ఒకనాడు కణ్వూడు శకుంతలతో ఇట్లన్నాడు :-
"అమ్మా! నీవు పతివ్రతవు. అయినను ఆడది కలకాలము పుట్టింట ఉండరాదు. భర్త వద్ద ఉండుటయే శ్రేయస్సు. కాన నీవు భర్త వద్దకు వెళ్ళుము."
శకుంతల వెంట కొందరు శిష్యులను ఇచ్చి పంపినాడు కణ్వూడు. శకుంతల , భరతుని తీసుకొని దుష్యంతుని వద్దకు వెళ్ళినది. దుష్యంతుడు కొలువుతీరి ఉన్నాడు. అచట మంత్రులు, ఉన్నారు. పురోహితులు ఉన్నారు. సామంతులు ఉన్నారు. పురజనులు ఉన్నారు. అది నిండు పేరోలగము.
శకుంతల పేరోలగమున ప్రవేశించినది. ఆమె దుష్యంతుని చూసినది. అతడు రాజు, ఆమె గుర్తించినది. దుష్యంతుడు శకుంతలను చూచినాడు. ఆమె మునికన్య. అతడు గుర్తించలేదు. శకుంతల మనసు చివుక్కుమంది. రాజులకు కొత్తవాని మీద మక్కువ ఎక్కువ. వారిని నమ్మరాదు. అయినను మరచిన వానికి గుర్తుచేయుట మంచిది అట్లనుకొని రాజుతో ఇట్లన్నది :-
"రాజా! నన్ను మరచినావా? కణ్వూని ఆశ్రమము మరచినావా? మన గాంధర్వము మరచినావా? ఇతడు మన పుత్రుడు. భరతుడు గుణవంతుడు, తేజోవంతుడు." అన్నది గాని అనుమానముగానే ఉన్నది.
"కాంతామణి ! నీవు ఎవరవో నాకు తెలియదు. ఎచటిదానవో తెలియదు. అసత్యము పలుకుచున్నావు. వచ్చిన దారిన వెళ్లుము."
శకుంతలకు కోపము పొంగినది. కనులు ఎర్రవారినవి. దుఃఖము పోర్లినది జలజల కన్నీరు రాలినది. ఒకసారి సభను చూచినది. అక్కడి వారందరు రాతి బొమ్మలవలె ఉన్నారు. ఒక్కడు ఉలకలేదు. పలుకలేదు. అతడు రాజు. వారు ఆశ్రితులు.
శకుంతల అరచేత కన్నీరు తుడుచుకున్నది. దుఃఖము దిగమింగినది. ధైర్యము తెచ్చుకొన్నది . అన్నది:-
"అప్పుడు గాంధర్వము అన్నావు. మన పెండ్లి మనకు ఇద్దరకే తెలియును. ఈ సభవారికి తెలియదు. అది నీ ధైర్యము. అందుకే అబద్దము పలుకుచున్నావు. మనిషి చేయు ప్రతి పనిని వేదములు చూచుచున్నవి. పంచ భూతములు చూచుచున్నవి. ఉభయ సంధ్యలు చూచుచున్నవి. యముడు, సూర్యుడు, చంద్రుడు, ధర్మదేవత ఎల్లరు చూచుచున్నారు."
"ఆత్మావైపుత్రనామాసి", "అంగాధంగాత్సంభవతి" ఇవి వేదవాక్కులు. ఇతడు నీకు పుత్రుడు, భరతుడు.
"దీపము నుండి మరొక దీపము వెలుగును. ప్రకాశించును. అట్లే నీవలన భరతుడు పుట్టినాడు. ఇతడు అజేయుడు అని ఆకాశవాణి పలికినది. ఇతనిని కౌగలించుకొనుము. నీకు పుత్ర పరిష్వంగ సౌఖ్యము తెలియును."
"ముత్యపుసరులు, కర్పూర చందనములు, పున్నమి వెన్నెల శీతల ఉపకరణములు. పుత్రుని ఆలింగనము వాటిని మించిన సౌఖ్యప్రదము కాబట్టి రాజా! కణ్వాశ్రమము , మన గాంధర్వము, నీవు ఇచ్చిన వరము గుర్తుకు తెచ్చుకొనుము. నీవు రాజువు. అవినీతికి పాల్పడరాదు. అబద్దము ఆడరాదు."
"నూరు చెరువులు నిర్మించుట కన్న ఒక బావి త్రవ్వించుట మేలు. నూరు బావుల కన్న ఒక క్రతువు మేలు. నూరు క్రతువుల కన్న ఒక పుత్రుని కనుట మేలు. నూరుగురు పుత్రులకన్న ఒక సత్యవాక్యము మేలు"
శకుంతల ధర్మోపన్యాసమిచ్చినది. ఆశలు ఉడిగినవి. రాజును చూచినది.
"శకుంతలా! కధలు చక్కగా అల్లగలవు. నీతులు చక్కగా చెప్పగలవు. అంతమాత్రమున నీవు నా భార్యవు కాలేవు. ఇతడు నా పుత్రుడు కాలేదు. నేనెక్కడ? నీవెక్కడ? పిచ్చిమాటలు మానుము. వచ్చిన దారిన వెళ్ళుము." అన్నాడు. ఆనాడు దేబరించినాడు. ఈనాడు గద్దించినాడు.
శకుంతల దుఃఖము కట్టలు తెంచుకున్నది. ఆమె నిండు సభలో హోరుమని ఏడ్చినది. ఆమె ఏడ్పునకు దిక్కులు కరిగినవి. ఆకాశము కరుణించినది.
"ఓ దుష్యంతా! శంకుతలను పెండ్లాడినావు. ఆమె నీ భార్య. భరతుడు మీకు ఇరువురుకు పుట్టిన కుల దీపకుడు. వారిని స్వీకరింపుము. అని ఆకాశవాణి పలికినది."
అది విన్నారు. రాతిబోమ్మలు సభాపరులు ఆశ్చర్యపడినారు. దుష్యంతుడు ఇట్లన్నాడు:-
"శకుంతల ముందు చెప్పినదంతయు సత్యము. మా వివాహము మరెవ్వరికి తెలియదు. ప్రజాపవాద భీతితో తెలిసియు తెలియనట్లు నటించినాను. ఇపుడు దివ్యవాణి పలికినది. కాన స్వీకరించుచున్నాను."
అట్లని శకుంతలను, భరతుని ఆదరమున స్వీకరించినాడు.
దుష్యంతుడు కలకాలము రాజ్యము పాలించినాడు. తరువాత భరతునకు పట్టము కట్టినాడు. తాను అడవులను వెళ్ళినాడు. తపమాచరించినాడు.
భరతుడు సమస్త భూమండలమును అతి చతురతతో పాలించినాడు. అతడు కులదీపకుడు అయినాడు. భరత వంశమునకు ఆద్యుడు అయినాడు. కౌరవ పాండవులు అతని వంశమువారు. ఆ వంశమువారి కధ చెప్పినది భారతము.
అతని పేరనే ఈ దేశము భారతదేశము అయినది.
ఆలోచనామృతము
1. శకుంతలలు మానవ చరిత్రలో కోకొల్లలు. వారు పూర్వము ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. ముందు కాలమున ఉందురు. శకుంతలను ఆకాశవాణి కాపడినది. కాపాడబడని శకుంతలల కధలు మానవ చరిత్రలో కోకొల్లలు. శకుంతల అందముల రాశి. ఆమె మనసు అందములకు అందము. ఆమె కాళిదాస మహాకవిని మురిపించినది. కాళిదాసు సుందరాతి సుందరమయిన అభిజ్ఞాన శాకుస్తలము రచించినాడు.
2. శుక్రుడు తలపెట్టిన కులాంతర వివాహము విఫలమయినట్లు కనిపించుచున్నది. శకుంతల క్షత్రియ కన్య అని తెలిసిన తరువాతనే దుష్యంతుడు ఆమెను వరించెను. ఇది అందుకు నిదర్శనము.
3. వివాహములు ఎనిమిది విధములు, నిజము. కాని అన్ని విధములు అప్పటికి అమలులో లేవు. అది అమలులో ఉన్న దుష్యంతుడు అందు గురించి అంత చెప్పవలసిన పనిలేదు. తండ్రి అనుమతితో వివాహమే అప్పటి అచారమని తోచుచున్నది.
4. "పెండ్లిండ్లలో ఇది మరొక ప్రయోగము. గాంధర్వము కూడదను నీతి చెప్పు కధ. ఈ కధలో మరొక ధర్మము స్పష్టమయినది. వర్ణము ఒకటయినను అంతస్తును బట్టి పెండ్లిళ్ళు జరుగవలసియున్నవి. ఈనాడు అట్లే జరుగుచున్నవి.