5. శకుంతల దుష్యంతునకు తన తల్లి కధ చెప్పినది. అందు నిగుడమయిన ఆమె భయము ఒకటి దాగి ఉన్నది. తాను తల్లిదండ్రులు లేని బిడ్డగా పెరిగినది. తన బిడ్డ తండ్రిలేని వాడు కారాదు. ఆడది భద్రత కోరుకోనును. ఆమెకు తనకన్న తన సంతానమును గురించిన ధ్యాస ఎక్కువ. అందుకే ఆమె దుష్యంతుని వరము కోరినది. అతడు వరము ఇచ్చువరకు ఆమె లొంగలేదు.
6. జీవితపు దశలన్నింటిలో యౌవనము అతి చంచలము. అప్పుడు కోరికలు విమాన వేగమున ఉరుకులు పెట్టును. ఉడుకు రక్తము యుక్తాయుక్తా వివక్షత ఉండనీయదు. వేగము దాని ప్రధాన లక్షణము. వేగము మీరిన ప్రమాదములు సహజములు.
యౌవనమే జీవితమునకు పునాది వంటిది. వ్యక్తీ భాగస్వామిని అప్పుడే ఎన్నుకోనును. ఒక వృత్తిని, ఒక ఉద్యోగమును అప్పుడే ఎన్నుకోనును. వాటిని బట్టే అతని జీవిత నౌక పయనము సాగును.
ప్రాయము కోరికలు జవనాశ్వములు. వానికి కళ్ళెములు ఏర్పరచవలెను. అందుకు కుటుంబము ఏర్పడినది. వయసులో అనుభవము తక్కువ, అక్కడ అనుభవమున్న తల్లిదండ్రులున్నారు. వారు తమ అనుభవ నిదర్శనములతో వయసులో ఉన్నవారికి పాఠములు నేర్పి వారిని సక్రమ మార్గమున పెట్టుటకు ప్రయత్నింతురు.
శకుంతల తండ్రి కొఱకు వేచి యుండలేదు. ఆశకు పోయినది. జవనాశ్వమునకు కళ్ళెమువెయ లేదు. తొందరపడినది. కాలు జారినది.
ఇది పరువములో ఉన్నవారందరికీ హెచ్చరిక!
శంతనుడు
భరతవంశపు వాడు శాంతనుడు. అతడు ప్రదీప, సునందల పుత్రుడు. శంతనుడు గొప్ప వీరుడు. ఒకనాడు ధనుర్బాణములు పట్టినాడు. వేటకు అడవికి వెళ్ళినాడు. వేటాడినాడు. వేటాడినాడు. అలసినాడు. గంగానదీ తీరమునకు వచ్చినాడు. అక్కడి ఇసుకతిన్నెలు మీద కూర్చున్నాడు. వాతావరణము హాయిగా నున్నది. చల్లని గాలి వీచుచున్నది. గాలితో నీటి తుంపరలు వచ్చి ఆహ్లాదకరముగా ఉన్నది.
శంతనుని అలసట తీరినది. ఉత్సాహముగా ఉన్నాడు. అట్టి సమయమున గంగాదేవి వచ్చినది. ఆమె మనుష్య రూపము దాల్చి వచ్చినది. శంతనుని ఎదుట నిలిచినది. ఆమె అందముగా ఉన్నది. దేవకన్య వలె ఉన్నది.
శంతనుడు గంగను చూచినాడు. కనురెప్ప వాల్చలేదు. గంగ శంతనుని చూచినది. కనురెప్ప వాల్చలేదు.
ఈమె మనుష్యకాంత కాదు. మనుష్యకాంతలు ఇట్లు ఒంటరిగా రారు అనుకున్నాడు శాంతనుడు. అడిగినాడు.
"సుందరీ! నీవు ఎవ్వరవు? ఎక్కడిదానవు? ఒంటరిగా ఏలవచ్చినావు?"
గంగకు శంతమునిపై మనసయినది. "రాజా! నీవు నాపై వలపుగొని ఉన్నావు. నీకు ఇష్టమయిన నేను నీకు భార్యను కాగలను. అందుకు ఒక షరతున్నది. నేను చేయు పనులను నీవు అడ్డు రాకూడదు. నన్ను దూషించరాదు. నీవు నన్ను వ్యతిరేకించిననాడు నేను నీ వద్ద ఉండను. వెడలిపోదును." అన్నది.
శంతనుడు అందుకు అంగీకరించినాడు. గంగ శంతనుని భార్య అయినది. గంగకు ఏడుగురు పుత్రులు ఒకరి తరువాత ఒకరు కలిగినారు. గంగ తనకు పుట్టిన బిడ్డల నెల్ల గంగలో వేసి చంపినది. అట్లు ఏడుగురిని గంగకు అర్పించినది. శంతనుడు అడ్డు పలుకలేదు. అడ్డుపడిన గంగ వెళ్ళిపోవునని అతని భయము.
గంగ ఎనిమిదవసారి ప్రసవించినది. ఈసారి కూడా బిడ్డను తీసుకుని గంగకు సాగినది. శంతనుడు సహించలేకపోయినాడు. ఆమెను అడ్డుకున్నాడు. బిడ్డను గంగకు అర్పించవలదన్నాడు. అందుకు గంగ "పెండ్లి సమయమున నీవనిన మాటను వ్యతిరేకించినావు. నేను నీవద్ద ఉండను వెళ్లి పోవుచున్నాను. ఈ నీ కొడుకును పెంచి, పెద్ద చేసి నీకు అప్పగింతును" అంది.
శంతనుడు విచారించినాడు. భార్య కొఱకు ఏడుగురు కొడుకులను పోగొట్టుకున్నాను. కొడుకు కొఱకు భార్యను వ్యతిరేకించినాను. భార్య పోవుచున్నది. కొడుకును దక్కకున్నాడు. అట్లనుకున్నాడు. శంతనుడు గంగను ఇట్లడిగినాడు.
"గంగా! తల్లియే పిల్లలను చంపుట చూడలేదు. నీలో మాతృత్వము లేదా?" ఏం ఈ అకార్యము చేసినావు?"
గంగ పూర్వ కధ వివరించినది.
పూర్వము అష్టవసువులు భార్యల సహితముగా విహారమునకు వెడలినారు. వారు వశిష్టుని ఆశ్రమమునకు వచ్చినారు. అక్కడ వారికీ నందిని కనిపించినది. ఎనిమిదవ వసువు భార్య ప్రణయిని మురిసినది. దానిని పట్టి తెమ్మని కోరినది. వసువులందరు దానిని పట్టుకొని పోయినారు. వశిష్టునకు నందిని కనిపించలేదు. అతడు దివ్యదృష్టితో చూచినాడు. గ్రహించినాడు. కోపించినాడు. శపించినాడు. వసువులు మానవమాత్రులుగా జన్మింతురని అన్నాడు. వసువులు వశిష్టుని శాపమును తెలుసుకున్నారు. నందినిని తెచ్చినారు. అప్పగించినారు. వశిష్టునిని ప్రార్ధించినారు. శాపకారణముగా తాము ఎక్కువ రోజులు మానవ లోకమున ఉండకుండ అనుగ్రహించమన్నారు. వశిష్టుడు శాంతించినాడు. అనుగ్రహించినాడు.
"ఎనిమిదవ వసువు ప్రభాసుడు. అతడు నా ఎడల చాల కూరముగా ప్రవర్తించినాడు. అతడు మాత్రము మానవ లోకమున చిరకాలము ఉండును. సంతానహీనుడు కాగలడు." అన్నాడు వశిష్టుడు.
మరొక కారణమున గంగ మానవకాంత కావలసి వచ్చినది.
శంతనుని తండ్రి ప్రదీపుడు. అతడు గంగ ఒడ్డుకు వచ్చినాడు. గంగ అతనిని వలచినది. "నీ కోరిక నా పుత్రుడు శంతనుడు తీర్చగలడు" అన్నాడు. అట్లు గంగ మానవకాంత కావలసి వచ్చినది.
అందుగురించి వసువులు విన్నారు. గంగను ప్రార్ధించినారు.
"అమ్మా! మమ్ముల నీ కడుపున పుట్టనిమ్ము. పుట్టుగనే కడతేర్చి మమ్ము ధన్యులను చేయుము. ఎనిమిదవ వాడు మాత్రము పెరిగి పెద్దవాడగును."
గంగ అందుకు అంగీకరించినది.
పూర్వ కధ చెప్పినది గంగ. శంతనునితో అన్నది :-
"రాజా! ఈ బిడ్డ అష్టమ వసు స్వరూపము. ఇతనిని దేవపుత్రుడు అందురు. ఇతడు ధర్మ స్వరూపుడు. మానవలోకమున చిరకాలము ఉండును. ఇతనిని నావెంట తీసుకొని వెళ్ళుచున్నాను. కాలక్రమమున నీకు అప్పగించగలను."
అట్లని దేవపుత్రుని తీసుకుని గంగ వెళ్ళి పోయినది.
శంతనుడు గంగ వెళ్ళినదారి చూచుచూ ఉండిపొయినాడు.