Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 10

   "థేంక్యూ సార్... నా సిన్సియార్టీ  మీద మీకు వున్న నమ్మకానికి"   సిన్సియార్ గా అన్నాడు బెనర్జీ.
    "ఉన్న వాస్తవాన్ని చెప్పాను ఇన్ స్పెక్టర్.  బై  ది బై...  నా ప్రాబ్లం ఏమిటంటే..."
    "చెప్పండి"   అన్నాడు బెనర్జీ.
    ఈలోగా వేడి వేడి టీ వచ్చింది.
    టీ,  తాగాక,  రిలాక్స్  వుతూ   అన్నాడు ఫెడ్రిక్.
    "నన్ను హత్య చేయడానికి  ఎవరో కుట్ర పన్నుతున్నారని నాకు అనుమానంగా వుంది."
    "ఎవరు?"
    "ఎవరనేద   ఖచ్చితంగా చెప్పలేను."
    "హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని  మీకెందుకనిపించింది?"
    "అరగంట క్రితం నా కారు బ్రేకులు తీసి నన్ను చంపడానికి ప్రయత్నించారు కాబట్టి"   చెప్పాడు ఫెడ్రిక్.
    "వాట్"  అదురుపాటుతో   అడిగాడు బెనర్జీ.
    "నిజం ఇన్స్ పెక్టర్...లక్కీగా చెట్టుకు ఢీ  కొని కారుకి కొద్దిపాటి డామేజీతో నా ప్రాణాలు దక్కాయి"  అన్నాడు ఫెడ్రిక్.
    "మీకెవరైనా శత్రువులున్నారా?"
    "ప్రొఫెషనల్ గా   వున్నా,   నా ప్రాణాలు తియాలనుకునేంత శత్రుత్వం వున్నవాళ్ళు లేరు."
    "మరి మీ అనుమానానికి మోటివ్?"
    "అదే మీరు కనిపెట్టాలి."
    "ఆల్ రైట్...మీరు రిపోర్ట్ రాసివ్వండి."
    "వద్దు..  ఎఫ్.ఐ.ఆర్.  కూడా పైల్ చేయొద్దు. ఒక విధంగా చెప్పాలంటే అన్  అఫీషియల్ గా  నాకేసు డీల్ చేయాలి.  నాకు మీరు చేయాల్సినది ఇదొక్కటే."
    "అనఫీషియాల్ గానా?"
    "అవును ఇన్  స్పెక్టర్... మీరీ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియద్దు.  మీ వీలును బట్టి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియద్దు.   మీ వీలును బట్టి దర్యాప్తు చేయండి.  నన్ను చంపాలని అనుకుంటున్నది ఎవరో కాస్త నాకు తెలిస్తే చాలు."
    బెనర్జీ ఆలోచనలో పడిపోయాడు.
    ఫెడ్రిక్ క్యారెక్టర్ పెక్యూలియర్ గా   తోచింది.   సోసైటీలో  అతని హొదా   తెలుసు.  కేవలం తన మీద నమ్మకంతో,   తన దగ్గరకు వచ్చాడు.
    "ఆల్ రైట్ సార్... మీ కోసం అవుటాఫ్ ది వేలో వెళ్తాను.  అయితే,  అంత కన్నా ముందు,  మీరు మీ గురించి డిటెయిల్డ్  గా   చెప్పాలి.    ఏ విషయమూ మిస్ చేయొద్దు.   ఇట్స్ మై రిక్వెస్ట్"  చెప్పాడు తన అభిప్రాయాన్ని సూటిగా బెనర్జీ
    "తప్పకుండా..."  అంటూ తన చేతిలో వున్న బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి ఓ పెన్ చేసి చెక్ బుక్  తీసి ఓ బ్లాంక్ చెక్ సంతకం చేసి,  బెనర్జీకి ఇస్తూ ఇది నా తృప్తి కోసం"  అన్నాడు.
    "సారీసార్.. నేను నా తృప్తి కోసం ఈ కేసు టేకప్ చేస్తున్నాను.  అందుకు ప్రతిఫలం తీసుకుంటే నాకు  ఆ తృప్తి వుండదు.  ఈకేసు నేను తెల్చాక,  మీ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి  వస్తాను.  అదే నా ఫీజు"  అన్నాడు నమ్రతగా.
    ఫెడ్రిక్ కళ్ళలో నీళ్ళు చిమ్మాయి.
    "థేంక్యూ...  థేంక్యూ ఇన్  స్పెక్టర్...  ఈ థేంక్స్ మీరు ఫీజు తీసుకోనందుకు కాదు.  కన్నీళ్లు నేల రాలితే గుండె బరువు దిగుతుందంటారు.   మీ మంచితనంతో నా మనసు  చెమర్చి కన్నీళ్లు నేలరాల్చి,  నా బరువు దిగేలా చేసారు.  మీకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చే అవకాశం త్వరలో రావాలని కోరుకుంటున్నాను"    అన్నాడు ఇన్ స్పెక్టర్  బెనర్జీ చేతిని ఆప్యాయంగా నొక్కి వదిలేస్తూ.
    "ఏంటీ...  ఇవ్వాళ...పదకొండు దాటినా,  మన బాస్ రాలేదు"  అవని టేబుల్ దగ్గరికి వచ్చి అడిగింది వసుధ.
    "బావుంది...  నాకెలా తెలుస్తుంది"  అంది చికాకును అణిచిపెట్టుకొని.
    శేషశాయి అవని వైపే చూస్తున్నాడు.  అవని మీద పీకల్దాక కోపం వుందతనికి.  అవకాశం కోసం కాచుక్కూచున్నాడు.
    పన్నెండు దాటుతుండగా ఫెడ్రిక్ వచ్చాడు.  అందరూ సైలెంటయ్యారు.  ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు.    వసుధ స్టాక్  లిస్ట్,   ఎక్స్ పోర్ట్  చేయాల్సిన ఆర్టికల్స్ లిస్ట్ తీసుకొని ఛాంబర్ లోకి వెళ్ళింది.
    "సార్..ఓసారి మీరు ఈ లిస్ట్ ని   చెక్ చేస్తే...?"
    వసుధ వైపు చూసి "రేపు చూస్తాను"   అన్నాడు.
    "ఇవ్వాళే కొన్ని డెలివరీ చేయాలి సార్... పైగా  రేపు  ఉదయం కొన్ని పార్శిల్స్ ఢిల్లీకి వెళ్ళాలి."
    అసహనంగా తల విదిల్చి ఆ ఫైల్స్ ని   తీసుకొని చూడసాగాడు.
    "గోడౌన్ లో  నుంచి ఏయే ఆర్టికల్స్ వెళ్తున్నాయి,  ఏ ఆర్టికల్స్ స్టాక్ వున్నాయి... అవన్నీ సరిగ్గా మెయింటెన్ చేస్తున్నారా?"
    "యస్సార్."
    "అన్నీ దగ్గరుండి చూసుకోవాలి..ఎవర్నీ నమ్మకూడదు. ముఖ్యంగా సరుకు డెలివరీ చేసేటప్పుడు."
    "సర్టెన్లీ  సార్"
    "త్వరలో కొత్త ప్రోడక్ట్ ఒకటి మనం ఎక్స్ పోర్ట్ చేయబోతున్నాం."
    "ఆ ప్రోడక్ట్ ఏంటి సార్? "  కుతూహలంగా అడిగింది వసుధ.
    "నేను  చెప్పింది  చేయడమే మీ వంతు.  అనవసర విషయాల గురించి ఆసక్తి వద్దు...బైదిబై   అవని మీద మీ ఒపీనియన్  ఏంటి?"    అడిగాడు ఫెడ్రిక్.
    ఒక్కక్షణం  కంగారు పడింది.
    "చెప్పండి"  అన్నాడు.
    "షి   ఈజ్   ఎఫీషియంట్ అండ్ ఆల్సో సిన్సియర్"  అన్నది.
    "హిమాయత్ నగర్ లో    మరో చిన్న బ్రాంచీని ఓపెన్ చేద్దామనుకుంటున్నాను."
    "అవనిని అక్కడికి పంపిస్తారా సార్"  ఉత్సాహంగా అడిగింది వసుధ.
    "ఉహూ"
    "మరి"
    "మిమ్మల్ని ఆ బ్రాంచికి  ట్రాన్సఫర్   చేద్దామని."
    "సార్."
    "యాస్..అక్కడ మీరు చేయాల్సింది ఏమీలేదు.   జస్ట్ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం.  ఆన్సర్ చేయడం...అంతకు మించి మీకు పనేమి వుండదు."
    ఒక్కక్షణం వసుధ మొహంలో  రంగులు మారాయి.
    "మ..రి.. అవని?"
    "ఈ  ఆఫీసుకు ఇన్- చార్జీగా ఆపాయింట్ చేద్దామనుకుంటున్నాను.   కొన్ని నెలలు నేను స్టేట్స్ లో    వుండాల్సిరావచ్చు.  నేను వచ్చేవరకు అవని చూసుకుంటుంది.  గోడౌన్  స్టాక్ లిస్ట్,  ఆర్టికల్స్ పర్టిక్యులర్స్ మొత్తం  ఓ ఫైల్ తయారుచేయండి."
    "సార్."
    "నౌ  యు  కెన్ గో...   అన్నట్టు  ఓ  విషయం...  బాయ్ ఫ్రెండ్స్  విషయం మీ  పర్సనలే... కానీ  మీ  పర్సనల్  విషయాలకు ఆఫీస్  అవర్స్ లో టైం కేటాయించాకూడదు.  నాకు చెప్పకుండా మొన్న ఆఫీసు వదిలి వెళ్ళారు.  మీ డ్యూటి అవనికి అప్పగించారు."
    "అవని  చెప్పిందా?"   వెంటనే నోరు జారింది.
    "అంటే  నేను  చెప్పింది నిజమేనని,  మీ కర్దమైందన్నమాట."
    తల  వంచుకుంది వసుధ.
    "మీరిక  వెళ్ళొచ్చు."
    ఎర్రబడ్డ మొహంలో బయటకు నడిచింది.
    లంచ్  అవర్ లో  అవని వసుధ దగ్గరికి  వెళ్ళింది.
    బాస్ ఛాంబర్ లోకి   వెళ్ళినప్పట్నుంచి  అదోలా   వుంది.
    ఏం  జరిగి వుంటుందో అర్ధం కాలేదు.  తనతో  బిహేవ్  చేసినట్టు గా  వసుధతో   కూడా బిహేవ్ చేసాడా?   అన్న డౌట్ వచ్చింది అవనికి.
    వసుధ మాత్రం చాలా సీరియస్ గా  వుండిపోయింది.  అవని ఇదంతా ప్లాన్డ్ గా   చేసిందని  నమ్ముతోంది.
    "ఏయ్..వసుధా...ఏంటి డల్  గా   వున్నావు. బాస్ ఏమైనా   అన్నారా?"  అవని వంక సీరియస్ గా చూసి,
    "నీకేం  తెలియదా?"
    "నాకా...నాకేం తెలుస్తుంది?  నాకెలా తెలుస్తుంది?"
    "అవనీ...నాటకాలు వద్దు. నువ్వింకా చాలా అమాయకురాలివి అనుకున్నాను"  కోపంగా అంది వసుధ.
    "ఏయ్ వసుధా...ఏంటి...నువ్వేం మాట్లాడుతున్నావో నీ  కర్ధమవుతుందా?"
    "ఆహా..ఎంత చక్కగా నటిస్తున్నావు.  సినిమాల్లో ట్రయ్ చెయ్.. బ్రహ్మండంగా  అవకాశమిస్తారు."
    "వసుధా"
    "లేకపోతే...మొన్న నిన్ను నేను రిక్వెస్టు చేసి ధీరజ్ తో కలిసి బయటకు వెళ్ళిన విషయం,  నీకు నాకు తప్ప మరొకరికి తెలియదు అవునా?"
    "అవును."
    "మరా విషయం బాస్ కు   ఎలా తెలుసు?"
    "బాస్ కు  తెలిసిందా?"   ఆశ్చర్యంగా అడిగింది.
    "ఎంత  బాగా నటిస్తున్నావు అవని...శభాష్"  అంది వ్యంగ్యంగా  వసుధ.
    "నిజంగా వసుధ.  నా ఇష్టంతోనే నేను ఆ రోజు వున్నాను.  అయినా ఆ తప్ప నేను చేసినప్పుడు నీ గురించి ఎందుకు చెబుతాను.  అప్పుడు వసుధ వుండమంటే నువ్వెలా వున్నావని నన్ను అనడా"  అంది  అవని.
    "అంటే నీవు చెప్పలేదన్నమాట. "
    "నిజం."
    "మరి బాస్ కు  ఎలా తెలిసినట్టు?"  తనలో తానే గొణుక్కుంది.
    "ఏమో..నన్ను నమ్ము."  అంది  అవని.
    "సారి అవనీ.. ఏదో ఏమోషన్ లో  అనేసాను."   అంది   నోచ్చుకున్నట్టు నటిస్తూ.  లోలోపల కుతకుత వుడికిపోతుంది వసుధ మనసు.
    తనని మరో బ్రాంచికి...అదీపనికిరాని  బ్రాంచీకి పంపించి,  ఇక్కడ ఈ ఆఫీసు వ్యవహారం అంతా అవనికి అప్పగించడం జీర్ణించుకోలేకపోతుంది.
    "అవనీ..నాకో విషయం చెప్పు...మన బాస్ త్వరలో ఓ కొత్త ప్రోడక్ట్ ఎక్స్ పోర్ట్ చేస్తున్నాడట కదూ!"
    "నీకెవరు చెప్పారు?"
    "బాసే చెప్పాడులే?"
    "అదేంటి నన్ను చెప్పోద్ధన్నాడుగా"  అని నాలిక్కర్చుకుంది.
    "చెప్పోద్ధన్నాడా?"
    "అదీ..అదీ..."
    "నిజం చెప్పు అవనీ..నాకు చెప్పోద్ధన్నాడా?"
    "నీకని కాదు...ఇంకా పైనలైజ్  కాలేదు.  అప్పడే ఎవరితోనూ అనొద్ధన్నాడు."
    "నాక్కూడా చెప్పలేదు కదూ"  నిఘ్టారంగా అంది.
    "సారి వసుధా..  నీకు చెప్పొద్దని కాదు.  బాస్ చెప్పొద్దని ఆర్డర్ వేసాక చెబితే బావోదని..."
    "ఇంకా ఏం చెప్పాడు?"
    "ఏం చెప్పలేదు."
    "నిజంగా?"
    "నిజంగానే."
    "హిమాయత్ నగర్ లో   ఓ   బ్రాంచీ ఓపెన్ చేస్తున్నారటగా."
    "నిజమా..నాకు తెలియదు."
    అవని కళ్ళలోకి పరిశీలనగా చూసింది.  ఆమెకీ  విషయం తెలియని అర్ధమైంది  వసుధకు.
    తనని హిమాయత్ నగర్ బ్రాంచీకి  వెళ్ళమన్నారని,  ఈ ఆఫీసు వ్యవహారాలు నీకే అప్పగిస్తాడని  కానీ అవనితో చెప్పలేదు వసుధ కావాలనే.
    "ఎనీ వే సారీ అవనీ...ఏదో  కోపంలో నిన్ను హార్ట్ చేసాను.  ఏమైనా బాస్ ను  నమ్మకూడదు.  డబుల్ గేమ్  ఆడేరకం"  అంది వసుధ.
    "అదేంటి?"
    "అవును..ఇందాక నీ గురించి ఒపీనియన్ అడిగాడు.  నేను పాజిటివ్ గా  చెప్పాను.  కానీ,  బాస్ మాత్రం నీగురించి  బ్యాడ్ గా   చెప్పాడు.  నీ మీద మంచి ఒపీనియన్ లేదు"  అంది.
    కోపం తన్ను కొచ్చింది అవనికి.  వసుధ చెప్పేది నిజమేనని నమ్మింది.  పైగా బాస్ నిన్న తనతో ప్రవర్తించిన తీరుకు తను నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది.
    ఆ కోపంతోనే తన గురించి అలా చెప్పివుంటాడు.
    "ఇంకా ఏం చెప్పాడు నా గురించి?"
    "వద్దులే...చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టంలేదు. పైగా  నాకిలాంటి విషయాలు మోయడం  ఇష్టంలేదు."
    "ఇది మోయడం ఎందుకవుతుంది.  బాస్ గురించి నాకు  తెలిస్తే నేనేం  నిర్ణయం తీసుకోవాలో ఆలోచించోచ్చు. యజమానికి మన మీద విశ్వాసం లేనప్పుడు మనం పని చేయడం కూడా వేస్ట్"  అంది.
    "నిజం చెప్పావే...అయినా నువ్వెంత సిన్సియర్ వి.   నీలాంటి ఎంప్లాయి దొరకడం బాస్ అదృష్టం...ఫ్చ్ అయినా నీలాంటి వ్యక్తిని  పట్టుకొని అలా అనడం...నాక్తెతే  నచ్చలేదు."
    "ఏమన్నాడు?"  అడిగింది అవని.

 Previous Page Next Page