దుష్యంతుడు పూరుని వంశపువాడు. ఇలునకు, రధంతికి పుత్రుడు. దుష్యంతుడు బలవంతుడు. బుద్ధిమంతుడు. బాల్యముననే అతడు సింహ శార్దూలములతో అడుకోనువాడు.
ఇలుని తరువాత దుష్యంతుడు రాజు అయినాడు. అతనికి వేటాడుటన్న మిక్కులి మక్కువ. ఒకనాడు మంత్రి సామంత పురోహితసహితుడై వేటకు వెళ్ళినాడు. అతడు మృగములను చుట్టుముట్టినాడు. వేటాడినాడు. క్రూర మృగములను చంపినాడు. అడవి ప్రాంతము కలచి వేసినాడు. మృగముల అరుపులతోను, కేకలతోను అడవి దద్దరిల్లినది. అది పాల సంద్రము తరచునప్పటి మందర పర్వత ధ్వని వలె నున్నది.
దుష్యంతుడు వేటాడినాడు అలసినాడు. మంత్రులు మున్నగువారు వెంటరాగా విశ్రాంతికయి బయలుదేరినాడు. అట్లువారు కొంత దూరము వచ్చినారు. వారికి ఒక ఉపవనము కనిపించినది. అది అందంగా ఉన్నది. మనోహరముగా ఉన్నది. కనుల పండువుగా ఉన్నది. దుష్యంతుడు ఆ వనమును చూచినాడు అనందించినాడు.
దుష్యంతుడు ముందుకు నడిచినాడు. ఒక ఆశ్రమము కనిపించినది. అది అశాంతికి దూరముగా శాంతికి నెలవుగా ఉన్నది. మంతులను సైన్యమును అక్కడనే ఉంచినాడు. తాను ఆశ్రమమున ప్రవేశించినాడు. ఆశ్రమమున హోమ దూమములు కనిపించినవి. దగ్గర ఉన్న తీగలకు హోమ దూమములు సోకిన జాడలు కనిపించుచున్నవి. అక్కడి చెట్లకు తేనే తెట్టలు పుష్కలంగా ఉన్నవి. ఆశ్రమము పుణ్యనదీ తీరమున ఉన్నది. అచట వేదధ్వనులు వినిపించుచున్నవి.
అచటి చిలుకలు సామగానమువలె పాడుచున్నవి. ఏనుగులు ఆ ధ్వనులు వినుచున్నవి. ఆనందమున నీటి తుంపరలు చిమ్ముచున్నవి. గాలికి ఆ తుంపరలు సింహములపై పడుచున్నవి. అట్లు అచట సింహము, ఏనుగు, స్నేహ భావమున ఉన్నవి. బలి అన్నము తినుటకు ఎలుకలు, పిల్లులు మున్నగు సహజ విరోధ జాతులు కలిసి మెలిసి తిరుగుచున్నవి.
అది కణ్యుని ఆశ్రమము. దుష్యంతుడు ఆశ్రమమున ప్రవేశించినాడు. అచట శకుంతల కనిపించినది. ఆమె యౌవనవతి. రాజును ఆదరించినది. ఆసనము వేసినది. కూర్చుండ బెట్టినది. అర్ధ్యము ఇచ్చినది. పాద్యము ఇచ్చినది. "కణ్యుడు పండ్లు తెచ్చుటకు దగ్గర ఉన్న అడవులకు వెళ్ళినాడు." అని చెప్పినది.
దుష్యంతుడు శకుంతలను చూచినాడు. ఆమె ఎదురుగా కూర్చుని ఉన్నది. అతని మనసు చలించినది. మదనవికారము కలిగినది. మునికన్య విషయమున అట్టి వికారము అసంభవము. శకుంతలను గురించి తెలుసుకొన దలచినాడు. అడిగినాడు.
"శకుంతలా! నీలావణ్యం చూడ మునికన్య వలె కనిపించవు. నీవెవరవు?"
శకుంతల తన జన్మ వృత్తాంతము చెప్పినది.
ఒకప్పుడు విశ్వామిత్రుడు కఠోరమయిన తపము చేసినాడు. అది చూచి ఇంద్రుడు భయపదినాడు. తన పదవి ఉడును అనుకున్నాడు. మేనకను పిలిచినాడు. విశ్వామిత్రుని తపము భగ్నము చేయవలసినది అన్నాడు. విశ్వామిత్రుని పేరు విన్నది మేనక. గడగడలాడింది. అయినను ప్రయత్నింతునన్నది.
మేనక తన చెలికత్తెలతో తపోవనము ప్రవేశించినది. ఆటలాడినది. పాటలు పాడినది. విశ్వామిత్రుని కదలించలేకపోయింది.
ఒకనాడు మేనక విశ్వామిత్రుని ముందు నిలిచియున్నది. పిల్లగాలి వీచినది. పయ్యెద తొలగినది. విశ్వామిత్రునకు రొమ్ములు కనిపించినవి. స్తన కక్షులు కనిపించినవి. పలచని ఉదరము కనిపించినది. అందలి మూడు మడతలు కనిపించినవి. విశ్వామిత్రుని మనసు చెదరినది. మదన వికారము కలిగినది. అతడు మేనకతో సంభోగించినాడు. మేనక చాలాకాలము విశ్వామిత్రుని వద్దనే ఉన్నది. ఆమెకు ఒక కూతురు కలిగినది. ఆ బిడ్డను మాలినీ నదీ తీరమున ఉంచినది. మేనక దేవలోకమునకు వెళ్ళినది.
కణ్యుడు మాలినీ నదికి వెళ్ళినాడు. అచట ఆ శిశువు కనిపించినది. శకుంత పక్షులు ఆ శిశువును కాపాడుచున్నవి. అందువల్ల ఆ బిడ్డ శకుంతల అయినది. కణ్యుడు ఆమెను తెచ్చినాడు. పెంచి పెద్ద చేసినాడు. ఇప్పుడు ఆమె వయసులోనున్నది. సొగసు పెంచుకున్నది. దుష్యంతుని మురిపించినది.
దుష్యంతుడు ఆమె కధ తెలుసుకున్నాడు. ఆమె మునికన్య కానందుకు ఆనందించినాడు. శకుంతలతో అన్నాడు :-
"శకుంతలా! నీవు అందముల రాశివి. సుకుమారివి. ఆశ్రమములు నీకు తగినవి కావు. రాజ ప్రసాదములందు ఉండదగును. నా మనసు నిన్ను కోరుచున్నది. నాకు భార్యవు ఆగుము."
"రాజా! కణ్యుడు నన్ను పెంచినాడు, తండ్రి అయినాడు. అతడు త్వరలోనే వచ్చును. వారు అంగీకరించిన మీరు నన్ను చేపట్టవచ్చును."
"సుందరీ! తన పురుషుని ఎన్నుకొనుటలో స్త్రీకి స్వతంత్రమున్నది. అందు విషయమున ఆడది తానే కర్తయు, భోక్తయు అగుచున్నది. వివాహములు ఎనిమిది విధములు. 1. బ్రాహ్మము 2. దైవము 3. అర్హము 4. ప్రాజాపత్యము 5. రాక్షసము 6. అసురము 7. గాంధర్వము 8. పైశాచము. వీటిలో గాంధర్వము రాక్షసము. క్షత్రియులకు ప్రశస్తము. గాంధర్వమున తలిదండ్రులు అనుమతి అక్కరలేదు. మంత్ర తంత్రములు లేవు. కాబట్టి అందుకు అంగీకరింపుము" అని దేబరిల్లినాడు.
శకుంతల అలోచించినది. అతడు రాజు. వివాహము శాస్త్ర సమ్మతము. అప్పుడు ఆమె ఒక వరము కోరినది. తన కొడుకు రాజు కావలేనన్నది. మగవాడు అత్రమున ఉన్నాడు. అందుకు అంగీకరించినాడు. వరము ఇచ్చినాడు.
వారు గాంధర్వము వహించినారు.
దుష్యంతుడు పని తీర్చుకున్నాడు. వెళ్ళిపొయినాడు. మంత్రులను పంపింతునన్నాడు. శకుంతలను పిలిపించుకొందునన్నాడు. మాయ మాటలాడినాడు. బయటపడినాడు. మరచినాడు.
కణ్యుడు ఆశ్రమమునకు వచ్చినాడు. శకుంతలలో కళకళలు చూచినాడు. కలవరపాటు గ్రహించినాడు. అడిగినాడు. ఆమె తల వంచుకున్నది. సిగ్గున ఆమె బుగ్గలు ఎర్రవారినవి. కణ్యుడు గ్రహించినాడు. జరిగినది ఎరిగినాడు. కూతురి తల ముద్దాడినాడు దీవించినాడు. సంతోషించినాడు. వరము అడుగమన్నాడు. తన పుత్రుడు ఆరోగ్యవంతుడు, అయుష్మంతుడు, ధైర్యశాలి, బలసంపన్నుడు కావలెనన్నది. తన పుత్రుడు దుష్యంతునకు వంశ కర్త కావలెనన్నది.
కణ్యుడు ఆశీర్వదించినాడు. వరము ప్రసాదించినాడు.
శకుంతల గర్బవతి అయినది. కణ్యుడు గర్బరక్షణ విధులను నడిపినాడు. మూడు సంవత్సరములు గర్భమును రక్షించినాడు. అప్పుడు శకుంతల ప్రసవించినది. భరతుని కన్నది.
భరతుడు బాల్యమునందే సింహములను చంపెడివాడు. పులులను , సింహములను, ఖడ్గ మృగములను ఏనుగులను తెచ్చి ఆటలాడువాడు. అతడు బలవంతుడు, వేగవంతుడు , తేజోవంతుడు అయినాడు. అందువలన ఆశ్రమవాసులు అతనిని "సర్వదమనుడు" అని పిలిచినారు.