Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 11

     నైట్ డ్రస్ లో  వున్నాడతను.

    మనసు మనసులో లేదు.

    రైతెలు పెట్టెలో అతనెక్కిందగ్గర్నుంచి ఓ చీమ కూడా ఎక్క లేదు.

    సిగరెట్ పైన సిగరెట్.

    పెట్టి అయిపోయింది.

    ఆలోచనల్లో పడి కిటికిలోంచి  బయటికి చూస్తూ కూర్చున్నాడు విజయ్. చేతిలో వున్న అగ్గిపెట్టెలోని  పుల్లల్ని తీసి ఒక్కొక్కటి కాల్చి పడేస్తున్నాడు.

    రైలు విజయవాడ చేరింది.

    మెల్లగా దిగి ప్లాటుఫారం  మీదికొచ్చాడు, గేటు దగ్గర టికెట్ ఇచ్చి రోడ్డు  మీది కొచ్చాడు.

    కానీ మనసులో "గిల్టీ" గా వుండటం తలెత్తి నడవలేక పోతున్నాడు  విజయ్.

    గాంధీనగర్ దాటి  అలంకార్  టాకీసు  దగ్గరకొచ్చాడు వంతెన దాటి గవర్నరు పేట చేరాడు.

    ఈ రాత్రి ఎక్కడైనా తలదాచుకోవాలి ఎక్కడ?

    ఏలూరురోడ్డులో   వున్న ఓ హోటల్లో అద్దెకి గది సంపాదించాడు విజయ్ అతనింకా  గదిలో ఇమడలేదు అంతలో  ఓ కుర్రాడు వెకిలిగా నవ్వుతూ వచ్చి.

    "సార్!" అన్నాడు.

    "ఏమిటి?"

    "కావాలంటే అమ్మాయిలున్నారు" అన్నాడు.

    "అవసరం లేదు వెళ్ళు" అన్నాడు విజయ్. ఆ కుర్రాడు అతన్ని వింతగా  చూసి  వెళ్ళిపోయాడు.

     గది తలుపు వేసుకొని పడుకున్నాడు. గదిలో దోమలు, మాసి పోయిన దుప్పటి మంచానికి నల్లులు నిద్రపట్టేలా లేదు. గదికి కిటికీ కూడా చిన్నది. గాలి సరిగా రావడం  లేదు. ఫోన్ వేశాడు. అది బర్  బర్ మని చప్పుడు  చేస్తూ తిరుగుతోంది కానీ తాలూకా గాలి మాత్రం అతనికి తగలడం  లేదు.

    "తనకేదో 'శని' పట్టింది లేకపోతే ఏమిటి దౌర్భాగ్యం" అనుకున్నాడు విజయ్.

    ఊబి అని తెలీకుండాపీకలవరకు  కూరుకు పోయాడు.

    బయటపడే మార్గం ఏమిటి?

    మానభంగం కేసుకింద కనీసం అయిదేళ్ళు  శిక్షపడవచ్చు.

    శిక్ష.

    జైలు.

    భయంతో వణికిపోయాడు.

    ఏడుపొచ్చింది. ఏడవలేక  పోయాడు దైర్యం సన్నగిల్లి  పోతోంది.

    వివేకాన్ని పోగొట్టుకుని తొందరపడినందుకు తనకి శాస్తి జరగాల్సిందే!

    తప్పు చిన్నదయినా  నేరం నేరమే.

    తను దోషి.

    కాశ్మీర నిజం చెప్పినా రామదాసు దృష్టిలో చట్టం దృష్టిలో తను దోషి.

    కళ్ళముందు కటకటాలు అబ్బా ఎంత దుర్భరమైన జీవితం అది.

 

    అతని ఆలోచనల్లోనే తెల్లారింది. మొహం కడుక్కుని  కాస్త కాఫీ తాగి మళ్ళీ  పడుకున్నాడు.

    కళ్ళు మండిపోతున్నాయి.

    పగలు కాడవం చేత, దోమల బాధనల్లులబాధ  లేకపోవడంతో  పడుకున్నాడు విజయ్.

    అలసి పోవడంచేత  వెంటనే నిద్రపట్టింది. సాయంత్రం అయిదు గంటలకి మెలుకువ  వచ్చింది. కడుపులో ఆకలి.
  
    క్రితం రాత్రి భోజనం చెయ్యలేదు. ఈ రోజు పగలూ తిండి లేదు.

    టిఫిన్  కాఫి తెప్పించుకుని గదిలోనే కూర్చున్నాడు విజయ్

    హోటలు  కుర్రాడు ఈవినింగ్  పేపరు తెచ్చి గదిలో పడేశాడు.

    పేపరు తిరగేస్తూ  విజయ్ ఉలిక్కి పడ్డాడు. అతని కళ్ళు పెద్దవయినాయి. ఈ వార్తపైన అతని చూపు నిలిచింది.

                                బందరు  సముద్రపు ఒడ్డున
                యువతీ దారుణ హత్య

    బందరు, డిసెంబరు :8 నిన్న సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో  అర్జున అనే ఇరవై సంవత్సరాల యువతని విజయ్ అనే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెని చెరిచి దారుణంగా  హత్య చేసి పారిపోయిన ఉదంతం బయటపడింది. అర్జున  పేరు మోసిన స్ధానిక న్యాయవాది  వరదరాజులు  కుమార్తె బందరు  కళాశాలలో  అర్జున  విజయ్ తో పాటే బి.యస్సి క్లాసు చదువుతోంది. ముద్దాయి విజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    "నో" అంటూ గట్టిగా అరవబోయాడు  విజయ్.

    అర్జున చనిపోయిందా?

    తను హత్య చేశాడా?

    అతని గుండె పగిలిపోయింది.

    అన్యాయం ఇది దారుణం.

    తలని గోడకేసి కొట్టుకున్నాడు విజయ్ అతను మనోహరంగా  కట్టుకున్న మేడలు ఒక్క సారిగా కూలిపోయాయి.


    అర్జున...

 Previous Page Next Page