Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 12

"సంతోషం! చాలా మంచి పని  చేస్తున్నావు" ముక్తసరిగా అన్నాడు ఆనందం.
ఆ నిర్మానుష్యమైన ప్రాంతానికి ఎందుకు ప్రయాణం పెట్టుకున్నాడో చెప్పకుండా, టెలిగ్రాఫ్ భాషలో మాట్లాడుతున్న యజమాని అంతరంగమేమిటో సింహాచలానికి అంతుపట్టలేదు. అంచేత అతను కొంచెం ఆందోళనతోనే యజమానిని అనుసరిస్తున్నాడు.
వారిద్దరూ కొండ ప్రాంతానికి చేరుకోగానే, వారికి అక్కడ పరమానందం, భద్రాచలం కనిపించారు. వారిని చూడగానే సింహాచలం నూటికి నూరుపాళ్లు కీడునే శంకించేడు.
పరమానందం ఆనందాన్ని ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకున్నాడు.
సింహాచలం భద్రాచలాన్ని చేరుకుని ఈ మీటింగ్ పరమార్థమేమిటని కళ్లతో ప్రశ్నించాడు. నాక్కూడా తెలియదని భద్రాచలం పెదవి విరిచేడు.
"నువ్వు రావనుకున్నా!" అన్నాడు పరమానందం.
"నే వొచ్చేవేళకు నువ్వు వుండవని నే ననుకున్నా!" అన్నాడు  ఆనందం.
"మనం పందాలు మానుకున్నందుకు ఊరు ఊరంతా ఆనందిస్తోంది."
"వాళ్ల ఆనందం చెక్కు చెదరకుండా కలకాలం వుండాలి."
"అదే నేనూ కోరుకుంటున్నా!"
"నాకు నువ్వొక్కడివే విరోధివి!"
"నాకు నువ్వే శత్రువ్వి!"
యజమానుల మాటలు వింటూ భయపడి ఛస్తున్నారుగుమాస్తాలు.
"మనది పాడు బుద్ది!"
"అయినా రెండునెలల పాటు పందాలు మాని బుద్దిగా బఠాగ్గలిగాం."
"ఇక నాకు ఓపిక క్షీణించింది."
"నాకూ అంతే!"
"ఒకే ఒక్కటి! అతి పెద్ద పందెం!"
"ఆ పందెంలో నువ్వో, నేనో అయిపోవాలి!"
"రెండు చేతులూ కలుస్తేనే చప్పట్లు!"
"ఒక చెయ్యి విరిగిపోతే ఆ ముచ్చట్లకు స్వస్తి!"
"అందుకే నా యావదాస్తి నీ పేరిట రాసి తీసుకొచ్చా!"
"నేను కూడా అదే చేశా! నా  యావదాస్తీ నీ పేర రాసుకొచ్చా!"
"ఇద్దరూ దస్తావేజులు తీసేరు. ఒకరి దస్తావేజుని మరొకరు తనిఖీ చేసేరు.  అందులో రాతలు సమంగా వున్నందుకు సంతోషించేరు.
"ఒకే ఒక పందెం! జీవితంలో చివరి పందెం!" అన్నాడు పరమానందం.
"ఆ పందెంలో నువ్వో, నేనో సర్వనాశనమైపోవాలి!" అన్నాడు ఆనందం.
"ఇద్దర్లో ఒకడు కూలిపోతే భవిష్యత్తులో పందాలకు తావే వుండదు. సపోజ్ నువ్వు ఓడిపోయావనుకో, నీ మేడా, నీ సిరిసంపదలు అన్ని నాకు దక్కుతాయి. అప్పుడు నువ్వు గెడ్డం పెంచుకుని డాల్డా డబ్బా  ఊపుతూ 'ధర్మం చెయ్యండి బాబూ! ' అని అడుక్కుంటావు. ఎవడో కాల్చిపారేసిన సిగరెట్టు పీకను పరుగెత్తికెళ్లి తీసుకుని ఆప్యాయంగా కాల్చుకుంటావ్! అవునా ఆనందం?" అన్నాడు పరమానందం.
పరమానందం వర్ణించిన భవిష్యత్తు దృశ్యాన్ని పూర్తిగా చూసిన సింహాచలం తట్టుకోలేక "అయ్యగారూ!" అని బావురమని ఏడుస్తున్నాడు.
"ఇందుకా బాబూ, నన్నింత దూరం నడిపించేరు! ఇన్నాళ్లూ పందల్లెకుండా గడిపారంటే బుద్దిమంతులయ్యారని ఊరివాళ్లతోపాటు నేను కూడా అనుకున్నాను. ఒకేసారి ఇంత ఘోరమైన పందెం కోసమాండీ, ఇన్నాళ్లూ ఆగారు? వద్దండీ, వద్దు! ఈ సంగతి అమ్మగారికి తెలుస్తే తప్పకుండా ఉరి పోసుకుంటారు. నే చెప్పేస్తా!" అన్నాడు సింహాచలం ఏడుస్తూనే ఆవేశంగా.
"చంపుతా!" అరిచేడు ఆనందం.
"ఎవర్ని బాబూ?" అడిగేడు సింహాచలం ఏడుపు ఆపి.
"నిన్ను! నిన్ను చంపుతా! అమ్మగారికి కానీ, ఊళ్లో ఎవరికి గానీ మా చివరి పందెం గురించి తెలియకూడదు!" అన్నాడు ఆనందం.
"తెలిసిందో, ముందు మీ గుమాస్తాల అంతు చూస్తాం!" అన్నాడు పరమానందం.
"అయినా సింహాచలం....." అన్నాడు ఆనందం.
"చిత్తం!"
"మనం  ఓడిపోతామని ఎట్లా అనుకున్నావు?" అడిగేడు ఆనందం.
"చిత్తం! ఆయనంత ఇదిగా చెబుతుంటే...."
"నేనింకా ఇదిగా  చెబుతాను విను!" అన్నాడు ఆనందం.
"చిత్తం, చెప్పండి!" అన్నాడు సింహాచలం.
ఆనందం చెప్పడం ప్రారంబించేడు.
"ఈ చివరి పందెంలో పరమానందం తప్పకుండా ఓడిపోతాడు. దాని ఫలితంగా గోచీ పెట్టుకుని డ్రైనేజి పైపులు బాగు చేసే వృత్తి చేపడతాడు. చెత్త కుండీలు వెతుక్కుంటారు. అందులో విస్తరాకు పోట్లమొకటి దొరుకుతుంది. కుండీ పక్కన  కూర్చుని ఆ పొట్లంలో మిగిలిన మెతుకుల్ని నముల్తుంటాడు. అప్పుడు ఈ పరమానందం గుమాస్తా  ఈ భద్రచలం కూడా గోచీ పెట్టుకుని  అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తాడు. పొట్లంలోని మెతుకుల కోసం చెయ్యి జాపుతాడు. పరమానందం ఒక్క మెతుక్కూడా పెట్టానని  అక్కడ్నించి పారిపోతాడు. పరమానందం వెనక భద్రాచలం ఆకలి కడుపుతో" అని ఆనందం ఇంకా  ఏదో చెప్ప బోతుండగా......
"ఆపండి" అన్నాడు భద్రాచలం. ఆ తర్వాత అతను  మూర్చరోగిలాగా తన్నుకుంటున్నాడు.
అతడ్ని సముదాయిస్తున్నాడు పరమానందం.
"పిచ్చివాడా? జీవితంలో ఒడిదుడుకులు సర్వసాధారణం. ప్రతిరోజూ వాటి ఒత్తిడితో      నలిగిపోయే దాని కంటే - ప్రజాక్షేమం కోసం ఒకే సారి అటో ఇటో తేల్చుకోడం ఉత్తమ లక్షణం. ఇప్పుడు జరుగుతున్న చివరి పందెం ఆ లక్షణానికి సంబందించినదే! అమ్మగార్తోగాని, వీథి వాళ్లతో గాని ఈ పందెం గురించి చెప్పకుండా నీ స్వామి భక్తి నిరూపించుకో!"
పరమానందం చేసిన  ఉపదేశం  విని గుండె   రాయి చేసుకున్నాడు భద్రాచలం.
అప్పటికే వేళ ఉదయం పది గంటలయింది.
"పందెం మాటేమిటి?" అడిగేడు ఆనందం.
"ఏమిటి వెతుకుతున్నావ్?" అడిగేడు ఆనందం.
"ఇదిగో....ఇటు చూడు" అన్నాడు  పరమానందం.
"చూసేను. అదొక  చీమ బద్దకంగా తొంగుందో అన్నాడు ఆనందం.
"ఆ  చీమను నేను  చేత్తో తాకి నిద్ర  లేపుతాను. అప్పుడని ఏ పక్కకి పోతుంది?" అడిగేడు పరమానందం.
"ఖచ్చితంగా అది కుడి పక్కకే వెడుతుంది!" అన్నాడు ఆనందం.
"కాదు  ఎడం పక్కకి పోతుంది. పందేనికి సిద్దమేనా?" అడిగేడు పరమానందం.
"సిద్దమే?" అన్నాడు ఆనందం.
"భద్రాచలం సింహాచలం ఆ వీర ఘోర  పందేన్ని  చూడలేక కళ్లు మూసుకున్నారు. పరమానందం చీమను చేత్తో తాకేడు.
చీమ పాకుతోంది. అయితే అది కుడి ఎడమలకు పాకడం లేదు ముక్కు సూటిగా పాకుతోంది!
"చీమా! కుడి! కుడి పక్కకి" అరిచేడు ఆనందం.
"ఎడమ! ఎడమ పక్కకి "పరమానందం కూడా అరిచేడు.
"యజమానులు అరుస్తుంటే కళ్లు విప్పేరు గుమాస్తాలు యజమానుల అరుపులు శృతి మించుతున్నాయి. వారితో పాటు అరవకపోతే ఏం కొంప మునుగుతోందోనని గుమాస్తాలు కూడా అరవడం ప్రారంభించేరు.
"చీమా - కుడికి!"
"చీమా - ఎడమకి!"
అని ఆ నలుగురు ఆరుస్తుండటంతో ఆ ప్రదేశం రేసు  కోర్సుని గుర్తుచేస్తోంది.
పరుగెత్తే గుర్రాలను ఉత్సాహ పరిచేందుకు ఏవిధంగా అరుస్తారో -  అదే జాతి అరుపుల్తో వాళ్లు చీమను ఉత్సాహ పరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
చీమ గుర్రం కంటే చాలా చిన్నది. అతి చిన్నది. వాళ్ల  అరుపుల భీభత్సానికి భయపడి  గుండె పగల గొట్టుకుందో ఏమో గాని - అది ఎటూ కదల లేక  ఒకచోట ఆగిపోయింది.
పందెం తాలూకు అరుపులు మాత్రం ఆగలేదు.
ఇప్పుడు  నలుగురూ ఏక కంఠంతో 'కదులూ' అని అరుస్తున్నారు.
చీమ కదలలేదు. యజమానులకు అనుమానం కలిగింది. చీమను పరిక్షించి చూసేరు.
ఆ అల్ప జీవి అప్పటికే  ఆందోళనతో అలసిపోయి  మరణించింది.
పందెం ఎటూ తేల్చకుండా మరణించిన చీమను యజమానులు తిట్టి పోసేరు. గుమాస్తాలు అయ్యో పాపం! అని అనుకుంటున్నారు.

 Previous Page Next Page