Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 11


    3. అరణుల నుండి పుట్టిన అగ్నీ ! నీవు మాకు హోతవు. దర్భలు పరచియున్నవి. ప్రశంసనీయులయిన దేవతలను పిలుచుకొని రమ్ము.

    4. అగ్నీ ! నీవు దేవదూతవు. దేవతలను తీసికొని రమ్ము. వారితో పాటు నీవును కర్మలయందు ఆసీనుడవు అగుము. ఆపి హోతాన ఈఢ్యః

    5. అగ్నీ ! హవనములందు నీవు ఘృతములచే ప్రజ్వలితుడవు అగుదువు. క్రూరకర్మములు చేయు రాక్షసులను దహించుము.

    6. అగ్నినాగ్నిస్సమిధ్యతే అగ్ని నుండి అగ్ని జనించుచున్నది. జ్వలించుచున్నది. అది ఆహవ అగ్ని అగును. అతడు మేధావి అగును. గృహపాలకుడు అగును. నిత్యయవ్వనుడు అగును. హవ్యవాహనుడు అగును. జుహూముఖుడును అగును.

    (హోమ ద్రవ్యములను అగ్నిలో అర్పించుటకు వాడబడు కర్ర గంటెవంటి సాధనము జుహువు)

    7. అగ్ని పండితుడు. సత్యధర్ముడు. రోచమానుడు. రోగనాశకుడు. అందువలన అగ్నిని స్తుతించుడు.

    8. అగ్నిదేవా ! నిన్ను దేవదూతగా సేవించు యజమానికి రక్షకుడవు అగుము. తప్యస్మ పావితాభవ

    9. దేవతలకు హవిస్సులు అర్పించుటకు అగ్నిని సేవించు యజమానిని సుఖపెట్టుము. తస్మైపావకమృళయ 

    10. జ్వలించు అగ్నీ ! పావకా ! యజ్ఞమునకు దేవతలను కొనిరమ్ము. మా హవిస్సులను దేవతలకు అందించుము.

    11. అగ్నీ ! ఈ సూక్తము నవీనము. గాయత్రీ ఛందస్సుగలది. ఈ సూక్తమున నిన్ను స్తుతించుచున్నాము. మాకు ధనమును, శూర సంతానమును ప్రసాదించుము. రయిం వీరవతీమీషమ్.

    12. అగ్నీ ! నీవు ధవళకాంతితో ప్రకాశింపుము. దేవతలను స్తుతించు స్తవములతో నిన్ను సుతించుచున్నాము. స్తోత్రములను పరిగ్రహింపుము.

              పదమూడవ సూక్తము - ఋషి - కణ్వపుత్రుడు మేధాతిథి,
           దేవతలు-ఋక్కులకు వేరువేరు దేవతలు, ఛందస్సు-గాయత్రి.


    1. సమిద్ధ నామక అగ్నీ ! దేవతలను యజమాని ముందుకు తెమ్ము. నీవు శుద్ధిచేయగలవాడవు. హోమము జరిపించువాడవు. యాగమును నిర్వహింపుము.

    2. అగ్నీ ! కవీ ! నీవు మధుమంతములగు ఆహారములు కలవాడవు. రసవంతమగు అన్నము అందించుచున్నాము. దీనిని దేవతలకు అందించుము.

    3. మధుజిహ్వం హవిష్కృతమ్ నరాశంస అగ్ని తీయని పలుకులవాడు. హవిస్సు కలిగించువాడు. అట్టి అగ్నిని ఆహ్వానించుచున్నాము.

    4. ఇడ అను అగ్నీ ! నిన్ను స్తుతించుచున్నాము. సుఖకరములయిన రథములమీద దేవతలను తీసుకొనిరమ్ము. మంత్రములచే నిలిపిన దేవతలను కూడ నీవే పిలువవలసిన వాడవు.

    5. ఋత్విజులారా ! దర్భలను నేతికుండలకింద పరచుడు. అందువలన వానికి అమృతత్వము కలుగును. యత్రామృతప్యచ క్షణమ్

    6. యజ్ఞమున సత్యము వృద్ధిపొందును. ప్రకాశించును. అంతగా జన సమ్మర్దము ఉండని యజ్ఞద్వారములను నేడో రేపో తెరువవలసి ఉన్నది.

    7. రాత్రింబవళ్లను అగ్నులను యజ్ఞమునందలి దర్భవేదికల మీదకు ఆహ్వానించుచున్నాము. ఇదం వో బర్హి రాపదే.

    8. నక్త ఉషస, రాత్రింబవళ్ల అగ్నులు, శోభన జిహ్వలు కలవి. హోమము జరిపించునవి. దేవతా సంబంధమయినవి. మేధావులు ఆ రెండు అగ్నులు యజ్ఞమును ప్రవర్తింప చేయవలెను.

    9. ఇళ, సరస్వతి, మహి అను ముగ్గురు దేవతలు సుఖప్రదులు, నాశ రహితులు. వారు దర్భలమీద ఆసీనులు కావలెను. బర్హిః సీదం త్వస్రిదః

    10. త్వష్ట అను అగ్ని శ్రేష్ఠుడు అగును. బహురూపుడు అగును. అతనిని ఆహ్వానించుచున్నాము. అతడు మాకు మాత్రమే కావలెను. అస్మాకమస్తు కేవలం

    11. వనస్పతి అగ్నీ ! హవిస్సులను దేవతలకు, విజ్ఞానమును యజమానులకు అందించుము.

    యాజకులారా ! స్వాహానామక అగ్నిగల యాగమును ఇంద్రునకు అర్పించుడు. దేవతలను ఆహ్వానింతము.

    ఆలోచనామృతము :

    1. మానవునకు విశ్వాసము కలిగించుట అతి కష్ట కార్యము. మధుచ్ఛందుడు, అతని పుత్రుడు జేతుడు ఇంద్రుని సర్వశక్తిమంతుని, అధిష్టాన దేవతను చేయుటకు ప్రయత్నించినారు. ప్రజలకు అగ్నిమీది విశ్వాసము సడలినట్లు కనిపించదు.

    మేధాతిథి మరల అగ్నిని ప్రతిష్ఠించుటకు ఇక్కడ ప్రయత్నించినాడు. అగ్నికి గల నానా రూపములను, నామములను, అగ్ని ప్రభావమును పేర్కొన్నాడు.

    2. ఇళ, సరస్వతి, మహి తిస్రోదేవీ ముగ్గురు దేవేరులు.

    ఇళ కీర్తనీయ. మాతృభూమి.

    సరస్వతి జ్ఞానదేవత. మాతృ సంస్కృతి.

    మహిని భారతి అని కూడ అందురు. మహి భూమి అగును.

    సూర్యుడు భరతుడు. అతని వెలుగు భారతి. మహి మాతృభాష అగును.

    వీరు ముగ్గురు వెలుగును ఇచ్చువారు. అందువలన అగ్నులు.

                                      పదునాలుగవ సూక్తము

        ఋషి - కణ్వపుత్రుడు మేధాతిథి, దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి.


    1. అగ్నీ ! నేను స్తుతించుచున్నాను. దేవతలందరిని కూడి సోమపానమునకు విచ్చేయుము. యజ్ఞము గావింపుము.

    2. మేధావివగు అగ్నీ ! నిన్ను యాజకులు ఆహ్వానించుచున్నారు. నీవు చేయు కార్యమును వివరించుచున్నారు. దేవతలతో కూడి విచ్చేయుము. దేవే భిరగ్న ఆగహి

    3. అగ్నీ ! ఇంద్రవాయువులను, మిత్రుని, పూషదేవుని, భగుని, ఆదిత్యులను మరుత్తులను యజించుము.

    4. ఇంద్రాది దేవతల కొరకు పాత్రలలో సోమము సిద్దముగా ఉన్నది. అది తృప్తికరము, హర్షదము, బిందురూపమున మధురమై ఉన్నది.

    5. ఋత్విజులు మేధావంతులు. వారు దర్భలను పరచినారు. హవిస్సులను అలంకరించినారు. హవిష్మంతో అరంకృతః

    6. అగ్ని నేతిరంగు వీపుగలవాడు. అతని తలంపు మాత్రమున రథము, అశ్వములు సిద్ధమగును. ఆ అగ్ని దేవతలను సోమపానమునకు తోడ్కొని రావలెను.

    7. అగ్నీ ! నీకు చక్కని నాలుకలు ఉన్నవి. పత్నుల సహితులగు దేవతలను యజ్ఞమునకు తీసికొని రమ్ము. మధుర సోమములను త్రావింపుము. మధ్వః సుజిహ్వాపాయమ్

    8. మేము దేవతలను స్తుతించుచున్నాము. యజించుచున్నాము. మేము 'వషట్' అందుము. అప్పుడు ఆ దేవతలు నీ నాలుకలతో మధురమగు సోమమును సేవించవలెను.

    9. అగ్నిమేధావి అగును. హోమము కలిగించువాడు అగును. సూర్యుడు వెలుగులు పరచును. అప్పుడు దేవతలు మేల్కొందురు. మేల్కొన్న దేవతలను అగ్ని ఆ లోకము నుండి ఈ లోకమునకు తెచ్చును.

    10. విశ్వేదేవతలతోను, ఇంద్రునితోను, వాయువుతోను, సూర్యకిరణములతోను కలిసి అగ్ని సోమరస మాధుర్యమును గ్రోలును. పిబామిత్రస్యదామభిః

    11. అగ్నీ ! నీవు హోతలు చేయు యజ్ఞములందును, సామాన్యులు చేయు యజ్ఞములందును ఆసీనుడవు అగుదువు. నీవు మా యజ్ఞమును గావింపుము. సేమం వో అధ్వరం యజః

    12.  అగ్నీ ! నీ అశ్వములకు రోహితములు అని పేరు. అవి వేగవంతములు. రథారూఢులను వహించగలవి. వానిని నీ రథమునకు పూన్చుము. దేవతలను, ఆ రథముమీద ఇచటికి తీసుకొని రమ్ము.

             పదిహేనవ సూక్తము - ఋషి - కణ్వపుత్రుడు మేధాతిథి
              దేవతలు - వేరువేరు దేవతలు, ఛందస్సు - గాయత్రి.


    1. ఇంద్రా ! ఋతువుల సహితుడవయి సోమపానము చేయుము. ఆయా ఋతువులందలి సోమములు నీకు తృప్తికలిగించ గలవు. నిన్ను చెందగలవు.

    2. మరుత్తులారా ! మీరు మంచిదాతలు. మంచి మిత్రులు, 'పోత' అని పేరుగల యాజకుని పాత్రలోని సోమమును ఋతువుల శితులయి పానము చేయుడు. యజ్ఞమును పానము చేయుడు.

    3. భార్యాసహితుడవయిన త్వష్టా ! ఋతువుల సహితుడవయి సోమపానము చేయుము. నీవు రత్నములను ఇచ్చువాడవు. త్వంహాయ్ రత్నధా ఆసి

    4. అగ్నీ ! దేవతలనుగొని రమ్ము. ఉదయము, పగలు, సాయంత్రము జరుగునట్టి కర్మములందు వారిని ఆసీనులను చేయుము. వారిని అలంకరింపుము. ఋతువుల సహితుడవయి సోమపానము చేయుము.

    5. ఇంద్రా ! ఋతువులతో నీ స్నేహము అవిచ్చిన్నము. 'బ్రహ్మణాచ్ఛంసి' అను యాజకుని పాత్రలో సోమము ఉన్నది. ఋతువులు సోమపానము చేయుదురు. అనంతరము నీవు సోమమును త్రావుము.

    6. ధృతవ్రతులయిన మిత్రావరుణులారా ! ఋతువుల సహితులయి మా యజ్ఞమున సంచరింపుడు. ఋతువాయజ్ఞ మాశాథే

    7. ఋత్విజులు ధనము కోరువారు. వారు సోమరసము తీయుటకు రాతిని చేత ధరింతురు. అగ్నిని యజ్ఞములందు నుతింతురు. అగ్ని ధనములను ఇచ్చువాడు. ద్రవిణోదా

    8.  ఆయా దేవతలు వివిధ ధనములను ఇవ్వగలవారని విన్నాము. వారు ఆయా ధనములను మాకు ఇవ్వవలెను. దేవతల నిమిత్తమే ఆ ధనములను మేము కోరుచున్నాము. దేవేషు తావనామహే

    9. అగ్ని ధనములను ఇచ్చువాడు. ఋతువుల సహితుడయి 'నేష్ట' అను పాత్రలో సోమము త్రావగోరును. యాజకులరా ! హోమ స్థలము చేరుడు. హోమము చేయుడు. సాగుడు.

    10. ధనములను ఇచ్చు అగ్నీ ! నీవు ఋతువులలో నాల్గవ వాడవు. నిన్ను యజించుచున్నాము. మాకు ధనముల నొసగుము.

    11.  అశ్వినులారా ! మీరు జ్వలించు అగ్నిసములు. పవిత్ర కర్ములు. ఋతువుల సహితులయి యజ్ఞమున మధువును సేవింపుడు. ఋతువా యజ్ఞవాహసా

    12. పలప్రదాతవగు అగ్నీ ! నీవు గార్హపత్య రూపమున యజ్ఞమును నిర్వహించుచున్నావు. యజమాని కొఱకు దేవతలను యజింపుము.

    ఆలోచనామృతము :

    1. ఋతువులను మహర్షులు తొలిసారిగా దర్శించి ఉండవచ్చును. ఆ విషయమయిన ఉత్సాహము ఈ మంత్రములందు కనిపించును. ఋతువులకు దేవతలతో సమాన స్థాయి కల్పించినారు. ఇంద్రునకు ఋతువులతో సఖ్యము అవిచ్చిన్నము అన్నారు. తవేద్ధి సఖ్యమసృతమ్. అగ్నిని యత్వా తురీయం ఋతుభిః.ఋతువులతో నాల్గవ వాఢవు అన్నారు. ఋతువులను అగ్నిసములను చేసినారు.

    2. అగ్నులు మూడు. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని.

                                      పదునారవ సూక్తము

        ఋషి-కణ్వపుత్రుడు మేధాతిథి, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-గాయత్రి.

    1. ఇంద్రా ! నీవు వర్షప్రదాతవు. హర్యాశ్వములు నిన్ను వహించి తేగలవు. ఋత్విజుల మంత్రములు నిన్ను సూర్యునివలె ప్రకాశింప చేయగలవు.

 Previous Page Next Page