Previous Page Next Page 
నా కథవింటావా పేజి 10


    "అవునమ్మోయ్! నా జాకెట్టు కాస్త తొందరగా  ఇచ్చేసెయ్" అనేవారు వాళ్ళల్లో ఒకరు.
    "ఏమైంది సుందరమ్మగారూ! ఏంటా  గొడవ?" అడిగింది.
    "నీ కూతురి మాటలు వినలేదా? మేమంతా మా మొగుళ్ళతో కాపురాలు  చేస్తున్నామో, వేరే వాళ్ళతో కాపరాలు చేస్తున్నామో, సందేహంట! ఎలా నిలదీసి అడుగుతోందో చూడు. దీని మాటలకి ఆడవాళ్ళం  మాకే కోపం వస్తుంటే, మగాళ్ళకెలా వుంటుంది? ఇలా పెట్రేగే  ఆడాళ్ళ  వెంటే తిరుగుతారు రౌడీలు, అల్లరి  పెడతారు! ఇలాటమ్మాయి  ఊరికొక్కర్తి వుంటే చాలు, ఆడవాళ్ళందరూ  నవ్వుల పాలవుతారు"
    సీతాదేవి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
    "ఏదో చిన్నపిల్ల! తండ్రిలేని పిల్ల! స్వతంత్ర భావాలతో గారాబంగా పెరిగింది .ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు బాధపడుతున్నా, చూడలేని మెత్తని స్వభావం కలది. కాబట్టే ఆ అమ్మాయిని జడ పట్టిలాగితే  అ అవమానం తనకి జరిగినట్టుగా బాధపడి, తన సంగతి ఆలోచించకుండా  వెళ్ళి, వాణ్ని కొట్టింది .ఏది ఏమైనా, మీకు దండం పెడతాను. తెలిసో తెలీకో అదేమైనా అంటే దాని  తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారిమీద ప్రమాణం చేసి చెప్పింది. తనకి ఏ అఘాయిత్యమూ  జరగలేదని సమయానికి వాళ్ళొచ్చి  ఆదుకున్నారని పైగా  ఆ బురదలో రోడ్డుమీద ఏమైనా జరిగితే, బట్టలకైనా  బురదంటదా  చెప్పండి!" కళ్ళ నీళ్ళు  తుడుచుకుంటూ  చెప్పింది సీతాదేవి.
    కాస్సేపు ఎవ్వరూ మాట్లాడలేదు.
    తరువాత సుందరమ్మే  అందుకుంది. "ఏమిటమ్మా  ఆ ఏడుపూ ఆ మాటలూనూ? ఎవరైనా వింటే, మేమే ఏవో లేనిపోనివి పుట్టిస్తున్నామనుకుంటారు! ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు! కాకి పిల్ల కాకికి ముద్దు! అయినా మాకెందుకొచ్చిన  గొడవ ఇది." అంటూ లోపలికి వెళ్ళిపోయారు, మూడిళ్ళ వాళ్ళూ.
    సీతాదేవి చీరకొంగు  మొహాని కడ్డుపెట్టుకుని, వెక్కి  వెక్కి   ఏడ్చింది.   
    ఆ దృశ్యం  చూస్తూవుంటే, తన కోసం తల్లి  పడుతున్న  బాధలు చూస్తూ వుంటే  కడుపు తరుక్కుపోతోంది కావ్యకి!
    "తల్లి అచ్చటా ముచ్చటా  తీర్చి ,ఆమెని  ఎంతో  సుఖపెట్టాలనుకుంది. ఏదీ చెయ్యలేకపోగా, జీవితాంతం ఆమె గుండెలో రగులుతూనే వుండేలా కార్చిచ్చు పెట్టింది. ఆమె చెప్పే సలహాలన్నీ  పిరికి పాఠాలుగా అర్ధం చేసుకుందే తప్ప, గతి తప్పితే శృతి తప్పింది జీవితం అని తెలుసుకోలేకపోయింది. ఇప్పుడేం చెయ్యాలి తను? ఎలా తన తల్లిని సుఖపెట్టాలి? ఎలా ఆమె గుండెలో  మండుతున్న మంటల్ని  ఆర్పాలి?" ఏడుస్తూన్న తల్లి దగ్గరికి వెళ్ళి "అమ్మా! వాళ్ళేదేదో  అన్నారన్న  బాధతో, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఎలా? నువ్వు వాళ్ళని బతిమాలినా, కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు మారరమ్మా! పైగా నువ్వు ఇంకా బాధపడేలా ఏవేవో అంటారు. వాళ్ళనెందుకమ్మా  నువ్వు బతిమాలాలి? అమ్మా! నేనే తప్పూ చెయ్యలేదు. అటువంటప్పుడు 
భయమెందుకమ్మా. రా! లోపలికి పోదాం!" అంటూ ఆమె చెయ్యిపట్టి నడిపించి లోపలికి తీసుకెళ్ళింది కావ్య!
    తల్లికి సాయంగా  వంట చేస్తోంది. బట్టలు కుడుతోంది. అనుక్షణం ఆమె వెనకే కొంగు పట్టుకుని తిరుగుతోంది పసిపాపలా! కావ్యని అలా చూస్తూ వుంటే  ఆమె గుండె తరుక్కుపోతోంది.
    "బాబూ! క్రాంతీ! మామయ్యలకి  ఉత్తరం రాయరా ఏవైనా  సంబంధాలుంటే  కావ్యకి చూడమని" అంది.
    "అలాగే!" అంటూ ఉత్తరాలు రాశాడు  క్రాంతి.
    సీతాదేవి పెద్దన్నయ్య ప్రసాదరావు ఏదో సంబంధం ఉందనీ, వాళ్ళని వెంటబెట్టుకుని  హైదరాబాదొస్తున్నాననీ  రాశాడు.
    పొంగిపోయింది సీతాదేవి.
    కావ్యని చక్కగా  ముస్తాబు చేసింది. బంగారానికి మెరుగుపెట్టినట్టుగా, అసలే అందమైన కావ్య అలంకరణలో, దివ్యంగా వెలిగిపోయింది.
    పెళ్ళి వారొచ్చారు. అన్ని విషయాలు   మాట్లాడుకున్నారు. పిల్ల నచ్చిందన్నారు. తాంబూలాలు  పుచ్చుకోవాలనుకున్నారు.
    కావ్య  మదిలో  వెయ్యి వీణలు మ్రోగాయి. వేలవేల రాగాలు పలికాయి. తియ్యని తలుపులతో  కమ్మని కోర్కెలతో ,అంతులేని సంబరంలో మునిగిపోయింది కావ్య!
    కావ్య సంతోషాన్ని చూసి పొంగిపోయింది సీతాదేవి!
    తల్లి ఆనందాన్ని  చూసి తృప్తిగా నిట్టూర్చింది కావ్య!
    వాళ్ళ సంతోషం  అట్టేసేపు నిలవలేదు! విధి వాళ్ళతో ఆటాడుతోంది. ఏదో అతీతశక్తి వాళ్ళమీద పగ సాధించి కక్ష తీర్చుకుంటోంది.
    "కావ్య చెడిపోయిన పిల్ల" అని పెళ్ళి వారికి తెలిసింది. ఇటువంటి సంబంధం చూపించినందుకు అతణ్ని, దాచిపెట్టి పెళ్ళి చెయ్యాలనుకున్నందుకు  తల్లినీ, క్రాంతినీ నానా మాటలూ అని వెళ్ళిపోయారు, పెళ్ళివారు.
    సీతాదేవి కుప్పలా కూలిపోయింది!
    కావ్య జీవచ్చవంలా  మిగిలిపోయింది.
    "సీతా! నాతోనైనా నిజం చెప్పకపోయావా? నేనీ సంబంధాల వేటకే బయలుదేరేవాణ్ని కాదు" అన్నాడు ప్రసాదరావు.
    "అన్నయ్యా! కావ్య చెడిపోయిన పిల్ల అని నువ్వూ  నమ్ముతున్నావా? లేదన్నయ్యా లేదు!" అంటూ జరిగినదంతా  చెప్పింది సీతాదేవి.
    "సీతా! నింద నిజంకన్నా  చెడ్డదమ్మా! పదుగురాడుమాట, పాటియై ధరచెల్లు. అని అందరూ  అదే మాటంటే కామోననుకుంటారు జనం! చాలా దురదృష్టం ఆడపిల్ల ఇలా నిందలపాలవ్వడం" అని సానుభూతి చూపించి, వాళ్ళ వూరికి ప్రమాణమై వెళ్ళిపోయాడు ప్రసాదరావు.
    ఈ వార్త తెలిశాక ఇంకే అన్నదమ్ములూ ఏ సంబంధమూ  తేలేదు. తేలేమని ఉత్తరం రాసిపారేశారు.
    సీతాదేవికి పిచ్చి పట్టినట్టయింది.
    కావ్యకి బ్రతుకుమీదే విరక్తి పుట్టుకొచ్చింది.
    క్రాంతి, వాళ్ళద్వారా వీళ్ళ ద్వారా ఏదో సంబంధాలు  తెచ్చాడు. అవీ ఇలాగే, ఇదే కారణంవల్ల కుదరకుండా పోయాయి!
    "అమ్మా! మనం ఈ ఊరొదిలి  ఎక్కడికైనా  వెళ్ళి  పోదామమ్మా! ఎక్కడికి వెళ్ళినా హేళనగా మాట్లాడుతున్నారు మన గురించి. మన పక్కన సుందరమ్మగారూ, ఈ ఇరుగుపొరుగు వారూ ఉన్నంతకాలం కావ్యకి పెళ్ళి జరగనివ్వరు. అసలు చెడిపోయిందన్న  పుకారు లేవదీసిందే వాళ్ళు కదా!"
    క్రాంతి మాటలకి దుఃఖం ముంచుకొచ్చింది సీతాదేవికి.
    "బాబూ! విషయం తెలిశాక, మామయ్యలే ,రమ్మని  పిలవలేదు. ఏవూరు వెళతాం బాబూ! నీ చదువు పూర్తయ్యేదాకానయినా మనం ఈ ఊళ్ళో వుండాలికదా! ఆ తరవాత  కనీసం నీకే ఊళ్ళో ఉద్యోగం ఒస్తే అక్కడికే పోవచ్చు." ఓదార్చింది.
    "నా ప్రెండ్సంతా  ఒక్కొక్కరు  ఒక్కొక్కలాగ  కథలు కథలుగా మాట్లాడుతూ వుంటే నాకు చదవబుద్ధి కావడంలేదమ్మా." ఏడ్చాడు క్రాంతి!
    "బాబూ! అలా అనకు! కుక్కలు  మొరుగుతూనే  వుంటాయి. ఏనుగు పోతూనే వుంటుంది. ఎవరో ఏదో కూశారని, ఇంత కష్టపడి చదివిన చదువు గంగపాలు చెయ్యకు," ఏడుస్తూ బతిమాలింది సీతాదేవి.
    ఈ విషాదం చూస్తూ వుంటే, "తనవల్లే  అమ్మా అన్నాయి ఇలా ఏడవ వలసి ఒచ్చింది. తనులేకుండా పోతే, కొన్నాళ్ళు బాధపడ్డా, ఆ తరవాతైనా వాళ్ళు బాగుంటారు. తను బ్రతికుంటే ,జీవితమంతా ఏడుపే!" అనుకుంది. ఫానుకి చీరని బిగించి ప్రాణాలు  తీసుకోడానికి  మెడకి ఉచ్చు తగిలించు కుంది.
    "కావ్యా!" అరిచింది సీతమ్మ.
    పరుగెత్తుకెళ్ళి  ఆ ముళ్ళు విప్పి కావ్యని కిందకి దింపాడు క్రాంతి.
    "ప్రాణాలు తీసుకుందామనుకున్నావా? నీతోపాటు మేమూ నీతోనే వచ్చేస్తామని అనుకోలేదు కదతల్లీ" ఏడ్చింది సీతమ్మ.
    "కావ్యా! అమ్మని చూడు ఎలా ఏడుస్తోందో? ఇంకెప్పుడూ  ఇలాంటి పనిచెయ్యనని ప్రమాణం చెయ్యి" చేతిలో చెయ్యి వేయించుకున్నాడు క్రాంతి!
    ఆ ముగ్గురూ ఒకరినొకరు  ఓదార్చుకుంటూ  బతికారు కొన్నాళ్ళు!
                                           7
    "కావ్యా!....కావ్యా!"....
    "అబ్బ__ ఏమిటా గావు కేకలు! ఒస్తున్నానని చెప్తున్నాగా?"  
    పొద్దున్న టిఫిన్ కోసం పూరీల పిండి కలుపుతూ కలుపుతూ అలాగే పిండిచేత్తోటే ఒచ్చేసింది కావ్య!
    కుర్చీలోంచి లేచివెళ్ళి తల్లిని చెట్టేశాడు క్రాంతి.
    "ఏమిట్రా ఇదంతా?" అంది  ఆలుగడ్డలు కూర కోసం  తరుగుతూ సీతాదేవి.
    కావ్య నెంబరు ఫస్టుక్లాసులో వుందే మమ్మీ! ఐ....యామ్....వెరీ....హాప్పీ...." అన్నాడు పేపరు చేతిలో పట్టుకుని క్రాంతి.
    "ఏదీ పేపరిటివ్వు" క్రాంతి చేతిలోంచి పేపరులాక్కుంటూ, తను నోట్ పుస్తకంలో  రాసుకున్న ఫ్రెండ్స్ నెంబర్లన్నీ  చూడ్డం మొదలెట్టింది. ఒక్కతనకీ, కళ్యాణికీ ఫస్టుక్లాసొచ్చింది. ఉమ, రేఖా, గంగా సెకెండ్ క్లాసులో ప్యాసయ్యారు. నిర్మలకి థర్డ్ క్లాసొచ్చింది. "నిర్మలకి థర్డ్ క్లాసెందుకొచ్చిందో! బాగానే రాశానని చెప్పింది మరి, అనుకుంది. ఈ నెంబర్లూ, రిజల్సూ చూస్తూ వుంటే కాలేజీ, వాతావరణం, స్నేహితులూ, అల్లరీ, ఆ ఉత్సాహం, అంతా అంచెలంచెలుగా జ్ఞాపక మొచ్చాయి. ఏదో ఆనందం ఆ గజిబిజి ఊహలలోనించి  తొంగి చూసి గిలిగింతలు  పెట్టినట్లయింది. వెంటనే ఆ ఆనందం పాలపొంగులా  క్షణంలో  చల్లారిపోయింది. పరీక్ష చివరిరోజు జరిగిన విశేషాలన్నీ ఒక్కొక్కటి కళ్ళముందు కదిలి పీడకలలా పీడించాయి మనస్సుని! కళ్ళని నీటిపొరలు కమ్మేశాయి!
    "తను కాలేజికివెళ్ళి  ఎమ్.ఏ. చదవలేదు. అమ్మ ఒప్పుకోదు. ఉద్యోగం కూడా చెయ్యనియ్యదు. పెళ్ళి ఒక్కటే తన జీవితంలో మార్పు తీసుకురావాలి. అదికూడా  జరగడం లేదు. తను ఫస్టుక్లాసులో పాసయి ఏం లాభం?
    నిర్మల థర్డ్ క్లాసులో  ప్యాసయితేనేం? జీవితంలో ఫస్టుక్లాసుగా  సెటిల్ అయిపోయింది. ఎవరో డాక్టరుతో పెళ్ళి కుదిరిందట. కళ్యాణి  మొన్న ఉత్తరంలో రాసింది.
    పాపం కళ్యాణొక్కర్తే  కనీసం తనకి ఉత్తరాలైనా  రాస్తోంది. మిగతా వాళ్ళు తను రాసిన ఉత్తరాలకి సమాధానము కూడా రాయడం లేదు. వాళ్ళు కూడా తను చెడిపోయిందనుకున్నారేమో! చివరికి నిర్మల కూడా చెంపలమీదగా జారుతున్న కన్నీటిని తుడుచుకుంది.

 Previous Page Next Page