఈ అన్వేషణ కొనసాగుతుంది.
స్థిర నిశ్చయుడయ్యి, ధీరగంభీరుడయ్యి, చలించని ఆత్మవిశ్వాసంతో ఎత్తయిన కొండల మలుపుల్లోంచి, రాక్షస వృక్షాల మధ్య నుంచి నడుస్తున్నాడాయన. ఎక్కడో చిరుతపులి నిద్రలో ఆవలిస్తున్న భీకరమైన నాదం, ఇంకెక్కడో పెద్ద వృక్షానికి తనను తాను చుట్టుకుంటూ కొండచిలువ చేస్తున్న వింత చప్పుడు, ఎక్కడి నుంచో ఒక నక్క వేసిన ఊళ.
పల్చటి వెన్నెల దట్టమయిన మంచుతో కలిసి అడవినంతా పూర్తిగా ఆక్రమించుకుంది.
భయంకరమయిన రాత్రి... మామూలు మనుషులు వూహించని, చూడని, దట్టమయిన కీకారణ్యంలో నాలుగో జాము ప్రవేశించింది.
ఆ ఆజానుబాహుడు ఎంత దూరం నడిచాడో తెలీదు. ఎంత వేగంతో నడిచాడో ఆయనకే తెలీదు. ఏదో చప్పుడుకి తల తిప్పి చూశాడు. చీకటి వెన్నెల్ని మింగేస్తున్న చీకటి. ఆ చీకట్లో అతని చెవులకు అప్పుడు వినిపించింది గలగలమని చప్పుడు.
ఆ ఆజానుబాహుడి పెదవుల మీద సన్నని చిరునవ్వు- గుండెలు తొణికిసలాడిన సంతృప్తి. ఆ గలగలమని శబ్దం నీటి శబ్దం.
అనంతమయిన సృష్టికి నీరే మూలం. అనంతమయిన జన్మలకు కూడా నీరే మూలం.
విశాలమయిన బూరుగుచెట్టు కిందకొచ్చి నిలబడ్డాడు. ఆ చెట్టుకి ఇరవై అడుగుల దూరంలో అస్పష్టంగా కనిపిస్తున్న వింత ఆకారంవైపు కనులు పరికించి చూశాడాయన.
ఒక్కక్షణం అయన కనులు అర్థ నిమీలితాలయ్యాయి.
తూర్పు కనుమల్లోని దట్టమైన అడవుల్లోకి రావడం అదే ప్రథమం. ఎప్పుడూ అడవి ముఖం కూడా చూడని తను ఎలా తెలిసినట్టుగా చీకటి దారిలో నడవగలిగాడు?
వింతప్రశ్న- జవాబులేని, దొరకని వింత ప్రశ్న.
ఇరవై అడుగుల దూరంలో వున్న వింత ఆకాశానికి దగ్గరగా వెళ్ళిన ఆ ఆజానుబాహుడు శిథిలమైపోయి నేడో రేపో కూలిపోవడానికి సిద్ధంగా వుండి వింత ఆకారంలా కనిపిస్తున్న ఒక రాతి కట్టడాన్ని ఆశ్చర్యంగా చూశాడు.
ఏవేవో జ్ఞాపకాలు అల్లుకుపోయిన కలల్లాంటి జ్ఞాపకాలు. మగత చూపుల్లో మసక బొమ్మల్లాంటి జ్ఞాపకాలు.
ద్వైతాదైత స్థితి. గబగబా ముందుకు నడిచి ఆ రాతి భవనంలోకి ప్రవేశించాడు.
చిరపరిచితమైన గదులు, ఆ గదుల్లో తను తిరిగిన జ్ఞాపకాలు. నిశ్శబ్దం... ఆ నిశ్శబ్దంతో కూడా ఆయనకు పరిచయమున్నట్లుగానే వుంది.
ఎవరో తనను పిలుస్తున్నారు. ఆ మాటలు తనకు వినిపిస్తున్నాయి అస్పష్టంగా. ఆ రాతిభవనం మధ్యన కాసేపు అచేతనంగా నిలబడి పోయాడు. అంతలో అతని చేతికి ఏదో మెత్తని వస్తువు తగిలింది.
కుడిచేత్తో ఆ వస్తువును తీసి ముఖానికి దగ్గరగా పెట్టుకుని చూశాడు! కొండనాగుపాము. నుదుటిమీద మణి. దాని నుదుటిమీద పెంపుడు జంతువును నిమిరినట్టుగా ప్రేమగా నిమిరి పక్కన పెట్టాడు ఎంతో నిబ్బరంగా.