Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 13

"మన పందేన్ని పాడు చేసింది పాడు చీమ!" అన్నాడు ఆనందం.
"ఈ చీమ కాకపోతే మరొకటి! ఇవాళ అటో ఇటో తేలి పోవాలి!" అన్నాడు పరమానందం.
సరిగ్గా అప్పుడు -
దూరంగా వున్న కొండ శిఖరమ్మీద నిలబడి నమస్కారం చేసి - అక్కడ్నించి కిందికి దూకే ప్రయత్నం చేస్తున్నాడు ఒక యువకుడు.
నలుగురి చూపు ఆ యువకుడి మీద పడింది.
శిఖరం మీంచి దూకి ప్రాణం తీసుకుందామనుకున్న ఆ యువకుడు మరుక్షణమే - తన నిర్ణయాన్ని మార్చుకుని  మళ్లీ కిందికి దిగుతున్నాడు!
ఈ విధంగా ఆ యువకుడు శిఖర మెక్కి దిగడం, దిగి మళ్లీ శిఖరమోక్కాడం లాంటి వింత విన్యాసంలో అలిసి పోతున్నాడు!
"ఎవరో పాపం....కుర్రాడు.....చావాలనుకుంటున్నాడు" అన్నాడు పరమానందం.
"కానీ! చావడు!" అన్నాడు ఆనందం.
"ఎవరు చెప్పగలరు! చచ్చినా చావచ్చు!"
"ఎవరైనా చెప్పగలరు! అతను చచ్చినా చావడు!"
"ఛస్తాడు!" అన్నాడు కోపంగా పరమానందం.
"చావడు!" అన్నాడు శాంతంగా ఆనందం.
ఇంత క్రితం చీమ మీద కాసిన పందెం - ఆ చీమ చచ్చిపోయిన కారణంగా రద్దయింది. ఇప్పుడు అదే పందేన్ని చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆ యువకుడి మీదికి తిప్పేరు. చస్తాడని పరమానందం - చావడని ఆనందం పందెం వేసుకున్నారు.
తన చావు బతుకుల మీద పందెం వేసినట్లు తెలీని యువకుడు మాత్రం శిఖరమోక్కి దిగి మళ్లా ఎక్కడం చేస్తూనే  వున్నాడు.
ఆనందం పరమానందంలు గొప్ప టెన్షల్లో పడిపోయేరు. శిఖర మోక్కిన వాడు దూకేసినా, దిగినవాడు ఊళ్లోకి వెళ్లిపోయినా పందెం అటో ఇటో తేలిపోతుంది.
అల్లాంటి అవకాశమివ్వకుండా తమ ప్రాణాలు తింటున్న  యువకుడి మీద యజమానులకు వెర్రి కోపం వచ్చింది. ఇద్దరూ తమ తమ గుమాస్తాలకు ఆజ్ఞలు జారీ చేసేరు-
"వాడ్ని లాక్కురండి!" అన్నాడు ఆనందం.
"మేము అతన్తో మాటాడాలి!" అన్నాడు పరమానందం.
గుమాస్తాలు ఆ కుర్రాడ్ని తీసుకురావడానికి చాల వేగంగా కోండెక్కుతున్నారు!

                            *        *        *
ఆనందం భార్య తాయారమ్మ పరమానందం భార్య జానకమ్మా - ఇద్దరూ ఫోన్ లో మాటాడుకుంటున్నారు.
ఆ రోజున ఎవరింటో ఏ వంటలు చేసుకున్నారో మాటాడుకున్నారు. కొత్త వంట గురించి కొంత సేపు ముచ్చటించుకున్నారు. నందివాడ వారి వీథిలో తమకు లభించిన కీర్తి గురించి చెప్పుకున్నారు. ఉత్తమ ఇల్లాలు , ఆదర్శపత్ని లాంటి బిరుదులు తమకు దక్కినందుకు సంతోషం ప్రకటించుకున్నారు.
ఈ ఊరు మహిళా మండలిలో తమకు జరగబోతున్న ఘన సన్మానం గురించి ముచ్చటించుకున్నారు. ఈ సభకి ఎవరు ఏ రంగు చీరలో హాజరావ్వాలో నిర్ణయించుకున్నారు.
అంతా అయ్యేక -
అన్నట్టు అన్నయ్యగారు ఇంటో వున్నారా?" అని అడిగింది తాయారమ్మ.
"లేరు వదినా! మరి మా అన్నయ్యగారో?" అని ప్రశ్నించింది జనాకమ్మ.
"ఊహు..... పొద్దున్నే తొమ్మిదింటికి వీథిలో వెళ్లేరు. ఇంత వరకూ రాలేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో?"
"విచిత్రం! ఈయన కూడా సరిగ్గా తొమ్మిదింటికే వీథిలో అడుగుపెట్టేరు వదినా! ఈయన కూడా ఇంత వరకూ రాలేదు. నువ్వన్నట్లు  ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో?"
"సింహాచలం కూడా మా వారి వెంట వెళ్లేడు!"
"భద్రాచలాన్ని మావారు వెంటబెట్టుకు  వెళ్లేరు!"
"ఎక్కడికి వెళ్లినట్లో?"
"ఏమిటో వదినా! నా ఎడం కన్ను అదురుతోంది. భయంగా వుంది."
"చిత్రం! నా క్కూడా అదే కన్ను అదురుతోంది. భయంగా లేదు అలవాటై పోయిందో ఏమిటో మరి?"
"అన్నిటికి ఆ వేణుగోపాలస్వామే వున్నాడు."
"అంతే వదినా! భారమంతా ఆ దేవుడి మీద వేసి నిబ్బరంగా వుండటం మంచిది!"
"అలాగే! వుంటాను వదినా!"
"మంచిదోదినా!"
అప్పటిగ్గాని వాళ్ల ఫోను సంభాషణ పూర్తికాలేదు. అందుకు ఒక గంట కాలం వేస్టయింది.

                             *        *        *
అక్కడ.....ఆకొండ మీద.
యువకుడు మళ్లీ శిఖర మోక్కుతున్నాడు. అది చూచి భద్రాచలం ముచ్చట పడుతున్నాడు.
"ఖచ్చితంగా దూకుతాడు!" అన్నాడు భద్రాచలం.
"ఎట్లాచెప్ప గలిగేవు?" కుతూహలంగా అడిగేడు సింహాచలం.
"అదంతే! నా అంతరాత్మ చెబుతోంది!"  అన్నాడు భద్రాచలం.
"నా క్కూడా నా అంతరాత్మ చెబుతోంది!" అన్నాడు సింహాచలం
"ఏవఁని?"
"శిఖరమ్మీంచి దూకడని!"
"అతను చావడం చావకపోవడం దేవుడెరుగు! మధ్యలో మనల్ని చంపుతున్నాడు" అన్నాడు భద్రాచలం.
"నిజమే! పొద్దున్ననగా తగలడ్డాం ఆకలి దంచేస్తోంది!" అన్నాడు సింహాచలం.
అంతలో ఆ యువకుడు శిఖర మెక్కడం కనిపించింది.
"చూడటు! శిఖరమెక్కేడు!" అన్నాడు భద్రాచలం.
"ఎక్కితే సరిపొద్దేమిటి? అక్కడ్నించి దూకద్దూ?" అన్నాడు సింహాచలం.
"వాడు దూక్కపోతే మనం వాడి వెనగ్గా వెళ్లి తోసేద్దాం! పందెం పూర్తవుతుంది!" అన్నాడు భద్రాచలం.
"అంటే ... మీరు గెలిచి.... మమ్మల్ని అడుక్కు తినమనేగా నీ  ఉద్దేశం? అదేం కుదరదు. వాడు బతుకుతాడు. బతికి తీరాలి."
ఈ లోగా ఆ యువకుడు శిఖరం దిగడం ప్రారంబించేడు. తన ఎదుట ఇద్దరు కొత్త వ్యక్తులు నిలబడి తనని ఆకలి చూపుల్తో చూడటం గమనించేడు. ఎవరు మీరు అని కూడా అడిగేడు.
భద్రాచలం గానీ, సింహాచలం గానీ నోరు విప్పలేదు. ఒక  అడుగుముందుకు వేసేరు.
ఈ ఆగంతుకులేవరో - తన మీదికి ఎందుకు వస్తున్నారో ఊహించలేక -  వాళ్ల ఆకలి చూపులకు భయపడి కెవ్వున కేకపెట్టేడు యువకుడు.
ఇద్దరు ఆ యువకుడ్ని వాటేసుకుని - మోసుకుంటో - తమ యజమానుల వేపు కదిలేరు.

                                        13
ఎందుకైనా  మంచిదని ఆనందం పరమానందంలు చెట్లెక్కి కూచున్నారు.
"ఈలోగా -
సింహాచలం భద్రాచలంలు యువకుడ్ని ఎత్తుకుని చెట్ల  కిందికి వచ్చేరు. అక్కడ వుండవలసిన యజమానులు కనిపించలేదు. చెట్టుమీదకు చూడకుండా యాజమానుల కోసం చుట్టూపక్కల చూస్తున్నారు.
ఆ తర్వాత-
యువకుడ్ని దించి నించోబెట్టి - యజమానుల కోసం - కొండ జాతి మనుషుల్లాగా నోళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని కూతలు కూస్తున్నారు.
వాళ్ల వింత చేష్టల్ని చూసి యువకుడు మరింత బెదిరి పోతున్నాడు.
అతను బెదిరే కొద్దీ గుమస్తాలు తమ కూతల స్ధాయిని కూడా పెంచుతున్నారు. యువకుడు కొంచెం దైర్యం తెచ్చుకుని అడిగేడు-
"ఏమిటా కూతలు?"
సమాధానం చెప్పకుండా మళ్లీ కూసేరు.
"ఆ కూతలకి అర్థం ఏమిటో? అసలింతకీ ఎవరుమీరు?"
మళ్లీ కూసేరు.
"ఎవరి కోసం ఈ కూతలు?"
అని అడగ్గానే చెట్టు మీదున్న ఆనందం పరమానందంలు ఒకేసారి  దూకేరు. వారు దూకడంతో గుమాస్తాలు కూతలు ఆపేసేరు.
వాతావరణం మొత్తం యువకుడికి గందరగోళంగా కనిపించింది.  కొంచెం భయంగా ఎక్కువ ఆందోళనతో అన్నాడు -
"చూస్తుంటే బందిపోటు  దొంగల్లావున్నారు. నా దగ్గిర డబ్బులేదు. నగల్లేవు. ప్లీజ్ నన్ను నమ్మండి. వదిలేయండి. అసలే నేను చచ్చిపోవడానికి వచ్చేను."

 Previous Page Next Page