Previous Page Next Page 
నా కథవింటావా పేజి 11


    "ఆ రోజు వాడెవడో తన జుట్టు లాగడం వల్లే కదా కావ్యవాణ్ణికొట్టింది. దానివల్లే కదా వాడు పగబట్టీ  ఇలా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు" అన్న ఫీలింగ్ కూడా నిర్మలకి రాకపోడం  కావ్యకి ఆశ్చర్యాన్నీ, బాధనీ కలిగించింది!
    కావ్య బాధపడుతోందని  గ్రహించిన  సీతాదేవి  "కావ్యా! కూర చెయ్యడం అయిపోయింది. పూరీలొత్తియ్యవూ?" అంది.
    కావ్య ఆలోచనల్లోంచి  ఉలిక్కిపడింది. పిండి  కలుపుతూ  ఒచ్చిన  చేతులు ఆరిపోయాయి. పేపరక్కడ  పడేసి, వంటింట్లో కెళ్ళింది.
    "నీ ఫ్రెండ్సంతా  పాసయ్యారా?" అడిగింది సీతాదేవి.
    "ఆఁ....ఫస్టుక్లాసు  ఒక్క నాకూ  కళ్యాణికే  ఒచ్చింది" అంటూ అందరి సంగతి చెప్పింది.
    "అమ్మా పాయసం  చెయ్యి! వెజిటబుల్ బిరియానీ  చెయ్యి ఇవ్వాళ" పురమాయించాడు  క్రాంతి.
    "ఎందుకురా? ఎవరైనా  భోజనానికొస్తున్నారా?" అడిగింది తల్లి
    "కావ్యకి ఫస్టు క్లాసొచ్చినందుకు!"
    "ఏ క్లాసొస్తే  ఏం గోప్పలే!" అంది కావ్య పెదవివిరుస్తూ.
    "అంటే?" అడిగాడు  క్రాంతి.
    "ఏం చేసుకోవాలి సర్టిఫికెట్ ని? గోడకి  ఫ్రేం  చేయించి  తగిలించాలి!" అంది అదే ధోరణిలో కావ్య.
    "ఓహో! అంతకన్నా  దానివల్ల ఇంకే  ఉపయోగమూ లేదన్న  మాట!" కావ్య  మొహంలోకి చూస్తూ అన్నాడు.
    "నాకు లేదు!"
    క్రాంతికి  ఆమె మనసు  అర్ధమయింది. బాధా, జాలీ, అతని గుండె కరిగించేశాయి.
    క్రాంతికి తెలుసు! కావ్యకి చదువుకోవాలనుందని!
    అతనికి తల్లి మనసు కూడా తెలుసు! కావ్యని  ఒక్కదాన్నీ  గడప దాటి  పంపించడానికి  భయపడుతోందని!
    అందుకే  ఇద్దరినీ  తృప్తిపరిచే  విధానం  కోసం  ఆలోచిస్తున్నాడు.
    "కావ్యా! ఎమ్.ఏ. చేస్తావా?" అడిగాడు.
    కావ్యా, సీతాదేవీ ఇద్దరూ  ఒక్కసారే  అతని మొహంలోకి చూశారు. అయితే, వేర్వేరు భావాలతో.
    "కరస్పాండెన్స్ కోర్స్ చెయ్యొచ్చుకదా! మనయూనివర్శిటీకీ, వెంకటేశ్వరా యూనివర్శిటీకీ, అన్నామలై యూనివర్శిటీకీ  అన్నింటికీ  అఫ్లయ్ చేసి పెడ్తే సరి. ఎక్కడ  కావాలనుకుంటే, అక్కడ చెయ్యొచ్చు. ఇంట్లో వున్నట్టూ వుంటుంది. బోర్ కొట్టకుండానూ  వుంటుంది. చూస్తూ చూస్తూ ఎమ్.ఏ. డిగ్రీ కూడా  ఒచ్చేస్తుంది. పెళ్ళయినా, చదువుకోవడానికి ఏ ఇబ్బందీ  వుండదు. ఏమంటారు?" ఇద్దర్నీ  చూస్తూ అడిగాడు. ఇద్దరి మొహాల్లోనూ  సంతోషాన్ని చూసిన క్రాంతి  తృప్తిగా నిట్టూర్చాడు.
    క్రాంతి సలహా సీతాదేవికి చాలా నచ్చింది. వృధాగా కాలక్షేపం  చెయ్యకుండా  వుండడానికే  పిచ్చి పిచ్చి ఆలోచనలలో  మనసు పాడుచేసుకోకుండా వుండడానికీ, ఇది బాగానే వుందనిపించింది. గబగబా పాయసం, బిరియానీ చేసే ప్రయత్నంలో  మునిగిపోయింది. కొండంత  చీకట్లోనూ, గోరంత ఆశ, గుండెనిండా  ధైర్యాన్నీ, మనసునిండా  ఉత్సాహాన్నీ  ఇచ్చింది.
    ఆ మధ్యాహ్నం  కళ్యాణొచ్చింది  ఇంటికి. కావ్యకి ప్రాణం లేచొచ్చింది. ఆ పూట అక్కడే భోంచేసింది కళ్యాణి. ఎక్కడెక్కడి కబుర్లో  తనివితీరా  మాట్లాడుకున్నారు స్నేహితులిద్దరూ. కావ్యకి జరిగిన అన్యాయానికి ఎంతో బాధపడింది కళ్యాణి. కళ్యాణి  యూనివర్సిటీలో  జర్నలిజమ్ కీ ఎమ్.ఏ కీ రెండింటికీ  అప్లయ్ చేసింది.
    "కళ్యాణీ! ఒక రోజున గంగా, నిర్మలా కలిసొచ్చారే  మా ఇంటికి. ఆ క్రితంరోజే నన్ను చూడ్డానికెవరో వొచ్చివెళ్లారే! ఈ పుకార్లన్నీ  విని, 'ఈ సంబంధం మాకిష్టంలేదని' ఏదో వంక చెప్పి కబురు పెట్టారు. అది విని వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకుంటూ  మౌనంగా  వుండిపోయారు. కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయారు. అంతే మళ్ళీ  ఈరోజు వరకూ రాలేదు. బహుశ వాళ్లూ, నేను చెడిపోయానని దూరంగా  ఉంటున్నారేమో" అంది బాధగా.
    "కావ్యా! నిజమైన స్నేహం వీటన్నింటికీ అతీతం! భయంలేనిదీ, మలినం లేనిదీ, పవిత్రమైనదీ  స్నేహం! పైగా  స్నేహం కోసం, ఒక స్నేహితురాలి కోసం నువ్వు చేసింది త్యాగం. అది  గుర్తించకుండా  స్వార్ధంతో వాళ్ళలా తప్పుకోవడం  స్నేహమనే  మాటకే  కళంకం. వాళ్ళని మర్చిపో! ఎమ్.ఏ. ప్రైవేటుగా చదువు. ఐ....విష్.... యూ....గెట్....మేరీడ్....సూన్!....!" అంది.
    కళ్యాణి చూపే  మంచితనానికీ, ఆమెలోని  స్నేహ స్వభావానికీ ముగ్దురాలయింది కావ్య.
    "కళ్యాణి నువ్వైనా నన్నర్ధం చేసుకున్నావు. అదే చాలు. నీలాంటి స్నేహితురాలొక్కరుంటే చాలు. మనసు సంతోషంగా వుంటుంది." అంది తృప్తిగా కావ్య.
    సాయంత్రందాకా  వుంది కళ్యాణి. తనివితీరా  కబుర్లు  చెప్పుకున్నారు స్నేహితులిద్దరూ.
    చీకటిని చీల్చుకుంటూ  కాంతి పుట్టినట్టు, విషాదాన్ని  నెట్టుకుంటూ  కొత్త ఆశలు ఆమెని ఆవరించి, కొత్త ఊహలకు  ఊపిరి  పోశాయి !
    తల్లితో  కూడా  తిరుగుతూ, కుట్లు, అల్లికలూ  నేర్చుకుంది  కావ్య !
    ఈ మధ్య సీతాదేవికి  బట్టలు  కుట్టించుకోవడానికొచ్చే  వారి సంఖ్య తగ్గిపోయింది.
    "పోనీలే అమ్మా! వాళ్ళ  బట్టలూ వీళ్ళ బట్టలూ కుట్టే  శ్రమ తగ్గిపోయిందనుకో! ఎందుకొచ్చిన  శ్రమ!" ఊరడించింది  కావ్య  తల్లిని !
    "కావ్యకి సంబంధాలు  చూసి  ఎలాగైనా  ఈ ఏడు  పెళ్ళి చెయ్యాలనుంది" అంటూ అన్నదమ్ములందరికీ  ఉత్తరాలు  రాసింది సీతాదేవి. ఒక్కరూ  సమాధానం రాయలేదు. ఆమెలో ఏదో  బెంగ, ఏదో బాధా, సతమతమయిపోతోంది సీతాదేవి.
    కావ్యకి  వేంకటేశ్వర  విశ్వవిద్యాలయంలో  ఎం.ఎ.లో అడ్మిట్ చేసుకుంటున్నట్టు  ఉత్తరం వచ్చింది.సంతోషంతో  ఉక్కిరిబిక్కిరయింది  కావ్య! తల్లి కూడా సంతోషించింది. ఫీజు కట్టాడు క్రాంతి. వాళ్ళు సిలబసు కొంత మెటీరియలూ  అంతా  పంపించారు. అదంతా  చదువుతూ  మురిసిపోయింది కావ్య!
    కళ్యాణికి  ఉస్మానియాలో  జర్నలిజమ్ లో  సీటొచ్చింది. అడపాతడపా  కళ్యాణొచ్చి  పలకరించి  వెళుతోంది కావ్యని.
    ఆ రోజు బ్లౌజు కుట్టుకుంటూ  కూర్చుంది  కావ్య.
    క్లాసుల్లే వని  ఎగ్గొట్టి  కావ్య  ఇంటికొచ్చింది  కళ్యాణి.
    "ఏమిటే విశేషాలు?" అడిగింది కావ్య.
    "నిర్మల పెళ్ళయింది మొన్న" అంది.
    "అవునా ?"
    "నిన్ను పిలవలేదా?"
    "లేదు...."
    "అందరూ వచ్చారు మన ఫ్రెండ్స్! ఉమా, రేఖా  నిన్నడిగారు."
    కావ్య  నిర్లిప్తంగా  చూసింది.
    "కళ్యాణీ! నిన్నొక మాటడగనా?" అంది.
    "చెప్పు! ఏమిటో?" అన్నట్టు చూసింది  కళ్యాణి.
    "వాళ్ళందరూ  నా గురించి  ఏమనుకుంటున్నారో చెప్పు. ప్లీజ్....నేనేమీ బాధపడను! నిజం చెప్పు."
    కళ్యాణి మాట్లాడలేదు.
    "వాళ్ళూ  అందరిలాగే  అనుకుంటున్నారు కదూ! కనీసం నిర్మల తన పెళ్ళికి కూడా పిలవలేదు." కళ్ళనీళ్ళు పెట్టుకుంది కావ్య.
    "నువ్వూరికే  వాళ్ళ గురించి మాట్లాడ్డం, కళ్ళనీళ్ళు  పెట్టుకోవడం  చేస్తే నేనూ రావడం మానేస్తాను. ఎన్నిసార్లు చెప్పాను. వాళ్లు  రావడం  లేదని బాధపడొద్దనీ, వాళ్లనసలు  స్నేహితులుగా  అనుకోవద్దని" మందలించింది  కళ్యాణి.
    "నిజం తల్లీ!కళ్యాణి  మాటల్లో  ఎంతో సత్యం  వుంది. నువ్వఖ్కర్లేదూ  అనుకున్నవాళ్ళ  గురించి నీకేంటి బాధ? అసలు ఆ పిల్లకోసం, వాళ్ళ కోసం, వాళ్ళతో  వీళ్ళతో  తగాదాలుపడి, నువ్వు  అపనిందల పాలవుతున్నావ్? నెత్తీ నోరూ  కొట్టుకుని  చెప్పాను. ఒద్దమ్మా  ఈ గొడవలు  నీకూ అని. వినిపించుకున్నావు కాదు. పండంటి  నీ జీవితాన్ని ఊరికినే  బలిచేసుకున్నావ్!" దుఃఖం  ముంచుకొస్తూ వుంటే, మరి మాట్లాడ లేకపోయింది.
    "ఆంటీ! మీరూ ఇలా కంటతడి పెట్టుకుంటూ  వుంటే, కావ్య ఎలా మరిచిపోతుంది  చెప్పండి" అంది కళ్యాణి ఆమెనెలా  ఊరుకోపెట్టాలో  తెలీక  తికమకపడుతూ.
    కాస్సేపు నిశ్శబ్దం అందరినీ  మౌనంగా  వుంచింది.
    సీతాదేవి లోపలికి కెళ్ళిపోయింది. కాస్సేపట్లో  వేడి వేడి పకోడీలతో, కాఫీలతో ప్రత్యక్షమయింది.
    పకోడీలు తింటూ, "పెళ్ళి విశేషాలు  చెప్పు?" అంది కావ్య. పిల్లవాడికి  ఎనభైవేలు  కట్నమిచ్చార్ట. బట్టతల, సన్నగా  ఎలాగో  వున్నాడు. నిర్మల ఎలా  ఒప్పుకుందో  ఏమిటో" అంది కళ్యాణి.
    "బాగా డబ్బున్నవాళ్లని  చెప్పేవుగా. అందుకే  చేసుకుందేమో! నీకు జ్ఞాపకం వుందా? ఆ పిల్ల ఎప్పుడూ నగలూ, నాణ్యాలూ  అంటూ మాట్లాడేది. డైమండు దిద్దులూ, కెంపుల గాజులూ  అంటూ ఆ రోజుల్లో నించే  ఇవన్నీ  మాట్లాడేది. పోనీలే! తన కోరిక  తీరే  విధంగా  డబ్బున్న వాళ్ళే  దొరికారుగా." అంది కావ్య.
    "పెళ్ళిలో  ఏవేవో  గొడవలు...."
    "ఎందుకని ? బీదవాడి  పెళ్ళిలో అంటే  ఇదుందనీ  అది లేదనీ  గానీ, డబ్బున్నవాళ్ళ  పెళ్ళిలో కూడా  గొడవలెందుకు ?" అడిగింది కావ్య !
    కళ్యాణి నవ్వింది!
    "నిర్మలా వాళ్ళ  దగ్గర  పెద్ద డబ్బేమీ లేదే! మామూలు కంటే ఏదో కాస్త! నీళ్ల దగ్గర కార్లూ గీర్లూ  అంతా హోదా  ఎక్కువగా వుంది. పెళ్ళి చేసేటప్పుడు  సమానత్వం చూసి  చెయ్యాలి! సామెతే  వుందిగా, "సమాన వియ్యం సమాన కయ్యం" అని. వాళ్లంతట  వాళ్ళు  చేసుకున్న పెళ్లయితే, ఐ....మీన్....లవ్....మ్యారేజ్.... అది వేరు. అప్పుడు అంతస్థుల తేడా  తెలీదు. లేదా, పిల్లని వాళ్ల  తాలూకు వాళ్లందరూ  ఇష్టపడి కోరుకుంటే  అదీ వేరు. ఏక్చువల్ గా, 'కోడల్ని  తెచ్చుకునేటప్పుడు  తమకంటే  తక్కువ  కుంటుంబంలో  నుంచి  తెచ్చుకోమన్నారు. కూతుర్నిచ్చేటప్పుడు  ఎక్కువచోట  ఇమ్మన్నారు. కానీ ఇలా మధ్యవర్తుల ద్వారా ఏర్పాటు చేసిన పెళ్ళి .తాహతుకు మించిన విధంగా  చెయ్యాలంటే, తప్పకుండా  గొడవలొస్తాయి. పెళ్ళికొడుకు  డాక్టరని అడిగినంతా  ఇచ్చి  నిర్మల ఈ సంబంధంపైనే  మొగ్గుచూపడం వల్ల, ఇల్లూవాకిలీ  తాకట్టు  పెట్టి  డబ్బు తెచ్చారట" అంది కళ్యాణి.

 Previous Page Next Page