"ఎక్కడికి వెళ్ళటం?" విసుక్కుంటూ అడిగాడు.
"ఎక్కడికా షాప్ కి... అంతా మర్చిపోయావా."
తల్లి చేతిలోని కాఫీ కప్పు అందుకుని గడియారంవైపు చూసాడు ఏడవుతోంది.
"నాకు మూడ్ ఏమీ బాగాలేదు..." కాఫీ చప్పరిస్తూ అన్నాడు.
"నేను నిన్ననే చెప్పాను కదమ్మా- నిన్న ఎక్కడో తుఫాను వచ్చి ఉంటుంది. అందుకే అన్నయ్య వెళ్ళాడు అని" జడ వేసుకుంటున్న శారద అంది నవ్వుతూ.
"నిజంగా వెళ్ళావా" తల్లి రెట్టించింది.
"మూడ్ బాగాలేదని చెప్పాను కదా-" విసుక్కుంటూ అన్నాడు శక్తి.
"మూడో- ముప్పయ్యో నాకు తెలీదు... ఇవాళ ఒక్కరోజు వెళ్ళరా- రేపట్నుంచీ నాన్నగారు వెళతారులే... మా చిట్టిబుజ్జాయివి కదూ" బుజ్జగింపుగా అంది తల్లి.
మరేం మాట్లాడలేకపోయాడు శక్తి. ఖాళీ కప్పుని తల్లి చేతిలో పెట్టి విసురుగా లేచి పెరట్లోకి వెళ్ళాడు.
అరగంటలో తయారైపోయాడు. మాట్లాడకుండా తల్లి పెట్టేసిన టిఫెన్ తినేసి ఇంట్లోంచి బయటపడ్డాడు.
* * * *
రోడ్డుమీదకు రాగానే శక్తి కళ్ళు నాలుగురోడ్ల కూడలిలో చటుక్కున ఆగిపోయాయి.
అక్కడకు మిగతా మిత్రులంతా రావటం, హోటల్ దగ్గరకు వచ్చి సిగరెట్లు, కాఫీల కార్యక్రమంలో పడటంతో పని విషయం పూర్తిగా మర్చిపోయాడు శక్తి.
పదకొండయింది.
"అలంకార్లోకి- జేబా భక్తియార్ సినిమా వచ్చిందిరా... వెళదామా" ప్రపోజ్ చేసాడు జగపతి.
"సినిమానా?" నీరసంగా అన్నాడు శక్తి.
"ఏంరా... అంత నీరసంగా రెస్పాన్స్ ఇచ్చావ్?"
"ఇదేం నీ మేనత్త కూతురా?" నవ్వుతూ అన్నాడు శక్తి.
"అలా తీసి పారెయ్యకురోయ్.... నీకు జపాన్, తైవాన్, సౌత్ కొరియా మనుష్యులంటేనే ఇష్టం... నీదేం టేస్టురా బాబూ... అస్సలు నీకు దేశభక్తి లేదురా... మనదేశంలోని అమ్మాయిల్ని మనం ప్రేమించక పోతే ఎవరు ప్రేమిస్తారురా? ప్రేమించాలి... మన ప్రక్కింటి అమ్మాయిని మనం ప్రేమించటం నేర్చుకోవాలి. మన శ్రీదేవిని మనం ప్రేమించటం నేర్చుకోవాలి."
"శక్తీ... టైమ్ వేస్ట్ చేయకు" రమణరావు ప్రోగ్రాం ఫిక్స్ చేయటంతో మిత్ర బృందంతో ముందుకు కదిలాడు శక్తి.
బృందమంతా బస్ స్టాండ్ కు వచ్చింది అక్కడ. బస్సు ఎక్కితే జగ్గయ్యపేట అరగంట ప్రయాణం... కదులుతున్న బస్సులోకి అందరూ ఎక్కేసారు. చివరగా ఎక్కబోతున్నాడు శక్తి. బస్సు వేగం పుంజుకుంది.
అదే సమయంలో-
శక్తి చేతిని పట్టుకుని ఎవరో లాగటంతో, క్రింద పడబోయి నిలదొక్కుకుని, ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని కోపంగా చూసి, అంతలోనే మామూలు స్థితికి వచ్చాడు శక్తి.
బస్సు ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది.
"మీరా..." ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు శక్తి.
ఆ వ్యక్తి కిరాణాషాపు యజమాని సూర్యం.
"ఏమయ్య శక్తీ ఏంటిది... నిన్నొచ్చావ్, బుద్ధిగా పనిచేసావు.... ఇవాళ మాయమైపోయావ్.... పదిగంటలదాకా వస్తావు, వస్తావని ఎదురుచూసి మీ ఇంటికి మనిషిని పంపాను. ఎప్పుడో వెళ్ళిపోయావని చెప్పారు నిన్ను వెతుక్కుంటూ నేనే బయలుదేరాను..." కోపంగా అన్నాడు సూర్యం.
"షాప్ కనే బయలుదేరానండీ... కానీ..." ఏదో చెప్పబోయాడు శక్తి.
"అప్పుడే ఏమైపోయింది? ఫ్రెండ్స్ కనిపించగానే మాయమైపోయిందా? కొటేషన్ కన్పించగానే కన్పించింది. కన్పించినట్లు వ్రాసుకుంటే ఉపయోగం లేదు. ఒక్క కొటేషన్ తెల్సినా దాన్ని జీవితకాలం ఎవడు ఆచరిస్తాడో వాడే విజయం సాధిస్తాడు. మనదేశంలో ఎవరికీ సూటబుల్ జాబ్ లేదు. అసలు ఏదో ఒక జాబ్ ఐనా లేదు. లేనంత మాత్రాన వ్యవస్థను తిట్టి, టుమారో ఐ విల్ బికమ్ ఏ గ్రేట్ అని అనుకుంటే మూర్ఖత్వం. రేపు అనేది లేదు టుమారో ఈజ్ నో వేర్- టుడే ఈజ్ ఎస్టర్ డేస్ టుమారో.... ఈరోజు. నిన్నటి రేపు. ఎంత చిన్నదయినా పనిచేసేవాడే పైకి వస్తాడు. కానీ ఆత్మవంచన ముసుగు క్రింది సిద్ధాంతాలు రూపొందించుకుంటే మిగిలేది అలంకార్లో సినిమా మాత్రమే."
శక్తి తల వంచుకొని సూర్యం ప్రక్కనే నడుస్తున్నాడు. ఏమీ బదులు చెప్పలేని పరిస్థితి.
"చింతపండు అమ్ముకునే వీడు బిజినెస్ ఫిలాసఫీ చెప్పటం ఏమిటి అనుకోకు- నేను చెప్పే దాంట్లో మంచి వుంటే గ్రహించు... క్రింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఈ ఆస్థితోనే నేను పుట్టానను కుంటున్నావా? లేదు... ఎదగాలన్న ఆలోచన నన్ను ఇంతవాడిని చేసింది. ఒక మారుమూల పల్లెటూర్లో రోడ్డు కూడా లేని పల్లెటూర్లో పుట్టినవాడిని. కీసరరోడ్డు ప్రక్కన టీ పాక వుండేది మా నాన్నకు. అప్పట్లో మా నాన్న చచ్చిపోయాక ఆ టీ పాక నేనే నడిపాను. ఇలా ఎన్నాళ్ళు? మనమేమీ చెయ్యలేమా? ఇలాగే ఈ పల్లెటూళ్ళో ఎదగలేని పరిస్థితుల మధ్య ఇలాగే వుండిపోతామా? ఎన్నోరోజులు ఆలోచించాను. ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ వూరు విడిచి పెట్టేయాలని... వున్న ఊర్లో మన ప్రతిభ వికసించదయ్యా... ఆ వూర్నుంచి, ఆ మనుషుల నుంచి బైట పడాలి... బైట పడ్డాను... ఈ వూరు వచ్చాను... ఇరవైఏళ్ళ క్రిందటి మాట...
రాగానే షాపు మొదలు పెట్టాననుకున్నావా? తెలియని వూరు, తెలీని మనుషులు, పని చేసుకుని బ్రతుకుదామంటే పనిచ్చేవాడు లేడు. టీ బడ్డీ పెట్టుకుందామంటే నా దగ్గర అంత డబ్బులు లేవు. సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. ఒక పూట పస్తులు... అర్థాకలి... మనం ఏమీ చెయ్యలేమంటే ఏమీ చెయ్యలేము మనకు అసాధ్యం అనేదే లేదనుకుని దిగామనుకో కొంతలో కొంత మనం సాధిస్తాం. దానికితోడు అదృష్టం కూడా కలిసిరావాలనుకో. ఇంట్లో కూర్చుని అదృష్టాన్ని రా రమ్మంటే రాదయ్యా. నువ్వు చేసే పనే ఆ అదృష్టం వల్ల వచ్చిందనుకో- నీకో ఆలోచన రావటమే అదృష్టమనుకో.
పనికోసం ఎందరెందరి కాళ్ళో పట్టుకున్నాను.
దొరకలేదు-