ఎందుకైనా మంచిదని ఫోను తీసుకుని పరమానందం నంబరు డయల్ చేసేడు.
అవతల్నింఛి పరమానందం "హల్లో!" అన్నాడు.
"ఏం చేస్తున్నావ్?" అడిగేడు ఆనందం.
"టీ.వీ చూస్తూన్నా!" జవాబిచ్చేడు పరమానందం.
"నేను కూడా ఆ పని మీదే వున్నాను. ప్రస్తుతం హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రామ్ లు చూస్తున్నా."
"నేను కూడా ఆ ప్రోగ్రామ్ లే చూస్తున్నా!"
"చూడు, బాగాచూడు! 'కొద్దిసేపట్లో వార్తలు' అనే బోర్డును చూస్తూన్నావా?"
"చూస్తున్నా! అక్షరాలకంటే బోర్డు డాబుసరిగా వుంది."
"బోర్డు వదిలేయ్! వార్తలు ఎవరు చదువుతారు?"
"ఎవరు చదువుతారని నువ్వనుకుంటున్నావు?"
"తప్పకుండా చలపతిరావు చదువుతాడు."
"పందె మెంత?"
"వెయ్యిన్నూట పదాహర్లు."
"చెక్కు సిద్దం చెయ్యి!"
"నువ్వు కూడా ఆపని మీదే వుండు!"
ఇద్దరూ చెక్కుల మీద సంతకాలు చేసేరు.
టీ.వీలో బోర్డు మాయమై వార్తలు చదివే మనిషి కనిపిస్తున్నాడు. 'నమస్కారం' అన్నాడు చలపతిరావు. టీ.విలో చలపతిరావు కనిపించినందుకు ఆనందం సంతోషించేడు. పందెం తానే గెలిచాడు!
ఆ వెంటనే 'నమస్కారం' అంటూ తిరపతిరావు కూడా కనిపించేడు. టీ.విలో తిరుపతిరావు కనిపించినందుకు పరమానందం ఆనందించేడు. పందెంలో తాను ఓడిపోలేదు.
"ఆనందం ఇంట్లో- -
"అయ్యా! కొంపలంటుకున్నాయి" అని హడావుడిగా, ఖంగారుగా సింహాచలం పరుగెత్తుకుంటూ ఆనందం గదిలోకి ప్రవేశించేడు.
సింహాచలం చేసిన కామెంటుకి తాత్పర్యం తెలుసుకోలేక అతన్ని ఎగాదిగా చూసి అడిగేడు ఆనందం-
"ఎవరి కొంప?"
"మన కొంపేనండీ! అమ్మగారు క్షణంలోనే, అరక్షణంలోనో కాలి కింద కుర్చీని తన్నేశాలా ఉన్నారండీ!"
"కుర్చీలను తన్నడం ఏమిటయ్యా! పాడు అలవాటు! తన్నిందే అనుకో! తంతే ఏమవుతుంది?"
సింహాచలం కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు-
"ఏమవుతుందని తాపీగా అడుగుతున్నారా, అయ్యో! అయ్యో! అమ్మగారు ఉరి వేసుకుంటున్నారండీ! ఉరి! కుర్చీని తంతే మెడకి ఉరిబిగిసుకుంటుందండీ! అంటే అమ్మగారు....."
"తాయారు!" అని గావు కేక పెట్టి ఆనందం లేచి నిలబడ్డాడు.
* * *
పరమానందం ఇంట్లో కూడా బీభాత్సమే చోటు చేసుకుంది.
జానకి తన గదిలో వుంది. తలుపులు మూసుకుంది. ఒంటినిండా కిరసనాయిలు పోసుకుని వుంది. అగ్గిపెట్టె కోసం వెతుకుతోంది.
భద్రాచలం కిటికీలో నుంచి ఏడుస్తూ అంటున్నాడు-
"అమ్మా! వద్దండమ్మా! తమరు కాలిపోవద్దు! మాడి మసైపోవద్దు! అయ్యగారు నా పక్కనే నిలబడ్డారండమ్మా! చూడండమ్మా! కాల్చుకోవద్దని చేతులు జోడించి నిలబడ్డారు!"
పరమానందం ఏడుస్తూ అంటున్నాడు-
"జానకీ! వద్దు! ఆత్మహత్య మహాపాపం! నన్ను అన్యాయం చేసి వెళ్లిపోవడం ఇంకా గొప్ప పాపం!"
"హుం, పాడు బతుకు! ఈ పాపిష్టి బతుకు బతుకుతూ మీ వల్ల పాపాలు మూటకట్టుకోవడం కంటే చావడమే మేలు! అగ్గిపెట్టె కనిపించి చావడంలేదు!"
"నా మాట విను జానకీ! ఇక నేను పందాల జోలికి వెళ్లను!"
"మీది కుక్కబుద్ది! తెల్లవారితే మళ్లీ మొదటికోస్తారు!"
"జానకీ! నామాట నమ్ము!"
"నేను నమ్మను!"
"ఇదిగో చివరి పందెం తాలూకు చెక్కు దీన్ని ఇప్పుడే ఇక్కడే నీ కళ్లముందు చించుతున్నాను, చూడు!" అని చెక్కుని చించేడు.
"ఇక ముందు పందాలు కట్టను గాక కట్టనని ఇప్పుడే కబురంపుతాను. కట్టునట్టు తేలిస్తే చెప్పుచ్చుక్కొట్టు! సరేనా?" అన్నాడు పరమానందం.
ఆ మాట విని తట్టుకోలేక మాటందుకున్నాడు భద్రాచలం -
"అమ్మా! అయ్యగారిని చెప్పుతో కొట్టాలని నాకు గొప్ప సరదాగా ఉందండమ్మా! ఆ పనేదో నేను చూసుకుంటాను. తమరు ఆత్మహత్య ప్రయత్నం విరమించండి!"
"అవును, జానకీ! విరమించు!" ప్రాథేయపడ్డాడు పరమానందం.
అక్కడ-
ఆనందం ఇంట్లో-
"మీ మాటలు నమ్మచ్చంటారా?" అమాయకంగా అడిగింది తాయారు.
"భార్య కంటే గొప్పది కాదు పందెం! నాకు నువ్వే కావాలి! పందాల జోలికి ఇక వెళ్లాను తాయారూ! మెడ మీద తాడు తప్పించి మెల్లగా దిగు!' అంటున్నాడు ఆనందం.
తాయారమ్మ తన ఆత్మహత్య ప్రయత్నం విరమించింది. కుర్చీ దిగుతూ అంది -
"ఇప్పుడు మీ మాట వింటున్నా! ఇక ముందు మీరు ఎవరితోనైనా - పెద్దదైనా, చిన్నదైనా పందెం కట్టినట్లు తెలిసిందో, నేను మీకు దక్కను!"
తాయరమ్మని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు ఆనందం-
"నా పిచ్చి తాయారూ! నువ్వు దూరమైతే బతగ్గలనా? నేను లేనప్పుడు ఇంక పందాలెక్క డుంటాయి?"
ఆ తర్వాత చాలా మంచి పనులు చకచకా జరిగిపోయాయి.
సింహాచలం, భద్రాచలం వీథిలో తిరుగుతూ పందాలపీడ తొలిగిపోయిందని ప్రకటనలు చేస్తున్నారు. వాల్ పోస్టర్లు రాయించి గోడలకు అంటిస్తున్నారు. మొదట్లో ఆ ప్రకటనల మీద జనానికి నమ్మకం చిక్కలేదు అందుచేత చిన్నచిన్న టెస్టులవీ చేసి ఆనందం, పరమానందం నిజంగా పందాలు మానివేసేరని తెలుసుకున్నారు.
ఆ తర్వాత చాలా మంచి పనులు చకచకా జరిగిపోయాయి.
ఇప్పుడు నందివాడవారి వీథి కళకళ లాడుతోంది. వీథిలో జనం హాయిగా, నిశ్చింతగా తిరుగుతున్నారు. తోరణాలవీ కట్టారు. మైకులు పెట్టి, పాటలవీ పాడుతున్నారు. రైల్వే స్టేషన్లో, బస్టాండులో నందివాడ వారి వీథికి మేము వస్తామంటే మేము వస్తామని ఆటోవాళ్లు, రిక్షావాళ్లుపోటిపడుతున్నారు.
శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో పూజారి రామానుజాచార్యుల వారి కుమారై వివాహం రంగరంగవైభవంగా జరిగింది. ఆ పెళ్లికి తాయారమ్మ, జానకమ్మలు ముఖ్యమైన ముత్తైదువుటలుగా విచ్చేశారు. ఆ పెళ్లిలో పేరంటాళ్లు తాయారమ్మ, జానకమ్మలను హృదయపూర్వకంగా అభినందించారు. భర్తలను సన్మార్గంలో నడిపిస్తున్న ఆదర్శ మహిళలని ఆ ఇద్దర్నీ శ్లాఘించేరు.
నందివాడ వారి వీథి నుంచి మాయమైన బాంకు రెండు నెలల తర్వాత మళ్లీ ఆ వీథికే వచ్చింది. ఆ బాంకు ప్రారంభోత్సవ సభకి ఆనందం, పరమానందం ముఖ్య అతిథులుగా విచ్చేసేరు. ఆనందం రిబ్బను కత్తిరించేడు. పరమానందం ఉపన్యాసం చేసేడు. ఆ ఉపన్యాసంలో తమ పందాల తప్పుని పెద్ద మనస్సుతో క్షమించమని కోరేడు. ఇకముందు అలాంటి సంఘవిద్రోహక చర్యలు తలపెట్టమని సభాముఖంగా హామీ ఇచ్చేడు. తాము సుఖంగా బతుకుతూ పదిమందినీ సుఖంగా బతికించడమే తమ నూతన ధ్యేయమని చెప్పేడు.
కరతాళ ధ్వనులు మిన్నుముట్టగా సభ పూర్తమయింది!
12
అదంతా కొండ ప్రాంతం.
ఊరికి దూరంగా వుంది. ఆనందం అక్కడికి నడుస్తున్నాడు. వెంట సింహాచలం వున్నాడు.
"ఇంకా ఎంత దూరం నడవాలో?" సింహాచలం అడిగేడు.
"మాట్లాడకుండా నాతో నడు!" అన్నాడు ఆనందం.
"చిత్తం!"
"వివరాలు మాత్రం అడక్కు!" అన్నాడు ఆనందం సీరియస్ గా.
సింహాచలం తన మనసులో కీడు శంకించాడు. అయినా దాచుకుని ఎంతో సంతోషం నటిస్తూ అన్నాడు -
"చిత్తం! వివరాలడిగే అవసరం ఇక రాదులెండి!"
"ఎంచేత!"
"తమరు పూర్తిగా మారిపోయేరు కదా! పందాలనీ మానేసి లోక కళ్యాణానికి కట్టుబడి వున్నారు కదా! ఇప్పుడు తమరేం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తారు కదా! ఆలాంటప్పుడు - ఆ పవిత్ర ఆశయంతో ఏక దీక్షతో నడిచే మిమ్మల్ని నేను ఎంత దూరమైనా ఆనందంగా అనుసరిస్తాను" అన్నాడు సింహాచలం.