Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 10


    "మామ్మగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చెయ్యమని. ఇది సంసారుల కొంప. కజిన్ అట కజిన్. మంచిపేరే పెట్టావు. మీరు కళ్లు మూసుకుంటే లోకం మూసుకోవద్దూ. మాకంతా తెలిసిందే అమ్మాయి. ఈ ఫస్టుకి ఇల్లు ఖాళీ చెయ్యమంది." ఏడుపుమొహంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండు సుశీల ఆఫీసులో, ఇంటావిడతో చెప్పిందనగానే ఇద్దరికిద్దరూ చెదిరిపోయారు. సెలవై వెళ్ళిన భాస్కర్ ని రూముకి పిలిచి చీవాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాస్. రంజనని ఏహ్యంగా చూశాడు.
    "నాయినా బుద్ధి గడ్డితిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫైర్ నడిపాను. నన్ను వదిలిపెట్టు ఇంక, నీవల్ల అందరిముందూ దోషిలా నిలబడ్డాను. ప్లీజ్ గో ఎ వే ఫ్రం హియర్" రంజన ఆఫీసులో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది. 'ఛా.. ఛా.. ఏదో పై మెరుగులకి మోసపోయి మోజుపడ్డాను. మేడిపండువని తెలియక, కట్టుకొన్న ఇల్లాలిని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలి గోటికి సరిపోవు" భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు.
    "మరింకేం వెళ్ళు, నీ పతివ్రత పెళ్లాం దగ్గరకి, ప్రతి మగాడూ నీలాగే నాలుగురోజులు మోజు తీరిపోయాక పెళ్ళాం పతివ్రతలాగే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మీలాంటి పెళ్ళయిన వాళ్ళ మాటలు నమ్మడం నా బుద్ధి తక్కువ. ఇంకా నీతో మాటలేమిటీ. గెటౌట్ నౌ" రంజన తిరస్కారంగా చూస్తూ అంది.
    "పోక నీ కొంప పట్టుకుని ఇంకా వేళ్ళాడుతాననుకున్నావా?" గబగబా బట్టలన్నీ సూట్ కేస్ లో కూర్చాడు.

                                                      *  *  *

    "అదేం అప్పుడే మోజు తీరిపోయింది ఏమిటి వెనక్కి వచ్చేశారు. అయ్యో కనీసం ఒక నెలన్నా కాలేదే. ఇరవై రోజులకే ప్రేమంతా చిల్లు బాల్చీలో నీళ్ళలా కారిపోయిందా" తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది గుమ్మంలోనే నిలబడి.
    "ప్రభా ఫర్ గాడ్ సేక్. చచ్చిన పాముని ఇంకా చంపకు. బుద్ధి వచ్చింది. దూరపుకొండల సామెత అర్ధమైంది. ఏదో పై మెరుగులకి మోసపోయి చలించి తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను... సారీ" క్షమాపణ చెపితేగాని ప్రభావతి లోపలికి రానీయదన్నది అర్ధమై అప్పటికే సగం చచ్చి, ఆత్మాభిమానం చంపుకుని వచ్చిన భాస్కర్ తెగేదాక ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. "ప్రభా ముందు లోపలికి రానీ, మనం మాట్లాడుకుందాం. సారీ చెప్పాగా." ప్రభావతి అతనివంక సూటిగా చూసింది.
    "ఒక్క మాటకి జవాబు చెప్పండి. ఇదేపని నేను చేసి, ఓ నెల నా ఇష్టం వచ్చినవాడితో ఉండి, సారీ తప్పుచేశాను అంటే మీరేం జవాబు చెప్తారు" భాస్కర్ తల దించుకున్నాడు. "చెప్పరు, జవాబు చెప్పరు చెప్పలేరు. ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్న మీకుండదు. ఎందుకంటే, అలా జరగదు, జరిగినా మీరు వెనక్కి తగ్గరు. తగ్గిపోవడానికి, అలాంటి భార్యని వెనక్కి తీసుకోవడానికి మీ పురుషాహంకారం అడ్డొస్తుంది. అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావడం అన్న ప్రశ్న ఉండదు" భాస్కర్ దోషిలా తల దించుకున్నాడు.
    "ప్రభా నీవు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయా ధరిత్రి అన్నారు. మగాళ్ళు ఏ తప్పుచేసినా కన్నతల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది ఆ గుణం మాకు లేదు."
    "అవును యుగయుగాలుగా సహనశీలురు క్షమయాధరిత్రులు లాంటి బిరుదులిచ్చి సీతలు, అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడేం చేసినా ఆడది క్షమించడాలు, పాఠాలు, నీతి బోధలు చేసి, చేస్తూ మగాళ్ళకి ధైర్యం కలిగించారు. పెళ్ళాం ఏం చేస్తుంది, నాలుగురోజులు ఏడుస్తుంది. మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుణ్ణి సంసారాన్ని వదులుకోదు. ఎన్ని వెధవ పనులు చేసినా 'క్షమించు' అనగానే కరిగిపోయి మొగుణ్ణి కౌగిలిలోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్ళిలా ఆడుతున్నారు. కానీ, ఆ రోజులు పోయాయి. ఈనాటి ఆడది భర్త లేకపోయినా కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ళమీద నిలబడగలదు. పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే స్థయిర్యం ఆమెకి ఆర్ధిక స్వాతంత్ర్యం ఇచ్చింది అన్నది మరువకండి. నాకు ఇప్పుడు మీ అవసరం లేదు. బాబుని పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు. చూడండి. మగాడికి ఆడది ఇంటి చాకిరీ చెయ్యాలి. బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి. ఇంట్లో కమ్మగా, వేడిగా వండిపెట్టాలి. ఇంటా బయటా చచ్చీ చెడి చాకిరీ చేసి అలసిపోయినా, భర్తగారు ఇంటికొచ్చేసరికి తెల్లచీర, మల్లెపూలతో ముస్తాబై కంటికానందం కలిగించాలి. శయనేషు రంభ అవాలి. బాగుంది. మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా. ప్రియురాలనేసరికి రెండుసార్లు గడ్డాలు గీస్తారు, స్నానాలు, పళ్లు తోముకోవడాలు, సెంట్లు పూసుకోవడాలు ఇవన్నీ చేసే మొగుడు, పెళ్లాం అనేసరికి జిడ్డుమొహం, చెమటకంపు, నోరు కంపు, కుళ్ళు లుంగీతో పక్కమీద కొస్తాడేం. చూడండి. ఏ ఆడదీ రోజంతా సింగారించుకుని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు కుదరదు. అంతమాత్రానికి ఇల్లాళ్ళూ హిడింబిల్లా, ప్రియురాళ్లు ఊర్వశుల్లా కనబడతారా. ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడదాని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు."
    "ప్రభా ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అర్ధం అయింది. ఇంట్లో భార్య ఎంత బాగా దోసెలు చేసినా హోటలు దోసె రుచి రాదన్నట్లు అప్పుడప్పుడు హోటలుకి వెళ్ళి కక్కుర్తి పడతారు. ఇదీ అంతే. పొరుగింటి పుల్లకూర రుచి..."
    "అవును. హోటలుకి వెళ్ళి దోసె తినడం లాంటిదే ఇదీనూ. కాస్త రొటీన్ నుంచి పెళ్ళాం విసుగనిపించినప్పుడు నాలుగు రోజులు థ్రిల్లు కావాలి మీకు. మంచిదే. మేమూ అలాంటి మనుషులమే. మాకూ జిహ్వ చాపల్యం ఉండదా. హోటలుకి వెళ్ళి దోసె తినాలనిపించదా." ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు.
    "ప్రభా, నేనింకేం చెప్పను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. క్షమాపణ కోరాను."
    "డాడీ" బయటినుంచి ఆడుకుని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంక ఎక్కాడు. ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్భాంధవుడిలా కనిపించాడు భాస్కర్ కి. కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమైనా ప్రభావతి క్షమించకపోదన్న ధైర్యం వచ్చింది. "ఎక్కడికెళ్ళావు డాడీ, మమ్మీ ఊరుకెళ్ళావని చెప్పింది. ఇన్నాళ్ళెందుకెళ్ళావు. పో, నీతో కట్." రాహుల్ ముద్దులు గునిశాడు. "ఏం చెయ్యను రాహుల్. మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది. సారీ చెప్పినా రానీయడం లేదు చూడు" కొడుకే రక్షించే దారి అన్నట్టు అన్నాడు.
    "అవునా మమ్మీ. పోనీలే పాపం. సారీ చెప్పారుగా. ఇంకెప్పుడూ వెళ్ళరులే. రానీ మమ్మీ."
    "హు మీకో కొడుకుండబట్టి బతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ, ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు. వాణ్ణి కన్న పాపానికి మీ పాపం భరించాలి. రేపు వాడు పెద్దయి నన్ను దోషిలా చూడకూడదని లోపలికి రానిస్తున్నాను. బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజునుంచి మీ స్థానం నా భర్తగా కాదు. రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరంగీకరిస్తే లోపలికి రండి. కుక్క ముట్టిన కూడు నేను తినను." ప్రభావతి కచ్చితంగా అని గుమ్మంలోంచి తొలగి లోపలికి వెళ్ళింది.
    ఆ మాత్రం చాలు అన్నట్లు భాస్కర్ గబగబా లోపలికడుగుపెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది. నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది. అన్నది అతని నమ్మకం, ధైర్యం.
    కానీ, ప్రభావతి ఈనాటి స్త్రీ, చదువు, ఆర్ధిక స్వాతంత్ర్యం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్ కి తరువాత తరువాత అర్ధం కావచ్చు.

                                                              * ఇండియా టుడే, జనవరి -1998

                                                            *  *  *  *

 Previous Page Next Page